ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డుతో చిన్నారి బాస చైత్ర
నిజామాబాద్: మూడేళ్ల ఆ చిచ్చర పిడుగు స్కూలుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అరుదైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డును సాధించింది. నగరంలోని గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర 17 జాతీయపండుగలు, 12 జాతీయ గుర్తులు, 13 అంతరిక్ష వస్తువులు, 26 శరీర భాగాలు, 26 రకాల జంతువులు, 22 రకాల కూరగాయలు, 21 పండ్లు, 13 రంగులు, 8 రకాల ఆకారాలు (ట్రైయాంగిల్, స్క్వేర్, సర్కిల్ లాంటివి) గుర్తుపట్టడంతో పాటు 26 అల్ఫాబెట్స్‌కి సంబంధించిన వస్తువుల పేర్లను, 11 ఇంగ్లిష్ రైమ్స్‌ని ధారాళంగా తడబడకుండా చెప్పేస్తుంది.
ఈ పాప ప్రతిభను గుర్తించిన ఐబీఆర్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైత్ర ధారాళంగా చెప్పిన వాటిని ఆమె ప్రతిభా పాటవాలను ప్రత్యక్షంగా చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వారు అచీవర్ అవార్డును ప్రదానం చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ అనేది ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ వ్యక్తుల ప్రతిభని, ఒక సంస్థ సాధించిన ప్రగతిని భద్రపరచి భావితరాలకు స్ఫూర్తిని అందించే సంస్థ.
దీనిలో భాగంగా రాష్ట్రంలోని నగరానికి చెందిన గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడంపై పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచీవర్ అవార్డును అందుకోవడం అభినందనీయమంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చైత్రకు ఐబీఆర్‌లో స్థానం దక్కడంతో ఆమె తల్లిదండ్రులైన బ్యాంక్ ఉద్యోగిని అన్నపూర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. తమ పాప ఇప్పటి వరకు స్కూల్‌కు కూడా వెళ్లలేదని, ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అచీవర్ అవార్డును కైవసం చేసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment