పురస్కారం: మదర్ థెరిసా.. ప్రపంచ శాంతిదూత
నోబెల్ ఇండియా: అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిసా. ఈమెకు 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్య్రం నుంచి, బాధల నుంచి విముక్తి కల్పించటానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి అందజేశారు.
మదర్ థెరిసా బాల్యం:
మదర్ థెరిసా ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె’ పట్టణంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీన జన్మించారు. ఆగస్టు 27వ తేదీన ఆమెను రోమన్ క్యాథలిక్ చర్చిలో బాప్టైజ్ చేసి, యాగ్నిస్ గోన్‌జా బొయాహు అని పేరు పెట్టారు. ఆల్బేనియన్ భాషలో గొన్‌జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె తండ్రి నైకోల్ డ్రానాషిల్ బొయాహు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో యాగ్నిస్ కడపటిది.
చిన్నతనం నుంచి యాగ్నిస్‌కు రోమన్ క్యాథలిక్ మిషనరీల సేవలకు సంబంధించిన కథలంటే చాలా ఇష్టం. యాగ్నిస్ తండ్రి రాజకీయాలలో ఉంటూ, 1919వ సంవత్సరంలో మరణించారు. యాగ్నిస్ 12 సంవత్సరాల వయసులోనే దైవచింతనతో రోమన్ క్యాథలిక్ చర్చి వైపు ఆకర్షితమయ్యారు. 18 సంవత్సరాల వయసులో ఆమె లొరీటో ఐరిష్ నన్‌ల వ్యవస్థలో చేరి, ఆంగ్లంలో ప్రావీణ్యత పొంది, 1931 మే నెల 24వ తేదీన ‘నన్’గా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆమె భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకుని, 1931 నుంచి 1948 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేశారు.
భారత్‌లో సేవలు:
రోమన్ క్యాథలిక్ మిషనరీల ఆచారం ప్రకారం, యాగ్నిస్ తొలి నామాన్ని థెరిసాగా మార్చుకుని, అందమైన హిమాలయాలలోని డార్జిలింగ్ నగరంలో రోమన్ క్యాథలిక్‌గా సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమె కలకత్తా శివార్లలోని ‘ఎంటాలీ’ అనే చోట లొరీటో కాన్వెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ, అదే స్కూల్లో 1944వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయిని అయ్యారు. ఆ ఏడాది బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల రోగాల వల్ల ఎందరో చనిపోయారు. దానికి తోడు, 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేసి, భయంకరంగా తయారుచేశాయి. మదర్ థెరిసా 1946 సెప్టెంబర్‌లో అంతఃకరణ ప్రబోధంతో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. ఆమె కలకత్తా నగరంలోని పేదలు నివసించే పేటలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. రోగులకు సేవ చేయటం కోసం ఆమె బీహార్‌లోని పాట్నా నగరంలోని ఒక హాస్పిటల్‌లో కొద్ది నెలల మెడికల్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు.
మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన ‘వాటికన్’ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ స్థాపనకు అనుమతి పొందారు. సాధారణంగా మిషనరీ నన్‌లు ధరించే దుస్తులకు బదులు నీలి అంచు తెల్ల చీరను తమ సంస్థకు గుర్తింపుగా నిర్ణయించారు. ఈ విధంగా థెరిసా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు.
మదర్‌కు నోబెల్:
మదర్ థెరిసా సేవలను గుర్తించి, 1979వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. ‘ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పురస్కారం అందుకుంటుంద’నే ప్రశ్నకు ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్‌ది. నా విశ్వాసం క్యాథలిక్ మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం జీసస్‌కు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచశాంతిని నెలకొల్పేందుకు మీరిచ్చే సందేశం ఏమిట’ని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను ప్రేమిస్తే చాలు, ప్రపంచశాంతి దానంతటదే నెలకొంటుంది’’ అన్నారు మదర్ థెరిసా.
నోబెల్ పురస్కార స్వీకరణ ప్రసంగంలో ఆమె‘‘నేటి ప్రపంచంలో ‘దారిద్య్రం’ అనేది కేవలం వెనుకబడిన, ఆర్థికంగా పేద అయిన దేశాలకే పరిమితం కాదు. ఎన్నో విధాలుగాను పురోగమించిన దేశాలలో కూడా ఉందనటానికి చింతిస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చటం ద్వారా పేదరికం తొలగించవచ్చు కాని, సమాజంలో అణగదొక్కబడి, ఆదరణకు నోచుకోనివారికి, ఉగ్రవాదానికి భయపడి బతికేవారికి ఎదురవుతున్న ఆయా దారిద్య్రాలను తొలగించినప్పుడే నిజమైన శాంతి. అబార్షన్‌లతోపాటు విడాకుల నిర్మూలన కూడా జరిగినప్పుడే మానవులంతా శాంతితో జీవించగలరు’’ అన్నారు.
మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యక్రమాలు:
వృద్ధాప్యంలో ఉన్న, మరణానికి చేరువలో ఉన్న అభాగ్యుల కోసం ఆశ్రమం నడపడం. ఈ ఆశ్రమంలో మరణించినవారికి వారి మత కట్టుబాట్లకు అనుగుణంగా ఉత్తర క్రియలు జరపటం(ఆశ్రమంలో మహమ్మదీయులు మరణిస్తే ఖొరాన్ పఠనం, హిందువులు మరణిస్తే వారికి గంగాజలంతో అంత్యక్రియలు, క్రైస్తవులకు చర్చి నిబంధనలకనుగుణంగా నిర్వహించటం) వంటి జనామోదకర విధానాల అమలు.
కుష్ఠు రోగులకు ఆశ్రమం నిర్మించి, నగరంలో వివిధ ప్రాంతాలలో వారికి వైద్య సౌకర్యాలు కల్పించటం.
1955లో నిర్మలా శిశుభవనం స్థాపించటం.
‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లో బ్రదర్స్ విభాగం, సిస్టర్స్ విభాగం, ఫాదర్స్ విభాగం ఏర్పాటు చేసి నిష్ణాతులైన సేవకులను తయారుచేయటం. ఇదే క్రమంలో మత ప్రవక్తలను కూడా తయారుచేయడం.
దేశదేశాల్లో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థలను ప్రారంభించటం.
మదర్ థెరిసా అకుంఠిత దీక్ష, కృషి, పరిశ్రమల ఫలితంగా 1996వ సంవత్సరం నాటికి 100కి పైగా దేశాలలో 517 మిషనరీస్ ఆఫ్ చారిటీ శాఖలు ప్రారంభమ య్యాయి. ఇవి ప్రపంచమంతటా మానవ సేవను కొనసాగిస్తూ ఉన్నాయి.
మదర్ థెరిసా అవార్డులు... బహుమతులు:
1962 - పద్మశ్రీ బిరుదు; రామన్ మెగసెసే బహుమతి.
1971 - పోప్ జాన్ 23 శాంతి బహుమతి
1979 - నోబెల్ ‘శాంతి’ బహుమతి
1979 - బాల్‌జాన్ బహుమతి
1980 - {పపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన
పదిమందిలో ఒకరిగా గుర్తింపు
2010 - థెరిసా శతజయంతి సందర్భంగా భారత
రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల
మీదుగా ఐదు రూపాయల నాణెం విడుదల
1983వ సంవత్సరంలో పోప్ జాన్‌పాల్-2ను దర్శించే నిమిత్తం రోమ్ వెళ్లిన మదర్ థెరిసాకు గుండె జబ్బు వచ్చింది. తరువాత 1991లో మెక్సికో నగరానికి వెళ్లినప్పుడు ఆమెకు న్యుమోనియా వచ్చింది. 1996లో ఆమెకు మలేరియా వచ్చి గుండెలో ఎడమ కవాటం పనిచేయటం మానేసింది. దాంతో థెరిసా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అధ్యక్ష పదవిని పరిత్యజించారు. చివరకు 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన కలకత్తా నగరంలో కన్నుమూశారు.
నవీన్ చావ్లా అనే విశ్రాంత ఐసీఎస్ అధికారి, మదర్ జీవిత చరిత్రను పుస్తకంగా రాసి ప్రచురించారు. మదర్ థెరిసాకు ఎంతోమంది అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ని తన సామ్రాజ్యంగా భావించేవారని, ఆమె అబార్షన్, విడాకులను ప్రోత్సహించకపోవటం యువత స్వేచ్ఛకు ఆటంకమనీ విమర్శల అభిప్రాయం. ఇలాంటి ఎన్ని విమర్శలున్నా మదర్ థెరిసా పేరును ప్రపంచంలో అత్యధిక జనాదరణ గల మొదటి పదిమందిలో ఒకరుగా వరుసగా 18 సార్లు ప్రకటించడం ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని, సేవా నిరతిని చాటుతున్నాయి.
డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
విశ్రాంత రసాయనాచార్యులు