
టాగూర్ గీతాంజలిని అనువదించి, దానికి రాసిన ముందుమాటలో కవిత్వాన్ని ఎట్లా దర్శించాలో చలం పంచుకున్న అభిప్రాయం ఇక్కడ:
గొప్ప ఆర్టు, ముఖ్యం కవిత్వం వినోదం కాదు. అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి, ఉన్నత పరివర్తనం కలగచెయ్యాలని ప్రయత్నిస్తుంది. గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వరసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం వుండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా, ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి. మానవుడికి ఈశ్వరుడితో ప్రత్యక్ష సంబంధం Personal Relation ఉండడానికి వీలు వుంటుందని అంగీకరించుకోవాలి. కాకపోతే ఈ గీతాలు మొహమ్మొత్తే కూని రాగాలు. వుత్త చర్విత చరణాలు.
గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం. కొంత స్పష్టంగా తెలుస్తుంది. జయదేవుడి అష్టపదులు, కృష్ణశాస్త్రి గీతాలు, మాటల అర్థంతో ఎంత చెపుతాయో, ధ్వనితో, సంగీతంతో, భాషామాధుర్యంతో అంతకన్నా ఎక్కువ చెపుతాయి.
గీతాంజలి బెంగాలీ పాటల సంగతి అదే చెపుతారు. అవి పాడగా విన్నవారికి అవి పూర్తిగా తెలీక పోవొచ్చు. కాని వాటి గానం, శబ్దలాలిత్యం, పదాల ధ్వని విన్యాసం, ఇవన్నీ శ్రవణాన్ని, మనసుని ఆకర్షించి, మనసును దాటి ఎక్కడో అంతఃకరణంలో ఆత్మలో మాధుర్యాన్నీ తేజస్సునీ నింపుతాయి. ఆ శ్రోత అంతరాంతరంలో ఏం మార్పు జరుగుతుందో అతని మనసుకే తెలీదు. ఈ రహస్యం గుర్తించక పోవడం వల్లనే, ఈనాడు తిండికీ, వొంటికీ, మనసు పై పొరల ఆహ్లాదాలకీ ఉపయోగపడని కళ, కళ కాకుండా పోతోంది. లోకం ఇంత విడిపోయింది.
గొప్ప కవిత్వ సృష్టిగాని, అనుభవం గాని మనసు వెనక ఎంతో లోతునవుండే Sublime or Supernal Planeలో జరుగుతుంది. మనసుకు తెలిసేది స్వల్పం. గీతాంజలి అంతరార్థం చలానికేం తెలుసు? టాగూరు కెంతమాత్రం తెలుసు?
‘‘నీ పాటల అర్థాలన్నీ చెప్పమని అడుగుతారు. ఏం చెప్పాలో నాకు తెలీదు. ఏమో, వాటి అర్థమేమిటో ఎవరికి తెలుసు? అంటాను!’’ అంటారు టాగూర్.
తన Emotional అనుభవానికి రూపకల్పన చేస్తాడు కవి. తమ విరహాన్ని, నిరాశని, విశ్వాసాన్ని, భయాన్ని ఎన్నోవిధాల పాడారు, ్కట్చ ఝటరాసిన భక్తులూ, మీరా, కబీర్, రామదాసు, త్యాగరాజు. అంత భక్త పరాధీనుడైన ప్రభువు తనెంత తపించినా దర్శనమివ్వడేమని త్యాగరాజు వ్యథ, ఆశ్చర్యం, భయం; దాని కంతకీ రూపమిచ్చి:
ఖగరాజ నీ యానతి
విని వేగ చనలేదో
గగనానికి ఇలకు
బహు దూరం బనినాడో
కాకపోతే నువ్వెందుకు రావు? అని పాడతాడు కవి. ఆ విరహం నీ హృదయంలో ఏ కొద్దిగా మండినా, అతని తపనని నీకు అర్థం చెయ్యడానికి అతనిచ్చిన రూపకల్పన విష్ణూ, వాహనం గరుడుడూ నీకు అనుభవాన్నియ్యడానికి అభ్యంతరాలు కానక్కర్లేదు.
కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం.
కవిత్వం చదివిన తరవాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృథా!
నీకు తోచనిదీ కనపడనిదీ కవి చెప్పిన తరవాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వొచ్చేదీ, అదే నీకు సరిపడే కవిత.