ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి అందమైన భవనం పక్కన కూర్చుని ఫొటో తీసుకుంది. మనం కూడా ఒక ఫొటో తీసుకుంటే భలే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది నిజమైన భవనం కాదు. అక్షరాల వంద కేజీల కూల్ కేక్. అవునా! అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే.
చూడగానే నోట్లో నీళ్లూరించే కేక్ డెకరేషన్లతో కేక్ ఆర్టిస్ట్‌లు తెగ ఆకట్టుకుంటుంటారు. కేక్ ఆకృతిని చూసి ధరకూడా చూడకుండా కొనేస్తుంటారు కొందరు. కానీ ఈ కేకు వాటన్నింటిలోకి చాలా భిన్నమైనది. అచ్చం ఇలాంటి కేకులు రూపొందించే ఆర్టిస్టే పూనేకు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్. వినూత్న ఆలోచనతో ఏకంగా లండన్ వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపును తెచ్చుకుంది.
బ్రిటన్ రాయల్ కుటుంబం ఏది చేసినా ఎంతో రిచ్‌గా ఉంటుంది. వారు నివసించే భవనాల నుంచి ధరించే దుస్తుల వరకు అంతా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా ఎంతో ప్రత్యేకమైన బ్రిటన్‌కు చెందిన ఓ పురాతన చర్చ్‌ను వీగన్ కేక్‌తో రూపొందించింది ప్రాచి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేక్ ఐకాన్ ఎడ్డీస్పెన్స్ మార్గదర్శకత్వంలో రాయల్ ఐసింగ్ కళను నేర్చుకుని 1500ల కేకు ముక్కలతో మిలాన్ క్యాథడ్రెల్ చర్చ్‌ను నిర్మించింది. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేకు ముక్కలను డిజైన్ చేసింది ప్రాచీ.
ముక్కలన్నింటిని కలిపి చర్చ్‌రూపం తీసుకురావడానికి ప్రాచీకి నెలరోజులు పట్టింది. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవైన నిర్మాణమే ఈ రాయల్ ఐసింగ్ కేక్. నాలుగు అడుగుల ఎత్తు, మూడడుగుల పది అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ కేకు బరువు వందకేజీలపైనే. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాలను కేక్‌లుగా రూపొందించడంలో ప్రాచీకి నైపుణ్యం ఉండడంతో.. గతేడాది ఫెమినా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment