Job Card
-
ఏబీపీఎస్‌కు మారితేనే ఉపాధి కూలి జమ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు బ్రిడ్జి సిస్ట మ్ (ఏబీపీఎస్)కు మారాల్సిందే. గతంలో మూడునాలుగు పర్యాయాలు ఈ డెడ్‌లైన్ మారినా, ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంక్ ఖాతా ఆధారిత, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తారు. ఇకపై ఆధార్–ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) కాకుండా, సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఏబీపీఎస్ అనుసరిస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ♦ ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్‌కార్డ్ హోల్డర్, తన జాబ్కార్డ్ను బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మ్యాపర్‌తో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి. ♦ ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపర్‌లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్–బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. ♦ ఉపాధిహామీ జాబ్‌కార్డు సమాచారంలో తేడాలున్నా వేజ్ పేమెంట్ అనేది స్తంభిస్తుంది. ♦ ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ♦క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో జాబ్‌కార్డును బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ఈ డెడ్‌లైన్ మరికొంతకాలం పొడిగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. లిబ్టెక్ నివేదికలో ఏముందంటే... ♦కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్‌కి అనర్హులుగా ఉండిపోయారు. ♦ పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్‌కి అర్హత సాధించలేకపోయారు. ♦ నరేగా పోర్టల్ నుంచి సమాచారాన్ని విశ్లే షించిన లిబ్టెక్ ఇండియా సంస్థ తన ని వేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పేమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అర్థమవుతుంది. దీంతో వారు ఉపాధి హామీ కింద పని పొందడానికి అనర్హులుగా చేస్తుంది. ఇది ఉపాధి చట్టం సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘనే. అంతేకాకుండా, గత 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నికరంగా తొలగించిన దాదాపు 4 లక్షల మంది కార్మికులను ఏబీపీఎస్ అర్హత గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏబీపీఎస్ కారణంగా ఉపాధి హామీ చట్టం కింద పని, పేమెంట్ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. – చక్రధర్ బుద్దా,డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా సంస్థ -
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
Dragon Fruit: వాణిజ్య పంట సాగు చేద్దామా..!
రాజాం సిటీ: ఇప్పుడిప్పుడే రైతులకు సుపరిచితమౌతున్న వాణిజ్యపంట డ్రాగన్ ఫ్రూట్. ఎక్కడో మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పుట్టిన ఈ పంట ఇప్పుడు పల్లెలకు సైతం పాకుతోంది. ఈ పంట ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు తోటల పెంపకానికి ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాణిజ్యపంటలపై అవగాహనతోపాటు సాగుచేసేందుకు ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. వాణిజ్యపంటగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న డ్రాగన్ తోటల పెంపకానికి సంబంధించి మూడేళ్లపాటు నిర్వహణకు నిధులు అందించనుంది. ఉపాధి పథకంలో జాబ్ కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న రైతులు ఈ తోలట పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా వాణిజ్యపంటలపై రైతులను ప్రోత్సహించడంతోపాటు వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీని నిర్వహణకు మూడేళ్లపాటు ఉపాధి పనుల్లో భాగంగా ప్రభుత్వం రూ. 3 లక్షల వరకు నిధులు సమకూర్చనుంది. అర్హులైన రైతులంతా ఈ తోటల పెంపకానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ప్రోత్సాహం ఇలా.. పొలంలో ఏర్పాటుచేసుకున్న డ్రాగన్ తోటలకు వరుసగా మూడేళ్లపాటు రూ.3,08,722 వరకు రైతుకు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ మొత్తాన్ని వేతనదారులకు రూ. 71,420లు, మెటీరియల్ ఖర్చుకు సంబంధించి రూ. 2,37,302లు అందజేయనుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఉపాధిహామీ ద్వారా డ్రాగన్ తోటల పెంపకానికి కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధిలో జాబ్‌కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న వారంతా తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పొలానికి భూసార పరీక్ష చేయించుకోవాలి. మూడేళ్లపాటు తోటల నిర్వహణకు రూ.3 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నాం. దీనికి అయ్యే పెట్టుబడిని రైతులే ముందుగా పెట్టుకోవాలి. - జి.ఉమాపరమేశ్వరి, పీడీ, డ్వామా -
అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు
ఏలూరు (మెట్రో): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. జాబ్‌కార్డులు కావాల్సిన వారు గ్రామ సచివాలయంలో ఆధార్‌కార్డు జిరాక్స్ జతపర్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాల్లో వసతులు కల్పించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 600 కోట్ల పనులు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌కు సిద్ధం కావాలి : ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేందుకు సిద్ధంకావాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులకు సూచించారు. ఈ నెల 30న జిల్లాలో 938 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో నాడు– నేడు మొదటి విడత కింద 1148 పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. సమావేశంలో జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్. తేజ్‌భరత్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ఆరా కోవిడ్–19, ఈ ఏడాది అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, రైతుభరోసా కేంద్రాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, నాడు– నేడు పనులు, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. జిల్లా ప్రగతిపై ఆరా తీశారు. ఈ కాన్పరెన్స్‌లో కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్, జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్.తేజ్‌భరత్ పాల్గొన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 31 వరకూ గడువు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణను సెక్షన్ 22 (2) ఏపీ రైట్స్ చట్టం ప్రకారం చేపడతామని పేర్కొన్నారు. పేద రైతులకు చివరి అవకాశంగా 2020 మే 31ని గడువుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని సాదాబైనామాల రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. క్రమబద్దీకరణ కోసం ఫారం–10 నమూనాలో తహసీల్దార్‌కు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు నకలు, కొన్న రిజిస్టర్ కాని క్రయ దస్తావేజు నకలు, భూమి కొనుగోలు, సాగులో ఉన్నట్టు పత్రాలను జత చేయాలని పేర్కొన్నారు. ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదార్ పాస్ బుక్స్ యాక్ట్ 1971 రూల్స్ 1989 అనుసరించి జిల్లా యంత్రాంగం అమలుకు ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి పట్టా చేయించుకోనట్లయితే ఆ భూమిపై హక్కు పత్రాలు పొందడానికి అవకాశం ఉండదని వెల్లడించారు. భూమిపై హక్కుకు రుజువుగా ఉండే పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్ పొందాలంటే సాదాబైనామా విక్రయాన్ని క్రమబద్దీకరించుకుని ఫారం 13 (బీ) సర్టిఫికెట్ పొందాలని పేర్కొన్నారు. బ్యాంకు రుణం కావాలన్నా, ఎరువులు, క్రిమి సంహారక మందులు, ప్రభుత్వం ఇచ్చే పంట నష్టం పరిహారం, ఇన్సూరెన్స్ ద్వారా పంట నష్టపరిహారం కావాలన్నా, భూతగాదాలు వచ్చినప్పుడు హక్కును రుజువు చేసుకోవాలన్నా పాసు పుస్తకం టైటిల్ డీడ్ అవసరమని తెలిపారు. సాదాబైనామా క్రమబద్దీకరణపై ఆర్డీఓలు విస్తృత ప్రచారం చేయించాలని, గ్రామాల్లో టాంటాం వేయించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలపై సమీ„ý. జిల్లాలో జ్యూవెలరీ, దుస్తులు, చెప్పుల షాపులు తెరిచేందుకు అనుమతి లేదని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో లాక్డౌన్ నిబంధనలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లాక్డౌన్ నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించరాదని పేర్కొన్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు వద్దే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని పోలీసు అధికారులకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ఎన్. తేజ్‌భరత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ జోరు
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకానికీ అనుసంధానం చేస్తోంది. ఎక్కడ చూసిన ఉపాధి.. ఏ పథకం ప్రవేశపెట్టినా ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతోంది. ఇలా ప్రతి దానికి ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు చేతినిండా పని లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయం, హరితహారం, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం, పశువుల పాకలు, ఫారంఫండ్లు.. డంపింగ్‌యార్డు, పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు.. ఇలా ప్రతీ దాన్ని ఉపాధి హామీ పథకంలో చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశమంతటా ఈ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతాఇంత కాదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. దీంతో ఉపాధి కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ఆ పథకం కింద సుమారు 52 రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో 1,51,583 మంది జాబ్‌కార్డులు ఉండగా.. 3,22,000 వేల మంది కూలీలు ఉన్నారు. గత ఏడాది 60 లక్షల పని దినాలు లక్ష్యం కాగా.. 31.22లక్షల పని దినాలు కల్పించారు. తాజాగా సంతల ఏర్పాటు.. గ్రామాల్లో సంతలు(అంగళ్లు) నిర్వహించుకోవడానికి వీలుగా గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే త్వరగా అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైన మౌలిక వసతులను రెండు కేటగిరీల్లో కల్పించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 20 గదులు, 30 గదుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసుకునేలా అవకాశం ఇచ్చారు. గ్రామ జనాభా, స్థలం, నిధుల లభ్యత తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీలే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 30 గదులకు రూ.15 లక్షలు, 20 గదులకు రూ.10 లక్షలు కేటాయించనున్నారు. వీటిని ప్లాట్‌ఫాం, నీటి వసతి, మూత్రశాలలు, డ్రైనేజీలు, పార్కింగ్ స్థల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంగళ్ల నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. వేలం పాట స్థలం కేటాయింపు లేదా అంగళ్లలో విక్రయించే వారి నుంచి పన్నులు కూడా వసూలు చేసుకోవచ్చు. వ్యవసాయ పనులకు.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశపెట్టే దేశ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తోంది. గ్రామీణులకు ఉన్న ఊర్లోనే పనిచేసుకుని జీవించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చుతోంది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం వల్ల బీడు భూములు సాగులోకి రావడంతోపాటు పాడిపరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాకల నిర్మాణాలు చేపడుతోంది. ఊటకుంటలు, ఫారంఫండ్లు, నీటి నిల్వ కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేసుకొని వర్మీకంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవచ్చు. పశువుల తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. హరితహారంలో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే హరితహారం కింద నాటే మొక్కలు ఉపాధి పనులతోనే చేయిస్తున్నారు. జిల్లాలోని వివిధ నర్సరీల్లో ఉపాధి కూలీలతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడం, వాటి రక్షణ చర్యలకు సైతం ఉపాధి పనుల్లోనే వినియోగిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. సీసీ రోడ్లకు 90 శాతం నిధులు ఈ పథకం నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో ఉపాధి కింద వేసిన రోడ్లు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ కింద చేపట్టే పనులు సైతం చేపడుతున్నారు. చెరువులో తీయడం ఈ పథకం కింద చేస్తున్నారు. అటవీ భూముల్లో.. ఉపాధి పథకం కింద అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి, ఊటకుంటల తవ్వకాలు చేపడుతున్నారు. అటవీభూములు ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీని ద్వారా బయట నుంచి భూమిని కాపాడుకోవచ్చు. ఈ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టికోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఈ ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతోపాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు రైతులకు సంబంధించిన నిర్మాణాలు ఈ పథకం కింద చేపడుతున్నాం. ఎక్కువగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం, నీటి లభ్యతను పెంచే నిర్మాణాలు చేపడుతున్నాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీవో -
ఎంబీఏ ఎంసీఏ బీటెక్ బీఈడీ పట్టా ఏదైనా అడ్డాకూలీయే!
పల్లెల్లో పెరిగిపోతున్న నిరుద్యోగులు జాబుల్లేక ‘జాబ్ కార్డు’తో ఉపాధి పనులకు పయనం పెద్దపల్లి, సాక్షి:...ఒక్కరిద్దరు కాదు.. అనేక పల్లెల్లో ఇలాంటివారెందరో కనిపిస్తున్నారు! ఉన్నత చదువులు చదివి కొలువుల్లోనే కూలీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రం పెద్దపల్లిలో కూలీల అడ్డాపై బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ చదివిన పట్టభద్రులు కనిపిస్తున్నారు. ఉపాధి కోసం తట్ట పట్టుకొని లేబర్‌గా మారుతున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా దొరకలేదని, కుటుంబానికి భారంగా మారడం ఇష్టం లేక కూలీబాట పట్టినట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తే రూ.ఐదారు వేలకు మించి ఇవ్వడం లేదని, కూలీ పనికి వెళ్తే నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు ప్లాట్లలో చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించడం, చిన్న చిన్న కందకాలు తవ్వడంలాంటి పనులు చేస్తున్నామని చెప్పారు. ఆ ఊరి నిండా నిరుద్యోగులే.. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని హన్మంతునిపేట గ్రామం లో ఎంటెక్ ఆరుగురు, బీటెక్ 18, ఎంబీఏ 26, ఎంసీఏ 21, డిగ్రీ 55, ఇంటర్ 100 మందికిపైగా, టెన్త్ 200 మందికి పైగా చదివారు. వారిలో కేవలం తొమ్మిది మందికే ఉద్యోగాలు వచ్చాయి. బీటెక్ చదివినవారిలో నలుగురికి, ఎంటెక్ చేసిన ఒకరికి, బీఈడీ పూర్తి చేసిన నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఒక్క ఊరిలోనే కాదు.. చాలా గ్రామాల్లో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. మరికొందరు చదువులకు సంబంధం లేని కొలువుల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు. బీటెక్ పట్టభద్రులు అక్కడక్కడ సాఫ్ట్వేర్, కాల్సెంటర్లలో పని చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ చదివినవారిలో చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. ‘చదువులు జీవితాన్ని నిలబెట్టలేక పోతున్నాయి. అందుకే తీరిక వేళలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నా’ అని బీటెక్ చదివిన నవీన్ చెప్పాడు. ఒక చేతిలో తట్ట..మరో చేతిలో గడ్డపార పట్టుకున్న ఈయన రవికిశోర్. పెద్దపల్లి. ఇంజనీరింగ్ చదివాడు. కొలువు కోసం ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరిగాడు. ఎంత ప్రయత్నించినా జాబ్ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశల్లేక చివరికి కూలీ అవతారమెత్తాడు. ఈయన పేరు గుర్రాల రాజు. హన్మంతునిపేట. ఎంసీఏ చదివాడు. పెళ్లయింది. ఓ కూతురు. ఉద్యోగం కోసం ఎంతో యత్నించాడు. ఎక్కడా జాబ్ రాకపోవడంతో తనకున్న ఎకరం పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ, ఉపాధి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయన పేరు తీగల సతీశ్. పెద్దపల్లి సమీపంలోని హన్మంతునిపేట. 2010లో ఎంబీఏ పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో నాలుగేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. కాల్సెంటర్లో కొలువు దొరికినా నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. ఆ జీతంతో జాబ్ చేయలేక తిరిగొచ్చాడు. ఉపాధి హామీ పథకం కింద ‘జాబ్’ కార్డు సంపాదించి ఊరిలోనే పనికి వెళ్తున్నాడు. మా పొలగానికి పిల్లనిస్తలేరు మా కొడుకు ఎంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరకలేదు. పిల్లనివ్వమని అడిగితే పొలగాడు (కొడుకు) ఏం చేస్తుండని అడుగుతున్నరు. చివరికి ఉపాధి హామీ పనికి నా వెంటే వస్తుండు. దాంతోపాటు ఇంట్లో కులవృత్తి ఇస్త్రీ కూడా చేస్తూ నాలుగు పైసలు సంపాదించి ఆసరైతాండు. – కంది లక్ష్మీరాజమ్మ, హన్మంతునిపేట ఐదు సదివితేనే నౌకరచ్చింది మా కాలంలో ఐదు సదివితేనే నౌకరచ్చింది. పది సదివినోళ్లను సూడనేలేదు. గిప్పుడైతే ఇంటికి ముగ్గురు 20 ఏండ్లు బడికివోయి సదువుతాండ్రు. కానీ ఎవరికి నౌకరచ్చినట్టు కనిపిస్తలేదు. ఇద్దరు మనవలు, ఇద్దరు మనవరాండ్లు 18 ఏండ్లు పుస్తకాలతోనే తిరిగిండ్రు. ఇంట్ల నలుగురుంటే ఒక్కలకు నౌకరు లేదు. ఏం సదువులో ఏమో? – కందుల పోశాలు, హన్మంతునిపేట పట్టా దాచి పనికి పోతున్న నేను బీఈడీ చదివా. ప్రైవేటు స్కూల్‌కు వెళ్తే నెలకు రూ.4 వేలు ఇస్తామన్నారు. అవి ఎటూ చాలవు. కుటుంబ పోషణ భారమై బీఈడీ పట్టా బీరువాలో దాచి బజారులో కూలీ పని చేస్తున్నా. – భాస్కర్, శాంతినగర్ చదువుకున్నోళ్లకు పనిలేదు చదువుకున్నోళ్లమని చెబితే పని దొరకదేమోనన్న బాధ కూడా తమను వేధిస్తోందని విద్యావంతులు చెబుతున్నారు. చదువుకున్న వారు పని చేయలేరనే భావనతో పని ఇచ్చేందుకు వెనకాడుతున్నారన్నారు. కొందరు పాత దుస్తులు ధరించి, కూలీల మాదిరిగా అడ్డాపైకి వస్తున్నారు. -
‘ఉపాధి’కి కొత్త జాబ్‌కార్డులు
► కార్డులో క్యూఆర్ కోడ్, ఆధార్ లింకు ► ఉపాధి హామీలో అక్రమాలకు చెక్ ► 11 ఏళ్ల తర్వాత కార్డుల మార్పు ► కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ► జాబ్‌కార్డులు 1.50 లక్షలు ► సభ్యులు 3.20 లక్షలు ఆదిలాబాద్:మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు మంచి రోజులొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కూలీలకు ప్రత్యేక కొత్త జాబ్‌కార్డులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 1.50 లక్షల జాబ్‌కార్డుల ఉండగా.. 3.20 లక్షల మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించి రూ.కోట్లు మంజూరు చే స్తోంది. ప్రస్తుతం జిల్లాలో నీటి నిల్వకుంటలు, వర్మీకంపోస్టు తయారీ, భూ అభివృద్ధి కందకాలు, తదితర పనులు చేపడుతున్నారు. 2006 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తర్వాత అప్పటి ప్రభుత్వం కూలీలకు జాబ్‌కార్డులు జారీ చేసింది. ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధిక నిధులు వెచ్చిస్తుండడంతో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సంఖ్య పెరుగుతున్నా కొత్త జాబ్‌కార్డులు మాత్రం జారీ చేయలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత కొత్త జాబ్‌కార్డులు జారీ చేసింది. సాంకేతికతో జాబ్‌కార్డులు.. ప్రభుత్వం కూలీలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకునే విధంగా సాంకేతికతతో కూడిన జాబ్‌కార్డులను అందజేస్తోంది. కొత్తగా పనిచేస్తున్న వారితోపాటు పాత వారికీ జాబ్‌కార్డులు ఇస్తున్నారు. వీటిపై క్యూఆర్‌కోడ్ ముద్రించారు. నూతన జాబ్‌కార్డుల్లో సాంకేతికత జోడించి ఇవ్వడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్డుపై జాబ్‌కార్డు నెంబర్‌తోపాటు ఆధార్ నంబర్, పొటో, కూలీ చెల్లింపు ఖాతా నంబర్, బ్యాంకు ఖాతా, పోస్టల్ శాఖ ఖాతా నంబరు ముద్రించి ఉంటాయి. ఒక కుటుంబం నుంచి ఎంత మంది కూలీ పనికి వచ్చినా అందరికి కలిపి ఒక కార్డు మాత్రమే ఇస్తారు. కూలీలు తమ సెల్ఫోన్లో ఈజీఎస్ యాప్‌డౌన్‌లోడ్ చేసుకుని ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ రోజు ఎన్ని గంటలు పనిచేశారు, ఎంత కూలీ వస్తుంది తదితర వివరాలు తెలుసుకోవచ్చు. జాబ్‌కార్డుకు ఆధార్ నంబర్ లింకు చేశారు. అక్రమాలకు చెక్.. ఉపాధి హామీ పథకంలో కొందరు సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడేవారు. ఒకరికి బదులు మరొకరికి హా జరు వేయడం, పని గంటలు తక్కువ నమోదు చేయ డం వంటివి చేసేవారు. దీంతో సామాజిక తనిఖీల సమయంలో ఈజీఎస్ సిబ్బంది అక్రమాలు బయటకు వచ్చేవి. జరిమానా దాన్ని సరిపెట్టేవారు. ఇక నూతన జాబ్‌కార్డులతో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టవచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జాబ్‌కార్డులో ఆధార్‌లింకు, క్యూఆర్‌కోడ్ ముద్రించడం వల్ల అక్రమాలకు తావులేకుండా చేయవచ్చని డీఆర్డీవో రాజేశ్వర్ రాథోడ్ తెలిపారు. కొత్త కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు.. జాబ్‌కార్డు కోసం మ్యానువల్‌గా దరఖాస్తు చేసుకుని అధికారులు చుట్టూ తిరిగే కూలీలకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఇందులో భాగంగానే జాబ్‌కార్డు ప్రక్రియ ఆన్లైన్లో చేసింది. కొత్తగా జాబ్‌కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో అందజేస్తారు. తద్వారా కూలీలకు సమయం ఆదాతోపాటు వేగంగా కార్డు పొందే అవకాశం ఏర్పడింది. మారుతున్న కాలానుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏటా మార్పులు చేస్తూనే ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, సాంకేతిక వ్యవస్థను సద్వినియోగం చేసుకుని కూలీలు, రైతులకు సులభతరంగా సేవలందిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో చాలా సేవలను ఆన్లైన్లో చేసిన ప్రభుత్వం తాజాగా జాబ్‌కార్డు ప్రక్రియను కూడా మీసేవ కేంద్రాలతోపాటు ఇంటర్నెట్ లో దరఖాస్తు చేసుకునేందుకు అనుసంధానం చేసింది. గతంలో జాబ్‌కార్డు కా>వాలంటే తొలుత అధికారులకు దరఖాస్తులు చేసుకుని అధికారుల కోసం వేచి చూడాల్సి వచ్చేది. దీంతో వారి ఇబ్బందులను తొలగించేందుకు కార్డుల దరఖాస్తు, మంజూరు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులుగా గుర్తిస్తారు. ఈ దరఖాస్తులను డీఆర్డీవోకు పంపించి అక్కడి అధికారులు పరిశీలించిన తర్వాత మీసేవ కేంద్రం ద్వారా జాబ్‌కార్డులు జారీ చేస్తారు. -
ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారా నగదు చెల్లింపు
ఏలూరు సిటీ : జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డ్ కలిగిన ప్రతి వ్యవసాయ కూలికి బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం ఈ–ఆఫీస్, బయోమెట్రిక్ హాజరు, మీ కోసం అర్జీల పరిష్కారం, గ్యాస్ కనెక్షన్లు, ఎన్ఆర్ఈజీఎస్, ఫామ్‌పాండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రైతు కూలీలకు అక్టోబర్ 1 తేదీ నుంచి వేతనాలను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూగర్భ జలాలు అడుగంటిన జిల్లాల్లో రాష్ట్రంలోనే మన జిల్లా ప్ర«థమస్థానంలో ఉందని, ఇది చాలా విచారించదగిన విషయమన్నారు. ఈ–ఆఫీస్‌లో 5 వేల ఫైల్స్ మైలురాయి దాటితే రివార్డు జిల్లాలో ఈ –ఆఫీస్ కార్యక్రమంలో 5 వేల ఫైల్స్ మైలురాయిని దాటిన మొదటి తహసీల్దార్‌కు తన సొంత సొమ్ము రూ. వెయ్యి రివార్డుగా కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. ఇంతవరకు నల్లజర్ల తహసీల్దార్ 4937ఫైల్స్‌తో మొదటిస్థానంలో, పాలకొల్లు తహసీల్దార్ 4858 ఫైల్స్‌తో ద్వితీయస్థానంలో ఉన్నారని తెలిపారు. జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కె.ప్రభాకరరావు, డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, డీపీవో సుధాకర్ పాల్గొన్నారు. -
ఉపాధికి నిబంధనాలా?
నెల్లిమర్ల: ఉపాధిహామీ పథకంలో వందరోజుల నిబంధన కూలీలకు గుదిబండగా మారింది. ఒకే జాబ్‌కార్డులో ఉండే వేతనదారులంతా కలిసి ఆర్థిక సంవత్సరంలో వంద పనిదినాలు పూర్తిచేయడంతో వారికి అధికారులు పనులు నిలిపేశారు. ఈ విధంగా మండలంలోని 472 కుటుంబాలకు చెందిన సుమారు 1200మంది పనిలేక ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండునెలల పాటు పనిలేకపోతే ఎలా బతకాలని వాపోతున్నారు. మండలంలోని 26పంచాయతీల్లో మొత్తం 8వేల జాబ్‌కార్డులున్నాయి. వీరికి సంబంధించి 15వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్నారు. గత ఏప్రిల్ నెలనుంచి ఇప్పటివరకు 472 జాబ్‌కార్డులకు చెందిన కూలీలు వందరోజుల పని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే ఆర్థిక సంవత్సరంలో వందరోజులు పని పూర్తిచేసుకున్నవారికి మరి పని కల్పించకూడదు. అందువల్ల వీరిని సోమవారంనుంచి పనులకు రానివ్వకుండా ఉపాధిహామీ అధికారులు నిలిపివేశారు. వారంతా లబోదిబోమంటున్నారు. వాస్తవానికి ఒక్కో జాబ్‌కార్డులో ముగ్గురేసి, నలుగురేసి కూలీలు ఉన్నారు. దీనివల్ల ఒక్కొక్కరు నెలరోజులు చేసినా వందరోజులు పూర్తయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలలుండగా ఇకపై తమకు ఉపాధి ఎలా అన్నదే ప్రశ్న. వేరే పనులకు వెళ్దామన్నా ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేవని వాపోతున్నారు. -
వందేమాత్రం!
వ్యవసాయ పనుల్లేని సమయంలో ప్రతి కుటుంబానికి 150 రోజుల పని కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోతోంది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు ఈ విషయంలో చేతులెత్తేస్తున్నాయి. వంద రోజులతోనే సరిపెట్టేస్తున్నాయి. ఫలితంగా వేతనదారులకు వెతలు తప్పడంలేదు. ఇప్పటికే వంద రోజుల పని పూర్తి చేసిన వారు కొత్త ఆర్థిక సంవత్సరం.. అంటే ఏప్రిల్ వరకు పని లేక దిక్కులు చూడాల్సిన దుస్థితిలో పడ్డారు. రాజాం: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పంటల సాగు లేని సమయంలో స్థానికంగానే సన్నకారు రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు గత కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు ఇచ్చి ఏడాదిలో కనీసం 150 రోజులు పని కల్పించేలా చర్యలు చేపట్టింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు దీన్ని వంద రోజులకు తగ్గించేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేసేస్తున్నారు. పథకం ప్రారంభమైన తొలినాళ్లలో పక్కాగా నిర్వహించడంతో కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే కాలక్రమంలో రకరకాల నిబంధనలు పెట్టడం, వేతనాలు సక్రమంగా అందించకపోవడం, తక్కువ వేతనాలు రావడం వంటి కారణాలు మళ్లీ వలసలు పుంజుకునేలా చేశాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 60 వేల జాబ్‌కార్డులు పంపిణీ చేశారు. వీటి ద్వారా సుమారు 1.50 లక్షల మంది ఉపాధి పొందాల్సి ఉండగా..పైన పేర్కొన్న లోపాల కారణంగా లక్ష మంది వరకే ఉపాధి పనులకు వెళ్తున్నారు. రాజాం మండలంలో 13వేల జాబ్‌కార్డులు పంపిణీ చేయగా.. వాటిలో 8464 జాబ్ కార్డులకు సంంబంధించిన సుమారు 6వేల మంది వేతనదారులే పనులుకు వెళ్తున్నారు. పనిదినాలూ కట్ నిర్వహణ, ఇతరత్రా లోపాలతో ఇప్పటికే పథకం పనితీరు తీసికట్టుగా తయారుకాగా.. ఇది చాలదన్నట్లు కొత్త ప్రభుత్వం పనిదినాలను కుదించేసింది. గతంలో ప్రతి కార్డుదారుకు 150 పనిదినాలు కల్పించగా.. ఇప్పుడు దాన్ని 100 రోజులకు కుదించేశాయి. దీంతో ఫిబ్రవరి మొదటి వారానికే రాజాం మండలంలో సుమారు 500 కుటుంబాలకు 100 పని దినాలు పూర్తి అయిపోయాయి. మళ్లీ వీరికి పని కావాలంటే ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఆగాల్సిందే. కుటుంబంలో ఇద్దరు కార్డుదారులు ఉంటే చెరో 50 రోజులు చొప్పున, నలుగురు ఉంటే 25 రోజులు చొప్పున పని కల్పిస్తుండటంతో మిగిలిన రోజుల్లో పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. వేసవిలో పనులకు వెళ్లి రోజంతా కష్టపడినా ఒక్కో వేతనదారుడికి రూ.50 రావడం కష్టంగా ఉందని వేతనదారులు వాపోతున్నారు. అయినా దిక్కులేని స్థితిలో పనికి వెళ్తున్నామని, ప్రస్తుతం 100 రోజులు పూర్తి అయ్యాయని చెప్పి పనికి రావద్దంటున్నారని పలువురు వేతనదారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తమకు వలసబాటే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లేక పస్తులుంటున్నాం ఉపాధి పనులకు అలవాటుపడిపోయాం. ప్రతి రోజూ పనికి వెళ్లి ఎంతోకొంత వేతనం తెచ్చుకొని కుటుంబ పోషణ చేసుకునేవారం. ఇప్పుడు వంద రోజులు పూర్తి అయ్యాయని చెప్పి రావద్దంటున్నారు. దీంతో పనుల్లేక పస్తులుండాల్సి వస్తోంది. -కుప్పిలి కన్నారావు, పెనుబాక భార్యాభర్తలకు చెరో 50 రోజులు భార్యాభర్తలిద్దరం పనికి వెళ్లేవాళ్లం. గతంలో 150 రోజులు పని కల్పించేవారు. ప్రస్తుతం 100 రోజులే అనడంతో ఇద్దరికీ 50 రోజులే పని దొరికింది. ఇద్దరు ఆడపిల్లలతో పనిలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వమే స్పందించాలి. -చింత అప్పారావు, బీఎన్ వలస ప్రభుత్వ ఆదేశాల మేరకే.. గతంలో ఏడాదికి 150 రోజులు పని కల్పించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం కుటుంబానికి 100 రోజులు మాత్రమే పని కల్పించమని ఆదేశాలు జారీ చేసింది. తాము చే యగలిగిందేమీ లేదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయక తప్పటం లేదు. -జి.అరుణకుమారి, ఏపీవో -
‘ఉపాధి’కి ఊతం
►కూలీ రేటు రూ.20 పెంచిన సర్కారు ►రోజుకు రూ.169కు పెంచుతూ ఉత్తర్వులు ►జాబ్‌కార్డుల ప్రకారం ►4.45 లక్షల మంది కూలీలు ►వంద రోజుల పనిపై దృష్టి పెట్టని సర్కారు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మరో 20 రూపాయల కూలీ పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇం తకు ముందు ఉపాధి కూలీలకు రోజుకు రూ.149 చెల్లించేవారు. దానిని రూ.169 కు పెంచారు. ఉపాధిహామీ కింద చేపట్టే పనుల రేట్లను కూడ మార్చనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ రికార్డుల ప్రకారం 4,45,117 మంది కూలీలు జాబ్ కార్డులు పొందారు. వీరందరికీ కొత్త కూలీ రేట్లు వర్తించనున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలకు తప్పనిసరిగా వంద రోజుల పని దక్కేలా చూడాలన్న డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. 2013-14 లో రూ.14,578 కుటుంబాలకే 100 రోజుల పని ఉపాధిహామీ పథకం అమలులో రాష్ట్ర స్థాయి లో జిల్లా ఐదో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం లో 14,578 కుటుంబాలకే వంద 100 రోజుల పని దొరకడం గమనార్హం. ఉపాధి హామీతో భరోసా పొందని అనేక మంది కూలీలు వలసబాట పట్టారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి బతుకుదెరువు కోసం కూలీలు వలసలు సాగించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ ఏడాది జాబ్‌కార్డులు పొందిన 4,45,117మంది కూలీలకు ఉపాధి కల్పించేం దుకు రూ.557.62 కోట్ల విలువ గల పనులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి వరకు రూ. 203.50 కోట్లు ఖర్చు చేసి, 50,149 పనులు చేసినట్లు ప్రకటించారు. అందరికీ వంద రోజు ల పని కల్పించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2014-15లో లక్ష్యం నెరవేరేలా ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 4,45,117 మందికి జాబ్ కార్డులు జారీ చేసిన అధికారు లు, 2014-15లోనూ 2,19,236 కుటుంబాల కు వంద రోజులు పని కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశామని చెబుతున్నారు. ఈసారైనా వీ రందరికీ పని దక్కేలా చూడాల్సి ఉంది. ఉపాధిహామీ పథకం కింద ఈ యేడు ప్రణాళికలో చేర్చిన నిధులు వచ్చే ఏడాదిలో ఖర్చు చేసే అవకాశం ఉన్నా, ఈ ఏడాదిలో కూలీలకు ఉపాధికి గండి పడుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పలువురు సూచిస్తు న్నా రు. కూలీ పెంపు, వ్యవసాయాన్ని ఉపాధిహా మీకి అనుసంధానం చేయడం కూడా కలి సొచ్చే అవకాశమని భావిస్తున్నారు. -
ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
నెలాఖరు వరకు గడువు కలెక్టర్ రఘునందన్‌రావు తిరువూరు : సామాజిక పెన్షనుదారులు, ఉపాధిహామీపథకం జాబ్‌కార్డుదారులు నెలాఖరులోగా ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన తహ సీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలు పథకాల్లో ఆధార్‌నంబరును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో ఆధార్‌కార్డుల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మీసేవా కేంద్రాల్లో కూడా శాశ్వత ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నందున పెన్షన్లు, ఎన్ఆర్ఈజీఎస్, పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డుదారులు విధిగా తమ డేటా ఎంట్రీ చేయించుకుని కార్డులు పొందాలని కోరారు. ఈ నెలాఖరులోపు వివరాలు నమోదు చేయని పెన్షనర్లు, ఉపాధిహామీపథకం కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు 36శాతం, రేషన్‌కార్డులు 56శాతం, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డులు 76శాతం, పెన్షన్లు 50శాతం మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారని, మిగిలినవి త్వరలో అనుసంధానిస్తామని తెలిపారు. ఇసుక తవ్వకాల నిరోధానికి టాస్క్‌ఫోర్స్... జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇసుక తవ్వకాలపై తమకు సమాచారం ఇస్తే టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరపడం నేరమని తెలిపారు. అధికారులతో సమావేశం... పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్స్ ఆన్లైన్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్ని పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్లైన్ చేశారు, ఆధార్ నంబర్ల నమోదు తదితర వివరాలను వీఆర్వోలనడిగి తెలుసుకున్నారు. మల్లేల, రామన్నపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన అసైన్డ్భూములు, అటవీ, రెవెన్యూ భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు, ఎంపీడీవో సుమమాలిని, సీడీపీవో అంకమాంబ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షకీల్‌అహ్మద్ పాల్గొన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు గ్రామసభలు విస్సన్నపేట : కౌలురైతులను గురిచేందుకు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. తహసీత్దారు కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరైన వారి దరఖాస్తులను పరిశీలించి మరళా రెన్యూవల్ చేయ్యాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు.డీఎస్సీ ద్వారా త్వరలోనే అవసరమైన చోట ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు. తహసీల్దార్ సాయిగోపాల్,ఎంపీడీవో జాన్సీరాణి,ఎంఈవో రేణుకానందరావు పాల్గొన్నారు. -
ఉపాధికి ‘ఆధార్’ గండం!
యాచారం, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల విషయంలో మధ్య తరగతి ప్రజలను ‘ఆధార్’తో బెదరగొట్టి, చివరకు వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బడుగుజీవులపై ‘ఆధార్’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరూ తమ జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్దేశించింది. ఈ నెల 15వ తేదీలోగా అనుసంధానం ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఉపాధికి-ఆధార్ లింకుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కూలీలకు ఆందోళన కలిగిస్తోంది. అనుసంధానం కాకపోతే డబ్బులు రావని పథకం అధికారులు సూచనప్రాయంగా చెబుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. చేసిన పనుల డబ్బుల కోసం నెలల తరబడి కాళ్లరిగేలా తిరుగుతుంటే... ప్రభుత్వం మళ్లీ కొత్త పద్ధతి పెట్టి ఇబ్బందుల పాల్జేయాలని చూస్తోందని కూలీలు మండిపడుతున్నారు. యాచారంలో సగంమంది కూలీలకే... మండలంలో 20గ్రామాల్లోని 925 శ్రమశక్తి సంఘాల్లో 18,708 మంది కూలీలు ఉన్నారు. అదే విధంగా వ్యక్తిగతంగా జాబ్‌కార్డులు పొందిన (పనులకు వెళ్లని) వారు మరో 18మంది వేల వరకూ కూలీలు ఉన్నా రు. శ్రమశక్తి సంఘాల్లో 14,849 మంది కూలీలు మాత్రమే తమ జాబ్‌కార్డులను, ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. రెండువేల మంది కూలీల అనుసంధానం రిజెక్ట్ కాగా, మరో రెండువేల మంది కూలీల వరకూ అనుసంధానం చేసుకోలేదు. అలాగే వ్యక్తిగత జాబ్‌కార్డులు పొందిన మరో 16వేల మంది కూలీలు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోలేదు. మండలంలో మొత్తం 36వేల మందికి పైగా ఉన్న కూలీల్లో కేవలం సగంమందికి మాత్రమే జాబ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో కూలీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జాబ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల ఇక తమకు సకాలంలో డబ్బులు అందవన్న భయాందోళన మొదలైంది. నత్తనడకన స్మార్ట్‌కార్డుల నమోదు జాబ్కార్డులుండి ఆధార్ కార్డు అనుసంధానం జరిగినా తప్పనిసరిగా స్మార్ట్‌కార్డులు ఉంటేనే కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ల (సీఎస్పీ) ద్వారా కూలీలు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే యాక్సిస్ బ్యాంకు కూలీలకు డబ్బులు పంపిణీ చేసే సంస్థను మార్చింది. దీంతో పాత సంస్థ స్మార్ట్‌కార్డులు చెల్లకుండా పోయాయి. తాజాగా వచ్చిన మణిపాల్ సంస్థ కూలీలకు కొత్త స్మార్ట్‌కార్డులు అందజేసేందుకు ఉపక్రమించింది. అయితే ప్రక్రియ నత్తనడకన నడుస్తుండటంతో మండలంలోని 20 గ్రామాల్లో పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్న 18,708 మంది కూలీల్లో నేటికీ సగంమందికి కూడా స్మార్ట్‌కార్డుల నమోదు పూర్తి కాలేదు. -
తూతూమంత్రంగా ‘ఉపాధి’ పరిశీలన
జిల్లాలో జరిగిన ఉపాధిహామీ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటనపై వేతనదారులు తీవ్ర అసంతృప్తి వక్తం చేశారు. తూతూ మంత్రంగా పరిశీలన ఉందని పెదవి విరిచారు. పనుల జోలికి బృందం సభ్యులు వెళ్లకపోవడంపై మండిపడుతున్నారు. రెండో రోజైన శుక్రవారం శ్రీకాకుళం రూరల్‌తోపాటు గార, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, పోలాకి తదితర మండలాల్లో బృందం ప్రతినిధులు పర్యటించారు. వంద రోజుల పనిదినాలు పూర్తి చేయాలి శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్:ప్రతి కుంటుంబం తప్పని సరిగా వంద రోజులు పనిదినాలు పూర్తి చేయాలని ఉపాధి హామీ పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధి, సీనియర్ ఐఏఎస్ అధికారి భగీరధ పాండే అన్నారు. రాగోలుపేటలో జరిగిన ఉపాధి పనులను బృందం పరిశీలించి రికార్డులను సరిచూశారు. జాబ్ కార్డులను అప్డేట్ చేస్తున్నదీ లేనిది పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడి.. కోరిన వెంటనే పనులు కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పోస్టాఫీసుల్లో ఆలస్యం ఏమైనా అవుతుందా అన్ని ప్రశ్నించారు. సర్పంచ్ యజ్జల గురుమూర్తి కల్పించుకొని ఇటీవల కాలంలో వేతనాలు సకాలంలో అందడం లేదని చెప్పగా, పోస్టుమాస్టర్ బదిలీ కావడంతో ఈ పరిస్థితి నెలకొందని, దీనిపై పీడీకి నివేదికలు అందజేశామని ఏపీవో కె.యుగంధర్ చెప్పారు. కేంద్ర బృందం పరిశీలన తూతూ మంత్రంగా సాగింది. ఉదయం ఖాజీపేట, సానివాడలో పరిశీలన జరుగుతుందని, అనంతరం కరజాడ పంచాయితీ అని చివరికి రాగోలుకు సాయంత్రం నాలుగు గంటలకు చేరారు. అక్కడ పంచాయితీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం రాగోలుపేట వెళ్లి కేవలం వేతనదారులు, గ్రామస్తులతో మాట్లాడి వెనుదిరిగారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ గణపతిరావు పాల్గొన్నారు. కొత్తరేవులో: పోలాకి: కొత్తరేవు, వనిత గ్రామాల్లో 2013-14 సంవత్సరంలో చేపట్టిన పనులను కేంద్ర బృందం సభ్యులు భగీరథ పండా పరిశీలించారు. వేతనదారులతో మాట్లాడి 150 రోజుల పనులు వర్తించాయా అని అడితెలుసుకున్నారు. పరిశీలన అంతంత మాత్రం గార:ఉపాధి హామీ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందం పరిశీలన అంతంత మాత్రంగానే సాగింది. బృంద సభ్యుడైన భగీరధ పండా శాలిహుండం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి రికార్డులను పరిశీలించారు. జాబ్‌కార్డుల్లో పనిదినాలు ఎందుకు వేయలేదని పండా ప్రశ్నించగా, వేతనదారుడు వలస వెళ్లడంతో నమోదు చేయలేకపోయామని కిందిస్థాయి సిబ్బంది వివరించారు.అనంతరం వంశధార నది వరదకట్ట పనులను పరిశీలించారు. బూరవెల్లి పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభను నిర్వహించి వేతనదారులతో మాట్లాడారు. వేతనాలపై వాకాబు కంచిలి: జాడుపూడి, మఖరాంపురం పంచాయతీల్లో ఉపాధి పనులు, వేతనదారుల పరిస్థితులపై కేంద్ర బృందం డెరైక్టర్ డాక్టర్ జి.రజనీకాంత్ ఆరా తీశారు. జాడుపూడిలో వేతనదారులందరితో సమావేశమై వేతనదారులతో మాట్లాడారు. చేస్తున్న పనులు, వేతనాలపై వాకాబు చేశారు. అనంతరంచింత చెరువు పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పి. చిన్నబాబు మాట్లాడుతూ చెరువును ఇంకా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం వీరు మఖరాంపురం గ్రామ వేతనదారులతో మాట్లాడారు. ఉద్దానం కొబ్బరి తోటల్లో గట్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో అవకాశం కల్పించాలని స్థానికులు కోరారు. పని దినాలు, వేతనాలు పెంచాలి వజ్రపుకొత్తూరు: ఉపాధి దినాలు 200 రోజులకు పెంచాలని, వేతనాలు కూడా పెంచాలని డోకులపాడు, పల్లిసారధి వేతనదారులు కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ జి. రజనీకాంత్‌ను కోరారు. పనులు తీరు, వేతనాలు అందజేస్తున్న విషయాలపై ఆరా తీశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రజలు ముందుకు రావాలన్నారు. వచ్చారు- వెళ్లారు! పలాస రూరల్: ఉపాధి పనులు పరిశీలనకు వచ్చిన బృందం సభ్యులు వచ్చి వెళ్లారు. పెద్దనీలావతి, మామిడిమెట్టు గ్రామాల్లో పర్యటించిన సభ్యులు కేవలం ఇద్దరి వేతనదారులతోనే మాట్లాడారు. పెద్దనీలావతిలో సుమారు 30 నిమిషాలు పాటు సమావేశమై పనులు, వేతనాలపై అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పై-లీన్ తుఫాన్‌తో జీడి, మామిడి, కొబ్బరి చెట్లు కూలీ పోయాయని, వాటిని తొలగించేందుకు ఉపాధిహామి పనుల్లో పని కల్పించాలని కూలీలు కోరారు. రంగోయిలో ఇద్దరితో మాటాడి వెనుదిరిగారు. ఉపాధి పనులు ఎక్కువగా చేయించండి సారవకోట రూరల్: పనులను గ్రామాలలో అధికంగా గుర్తించి వేతనదారులతో చేయించాలని బృందం చైర్మన్ కేబీ సక్సేనా అన్నారు. మాళవ పంచాయతీ కార్యాలయంలో వేతనదారులతో సమావేశమయ్యారు. పంచాయతీ పరిధిలో 150 మందికి జాబ్‌కార్డులుండగా 116 మంది మాత్రమే హాజరు కావడంపై సిబ్బందిని నిలదీశారు. పనులకు రాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల పరిశీలన సరుబుజ్జిలి: కేంద్రబృందం చైర్మన్ కె.బి.శరత్‌సక్సేనా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో కలిసి పురుషోత్తపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. కొత్తకోట గ్రామంలో పనికి తగ్గవేతనం అందడంలేదని, 200 రోజుల పని దీనాలు కల్పించాలని వేతనదారులు కోరారు. చిగురవలస గ్రామంలో ఎస్సీ లబ్ధిదారులకు కల్పించిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులపై సంతృప్తి ఎచ్చెర్ల: పొన్నాడలో జరిగిన ఉపాధి పనులను కేంద్ర బృందం ప్రతినిధి గణపతి తదితరులు పరిశీలించారు. పనులు సక్రమంగా జరుగుతున్నాయని వాటిని కొనసాగించాలన్నారు. 150 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని వేతనదారులకు సూచించారు. జాబ్ కార్డుల పరిశీలన ఆమదాలవలస టౌన్: భరద్వాజ పండా నాయకత్వంలోని కేంద్ర బృందం సభ్యులు వంజంగిలో శుక్రవారం సాయంత్రం పర్యటించింది. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడి వారి జాబ్ కార్డులను పరిశీలించారు. ఏఏ పనులు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. ‘ఉపాధి’ధర పెంచండి నందిగాం: ఉపాధి పనులకు వేతనం పెంచడంతోపాటు పనిదినాలు పెంచాలని దేవుపురం పంచాయతీ కొండతెంబూరు, పెద్దతామరాపల్లి గ్రామస్తులు కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ రజనీకాంతరావును కోరారు. ప్రైవేటు పనులకు వెళ్తే రోజుకు రూ. 300 వస్తుందని, ఉపాధి పనుల్లో మాత్రం 120 రూపాయలకు మించి గిట్టడం లేదని వివరించారు. గ్రామస్థాయిలో పనులు చాలడం లేదని పెద్దతామరాపల్లి వేతనదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నామమాత్రంగా పరిశీలన హిరమండలం: మండలంలో కేంద్ర బృందం నామమాత్రంగా ఉపాధి పనులు పరిశీలించారు. గుర్రాలమెట్ట, నౌగూడ, సుభలయి గ్రామాలోబృందం చెర్మైన్ కె .బి.సక్సేనా ఆధ్వర్యంలో సభ్యులు పర్యటించారు. అయితే పనులను పరిశీలించకుండా..కేవలం వేతనదారులతో మాట్లాడి వెళ్లిపోవడంపై విమర్శలు వచ్చాయి. గుర్రాలమెట్టలో పర్యటించిన కేంద్రబృందంతో వచ్చిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ కూలీల నుంచి పలు విషయాలను సేకరించారు. దూర ప్రాంతంలో పనులు కల్పిస్తుండడంతో ప్రయాణ ఖర్చులు కూడా రావడం లేదని కలెక్టర్‌కు వివరించారు. వేతనాలు సకాలంలో అందడం లేదు పాతపట్నం రూరల్: కొరసవాడ, అంతరాబ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. చైర్మన్ కె.బి.సక్సెనా వేతనదారులతో మాట్లాడారు. వేతనాలు సకాలంలో అందడం లేదని కొరసవాడ మహిళా వేతనదారులు సక్సెనా దృష్టికి తె చ్చారు. 150 రోజుల పని దినాల్ని కల్పించాలని కోరారు. జాబ్ కార్డులు పరిశీలించి ఎస్సీ,ఎస్టీలు వంద రోజుల పని పూర్తి ఎందుకు చేయడం లేదని డ్వామా పీడీని ప్రశ్నించారు. తేడాపై ఆగ్రహం! ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జాబ్‌కార్డులు ఉన్న అన్ని కుటుంబాలకు పని కల్పించకపోవడంతోపాటు, ఎస్సీ కుటుంబాలకు పనులు కల్పించడంలో కూడా తేడాలు ఎందుకు ఉన్నాయని కేంద్ర బృందంచైర్మన్ కె.బి.సమీన(సక్సెనా) అధికారులను ప్రశ్నించారు. మండల స్థాయి అధికారులు ఇచ్చిన లెక్కలకు.. గ్రామస్థాయిలో వేతనదారులు చెబుతున్న వాటికి తేడా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఉపాధిహామీ పథకం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం లక్ష్మీనర్సుపేట, కొమ్మువలస పంచాయతీల్లో పర్యటించి వేతనదారులతో మాట్లాడారు. లక్ష్మీనర్సుపేటలో జాబ్‌కార్డుల్లో వేతనదారుల పనులు, వేతనాలు చెల్లింపులకు సంబంధించిన అంశాలు నమోదులో తేడాలు ఉన్నాయని గుర్తించారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాలకు, వాస్తవంగా చెబుతున్న వివరాలకు ఉన్న తేడాలపై కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను అడిగి తెలుసుకున్నారు. చీకటిలోనే బృందం పర్యటన రణస్థలం రూరల్,న్యూస్‌లైన్:ఉపాధి పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు భగీధర్ పండా, అడిషనల్ పీడీ జి గణపతిరావులు రాత్రి ఏడు గంటలకు చిల్లపేటరాజాంలో పర్యటించారు. అయితే ఉపాధి పదకం ద్వారా ఇక్క చేటపట్టిన ఎటువంటి పనులను కేంద్ర బృందం పరిశీలించలేదు. కేవలం ఉపాధి వేతనదారులతో మాట్లాడి టార్చిలైటు వెలుగులో రికార్డులు పరిశీలించి వెళ్లిపోయారు. ఫీల్ట్ అసిస్టెంట్‌తో మాట్లాడి వెళ్లిపోయారు! టెక్కలి,న్యూస్‌లైన్: ఎన్‌ఆర్‌ఐడీ (కేంద్ర బృందం) డెరైక్టర్ రజనీకాంత్, డీఆర్డీఏ పీడీ టి.రజనీకాంతరావు, ఈడీ రమణమూర్తిల నేతృత్వంలోని అధికారులు చాకిపల్లి గ్రామాన్ని సందర్శించారు. పనులను పరిశీలించకుండా పంచాయతీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌తో పాటు కొంత మంది వేతనదారులను నుంచి వివరాలు సేకరించి వెనుదిరిగారు. -
బూడిద బతుకులు
చిలంకూరు(ఎర్రగుంట్ల), న్యూస్‌లైన్: మండల పరిధిలోని చిలంకూరు యానాది కాలనీవాసులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఉపాధి జాబ్‌కార్డులున్నా పనులు కల్పించలేదు. కాలనీలో సుమారు 25 కుటుంబాలవారున్నారు. వారి ప్రధాన వృత్తి కట్టెలు, మొద్దులను కాల్చి బొగ్గులు తయారు చేయడం. వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కాలనీలో ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. బ్యాంకు రుణాలు లేవు. ఇందిరమ్మ గృహాలు రాలేదు. వీధిలైట్లు, మరుగుదొడ్లులేవు. సుమారు 20మంది పిల్లలనురెండు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపాల్సి ఉంది. రోడ్డుపైన చిన్న పిల్లలను పంపడానికి భయపడి పాఠశాలకు పంపడంలేదు. ఎలాంటి ఉపాధి అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులందరూ కొండల్లోకి వెళ్లి పోయి కట్టెలు సేకరించి బట్టీలుగా పేర్చి, వాటికి కాల్చి బొగ్గులు అమ్ముకుని జీవనం గడుపుకుంటున్నారు. ఒక్కొక్క బట్టీలో సుమారు 30 నుంచి 40 బస్తాల బొగ్గుల లు అవుతాయని, ఒక్కో బస్తా రూ.300కు కాంట్రాక్టరుకు ఇస్తామని వారు తెలిపారు. అదే మార్కెట్లో అమ్మకుంటే రూ.500కు అమ్ముకోవచ్చని, ముందుగా కాంట్రాక్టరువద్ద డబ్బులు తీసుకుంటున్నందున అతనికు అమ్మాల్సి వస్తోందన్నారు. బొగ్గుబట్టీల పొగతో కాలనీలో చాలామంది ఆనారోగ్యానికి గురవుతున్నారని, ఇటీవల ఒక వ్యక్తి మృతి చెందాడని చెప్పారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.