post master
-
పోస్ట్‌మాస్టర్ యవ్వారం.. ఐపీఎల్ బెట్టింగ్‌లో కోటి లాస్.. అంతా మంది సొమ్మే!
భోపాల్: తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకుంటే.. ఆ కర్మఫలితాన్ని కూడా తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. మంది సొమ్ముతో ఐపీఎల్లో బెట్టింగ్ వేయడమే కాదు.. ఆ సొమ్మంతా పొగొట్టి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఓ పోస్ట్‌మాస్టర్. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్‌లో విశాల్ అహిర్వార్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగులు పెడుతున్నాడు అతను. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలకు పైనే పొగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బంతా మంది సొమ్మని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 24 కుటుంబాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఐపీఎల్లో బెట్టింగ్ కోసం వాడుకున్నాడు. విశాల్ చేసిన మోసం వెలుగులోకి రావడంతో మే 20న బినా గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్నాడు అతను. నిందితుడు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఎఫ్డి ఖాతాల కోసం నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడని, గత రెండేళ్ల నుండి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చీటింగ్, ఖాతాదారులను మోసం చేయడం సెక్షన్ల కింద విశాల్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
పోస్టాఫీస్ ఖాతాదారులు ఇవి గుర్తుంచుకోండి!
ప్రస్తుతం ఎన్నో రకాల పథకాలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా కచ్చితమైన రాబడి పొందవచ్చు. అయితే, పోస్టాఫీస్‌లో ఖాతా కలిగిన వారు, ఇతర రకాల స్కీమ్స్‌లో చేరిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇండియా పోస్ట్ ఇటీవలే కొత్త రూల్స్ తీసుకోని వచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ వల్ల పోస్టాఫీస్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. పోస్టాఫీస్ జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచుల్లో వ్యక్తి గత ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయెల్ లిమిట్‌ను రూ.20,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వడ్డీ రేటును కూడా సవరించింది. సేవింగ్ ఖాతా నగదుపై ఏడాదికీ 4శాతం వడ్డీ లభించనుంది. పోస్టాఫీస్ జీడీఎస్ బ్రాంచుల నుంచి రూ.5,000 కాకుండా ఇప్పుడు ఒక్కో కస్టమర్ రూ.20 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రోజుకు ఒక అకౌంట్లో రూ.50,000కు మించి డబ్బులు డిపాజిట్ చేయడానికి వీలు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి స్కీమ్‌లలో డబ్బు డిపాజిట్ చేయడానికి విత్‌డ్రాయెల్ ఫామ్ లేదా చెక్ ఉపయోగించొచ్చు. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ మీ పోస్టాఫీస్ ఖాతాలోలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే.. అప్పుడు మీ ఖాతా నుంచి రూ.100 కట్ అవుతుంది. చదవండి: మీ ఆధార్ ను ఎవరైనా వాడారా తెలుసుకోండిలా..? కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం -
420 పోస్టు మాస్టర్
సాక్షి, కృష్ణా : పోస్టాపీస్ ఖాతాదారులను మోసం చేసిన ఓ పోస్ట్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బూతుమిల్లుపాడు,అజంపూడి బ్రాంచ్ లో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న నాగేంద్ర 300 మంది ఖాతాదారులను మోసం చేసి 43 లక్షల రూపాయలు స్వాహా చేశాడు. 2014 నుండి ఖాతాదారుల నుండి డబ్బు తీసుకొని పాస్ బుక్ జమ చేయకుండా ఆ సొమ్మంత కాజేశాడు. బాధితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలియడంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. -
పార్శిల్స్ ఘటనపై స్పందించిన పోస్టల్ శాఖ
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పోస్టాఫీస్‌కు వచ్చిన పలు పార్శిల్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు అధికారుల పేరిట పార్శిల్స్ రావడం అధికారులను పరుగులు పెట్టించింది. తాజాగా ఈ ఘటనపై సికింద్రాబాద్ సీనియర్ పోస్ట్ మాస్టర్ రమణారెడ్డి స్పందించారు. ‘మాకు శనివారం సాయంత్రం పార్శిల్స్ వచ్చాయి. ఆఫీస్ టైమ్ అయిపోవడంతో వాటిని తిరిగి పంపించాం. మంగళవారం ఉదయం మళ్లీ పోస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. అయితే పార్శిల్స్ నుంచి చెడు వాసన వచ్చింది. ఆ పార్శిల్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ల నుంచి పోస్టు చేసినట్టు తెలిసింది. దీంతో మేము వారి నుంచి సమాచారం కోరాం. వారు తాము ఎలాంటి పార్శిల్స్ పంపలేదని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని వారు వివరణ ఇచ్చారు. తొలుత అందులో కెమికల్స్ ఉన్నాయని భావించినప్పటికీ.. అది మురుగు నీరు అని తేలింది. ఆ పార్శిల్స్తోపాటు మూడు పేజీల లేఖ కూడా ఉంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నార’ని రమణారెడ్డి తెలిపారు. కాగా, ఆ పార్శిల్స్ ఓయూ నుంచి ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చాయని అధికారులు గుర్తించారు. అందులో మురుగు నీరు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్ పంపించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పడవెళ్లి పోతున్నది
ఉద్యోగంలో చేరగానే మొదట ఉలాపూర్ గ్రామానికి పోస్ట్‌మాస్టర్‌గా రావలసి వచ్చింది. ఉలాపూర్ చిన్న ఊరు. దగ్గిరలో నీలిమందు కార్ఖానా ఉంది. ఆ కార్ఖానా దొర ఎంతో ప్రయత్నం చేసి, ఈ క్రొత్త పోస్టాఫీసు పెట్టించగలిగాడు. పోస్ట్ మాస్టరు కలకత్తా బిడ్డ. నీళ్లలోని చేపను ఒడ్డున పడేస్తే ఏమవుతుందో, ఈ కుగ్రామానికి వచ్చిన పోస్ట్ మాస్టరు స్థితి కూడా అంతే అయింది. చీకటి కోణంగా ఉండే ఒక యింట్లో అతడి ఆఫీసు. దగ్గరలో నాచుతో కప్పివుండే చెరువు. దానికి నాలుగు వైపులా అడవి. స్థానికంగా ఉండేవారితో అతడు కలిసిపోలేకపోయాడు. పైగా చేతికి ఎక్కువ పనిలేదు. అప్పుడప్పుడు ఒకటి అర కవితలు వ్రాయటానికి ప్రయత్నించేవాడు. రోజంతా ఆకాశంలోని మేఘాల్ని చూస్తూ కూచుంటే జీవితం సుఖంగా గడిచిపోతుంది – అన్న భావం వ్యక్తం అవుతూవుంటుంది, ఆ కవితల్లో. పోస్ట్ మాస్టరు జీతం చాలా తక్కువ. తానే వంట చేసుకుని తినాలి. ఊళ్లో తల్లీ తండ్రీ లేని ఒక అనాథ బాలిక అతడి పనులు చేసిపెడుతూ ఉండేది. ఆమెకి నాలుగు మెతుకులు తినటానికి దొరికేవి. పేరు రతన్. పన్నెండు పదమూడేళ్లుంటాయి. పెళ్లయే అవకాశం ఏమీ కన్పించదు. సంజెవేళ పశువుల పాకల్లోంచి పొగలు వర్తులాకారంగా లేస్తూ ఉంటాయి. పొదల గుబురుల్లోంచి కీచురాళ్లు కూస్తుంటాయి. చీకట్లో వసారాలో ఒంటరిగా కూర్చుని ఆకుల కదలికలు చూస్తుంటే, కవి హృదయంలో రవంత సంచలనం కలిగినప్పుడిహ ఇంట్లో మూల గుడ్డిదీపం వెలిగించి ‘రతన్’ అని పిలిచేవాడు. రతన్ గుమ్మంలో కూర్చుని ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తూండేది. ‘‘ఏం చేస్తున్నావ్ నువ్వు?’’ ‘‘పొయ్యి వెలిగించటానికి వెళ్లాలి. వంటింట్లో–’’ ‘‘వంటింటి పనులు తర్వాత చేసుకుందువుగాని– ముందు ఒకమాటు చిలుంగొట్టం సిద్ధం చేసి ఇయ్యి’’ బుగ్గలు రెండు ఉబ్బించి చిలుంగొట్టం ఊదుకుంటూ రతన్ ప్రవేశించేది. ఆమె చేతిలోని గొట్టాన్ని అందుకుని, ‘‘అవును కాని రతన్, మీ అమ్మ జ్ఞాపకం వస్తూంటుందా’’ అని అడిగేవాడు. చాలా సంగతులవన్నీ. కొన్ని జ్ఞాపకం వస్తాయి, కొన్ని రావు. తల్లి కంటే తండ్రి ఆమెను ఎక్కువ ఆపేక్షగా చూసేవాడు. ఆమెకొక తమ్ముడుండేవాడు. ఒకనాడు వర్షంగా ఉన్న రోజున ఒక గుంటగట్టున ఇద్దరూ కలిసి, చెట్టున విరిగిన సమ్మటి కొమ్మను గాలం చేసుకుని ఉత్తుత్తి చేపలు పట్టే ఆట ఆడుకున్నారు. ఇలా మాటల్లో మధ్య మధ్య రాత్రి చాలా ప్రొద్దుపోతూ ఉండేది. అప్పుడిహ బద్దకం కొద్దీ పోస్ట్ మాస్టరు వంట చేసుకోటానికి ఇచ్చగించేవాడు కాదు. ప్రొద్దున చల్లారిపోయిన కూరలవీ ఉండేవి. రతన్ గబగబా పొయ్యి వెలిగించి, కాసిని రొట్టెలు కాల్చి తీసుకువచ్చేది. వాటితోనే ఆ రాత్రి ఇద్దరికీ తిండి వెళ్లిపోయేది. ఒకొకరోజున ఆ పెద్ద ఎనిమిది దూలాల ఆఫీసు గృహంలో ఒకవైపున బల్లమీద కూర్చుని పోస్ట్ మాస్టరు తన యింటి సంగతులు ఏకరువు పెట్టేవాడు. తల్లి, తమ్ముడు అక్కల సంగతులు– ప్రవాసంలో ఒంటరిగా ఇంట్లో కూర్చున్నప్పుడు మనస్సు ఎవరికోసం కొట్టుకుంటూ ఉంటుందో వారి సంగతులు చదువు సంస్కారంలేని ఆ చిన్నబాలికతో చెప్పుకునేవాడు. అతడా సంగతులన్నీ చెపుతున్నప్పుడు ఆ బాలిక వాళ్ల యింట్లో వాళ్లని అమ్మ, అక్క, అన్న అని వరసలు కలిపి మాట్లాడేదాకా వచ్చింది. తన చిన్న హృదయ పటం మీద వారి ఊహారూపాలను కూడా చిత్రించుకుంది. వర్షాకాలంలో మబ్బులు లేని ఒకనాటి మధ్యాహ్నవేళ చక్కని నులివెచ్చని గాలి వీస్తోంది. అలసిపోయి ఉన్న ధరణి వేడి నిట్టూర్పు ఒంటికి తగులుతున్నట్లుంది. పోస్ట్ మాస్టరు వాటికేసి చూస్తూ– ఈ సమయంలో హృదయానికి హత్తుకునే అనురాగ పుత్తలిౖయెన మానవమూర్తి సరసన ఉంటే అని భావించుకోసాగాడు. ఒక చిన్న పల్లెటూరులో కొద్ది జీతం తెచ్చుకునే సబ్ పోస్ట్ మాస్టరు మనసులో ఒక సెలవునాటి మధ్యాహ్న వేళ ఇలాంటి భావాలు తలెత్తాయని అంటే ఎవరూ నమ్మనూ నమ్మరు; అర్థమూ చేసుకోలేరు. పెద్దనిట్టూర్పు విడిచి ‘రత్నా’ అని పిలిచాడు. రతన్ అప్పుడు జామచెట్టు కింద, కాళ్లు చాచుకుని పచ్చిజామకాయ తింటూ కూర్చుంది. యజమాని గొంతు విన్పించగానే హడావుడిగా పరుగెత్తుకొచ్చి, ‘‘బాబుగారూ, పిలిచారా?’’ అన్నది. ‘‘నీకు కాస్త చదువు నేర్పుతాను’’ అని ఆ మధ్యాహ్నమంతా అఆలు నేర్పడం మొదలెట్టాడు. కొద్దిరోజుల్లోనే ఆమెకి ఒత్తులు కూడా వచ్చేశాయి. ఒకనాడు ప్రొద్దున్నుంచి తెరిపిలేకుండా కురుస్తోంది వర్షం. పోస్ట్ మాస్టరు శిష్యురాలు చాలాసేపటినుంచి గుమ్మం దగ్గిర కనిపెట్టుకుని కూచుని ఉంది. కాని ఎంతసేపటికీ పిలుపు రాకపోవటంతో తన పుస్తకాలు, కలం పెట్టుకున్న చిన్న పెట్టె తీసుకుని తానే లోపలికి వెళ్లింది. మాస్టర్ మంచం మీద పడుకుని ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుని, చప్పుడు కానీయకుండా మళ్లీ మెల్లిగా గదిలోంచి బయటకు వెళ్లబోయింది. చటుక్కున ‘‘రత్నా’’ అని పిలుపు విన్పించింది. ‘‘ఒంట్లో బాగున్నట్టు లేదు, నుదురు మీద చెయ్యివేసి చూడు’’ అన్నాడు. తోడు ఎవరూ లేని ఈ ప్రవాసంలో, జోరుగా కురుస్తున్న వర్షంలో, అస్వస్థతగా ఉన్న శరీరానికి కాస్త శుశ్రూష కావాలనిపించింది. కాలిపోతున్న నుదురు మీద గాజుల చేతి కోమలస్పర్శ తలపుకు వచ్చింది. ఈ దుస్సహమైన రోగ బాధలో స్నేహరూపిణులైన తల్లి, అక్క ప్రక్కన ఉండాలనిపిస్తుంది. బాలిక అయిన రతన్ ఇంక బాలికగా ఉండిపోలేదు. ఆమె తల్లిస్థానాన్ని, అధికారాన్ని చేపట్టింది. వైద్యుణ్ని పిలిపించింది. వేళకు మందు తాగించేది. తానే పథ్యం వండిపెట్టేది. ‘‘బాబుగారూ, కాస్త తేలిగ్గా ఉన్నట్లుందా?’’ అని ఒకటికి పదిసార్లు అడిగేది. చాలా రోజులకి పోస్ట్ మాస్టరు చిక్కి శల్యమై రోగశయ్య మీదినుంచి లేచాడు. ఇహ లాభం లేదు. ఇక్కడినుంచి ఎలాగయినా సరే బదిలీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతపు అస్వస్థతను వ్యక్తం చేస్తూ పై అధికారులకు దరఖాస్తు పంపుకున్నాడు. రతన్ మళ్లీ గుమ్మం బయట తన స్వస్థానాన్ని ఆక్రమించుకుంది. కాని వెనుకటిలాగా ఇప్పుడామెకి పిలుపు రావడం లేదు. బయట కూర్చుని తన పాతపాఠాలు వెయ్యేసిసార్లు చదివేది. చటుక్కున ఎప్పుడు పిలుపు వస్తుందో, ఆ సమయానికి తనకు వచ్చిన ఒత్తులన్నీ ఎక్కడ తారుమారవుతాయో అని ఆమెకొక భయం ఉండేది. చివరికి వారం పోయాక ఒకనాడు సంజెవేళ పిలుపు వచ్చింది. ‘‘బాబుగారూ పిలిచారా నన్ను?’’ ‘‘రత్నా, రేపే నేను వెళ్లిపోతున్నాను’’ అని చెప్పాడు పోస్ట్ మాస్టర్. ‘‘ఎక్కడికి వెడతారు?’’ ‘‘ఇంటికి వెడుతున్నా’’ ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు?’’ ‘‘ఇంక రాను’’ రతన్ ఇంకేమీ అడగలేదు. బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాననీ, మంజూరు కాలేదనీ, అంచేత ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతున్నాననీ చెప్పాడు. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. మినుకు మినుకు మంటూ దీపం వెలుగుతోంది. కొంచెం సేపయాక రతన్ మెల్లిగా లేచి, రొట్టెలు చెయ్యిటానికి వంటింట్లోకి వెళ్లింది. పోస్ట్ మాస్టర్ భోజనమయిన తర్వాత– ‘‘బాబుగారూ! నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లరాదూ’’ అని అడిగింది. పోస్ట్ మాస్టర్ నవ్వి– ‘‘అది యెలా సాధ్యమవుతుంది?’’ అన్నాడు. అసలు విషయమేమిటో, ఎందువల్ల సాధ్యం కాదో ఆ బాలికకు నచ్చజెప్పటం ఆవశ్యకమని అనుకోలేదు. రాత్రంతా మెలకువగా ఉన్నప్పుడు, కలలోనూ కూడా ‘అది యెలా సాధ్యమవుతుంది’ అని నవ్వుతూ మాస్టర్ అన్న మాట ఆ బాలిక చెవుల్లో ప్రతిధ్వనించ సాగింది. పోస్ట్ మాస్టర్ తెల్లారకట్లనే లేచి చూసేసరికి స్నానానికి నీళ్లు సిద్ధంగా పెట్టి ఉన్నాయి. అతడు యెప్పుడు బయలుదేరుతున్నదీ బాలిక యెందుచేతనో అడగలేక పోయింది. ప్రొద్దున్నే అవసరమొస్తాయో అని క్రితం రాత్రే నది నుంచి నీళ్లు తీసుకొచ్చిపెట్టింది. స్నానం అయాక రత్నకి పిలుపు వచ్చింది. ‘‘నా స్థానంలో వచ్చే అతడితో నేను చెప్పి వెడతాను. అతడు నిన్ను, నాలాగానే ఆదరిస్తాడు. నువ్వేమీ బెంగపెట్టుకోనక్కర్లేదు’’ అన్నాడు. ఈ మాటలు దయార్ద్ర హృదయంలోంచి వచ్చినవే. కాని స్త్రీ హృదయాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఈ మెత్తని మాటలను ఆమె సహించలేకపోయింది. ఒక్కసారి బావురుమని యేడుస్తూ– ‘‘వద్దు వద్దు. మీరెవరికీ యేమీ చెప్పనవసరం లేదు. నేనిక్కడ ఉండాలనుకోవటం లేదు’’ అన్నది. రత్న ఇలా వ్యవహరించటం మాస్టర్ యెన్నడూ చూసి యెరుగడు. చటుక్కున తెల్లబోయాడు. క్రొత్త పోస్ట్ మాస్టర్ వచ్చాడు. అతడికి ఛార్జి అప్పగించి, పాత మాస్టర్ ప్రయాణోన్ముఖుడయాడు. రత్నను పిలిచి– ‘‘నీకెప్పుడూ నేనేమీ యివ్వలేకపోయాను’’ అన్నాడు. త్రోవ ఖర్చుకు పోనూ తనకు వచ్చిన జీతం పైకం మొత్తమంతా జేబులోంచి పైకి తీశాడు. ‘‘బాబుగారూ, మీ కాళ్లు రెంటూ పట్టుకుంటున్నా. నాకేమీ యివ్వద్దు, నన్ను గురించి ఎవరూ ఏమీ దిగులు పెట్టుకోనక్ఖర్లేదు’’ అని ఒక్క పరుగున పారిపోయింది. పాత మాస్టర్ నిట్టూర్పు విడిచి, గొడుగు పైన వేసుకుని, రేకుట్రంకు కూలివాడి నెత్తిన యెత్తి పడవల రేవుకి బయలుదేరాడు. పడవ యెక్కి, బయలుదేరేసరికి అతడి హృదయంలో అపరిమితమైన వేదన కలగసాగింది. ‘‘తిరిగి వెడదాం, జగతి ఒడినుంచి జారిపోయిన ఆ అనాథను తీసుకువద్దాం’’ అనిపించిందొకసారి. కాని అప్పటికి తెరచాపకు గాలి బాగా అందుకుంది. నదీ ప్రవాహం వడిగా ఉంది. ఊరు దాటిపోయి, నదీ ఒడ్డున ఉండే శ్మశానం కన్పిస్తోంది. పథికుని ఉదాసీన హృదయంలో– ‘‘జీవితంలో ఇలాంటి ఎన్ని విఛ్చేదాలు, ఎన్ని మృత్యువులున్నాయో? తిరిగి వెళ్లటం వల్ల లాభమేమిటి? పృథివిలో ఎవరికి ఎవరు?’’ అన్న వైరాగ్యం ఉదయించింది. ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941) కథ ‘పోస్ట్ మాస్టర్’కు ఇది సంక్షిప్త రూపం. రచనాకాలం 1891. దీన్ని తెలుగులోకి అనువదించింది మద్దిపట్ల సూరి. ‘గీతాంజలి’ టాగూర్ ప్రసిద్ధ రచన. రవీంద్రనాథ్ టాగూర్ -
పోస్ట్‌మాస్టర్ చేతివాటం
మిరుదొడ్డి(దుబ్బాక): నమ్మకానికి మారుపేరుగా నిలిచే పోస్టాఫీసులో బ్రాంచి పోస్టుమాస్టర్ చేతివాటం చూపిన వైనం మండల పరిధిలోని రుద్రారం ఫోస్టాఫీసులో బుధవారం వెలుగులోకి వచ్చింది. గత 31 నెలలుగా పోస్టాఫీసులో జమ చేసిన డిపాజిట్ డబ్బులను సబ్ పోస్టాఫీసు అకౌంట్‌కు చూపకుండా పోస్టుమాస్టర్ లత రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. బ్రాంచి పోస్టాఫీసు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నిజాంపేట సబ్ ఫోస్ట్ ఆఫీస్ కింద మండల పరిధిలోని రుద్రారం బ్రాంచ్ పోస్టాఫీసులో 47 సుకన్య సంవృద్ధి అకౌంట్లు, 76 రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్, గ్రామీణ రూరల్ తపాలా జీవిత బీమా వంటి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పోస్టుమాస్టర్ లత తీసుకుంటున్న డిపాజిట్లల్లో అనుమానాలు తలెత్తుతున్నట్లు గమనించిన కొందరు ఖాతాదారులు నిజాంపేట సబ్‌పోస్టాఫీసులో వాకబు చేశారు. తమ ఖాతా బుక్కుల్లో గత 31 నెలలుగా డిపాజిట్ చేస్తున్నప్పటికి సబ్ ఫోస్టాఫీసులో కేవలం రూ.4 వేలు మాత్రమే జమ అయినట్లు ఆన్లైన్లో చూపెట్టడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు. దీంతో రుద్రారం బ్రాంచ్ ఫోస్టాఫీసులో జరుగుతున్న తతంగంపై మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ నికిత్, మేయిల్ పర్సన్ కరుణాకర్ బుధవారం రుద్రారం పోస్టాఫీసును ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పోస్టాఫీసులోని లావాదేవీలపై విచారణ చేపట్టారు. రికార్డుల పరిశీలనలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ లత ఖాతాదారుల పాసుబుక్కుల్లో డబ్బులు జమచేసిన అనంతరం సబ్‌పోస్టాఫీసుకు రోజువారి అకౌంట్ చూపకుండా డబ్బులు స్వాహాచేసినట్లు పోస్టల్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్రాంచ్ పోస్టాఫీసుకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఖతాదారులకు న్యాయం చేస్తాం.. రుద్రారం బ్రాంచ్ పోస్టాఫీసులో జరిగిన సొమ్ము స్వాహాపై ఖాతాదారులు ఆందోళన చెందవద్దని మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అంకిత్ అన్నారు. ఖతాదారుల పాసుబుక్కులను, రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంత సొమ్ము స్వాహా అయ్యిందో విచారిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన ఖతాదారులకు బ్రాంచ్ పోస్టుమాస్టర్ నుంచి సొమ్మును రికవరీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఖాతాదారులు శాంతించారు. అవకతవకలకు పాల్పడిన బ్రాంచ్ పోస్టుమాస్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. – మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అంకిత్ -
గడసాం పోస్టాఫీసులో డిపాజిట్లు స్వాహా!
దత్తిరాజేరు(గజపతినగరం): నిరుపేదలు పైసాపైసా కూడబెట్టి దాచుకున్న మొత్తాలు గద్దల పాలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్‌లో దాచుకున్న సొమ్ము అక్కడి ఇన్చార్జి పోస్టుమాస్టరే కాజేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గడశాంలో గ్రామానికి చెందిన పలువురు పేదలు దాచుకున్న రూ. 40 లక్షల వరకు అక్కడ ఇన్చార్జ్గా పని చేస్తున్న చినకాద బీపీఎం శ్యాం, రన్నర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ, గడసాం గ్రామానికి చెందిన విశ్రాంతి బీపీఎం బ్రహ్మం కమారుడు జగదీషకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో స్వాహా చేశారు. కొద్దిరోజులుగా జగదీష్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన పెదమానాపురం ఎస్పీఎం(సబ్‌పోస్ట్ మాస్టర్) సత్యం సిబ్బందితో కలసి గురువారం గ్రామానికి వెళ్లి రికార్డులను పరిశీలింగా వందలాది మంది డిపాజిట్ దారులు దాచుకొన్న సోత్తు స్వాహా చేసినట్లు తేలింది. ఆయన విజయనగరం హెడ్ పోస్టాఫీస్‌లోని ఐపీఓ పోలేటికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రికార్డులను పరిశీలించి 100 ఖాతాలను సీజ్ చేశారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో తాము పరిశీలనకు వచ్చినట్టు పెదమానాపురం బీపీఎం సత్యం సాక్షికి తెలిపారు. వంద పాస్‌పుస్తకాలను సీజ్ చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఎంతమొత్తం గల్లంతయిందన్నది ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. మొత్తమ్మీద గ్రామంలో రూ. 40లక్షల వరకూ కాజేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఉద్యోగుల సహకారంతోనే మొదటి స్థానం
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఉద్యోగుల సహకారంతోనే కర్నూలు డివిజన్‌కు రీజియన్ స్థాయిలో మొదటి స్థానం లభించిందని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక బి.క్యాంప్ పోస్టాఫీసులో హెడ్ మాస్టర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో పోస్టల్ సూపరింటెండెంట్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సూపరింటెండెంట్‌తో పాటు ఆయన సతీమణి రమాదేవిలను దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు దంపతులకు కిరీటం ధరింపజేసి సభాస్థలి దాకా ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టుమాస్టర్లు ఎద్దుల డేవిడ్, సూర్యనారాయణరావు, జయచంద్ర, శాంతకుమారి, ధూరతి, శివకుమార్‌రెడ్డి, తిక్కయ్య, సిస్టమ్ ఆర్గనైజర్స్ ఇంతియాజ్, రమేశ్ పాల్గొన్నారు. -
'మహాత్మాగాంధీ' డబ్బులు పోస్ట్‌మాస్టర్ స్వాహా
శ్రీకాకుళం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు చెందాల్సిన మొత్తాన్ని అక్రమ మార్గాల్లో కొల్లగొట్టిన పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. వారు అక్రమంగా వెనకేసిన మొత్తం రూపాయో రెండు రూపాయలో కాదు.. ఏకంగా 1.53 కోట్లు. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సతివాడ పోస్ట్ ఆఫీసుకు చెందిన ఓ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇతర ముగ్గురు తపాళా శాఖ అధికారులు 26.10.2013 నుంచి 09.09.2015 మధ్య కుట్రపూరితంగా వ్యవహరించి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన వారికి చెల్లించాల్సిన మొత్తంలో మోసం చేసి దాదాపు కోటిన్నరకు పైగా వెనకేసుకున్నారు. దీంతో గత కొంత కాలంగా వీరిని అనుమానించిన సీబీఐ అధికారులు తాజాగా వారిపై కేసులు పెట్టి వారి వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వీరి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. -
పోలీసుల అదుపులో బ్రాంచ్ పోస్టుమాస్టర్
వరికుంటపాడు (ఉదయగిరి): మండలంలోని గువ్వాడి బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఆవుల బాలయ్య వైఎస్సార్ జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈయనకు సంబంధం ఉండటంతో పోలీసులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తూర్పుచెన్నంపల్లికి చెందిన ఆయన సమీప బంధువు మరొకరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వీరికి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులతో సంబంధం ఉండి అడపాదడపా వారికి ఎర్రచందనం దుంగలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీరితో సంబంధం ఉన్న ఎర్ర దొంగలు కడప పోలీసులకు చిక్కడంతో వారిచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బద్వేలుకు చెందిన ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా ఏర్పడి వీరితో ఎర్రచందనం కొనుగోలుపై ఒప్పందం చేసుకొని వారితోనే మూడురోజులు కలిసి మెలిసి తిరిగి దుంగలను లోడుచేసిన అనంతరం వాహనంతోసహా అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. భైరవకోన అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికేందుకు పెద్దిరెడ్డిపల్లికి చెందిన కొంతమంది గిరిజనులను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారంతో పూర్తిగా సంబంధమున్న వీరిద్దరినీ బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకొని కూలీలను వది లివేశారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో 81 మందికి సంబంధం ఉన్నట్లుగా ఎస్పీ గుర్తించారని సమా చారం. ఇందులో ఉదయగిరి, దుత్తలూరు, నందిపాడు, సీతారామపురం మండలాలకు చెందిన పలువురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్‌తో సంబంధమున్న పలువురు వ్యక్తుల గుం డెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
బీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు పోస్టల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒ.విజయకుమార్ నోటిఫికేషన్ వివరాలు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 8 బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు విధివిధానాలు ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి సక్రమంగా ఉన్నవాటిని గమనించి అభ్యర్థులకు ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు ఒంగోలులోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు లేదా స్పీడ్‌పోస్టు ద్వారా మాత్రమే చేయాలి. దరఖాస్తులను ఒ.విజయకుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, ప్రకాశం డివిజన్, ఒంగోలు-523001కు పంపాలన్నారు. దరఖాస్తులు పంపే కవర్‌పై అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ జీడీఎస్ బీపీఎం, బీవో, ఏడబ్ల్యూ, ఎస్వో అని రాయాలి. జిల్లాలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ల ఖాళీలు కింది విధంగా ఉన్నాయి. సింగరాయకొండ సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని పాకల బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుంది. తాళ్లూరు సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని శివరామపురం బీపీఎం ఓబీసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు. అద్దంకి సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని సంకువారిపాలెం బీపీఎం ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు. దర్శి సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని నిమ్మారెడ్డిపాలెం బీపీఎం ఓబీసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2 గంటలకు. వలపర్ల సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని చిమ్మిరిబండ బీపీఎం ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 11వ తేది ఉదయం 10 గంటలకు. మొగ ళ్లూరు సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి బీపీఎం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ నెల 11 మధ్యాహ్నం 2 గంటలకు. మార్టూరు సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని బొబ్బేపల్లి బీపీఎం ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు. దర్శి సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని దేవవరం బీపీఎం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 2 గంటలకు. -
తూతూమంత్రంగా ‘ఉపాధి’ పరిశీలన
జిల్లాలో జరిగిన ఉపాధిహామీ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటనపై వేతనదారులు తీవ్ర అసంతృప్తి వక్తం చేశారు. తూతూ మంత్రంగా పరిశీలన ఉందని పెదవి విరిచారు. పనుల జోలికి బృందం సభ్యులు వెళ్లకపోవడంపై మండిపడుతున్నారు. రెండో రోజైన శుక్రవారం శ్రీకాకుళం రూరల్‌తోపాటు గార, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, పోలాకి తదితర మండలాల్లో బృందం ప్రతినిధులు పర్యటించారు. వంద రోజుల పనిదినాలు పూర్తి చేయాలి శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్:ప్రతి కుంటుంబం తప్పని సరిగా వంద రోజులు పనిదినాలు పూర్తి చేయాలని ఉపాధి హామీ పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధి, సీనియర్ ఐఏఎస్ అధికారి భగీరధ పాండే అన్నారు. రాగోలుపేటలో జరిగిన ఉపాధి పనులను బృందం పరిశీలించి రికార్డులను సరిచూశారు. జాబ్ కార్డులను అప్డేట్ చేస్తున్నదీ లేనిది పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడి.. కోరిన వెంటనే పనులు కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పోస్టాఫీసుల్లో ఆలస్యం ఏమైనా అవుతుందా అన్ని ప్రశ్నించారు. సర్పంచ్ యజ్జల గురుమూర్తి కల్పించుకొని ఇటీవల కాలంలో వేతనాలు సకాలంలో అందడం లేదని చెప్పగా, పోస్టుమాస్టర్ బదిలీ కావడంతో ఈ పరిస్థితి నెలకొందని, దీనిపై పీడీకి నివేదికలు అందజేశామని ఏపీవో కె.యుగంధర్ చెప్పారు. కేంద్ర బృందం పరిశీలన తూతూ మంత్రంగా సాగింది. ఉదయం ఖాజీపేట, సానివాడలో పరిశీలన జరుగుతుందని, అనంతరం కరజాడ పంచాయితీ అని చివరికి రాగోలుకు సాయంత్రం నాలుగు గంటలకు చేరారు. అక్కడ పంచాయితీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం రాగోలుపేట వెళ్లి కేవలం వేతనదారులు, గ్రామస్తులతో మాట్లాడి వెనుదిరిగారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ గణపతిరావు పాల్గొన్నారు. కొత్తరేవులో: పోలాకి: కొత్తరేవు, వనిత గ్రామాల్లో 2013-14 సంవత్సరంలో చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు భగీరథ పండా పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడి 150 రోజుల పనులు వర్తించాయా అని అడితెలుసుకున్నారు. పరిశీలన అంతంత మాత్రం గార:ఉపాధి హామీ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందం పరిశీలన అంతంత మాత్రంగానే సాగింది. బృంద సభ్యుడైన భగీరధ పండా శాలిహుండం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి రికార్డులను పరిశీలించారు. జాబ్‌కార్డుల్లో పనిదినాలు ఎందుకు వేయలేదని పండా ప్రశ్నించగా, వేతనదారుడు వలస వెళ్లడంతో నమోదు చేయలేకపోయామని కిందిస్థాయి సిబ్బంది వివరించారు.అనంతరం వంశధార నది వరదకట్ట పనులను పరిశీలించారు. బూరవెల్లి పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభను నిర్వహించి వేతనదారులతో మాట్లాడారు. వేతనాలపై వాకాబు కంచిలి: జాడుపూడి, మఖరాంపురం పంచాయతీల్లో ఉపాధి పనులు, వేతనదారుల పరిస్థితులపై కేంద్ర బృందం డెరైక్టర్ డాక్టర్ జి.రజనీకాంత్ ఆరా తీశారు. జాడుపూడిలో వేతనదారులందరితో సమావేశమై వేతనదారులతో మాట్లాడారు. చేస్తున్న పనులు, వేతనాలపై వాకాబు చేశారు. అనంతరంచింత చెరువు పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పి. చిన్నబాబు మాట్లాడుతూ చెరువును ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం వీరు మఖరాంపురం గ్రామ వేతనదారులతో మాట్లాడారు. ఉద్దానం కొబ్బరి తోటల్లో గట్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో అవకాశం కల్పించాలని స్థానికులు కోరారు. పని దినాలు, వేతనాలు పెంచాలి వజ్రపుకొత్తూరు: ఉపాధి దినాలు 200 రోజులకు పెంచాలని, వేతనాలు కూడా పెంచాలని డోకులపాడు, పల్లిసారధి వేతనదారులు కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ జి. రజనీకాంత్‌ను కోరారు. పనులు తీరు, వేతనాలు అందజేస్తున్న విషయాలపై ఆరా తీశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రజలు ముందుకు రావాలన్నారు. వచ్చారు- వెళ్లారు! పలాస రూరల్: ఉపాధి పనులు పరిశీలనకు వచ్చిన బృందం సభ్యులు వచ్చి వెళ్లారు. పెద్దనీలావతి, మామిడిమెట్టు గ్రామాల్లో పర్యటించిన సభ్యులు కేవలం ఇద్దరి వేతనదారులతోనే మాట్లాడారు. పెద్దనీలావతిలో సుమారు 30 నిమిషాలు పాటు సమావేశమై పనులు, వేతనాలపై అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పై-లీన్ తుఫాన్‌తో జీడి, మామిడి, కొబ్బరి చెట్లు కూలీ పోయాయని, వాటిని తొలగించేందుకు ఉపాధిహామి పనుల్లో పని కల్పించాలని కూలీలు కోరారు. రంగోయిలో ఇద్దరితో మాటాడి వెనుదిరిగారు. ఉపాధి పనులు ఎక్కువగా చేయించండి సారవకోట రూరల్: పనులను గ్రామాలలో అధికంగా గుర్తించి వేతనదారులతో చేయించాలని బృందం చైర్మన్ కేబీ సక్సేనా అన్నారు. మాళవ పంచాయతీ కార్యాలయంలో వేతనదారులతో సమావేశమయ్యారు. పంచాయతీ పరిధిలో 150 మందికి జాబ్‌కార్డులుండగా 116 మంది మాత్రమే హాజరు కావడంపై సిబ్బందిని నిలదీశారు. పనులకు రాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల పరిశీలన సరుబుజ్జిలి: కేంద్రబృందం చైర్మన్ కె.బి.శరత్‌సక్సేనా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో కలిసి పురుషోత్తపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. కొత్తకోట గ్రామంలో పనికి తగ్గవేతనం అందడంలేదని, 200 రోజుల పని దీనాలు కల్పించాలని వేతనదారులు కోరారు. చిగురవలస గ్రామంలో ఎస్సీ లబ్ధిదారులకు కల్పించిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులపై సంతృప్తి ఎచ్చెర్ల: పొన్నాడలో జరిగిన ఉపాధి పనులను కేంద్ర బృందం ప్రతినిధి గణపతి తదితరులు పరిశీలించారు. పనులు సక్రమంగా జరుగుతున్నాయని వాటిని కొనసాగించాలన్నారు. 150 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని వేతనదారులకు సూచించారు. జాబ్ కార్డుల పరిశీలన ఆమదాలవలస టౌన్: భరద్వాజ పండా నాయకత్వంలోని కేంద్ర బృందం సభ్యులు వంజంగిలో శుక్రవారం సాయంత్రం పర్యటించింది. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడి వారి జాబ్ కార్డులను పరిశీలించారు. ఏఏ పనులు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. ‘ఉపాధి’ధర పెంచండి నందిగాం: ఉపాధి పనులకు వేతనం పెంచడంతోపాటు పనిదినాలు పెంచాలని దేవుపురం పంచాయతీ కొండతెంబూరు, పెద్దతామరాపల్లి గ్రామస్తులు కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ రజనీకాంతరావును కోరారు. ప్రైవేటు పనులకు వెళ్తే రోజుకు రూ. 300 వస్తుందని, ఉపాధి పనుల్లో మాత్రం 120 రూపాయలకు మించి గిట్టడం లేదని వివరించారు. గ్రామస్థాయిలో పనులు చాలడం లేదని పెద్దతామరాపల్లి వేతనదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నామమాత్రంగా పరిశీలన హిరమండలం: మండలంలో కేంద్ర బృందం నామమాత్రంగా ఉపాధి పనులు పరిశీలించారు. గుర్రాలమెట్ట, నౌగూడ, సుభలయి గ్రామాలోబృందం చెర్మైన్ కె .బి.సక్సేనా ఆధ్వర్యంలో సభ్యులు పర్యటించారు. అయితే పనులను పరిశీలించకుండా..కేవలం వేతనదారులతో మాట్లాడి వెళ్లిపోవడంపై విమర్శలు వచ్చాయి. గుర్రాలమెట్టలో పర్యటించిన కేంద్రబృందంతో వచ్చిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ కూలీల నుంచి పలు విషయాలను సేకరించారు. దూర ప్రాంతంలో పనులు కల్పిస్తుండడంతో ప్రయాణ ఖర్చులు కూడా రావడం లేదని కలెక్టర్‌కు వివరించారు. వేతనాలు సకాలంలో అందడం లేదు పాతపట్నం రూరల్: కొరసవాడ, అంతరాబ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. చైర్మన్ కె.బి.సక్సెనా వేతనదారులతో మాట్లాడారు. వేతనాలు సకాలంలో అందడం లేదని కొరసవాడ మహిళా వేతనదారులు సక్సెనా దృష్టికి తె చ్చారు. 150 రోజుల పని దినాల్ని కల్పించాలని కోరారు. జాబ్ కార్డులు పరిశీలించి ఎస్సీ,ఎస్టీలు వంద రోజుల పని పూర్తి ఎందుకు చేయడం లేదని డ్వామా పీడీని ప్రశ్నించారు. తేడాపై ఆగ్రహం! ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జాబ్‌కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు పని కల్పించకపోవడంతోపాటు, ఎస్సీ కుటుంబాలకు పనులు కల్పించడంలో కూడా తేడాలు ఎందుకు ఉన్నాయని కేంద్ర బృందంచైర్మన్ కె.బి.సమీన(సక్సెనా) అధికారులను ప్రశ్నించారు. మండల స్థాయి అధికారులు ఇచ్చిన లెక్కలకు.. గ్రామస్థాయిలో వేతనదారులు చెబుతున్న వాటికి తేడా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ పథకం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం లక్ష్మీనర్సుపేట, కొమ్మువలస పంచాయతీల్లో పర్యటించి వేతనదారులతో మాట్లాడారు. లక్ష్మీనర్సుపేటలో జాబ్‌కార్డుల్లో వేతనదారుల పనులు, వేతనాలు చెల్లింపులకు సంబంధించిన అంశాలు నమోదులో తేడాలు ఉన్నాయని గుర్తించారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాలకు, వాస్తవంగా చెబుతున్న వివరాలకు ఉన్న తేడాలపై కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను అడిగి తెలుసుకున్నారు. చీకటిలోనే బృందం పర్యటన రణస్థలం రూరల్,న్యూస్‌లైన్:ఉపాధి పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు భగీధర్ పండా, అడిషనల్ పీడీ జి గణపతిరావులు రాత్రి ఏడు గంటలకు చిల్లపేటరాజాంలో పర్యటించారు. అయితే ఉపాధి పదకం ద్వారా ఇక్క చేటపట్టిన ఎటువంటి పనులను కేంద్ర బృందం పరిశీలించలేదు. కేవలం ఉపాధి వేతనదారులతో మాట్లాడి టార్చిలైటు వెలుగులో రికార్డులు పరిశీలించి వెళ్లిపోయారు. ఫీల్ట్ అసిస్టెంట్‌తో మాట్లాడి వెళ్లిపోయారు! టెక్కలి,న్యూస్‌లైన్: ఎన్‌ఆర్‌ఐడీ (కేంద్ర బృందం) డెరైక్టర్ రజనీకాంత్, డీఆర్డీఏ పీడీ టి.రజనీకాంతరావు, ఈడీ రమణమూర్తిల నేతృత్వంలోని అధికారులు చాకిపల్లి గ్రామాన్ని సందర్శించారు. పనులను పరిశీలించకుండా పంచాయతీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌తో పాటు కొంత మంది వేతనదారులను నుంచి వివరాలు సేకరించి వెనుదిరిగారు. -
12 బీపీఎం పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు పోస్టల్ డివిజన్ పరిధిలో గ్రామీణ డాక్ సేవక్ పథకం కింద ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ల (బీపీఎం) వివరాలను ఆ శాఖ శుక్రవారం ప్రకటించింది. పోస్టల్ డివిజన్ పరిధిలో 12 బ్రాంచ్ పోస్టుమాస్టర్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను ఒంగోలు డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ఆఫీస్ (ఎస్ఎస్పీ) విజయ్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 12 పోస్టుల్లో జనరల్ విభాగం నుంచి ఆరుగురిని, ఓబీసీ నుంచి నలుగురిని, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసేందుకు విధి విధానాలు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు 2014 జనవరి 16 ఆఖరు తేదీగా గడువు విధించారు. డివిజన్లోని బొట్లగూడూరు సబ్ పోస్టాఫీసు పరిధిలోని తూమాటివారిపాలెం బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఖాళీని జనరల్‌కు కేటాయించారు. దీంతో పాటు జనరల్ కేటగిరీకి కేటాయించినవి పందిళ్లపల్లి సబ్ పోస్టాఫీసు (ఎస్వో) పరిధిలోని మోటుపల్లి, వెలిగండ్ల ఎస్వో పరిధిలోని రాళ్లపల్లి, కొండపి పరిధిలోని తాటాకులపాలెం, జువ్విగుంట, నాగులుప్పలపాడు పరిధిలోని పోతవరం ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో రామాయపట్నం పరిధిలోని రావూరు, స్వర్ణ పరిధిలోని కేశవరప్పాడు, టంగుటూరు పరిధిలోని అనంతవరం, పెరిదేపి పరిధిలోని వేములపాడు ఉన్నాయి. కురిచేడు పరిధిలోని బండి వెలిగండ్ల ఎస్సీ కేటగిరీకి, తాళ్లూరు పరిధిలోని రాజానగరం ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. తూమాటివారిపాలేనికి జనవరి 20న ఉదయం 10 గంటలకు, రావూరుకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. మోటుపల్లికి 21 ఉదయం 10 గంటలకు, అదే రోజు 2 గంటలకు కేశరప్పాడుకు బీపీఎంలను ఎంపిక చేస్తారు. రాళ్లపల్లికి 22న ఉదయం 10 గంటలకు, బండివెలిగండ్లకు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు బీపీఎంలను ఎంపిక చేస్తారు. తాటాకులపాలేనికి 23న ఉదయం 10 గంటలకు, అనంతవరానికి మధ్యాహ్నం 2 గంటలకు, 24న ఉదయం 10 గంటలకు జువ్విగుంటకు, మధ్యాహ్నం 2 గంటలకు రాజానగరానికి, 27న ఉదయం 10 గంటలకు పోతవరానికి, మధ్యాహ్నం 2 గంటలకు వేములపాడుకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్‌ల ద్వారానే పంపాలి. దరఖాస్తులు ఓ.విజయకుమార్, సీనియర్ సూపరింటెండెంట్, పోస్టాఫీసు, ప్రకాశం డివిజన్, ఒంగోలు 523001కు పంపాలి. ఎంపిక ప్రక్రియ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసు, ప్రకాశం డివిజన్, భాగ్యనగర్, ఆర్టీవో కార్యాలయంపై, ఒంగోలులో నిర్వహిస్తారు. దరఖాస్తు పంపే కవరుపై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడీఎస్, బీపీఎం అని రాయాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకుంటున్న ప్రదేశం పేరు, అది ఏ సబ్ పోస్టాఫీసు పరిధిలోకి వస్తుందో కూడా కవరుపై పేర్కొనాలి. మరిన్ని వివరాలకు ఒంగోలు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని లేదా సమీపంలోని సబ్ పోస్టాఫీసును సంప్రదించాలని విజయకుమార్ వివరించారు.