తహసీల్దార్ శ్రీనివాస్‌రావు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అనుమతులు లేకుండా ఇసుకు తరలిస్తే ఊరుకునేదిలేదని తహాశీల్దార్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. గ్రామశివారులోని మంజీరనది నుంచి ఇసుక తరలించే విషయమై నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామస్తులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం గోలిలింగాల శివారులోని 20ట్రాక్టర్ల ద్వారా 40ట్రిప్పుల ఇసుకను తరలించాలని అనుమతులిస్తే సుమారు 40ట్రాక్టర్ల ద్వారా 80కిపైగా ట్రిప్పుల ఇసుకను ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. సీసీ రోడ్ల ఏర్పాటు కోసం ఇసుకను తరలించేందుకు తాము అనుమతులిస్తే కొందరు మండలకేంద్రంలో విచ్చలవిడిగా అమ్ముకున్నారని, మరోసారి ఇలా జరిగితే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రవాణాచేస్తే ట్రాక్టర్ యాజమానులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే పంచాయతీ కార్యదర్శి ద్వారా ధృవీకరణ పత్రంతో తమకు దరఖాస్తు చేసుకుంటే మంజీరనది నుండి ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు ఇస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. సమావేశంలో ఆర్‌ఐ మహ్మాద్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, జూనియర్ అసిస్టెంట్ సాయిలు తదితరులున్నారు.
రేషన్ కార్డుల విచారణ పకడ్బందీగా చేపట్టాలి
రాజంపేట : రేషన్ కార్డుల విచారణను పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్ సతీష్‌రెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న నూతన రేషన్ కార్డుల మంజూరు, సవరణలపై పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘురాం, మండల ప్రత్యేక అధికారి అపర్ణలు పాల్గొన్నారు.


