తిరువనంతపురం: కరోనా విలయానికి పెళ్లిళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ను అంటించుకుంటూ పచ్చని పందిళ్లను కరోనా హాట్‌స్పాట్‌లుగా మార్చేస్తున్నారు. ఎంతటి శుభకార్యమైనా 50 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రభుత్వాలు హెచ్చరించినా కరోనాను లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా వైరస్ బారిన పడుతూ అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేరళలోని కేసర్‌గాడ్ జిల్లా పిలంకట్టలో జూలై 17న ఓ వివాహ మహోత్సవం 125 మంది అతిథుల సమక్షంలో జరిగింది.(పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..)
అయితే ఈ మధ్యే వధువు తండ్రికి కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ పెళ్లికి హాజరైనవారందరికీ పరీక్షలు జరపగా 43 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో నూతన వధూవరులు కూడా ఉండటం గమనార్హం. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది బంధుగణం మధ్య వివాహం జరుపుకున్నందుకు గానూ పోలీసులు పెళ్లికూతురు తండ్రిపై కేసు నమోదు చేశారు. విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపణ అయితే వారికి రెండేళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. (ఆ ఇద్దరు... దయ చూపిన స్త్రీలు)
Comments
Please login to add a commentAdd a comment