ఇవాళ రవీంద్రుడి పుట్టిన రోజు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో సులభంగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ రవీంద్రుడి సాహిత్యాన్నీ, ఆ సాహిత్యం ఇచ్చే సంస్కారాన్నీ తెలుసుకోవడం ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. రవీంద్రుడి బాల్యం చిత్రంగా గడిచింది. అతను నాలుగు గోడల్ని బద్దలు కొట్టడం నేర్చుకున్నారు. ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించారు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా ఆయన జ్ఞానవంతుడయ్యారు. ‘ప్రపంచ రహస్యాన్ని’ తెలుసుకునే క్రమంలో విజయం సాధించారు.
ప్రకృతిని ఆస్వాదించే హృదయాన్ని పొందిన టాగూర్, అక్కడినుండే సాహిత్యాన్ని సృష్టించడం మొదలు పెట్టారు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంస్కృత కావ్యాలు చదివారు. ఆంగ్ల సాహిత్యాన్ని పరిశీలించారు. బాల్యంలోనే ‘సంధ్యాగీత’ ప్రకటించారు. అది అందరి మన్ననలు పొందింది. రవీంద్రుని ప్రసిద్ధ గేయం ఊరకే అతని హృదయం నుండి రాలేదు. (Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు)
‘‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ఎక్కడ మాన వుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో/ ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో’’ అంటూ ఒక స్వేచ్ఛా స్వర్గంలోకి, తన దేశాన్ని మేలుకునేట్లు చేయమని ప్రార్థించారు. ఈ వాక్యాలు ఇప్పటికీ నెర వేరలేదు. రవీంద్రుడు విశ్వమానవ వాదాన్ని కోరుకున్నారు. పరిశుభ్ర ప్రపంచాన్ని ఆశించారు. ఆధునిక వచన కవితలో తన భావాల్ని పొందు పరిచారు. ‘గీతాంజలి’లో ఎంత గొప్ప కవిత్వం అందించారో వేరే చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి దేశ హద్దుల్ని దాటి, ప్రపంచం అంతా వినిపించింది. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!)
తన సాహిత్యం ద్వారా టాగూర్ ఈ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా మానవుడు తయారుకావాలని అభిలషించారు. మతం మనిషిని విభజించరాదని తెలియజేశారు. తన ఎనభై ఏళ్ళ జీవిత ప్రస్థానంలో అనేక నవలలు, నాటికలు, కవితా సంపుటాలు, గేయాలు రచించి సంపూర్ణ సాహిత్యకారుడిగా ఆవిష్కరించుకున్నారు. ‘విశ్వకవి’ అందించిన భావాలను పాడటమో, చదవ టమో కాదు. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే రవీంద్రుని ఆశయం నెరవేరినట్టు!
– డాక్టర్ సుంకర గోపాల్
తెలుగు శాఖాధిపతి, డీఆర్‌జీ ప్రభుత్వ కళాశాల, తాడేపల్లిగూడెం
(మే 7న టాగూర్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment