వెజిటేరియన్ మొసలి ... పరమాన్నమే తింటుంది
అదొక వెజిటేరియన్ మొసలి. అరవై ఏళ్లుగా పరమాన్నమే తింటుంది. అదీ గుడి పూజారులే పెట్టాలి. ఇతరులు పెడితే ముద్ద ముట్టుకోదు. అదీ దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత మాత్రమే ఆహారం తీసుకుంటుంది.
కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని అనంతపుర చెరువులో ఉన్న అనంతపద్మనాభ స్వామికి మొసలి రక్షకుడు. ఆ చెరువులోనే ఉంటూ స్వామివారికి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ మొసలిని అందరూ బాబియా అని పిలుస్తారు.
తమాషా ఏమిటంటే ఈ మొసలి చేపలను కూడా తినదు. ఇంత వరకూ ఎవరికీ అపకారం చేయలేదు. దాంతో అందరూ ఆ మొసలిని దైవాంశ సంభూతురాలిగా భావించి పూజిస్తారు. అసలు తొమ్మిదో శతాబ్దం నాటి ఈ గుడి చెరువులోకి మొసలి ఎలా వచ్చిందో ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే చెరువులో ఒకే మొసలి ఉంటుంది. ఆ మొసలి చనిపోతే ఇంకొక మొసలి వస్తుంది.
బిల్వమంగళుడనే భక్తుడు విష్ణువును పూజించేవాడట. అయితే ఆయనను పరీక్షించేందుకు కృష్ణుడు ఒక అల్లరిపిల్లవాడి రూపంలో వచ్చాడట. పిల్లవాడి అల్లరిని భరించలేక బిల్వమంగళుడు ఆ పిల్లవాడి చెవి మెలేసి దూరంగా తోసేశాడట. అప్పుడు ఆ పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు కానీ బిల్వమంగళుడికి తనను అల్లరిపెట్టింది కృష్ణుడేనని అర్థం కాలేదు. కృష్ణుడు ఒక గుహలో అంతర్ధానం అయిపోయాడు. ఆ గుహకు మొసలి కాపలాగా ఉంటుంది.
మొదట్లో దేవుడి విగ్రహాన్ని 70 కి పైగా వనమూలికలతో తయారు చేసేవారు. ఇప్పుడు పంచలోహ విగ్రహం ఏర్పాటు చేశారు. మళ్లీ వనమూలికల విగ్రహాన్ని తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.