పడవెళ్లి పోతున్నది | Summary Of Rabindranath Tagore Post Master | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 12:17 AM | Last Updated on Mon, Oct 8 2018 12:26 AM

Summary Of Rabindranath Tagore Post Master - Sakshi

ఉద్యోగంలో చేరగానే మొదట ఉలాపూర్‌ గ్రామానికి పోస్ట్‌మాస్టర్‌గా రావలసి వచ్చింది.

ఉలాపూర్‌ చిన్న ఊరు. దగ్గిరలో నీలిమందు కార్ఖానా ఉంది. ఆ కార్ఖానా దొర ఎంతో ప్రయత్నం చేసి, ఈ క్రొత్త పోస్టాఫీసు పెట్టించగలిగాడు.


పోస్ట్‌ మాస్టరు కలకత్తా బిడ్డ. నీళ్లలోని చేపను ఒడ్డున పడేస్తే ఏమవుతుందో, ఈ కుగ్రామానికి వచ్చిన పోస్ట్‌ మాస్టరు స్థితి కూడా అంతే అయింది. చీకటి కోణంగా ఉండే ఒక యింట్లో అతడి ఆఫీసు. దగ్గరలో నాచుతో కప్పివుండే చెరువు. దానికి నాలుగు వైపులా అడవి. 

స్థానికంగా ఉండేవారితో అతడు కలిసిపోలేకపోయాడు. పైగా చేతికి ఎక్కువ పనిలేదు. అప్పుడప్పుడు ఒకటి అర కవితలు వ్రాయటానికి ప్రయత్నించేవాడు. రోజంతా ఆకాశంలోని మేఘాల్ని చూస్తూ కూచుంటే జీవితం సుఖంగా గడిచిపోతుంది – అన్న భావం వ్యక్తం అవుతూవుంటుంది, ఆ కవితల్లో.

పోస్ట్‌ మాస్టరు జీతం చాలా తక్కువ. తానే వంట చేసుకుని తినాలి. ఊళ్లో తల్లీ తండ్రీ లేని ఒక అనాథ బాలిక అతడి పనులు చేసిపెడుతూ ఉండేది. ఆమెకి నాలుగు మెతుకులు తినటానికి దొరికేవి. పేరు రతన్‌. పన్నెండు పదమూడేళ్లుంటాయి. పెళ్లయే అవకాశం ఏమీ కన్పించదు.

సంజెవేళ పశువుల పాకల్లోంచి పొగలు వర్తులాకారంగా లేస్తూ ఉంటాయి. పొదల గుబురుల్లోంచి కీచురాళ్లు కూస్తుంటాయి. చీకట్లో వసారాలో ఒంటరిగా కూర్చుని ఆకుల కదలికలు చూస్తుంటే, కవి హృదయంలో రవంత సంచలనం కలిగినప్పుడిహ ఇంట్లో మూల గుడ్డిదీపం వెలిగించి ‘రతన్‌’ అని పిలిచేవాడు. రతన్‌ గుమ్మంలో కూర్చుని ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తూండేది. 

‘‘ఏం చేస్తున్నావ్‌ నువ్వు?’’
‘‘పొయ్యి వెలిగించటానికి వెళ్లాలి. వంటింట్లో–’’
‘‘వంటింటి పనులు తర్వాత చేసుకుందువుగాని– ముందు ఒకమాటు చిలుంగొట్టం సిద్ధం చేసి ఇయ్యి’’

బుగ్గలు రెండు ఉబ్బించి చిలుంగొట్టం ఊదుకుంటూ రతన్‌ ప్రవేశించేది. ఆమె చేతిలోని గొట్టాన్ని అందుకుని, ‘‘అవును కాని రతన్, మీ అమ్మ జ్ఞాపకం వస్తూంటుందా’’ అని అడిగేవాడు. చాలా సంగతులవన్నీ. కొన్ని జ్ఞాపకం వస్తాయి, కొన్ని రావు. తల్లి కంటే తండ్రి ఆమెను ఎక్కువ ఆపేక్షగా చూసేవాడు. ఆమెకొక తమ్ముడుండేవాడు. ఒకనాడు వర్షంగా ఉన్న రోజున ఒక గుంటగట్టున ఇద్దరూ కలిసి, చెట్టున విరిగిన సమ్మటి కొమ్మను గాలం చేసుకుని ఉత్తుత్తి చేపలు పట్టే ఆట ఆడుకున్నారు. ఇలా మాటల్లో మధ్య మధ్య రాత్రి చాలా ప్రొద్దుపోతూ ఉండేది. అప్పుడిహ బద్దకం కొద్దీ పోస్ట్‌ మాస్టరు వంట చేసుకోటానికి ఇచ్చగించేవాడు కాదు. ప్రొద్దున చల్లారిపోయిన కూరలవీ ఉండేవి. రతన్‌ గబగబా పొయ్యి వెలిగించి, కాసిని రొట్టెలు కాల్చి తీసుకువచ్చేది. వాటితోనే ఆ రాత్రి ఇద్దరికీ తిండి వెళ్లిపోయేది.

ఒకొకరోజున ఆ పెద్ద ఎనిమిది దూలాల ఆఫీసు గృహంలో ఒకవైపున బల్లమీద కూర్చుని పోస్ట్‌ మాస్టరు తన యింటి సంగతులు ఏకరువు పెట్టేవాడు. తల్లి, తమ్ముడు అక్కల సంగతులు– ప్రవాసంలో ఒంటరిగా ఇంట్లో కూర్చున్నప్పుడు మనస్సు ఎవరికోసం కొట్టుకుంటూ ఉంటుందో వారి సంగతులు చదువు సంస్కారంలేని ఆ చిన్నబాలికతో చెప్పుకునేవాడు. అతడా సంగతులన్నీ చెపుతున్నప్పుడు ఆ బాలిక వాళ్ల యింట్లో వాళ్లని అమ్మ, అక్క, అన్న అని వరసలు కలిపి మాట్లాడేదాకా వచ్చింది. తన చిన్న హృదయ పటం మీద వారి ఊహారూపాలను కూడా చిత్రించుకుంది.

వర్షాకాలంలో మబ్బులు లేని ఒకనాటి మధ్యాహ్నవేళ చక్కని నులివెచ్చని గాలి వీస్తోంది. అలసిపోయి ఉన్న ధరణి వేడి నిట్టూర్పు ఒంటికి తగులుతున్నట్లుంది. పోస్ట్‌ మాస్టరు వాటికేసి చూస్తూ– ఈ సమయంలో హృదయానికి హత్తుకునే అనురాగ పుత్తలిౖయెన మానవమూర్తి సరసన ఉంటే అని భావించుకోసాగాడు. ఒక చిన్న పల్లెటూరులో కొద్ది జీతం తెచ్చుకునే సబ్‌ పోస్ట్‌ మాస్టరు మనసులో ఒక సెలవునాటి మధ్యాహ్న వేళ ఇలాంటి భావాలు తలెత్తాయని అంటే ఎవరూ నమ్మనూ నమ్మరు; అర్థమూ చేసుకోలేరు.

పెద్దనిట్టూర్పు విడిచి ‘రత్నా’ అని పిలిచాడు. రతన్‌ అప్పుడు జామచెట్టు కింద, కాళ్లు చాచుకుని పచ్చిజామకాయ తింటూ కూర్చుంది. యజమాని గొంతు విన్పించగానే హడావుడిగా పరుగెత్తుకొచ్చి, ‘‘బాబుగారూ, పిలిచారా?’’ అన్నది. ‘‘నీకు కాస్త చదువు నేర్పుతాను’’ అని ఆ మధ్యాహ్నమంతా అఆలు నేర్పడం మొదలెట్టాడు. కొద్దిరోజుల్లోనే ఆమెకి ఒత్తులు కూడా వచ్చేశాయి.

ఒకనాడు ప్రొద్దున్నుంచి తెరిపిలేకుండా కురుస్తోంది వర్షం. పోస్ట్‌ మాస్టరు శిష్యురాలు చాలాసేపటినుంచి గుమ్మం దగ్గిర కనిపెట్టుకుని కూచుని ఉంది. కాని ఎంతసేపటికీ పిలుపు రాకపోవటంతో తన పుస్తకాలు, కలం పెట్టుకున్న చిన్న పెట్టె తీసుకుని తానే లోపలికి వెళ్లింది. మాస్టర్‌ మంచం మీద పడుకుని ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుని, చప్పుడు కానీయకుండా మళ్లీ మెల్లిగా గదిలోంచి బయటకు వెళ్లబోయింది. చటుక్కున ‘‘రత్నా’’ అని పిలుపు విన్పించింది. ‘‘ఒంట్లో బాగున్నట్టు లేదు, నుదురు మీద చెయ్యివేసి చూడు’’ అన్నాడు.

తోడు ఎవరూ లేని ఈ ప్రవాసంలో, జోరుగా కురుస్తున్న వర్షంలో, అస్వస్థతగా ఉన్న శరీరానికి కాస్త శుశ్రూష కావాలనిపించింది. కాలిపోతున్న నుదురు మీద గాజుల చేతి కోమలస్పర్శ తలపుకు వచ్చింది. ఈ దుస్సహమైన రోగ బాధలో స్నేహరూపిణులైన తల్లి, అక్క ప్రక్కన ఉండాలనిపిస్తుంది. బాలిక అయిన రతన్‌ ఇంక బాలికగా ఉండిపోలేదు. ఆమె తల్లిస్థానాన్ని, అధికారాన్ని చేపట్టింది. వైద్యుణ్ని పిలిపించింది. వేళకు మందు తాగించేది. తానే పథ్యం వండిపెట్టేది. ‘‘బాబుగారూ, కాస్త తేలిగ్గా ఉన్నట్లుందా?’’ అని ఒకటికి పదిసార్లు అడిగేది.

చాలా రోజులకి పోస్ట్‌ మాస్టరు చిక్కి శల్యమై రోగశయ్య మీదినుంచి లేచాడు. ఇహ లాభం లేదు. ఇక్కడినుంచి ఎలాగయినా సరే బదిలీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతపు అస్వస్థతను వ్యక్తం చేస్తూ పై అధికారులకు దరఖాస్తు పంపుకున్నాడు.

రతన్‌ మళ్లీ గుమ్మం బయట తన స్వస్థానాన్ని ఆక్రమించుకుంది. కాని వెనుకటిలాగా ఇప్పుడామెకి పిలుపు రావడం లేదు. బయట కూర్చుని తన పాతపాఠాలు వెయ్యేసిసార్లు చదివేది. చటుక్కున ఎప్పుడు పిలుపు వస్తుందో, ఆ సమయానికి తనకు వచ్చిన ఒత్తులన్నీ ఎక్కడ తారుమారవుతాయో అని ఆమెకొక భయం ఉండేది. చివరికి వారం పోయాక ఒకనాడు సంజెవేళ పిలుపు వచ్చింది.

‘‘బాబుగారూ పిలిచారా నన్ను?’’
‘‘రత్నా, రేపే నేను వెళ్లిపోతున్నాను’’ అని చెప్పాడు పోస్ట్‌ మాస్టర్‌.
‘‘ఎక్కడికి వెడతారు?’’
‘‘ఇంటికి వెడుతున్నా’’
‘‘మళ్లీ ఎప్పుడొస్తారు?’’
‘‘ఇంక రాను’’

రతన్‌ ఇంకేమీ అడగలేదు. బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాననీ, మంజూరు కాలేదనీ, అంచేత ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతున్నాననీ చెప్పాడు. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. మినుకు మినుకు మంటూ దీపం వెలుగుతోంది.

కొంచెం సేపయాక రతన్‌ మెల్లిగా లేచి, రొట్టెలు చెయ్యిటానికి వంటింట్లోకి వెళ్లింది. పోస్ట్‌ మాస్టర్‌ భోజనమయిన తర్వాత– ‘‘బాబుగారూ! నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లరాదూ’’ అని అడిగింది.

పోస్ట్‌ మాస్టర్‌ నవ్వి– ‘‘అది యెలా సాధ్యమవుతుంది?’’ అన్నాడు. అసలు విషయమేమిటో, ఎందువల్ల సాధ్యం కాదో ఆ బాలికకు నచ్చజెప్పటం ఆవశ్యకమని అనుకోలేదు.

రాత్రంతా మెలకువగా ఉన్నప్పుడు, కలలోనూ కూడా ‘అది యెలా సాధ్యమవుతుంది’ అని నవ్వుతూ మాస్టర్‌ అన్న మాట ఆ బాలిక చెవుల్లో ప్రతిధ్వనించ సాగింది.

పోస్ట్‌ మాస్టర్‌ తెల్లారకట్లనే లేచి చూసేసరికి స్నానానికి నీళ్లు సిద్ధంగా పెట్టి ఉన్నాయి. అతడు యెప్పుడు బయలుదేరుతున్నదీ బాలిక యెందుచేతనో అడగలేక పోయింది. ప్రొద్దున్నే అవసరమొస్తాయో అని క్రితం రాత్రే నది నుంచి నీళ్లు తీసుకొచ్చిపెట్టింది. స్నానం అయాక రత్నకి పిలుపు వచ్చింది. ‘‘నా స్థానంలో వచ్చే అతడితో నేను చెప్పి వెడతాను. అతడు నిన్ను, నాలాగానే ఆదరిస్తాడు. నువ్వేమీ బెంగపెట్టుకోనక్కర్లేదు’’ అన్నాడు. ఈ మాటలు దయార్ద్ర హృదయంలోంచి వచ్చినవే. కాని స్త్రీ హృదయాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఈ మెత్తని మాటలను ఆమె సహించలేకపోయింది. ఒక్కసారి బావురుమని యేడుస్తూ– ‘‘వద్దు వద్దు. మీరెవరికీ యేమీ చెప్పనవసరం లేదు. నేనిక్కడ ఉండాలనుకోవటం లేదు’’ అన్నది.

రత్న ఇలా వ్యవహరించటం మాస్టర్‌ యెన్నడూ చూసి యెరుగడు. చటుక్కున తెల్లబోయాడు.

క్రొత్త పోస్ట్‌ మాస్టర్‌ వచ్చాడు. అతడికి ఛార్జి అప్పగించి, పాత మాస్టర్‌ ప్రయాణోన్ముఖుడయాడు. రత్నను పిలిచి– ‘‘నీకెప్పుడూ నేనేమీ యివ్వలేకపోయాను’’ అన్నాడు. త్రోవ ఖర్చుకు పోనూ తనకు వచ్చిన జీతం పైకం మొత్తమంతా జేబులోంచి పైకి తీశాడు. ‘‘బాబుగారూ, మీ కాళ్లు రెంటూ పట్టుకుంటున్నా. నాకేమీ యివ్వద్దు, నన్ను గురించి ఎవరూ ఏమీ దిగులు పెట్టుకోనక్ఖర్లేదు’’ అని ఒక్క పరుగున పారిపోయింది.

పాత మాస్టర్‌ నిట్టూర్పు విడిచి, గొడుగు పైన వేసుకుని, రేకుట్రంకు కూలివాడి నెత్తిన యెత్తి పడవల రేవుకి బయలుదేరాడు. పడవ యెక్కి, బయలుదేరేసరికి అతడి హృదయంలో అపరిమితమైన వేదన కలగసాగింది. ‘‘తిరిగి వెడదాం, జగతి ఒడినుంచి జారిపోయిన ఆ అనాథను తీసుకువద్దాం’’ అనిపించిందొకసారి. కాని అప్పటికి తెరచాపకు గాలి బాగా అందుకుంది. నదీ ప్రవాహం వడిగా ఉంది. ఊరు దాటిపోయి, నదీ ఒడ్డున ఉండే శ్మశానం కన్పిస్తోంది. పథికుని ఉదాసీన హృదయంలో– ‘‘జీవితంలో ఇలాంటి ఎన్ని విఛ్చేదాలు, ఎన్ని మృత్యువులున్నాయో? తిరిగి వెళ్లటం వల్ల లాభమేమిటి? పృథివిలో ఎవరికి ఎవరు?’’ అన్న వైరాగ్యం ఉదయించింది.

‘విశ్వకవి’ రవీంద్రనాథ్‌ టాగూర్‌ (1861–1941) కథ ‘పోస్ట్‌ మాస్టర్‌’కు ఇది సంక్షిప్త రూపం. రచనాకాలం 1891. దీన్ని తెలుగులోకి అనువదించింది మద్దిపట్ల సూరి. ‘గీతాంజలి’ టాగూర్‌ ప్రసిద్ధ రచన.

రవీంద్రనాథ్‌ టాగూర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement