వ్యవసాయ పనుల్లేని సమయంలో ప్రతి కుటుంబానికి 150 రోజుల పని కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోతోంది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు ఈ విషయంలో చేతులెత్తేస్తున్నాయి. వంద రోజులతోనే సరిపెట్టేస్తున్నాయి. ఫలితంగా వేతనదారులకు వెతలు తప్పడంలేదు. ఇప్పటికే వంద రోజుల పని పూర్తి చేసిన వారు కొత్త ఆర్థిక సంవత్సరం.. అంటే ఏప్రిల్ వరకు పని లేక దిక్కులు చూడాల్సిన దుస్థితిలో పడ్డారు.
రాజాం: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పంటల సాగు లేని సమయంలో స్థానికంగానే సన్నకారు రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు గత కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు ఇచ్చి ఏడాదిలో కనీసం 150 రోజులు పని కల్పించేలా చర్యలు చేపట్టింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు దీన్ని వంద రోజులకు తగ్గించేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేసేస్తున్నారు. పథకం ప్రారంభమైన తొలినాళ్లలో పక్కాగా నిర్వహించడంతో కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే కాలక్రమంలో రకరకాల నిబంధనలు పెట్టడం, వేతనాలు సక్రమంగా అందించకపోవడం, తక్కువ వేతనాలు రావడం వంటి కారణాలు మళ్లీ వలసలు పుంజుకునేలా చేశాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 60 వేల జాబ్‌కార్డులు పంపిణీ చేశారు. వీటి ద్వారా సుమారు 1.50 లక్షల మంది ఉపాధి పొందాల్సి ఉండగా..పైన పేర్కొన్న లోపాల కారణంగా లక్ష మంది వరకే ఉపాధి పనులకు వెళ్తున్నారు. రాజాం మండలంలో 13వేల జాబ్‌కార్డులు పంపిణీ చేయగా.. వాటిలో 8464 జాబ్ కార్డులకు సంంబంధించిన సుమారు 6వేల మంది వేతనదారులే పనులుకు వెళ్తున్నారు.
పనిదినాలూ కట్
నిర్వహణ, ఇతరత్రా లోపాలతో ఇప్పటికే పథకం పనితీరు తీసికట్టుగా తయారుకాగా.. ఇది చాలదన్నట్లు కొత్త ప్రభుత్వం పనిదినాలను కుదించేసింది. గతంలో ప్రతి కార్డుదారుకు 150 పనిదినాలు కల్పించగా.. ఇప్పుడు దాన్ని 100 రోజులకు కుదించేశాయి. దీంతో ఫిబ్రవరి మొదటి వారానికే రాజాం మండలంలో సుమారు 500 కుటుంబాలకు 100 పని దినాలు పూర్తి అయిపోయాయి. మళ్లీ వీరికి పని కావాలంటే ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఆగాల్సిందే. కుటుంబంలో ఇద్దరు కార్డుదారులు ఉంటే చెరో 50 రోజులు చొప్పున, నలుగురు ఉంటే 25 రోజులు చొప్పున పని కల్పిస్తుండటంతో మిగిలిన రోజుల్లో పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. వేసవిలో పనులకు వెళ్లి రోజంతా కష్టపడినా ఒక్కో వేతనదారుడికి రూ.50 రావడం కష్టంగా ఉందని వేతనదారులు వాపోతున్నారు. అయినా దిక్కులేని స్థితిలో పనికి వెళ్తున్నామని, ప్రస్తుతం 100 రోజులు పూర్తి అయ్యాయని చెప్పి పనికి రావద్దంటున్నారని పలువురు వేతనదారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తమకు వలసబాటే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లేక పస్తులుంటున్నాం
ఉపాధి పనులకు అలవాటుపడిపోయాం. ప్రతి రోజూ పనికి వెళ్లి ఎంతోకొంత వేతనం తెచ్చుకొని కుటుంబ పోషణ చేసుకునేవారం. ఇప్పుడు వంద రోజులు పూర్తి అయ్యాయని చెప్పి రావద్దంటున్నారు. దీంతో పనుల్లేక పస్తులుండాల్సి వస్తోంది.
-కుప్పిలి కన్నారావు, పెనుబాక
భార్యాభర్తలకు చెరో 50 రోజులు
భార్యాభర్తలిద్దరం పనికి వెళ్లేవాళ్లం. గతంలో 150 రోజులు పని కల్పించేవారు. ప్రస్తుతం 100 రోజులే అనడంతో ఇద్దరికీ 50 రోజులే పని దొరికింది. ఇద్దరు ఆడపిల్లలతో పనిలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వమే స్పందించాలి.
-చింత అప్పారావు, బీఎన్ వలస
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
గతంలో ఏడాదికి 150 రోజులు పని కల్పించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం కుటుంబానికి 100 రోజులు మాత్రమే పని కల్పించమని ఆదేశాలు జారీ చేసింది. తాము చే యగలిగిందేమీ లేదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయక తప్పటం లేదు.
-జి.అరుణకుమారి, ఏపీవో
వందేమాత్రం!
Published Tue, Feb 24 2015 4:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement