తూతూమంత్రంగా ‘ఉపాధి’ పరిశీలన | 'employment' observation | Sakshi
Sakshi News home page

తూతూమంత్రంగా ‘ఉపాధి’ పరిశీలన

Published Sat, Jan 18 2014 4:23 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

'employment' observation

 జిల్లాలో జరిగిన ఉపాధిహామీ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటనపై వేతనదారులు తీవ్ర అసంతృప్తి వక్తం చేశారు. తూతూ మంత్రంగా పరిశీలన ఉందని పెదవి విరిచారు. పనుల జోలికి బృందం సభ్యులు వెళ్లకపోవడంపై మండిపడుతున్నారు. రెండో రోజైన శుక్రవారం శ్రీకాకుళం రూరల్‌తోపాటు గార, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, పోలాకి తదితర మండలాల్లో బృందం ప్రతినిధులు పర్యటించారు.
 
 వంద రోజుల పనిదినాలు పూర్తి చేయాలి
 శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్:ప్రతి కుంటుంబం తప్పని సరిగా వంద రోజులు పనిదినాలు పూర్తి చేయాలని ఉపాధి హామీ పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధి, సీనియర్ ఐఏఎస్ అధికారి భగీరధ పాండే అన్నారు. రాగోలుపేటలో జరిగిన ఉపాధి పనులను బృందం పరిశీలించి రికార్డులను సరిచూశారు. జాబ్ కార్డులను అప్‌డేట్ చేస్తున్నదీ లేనిది పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడి.. కోరిన వెంటనే పనులు కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పోస్టాఫీసుల్లో ఆలస్యం ఏమైనా అవుతుందా అన్ని ప్రశ్నించారు.
 
  సర్పంచ్ యజ్జల గురుమూర్తి కల్పించుకొని ఇటీవల కాలంలో వేతనాలు సకాలంలో అందడం లేదని చెప్పగా, పోస్టుమాస్టర్ బదిలీ కావడంతో ఈ పరిస్థితి నెలకొందని, దీనిపై పీడీకి నివేదికలు అందజేశామని ఏపీవో కె.యుగంధర్ చెప్పారు. కేంద్ర బృందం పరిశీలన తూతూ మంత్రంగా సాగింది. ఉదయం ఖాజీపేట, సానివాడలో పరిశీలన జరుగుతుందని, అనంతరం కరజాడ పంచాయితీ అని చివరికి రాగోలుకు సాయంత్రం నాలుగు గంటలకు చేరారు. అక్కడ పంచాయితీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం రాగోలుపేట వెళ్లి కేవలం వేతనదారులు, గ్రామస్తులతో మాట్లాడి వెనుదిరిగారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ గణపతిరావు పాల్గొన్నారు.
 
 కొత్తరేవులో:
 పోలాకి:  కొత్తరేవు, వనిత గ్రామాల్లో 2013-14 సంవత్సరంలో చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు భగీరథ పండా  పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడి 150 రోజుల పనులు వర్తించాయా అని అడితెలుసుకున్నారు.
 పరిశీలన అంతంత మాత్రం
 గార:ఉపాధి హామీ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందం పరిశీలన అంతంత మాత్రంగానే సాగింది. బృంద సభ్యుడైన భగీరధ పండా శాలిహుండం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి రికార్డులను పరిశీలించారు. జాబ్‌కార్డుల్లో పనిదినాలు ఎందుకు వేయలేదని పండా ప్రశ్నించగా, వేతనదారుడు వలస వెళ్లడంతో నమోదు చేయలేకపోయామని కిందిస్థాయి సిబ్బంది వివరించారు.అనంతరం వంశధార నది వరదకట్ట పనులను పరిశీలించారు. బూరవెల్లి పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభను నిర్వహించి వేతనదారులతో మాట్లాడారు.
 
 వేతనాలపై వాకాబు
 కంచిలి: జాడుపూడి, మఖరాంపురం పంచాయతీల్లో ఉపాధి పనులు, వేతనదారుల పరిస్థితులపై కేంద్ర బృందం డెరైక్టర్ డాక్టర్ జి.రజనీకాంత్ ఆరా తీశారు. జాడుపూడిలో వేతనదారులందరితో సమావేశమై వేతనదారులతో మాట్లాడారు. చేస్తున్న పనులు, వేతనాలపై వాకాబు చేశారు. అనంతరంచింత చెరువు పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పి. చిన్నబాబు మాట్లాడుతూ చెరువును ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు.  అనంతరం వీరు మఖరాంపురం గ్రామ వేతనదారులతో మాట్లాడారు. ఉద్దానం కొబ్బరి తోటల్లో గట్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో అవకాశం కల్పించాలని స్థానికులు కోరారు.  
 
 పని దినాలు, వేతనాలు పెంచాలి
 వజ్రపుకొత్తూరు: ఉపాధి దినాలు 200 రోజులకు పెంచాలని, వేతనాలు కూడా పెంచాలని  డోకులపాడు, పల్లిసారధి వేతనదారులు కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ జి. రజనీకాంత్‌ను కోరారు.  పనులు తీరు, వేతనాలు అందజేస్తున్న విషయాలపై ఆరా తీశారు.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రజలు ముందుకు రావాలన్నారు.  
 
 వచ్చారు- వెళ్లారు!
 పలాస రూరల్: ఉపాధి పనులు పరిశీలనకు వచ్చిన బృందం సభ్యులు వచ్చి వెళ్లారు. పెద్దనీలావతి, మామిడిమెట్టు గ్రామాల్లో పర్యటించిన సభ్యులు కేవలం ఇద్దరి వేతనదారులతోనే మాట్లాడారు. పెద్దనీలావతిలో సుమారు 30 నిమిషాలు పాటు సమావేశమై పనులు, వేతనాలపై అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పై-లీన్ తుఫాన్‌తో జీడి, మామిడి, కొబ్బరి చెట్లు కూలీ పోయాయని, వాటిని తొలగించేందుకు ఉపాధిహామి పనుల్లో పని కల్పించాలని కూలీలు కోరారు.  రంగోయిలో ఇద్దరితో మాటాడి వెనుదిరిగారు.
 
 ఉపాధి పనులు ఎక్కువగా చేయించండి
 సారవకోట రూరల్:  పనులను గ్రామాలలో అధికంగా గుర్తించి వేతనదారులతో చేయించాలని బృందం చైర్మన్ కేబీ సక్సేనా అన్నారు. మాళవ పంచాయతీ కార్యాలయంలో  వేతనదారులతో సమావేశమయ్యారు. పంచాయతీ పరిధిలో 150 మందికి జాబ్‌కార్డులుండగా 116 మంది మాత్రమే హాజరు కావడంపై సిబ్బందిని నిలదీశారు. పనులకు రాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
 
 రికార్డుల పరిశీలన
  సరుబుజ్జిలి: కేంద్రబృందం  చైర్మన్ కె.బి.శరత్‌సక్సేనా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో కలిసి పురుషోత్తపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. కొత్తకోట గ్రామంలో పనికి తగ్గవేతనం అందడంలేదని, 200 రోజుల పని దీనాలు కల్పించాలని వేతనదారులు కోరారు. చిగురవలస గ్రామంలో ఎస్సీ లబ్ధిదారులకు కల్పించిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
 పనులపై సంతృప్తి
 ఎచ్చెర్ల: పొన్నాడలో జరిగిన ఉపాధి పనులను కేంద్ర బృందం ప్రతినిధి గణపతి తదితరులు పరిశీలించారు. పనులు సక్రమంగా జరుగుతున్నాయని వాటిని కొనసాగించాలన్నారు.  150 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని వేతనదారులకు సూచించారు.
 
 జాబ్ కార్డుల పరిశీలన
 ఆమదాలవలస టౌన్:  భరద్వాజ పండా నాయకత్వంలోని కేంద్ర బృందం సభ్యులు వంజంగిలో శుక్రవారం సాయంత్రం పర్యటించింది. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడి వారి జాబ్ కార్డులను పరిశీలించారు. ఏఏ పనులు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు.
 
 ‘ఉపాధి’ధర పెంచండి
 నందిగాం: ఉపాధి పనులకు వేతనం పెంచడంతోపాటు పనిదినాలు పెంచాలని  దేవుపురం పంచాయతీ కొండతెంబూరు, పెద్దతామరాపల్లి గ్రామస్తులు కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ రజనీకాంతరావును కోరారు. ప్రైవేటు పనులకు వెళ్తే రోజుకు రూ. 300 వస్తుందని, ఉపాధి పనుల్లో మాత్రం  120 రూపాయలకు మించి  గిట్టడం లేదని వివరించారు. గ్రామస్థాయిలో పనులు చాలడం లేదని పెద్దతామరాపల్లి  వేతనదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
 నామమాత్రంగా పరిశీలన
 హిరమండలం: మండలంలో కేంద్ర బృందం నామమాత్రంగా ఉపాధి పనులు పరిశీలించారు. గుర్రాలమెట్ట, నౌగూడ, సుభలయి గ్రామాలోబృందం చెర్మైన్ కె .బి.సక్సేనా ఆధ్వర్యంలో సభ్యులు పర్యటించారు. అయితే పనులను పరిశీలించకుండా..కేవలం వేతనదారులతో మాట్లాడి వెళ్లిపోవడంపై విమర్శలు వచ్చాయి. గుర్రాలమెట్టలో పర్యటించిన కేంద్రబృందంతో వచ్చిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ కూలీల నుంచి పలు విషయాలను సేకరించారు. దూర ప్రాంతంలో పనులు కల్పిస్తుండడంతో ప్రయాణ ఖర్చులు కూడా రావడం లేదని కలెక్టర్‌కు వివరించారు.
 
 వేతనాలు సకాలంలో అందడం లేదు
  పాతపట్నం రూరల్: కొరసవాడ, అంతరాబ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. చైర్మన్ కె.బి.సక్సెనా వేతనదారులతో మాట్లాడారు. వేతనాలు సకాలంలో అందడం లేదని కొరసవాడ మహిళా వేతనదారులు సక్సెనా దృష్టికి తె చ్చారు. 150  రోజుల పని దినాల్ని కల్పించాలని కోరారు. జాబ్ కార్డులు పరిశీలించి ఎస్సీ,ఎస్టీలు వంద రోజుల పని పూర్తి ఎందుకు చేయడం లేదని డ్వామా పీడీని ప్రశ్నించారు.
 
  తేడాపై ఆగ్రహం!
 ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జాబ్‌కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు పని కల్పించకపోవడంతోపాటు, ఎస్సీ కుటుంబాలకు పనులు కల్పించడంలో కూడా తేడాలు ఎందుకు ఉన్నాయని కేంద్ర బృందంచైర్మన్ కె.బి.సమీన(సక్సెనా) అధికారులను ప్రశ్నించారు. మండల స్థాయి అధికారులు ఇచ్చిన లెక్కలకు.. గ్రామస్థాయిలో వేతనదారులు చెబుతున్న వాటికి తేడా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ పథకం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం లక్ష్మీనర్సుపేట, కొమ్మువలస పంచాయతీల్లో పర్యటించి వేతనదారులతో మాట్లాడారు. లక్ష్మీనర్సుపేటలో జాబ్‌కార్డుల్లో వేతనదారుల పనులు, వేతనాలు చెల్లింపులకు సంబంధించిన అంశాలు నమోదులో తేడాలు ఉన్నాయని గుర్తించారు. రికార్డుల్లో  నమోదు చేసిన వివరాలకు, వాస్తవంగా చెబుతున్న వివరాలకు ఉన్న తేడాలపై కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను అడిగి తెలుసుకున్నారు.
 
 చీకటిలోనే బృందం పర్యటన
 రణస్థలం రూరల్,న్యూస్‌లైన్:ఉపాధి పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు భగీధర్ పండా, అడిషనల్ పీడీ జి గణపతిరావులు రాత్రి ఏడు గంటలకు చిల్లపేటరాజాంలో పర్యటించారు. అయితే ఉపాధి పదకం ద్వారా ఇక్క చేటపట్టిన ఎటువంటి పనులను కేంద్ర బృందం పరిశీలించలేదు. కేవలం ఉపాధి వేతనదారులతో మాట్లాడి టార్చిలైటు వెలుగులో రికార్డులు పరిశీలించి వెళ్లిపోయారు.
 
 ఫీల్ట్ అసిస్టెంట్‌తో మాట్లాడి వెళ్లిపోయారు!
 టెక్కలి,న్యూస్‌లైన్: ఎన్‌ఆర్‌ఐడీ (కేంద్ర బృందం) డెరైక్టర్ రజనీకాంత్, డీఆర్‌డీఏ పీడీ టి.రజనీకాంతరావు, ఈడీ రమణమూర్తిల నేతృత్వంలోని అధికారులు చాకిపల్లి గ్రామాన్ని సందర్శించారు. పనులను పరిశీలించకుండా పంచాయతీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌తో పాటు కొంత మంది వేతనదారులను నుంచి వివరాలు సేకరించి వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement