
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.
రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్‌ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్‌ఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment