state governments
-
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
‘క్రీమీ లేయర్’పై బీజేపీ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాలను అడ్డుకోలేం
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణనకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తాము నిరోధించలేమని వెల్లడించింది. కుల గణన డేటాను ఎందుకు ప్రచురించాల్సి వచ్చిందో చెప్పాలని బిహార్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. కుల గణన చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందో లేదో పరిశీలిస్తామని తెలియజేసింది. బిహార్‌లో కుల గణనకు అనుమతి ఇస్తూ ఆగస్టు 1న బిహార్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీన్ భట్టీతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కులాల వారీగా సర్వేకు సంబంధించిన కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రచురించిందని, మిగిలిన వివరాలకు బయటపెట్టకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. -
సమష్టి కృషితోనే నేరాలకు అడ్డుకట్ట
సూరజ్‌కుండ్(హరియాణా): దేశవ్యాప్తంగా విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యత అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల హోం శాఖ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ‘చింతన్ శిబిర్’ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ‘ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ అభిలషించిన పంచప్రాణ లక్ష్యాలు, వందేళ్ల స్వతంత్రభారతం(2047 దార్శనికత)ను సాకారం చేసుకోవడానికి ఈ చింతన్ శిబిర్‌లో ఫలవంత కార్యాచరణను సంసిద్ధం చేసుకుందాం. జమ్మూకశ్మీర్, విదేశీ అక్రమ విరాళాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదుల లొంగుబాటుతో సమస్యలను అణచేసి దేశ అంతర్గత భద్రతను పెంచడంలో మోదీ సర్కార్ సఫలత సాధించింది. ‘పశుపతి(నాథ్) నుంచి తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదం ఉండేది. అదీ సద్దుమణిగింది. ఇక, రాష్ట్రంలో శాంతిభద్రత అనేది ఆ రాష్ట్ర అంశమే. కానీ, మనందరం ఉమ్మడిగా పోరాడి అన్ని రాష్ట్రాల్లో నేరాలను అణచివేద్దాం. ఇది మనందరి సమష్టి బాధ్యత’ అని హోం మంత్రులతో షా వ్యాఖ్యానించారు. ‘కొన్ని ఎన్జీవోలు మతమార్పిడి వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాయి. దేశార్థికాన్ని బలహీనపరిచేలా, అభివృద్ధిని అడ్డుకునేలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను దుర్వినియోగం చేశాయి. వీటిపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఆంక్షల చర్యలు తీసుకున్నాం’ అని షా చెప్పారు. -
ఏది ఉచితం? ఏది అనుచితం?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు. వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు. అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు. జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు -
గైడ్లకు రూ.లక్ష.. ఆపరేటర్లకు రూ.10 లక్షలు
(గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నవంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, టూర్ గైడ్లకు రూ.లక్ష చొప్పున, ఆపరేటర్ల(సంస్థలు)కు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, రిజిస్ట్రేషన్లు ఉన్న గైడ్లు, ఆపరేటర్లకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నందున, వారిని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని చెప్పారు. మొత్తంగా 10 వేల మంది గైడ్లకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సోమవారం ఈశాన్య రాష్ట్రాల మంత్రుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022, జనవరి 1 నుంచి దేశ, విదేశ పర్యాటకుల కోసం దేశంలోని పర్యాటక కేంద్రాలను తెరవాలని భావిస్తున్నామని అన్నారు. అయితే, ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ, హోం, విదేశాంగ ఇతర శాఖల నుంచి ఆమోదం లభించాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికానుందని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్, పారాలింపిక్స్ వంటి క్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు సాధించేందుకు మణిపూర్‌లోని ఇంఫాల్ సమీపంలో జాతీయ క్రీడల విశ్వవి ద్యాలయాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నామని మంత్రి వివరించారు. వచ్చే రెండేళ్లలో దేశంలోని వంద విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. -
Krishna And Godavari River: ముప్పేట ఒత్తిడి!
కృష్ణా, గోదావరి జలాల ఆధారంగా నిర్మిస్తున్న, నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టులపై ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరిన నేపథ్యంలో డీపీఆర్‌ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. డీపీఆర్‌లు సమర్పించాలంటూ బోర్డులు రెండు రాష్ట్రాలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన నిధులు వెంటనే డిపాజిట్ చేయాలని కూడా కోరుతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ఒక్కో అంశాన్ని పరిశీలిస్తున్న బోర్డులు.. వాటి అమలు ప్రక్రియను షురూ చేశాయి. గెజిట్ వెలువరించిన మరుసటి రోజే ఆ కాపీలను తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా పంపిన బోర్డులు.. తదనుగుణంగా చర్యలు మొద లుపెట్టాలని సూచించాయి. నోటిఫికేషన్లో పేర్కొ న్న మాదిరి తమకు డబ్బులు చెల్లించాలని, ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని వరుసగా లేఖలు రాస్తున్నాయి. మరోపక్క అనుమతులు లేని ప్రాజెక్టులకు రుణాల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రుణ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌తో ప్రాజెక్టుల నిర్మాణంపై పడే ప్రభావం, రుణ సంస్థలకు ఎదురయ్యే చిక్కులపై ఆరా తీయడం మొదలుపెట్టాయి. డీపీఆర్‌ల కోసం ఒత్తిడి అక్టోబర్‌లో అపెక్స్ భేటీ జరిగింది. అప్పట్నుంచే రెండు బోర్డులు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు)లు సమర్పించాలని రాష్ట్రాలను కోరుతున్నాయి. అయినా తెలంగాణ ఇంతవరకు ఎలాంటి డీపీఆర్‌లు సమర్పించలేదు. ఇటీవల కొత్త ప్రాజెక్టుల విషయంలో వివాదాలు ముదిరిన నేపథ్యంలో.. అపెక్స్ ఆమోదం లేకుండా, కేంద్ర జల సంఘంతో పాటు తమ అనుమతి లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని బోర్డులు తాజాగా మరోసారి ఆదేశించాయి. అలాగే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలని కూడా కోరాయి. తాజాగా తెలంగాణ చేపట్టిన 37 ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డు వాటి డీపీఆర్‌లు ఇవ్వాల్సిందిగా రెండ్రోజుల కిందట లేఖ రాసింది. మరోపక్క గోదావరి బోర్డు గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్–3, సీతారామ, కంతనపల్లి, మిషన్ భగీరథ, లోయర్ పెనుగంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటితరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. అయితే డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నా.. తెలంగాణ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు ఇవ్వండి ఇలావుండగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా బోర్డులు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున చెల్లించాలని బోర్డులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. నోటిఫికేషన్ వెలువడ్డ రోజునుంచి 60 రోజుల్లో ఈ నిధులు చెల్లించాలని గెజిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరాయి. అనుమతులపై రుణ సంస్థల ఆరా.. ఈ పరిస్థితుల్లో రుణ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై దృష్టి సారించాయి. ముఖ్యంగా తెలంగాణలోని కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులతో పాటు సీతారామ సాగర్, సీతమ్మ బ్యారేజీ, తుపాకులగూడెం, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్ఈసీ), నాబార్డ్ వంటి సంస్థలు రుణాలు అందించాయి. ప్రస్తుతం ఈ సంస్థలు ప్రాజెక్టులకు అనుమతులపై కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నుంచి సమాచారం కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని పక్షంలో ప్రాజెక్టుల నిర్మాణాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు? అనుమతుల ప్రక్రియకు కార్యాచరణ ప్రణాళిక ఏంటీ అన్న విషయాలపై రుణ సంస్థలు లేఖలు రాసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులకు ఆర్ఈసీ రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. మరో కార్పొరేషన్‌కు పీఎఫ్సీ, ఆర్ఈసీలు మరో రూ.2 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో కొంతమేర ఇప్పటికే మంజూరు చేయగా, మరికొంత విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో అవి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాయి. గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించ తలపెట్టిన సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం ఇచ్చేందుకు పీఎఫ్సీ ముందుకు వచ్చింది. అయితే అనుమతులు లేవన్న కారణంగా ప్రాజెక్టును నిలిపివేస్తే తమ రుణాలను బేషరతుగా వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ షరతులు విధించింది. -
పలు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తే , మరికొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కాలుష్య కారక టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కరోనా వైరస్ విజృంభణ, కాలుష్యం పెరిగిపోతూ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. టపాసులపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్తాన్, సిక్కిం, కర్ణాటక ఉన్నాయి. బాణసంచా కాల్చడంతో వాయుకాలుష్యం పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, కోవిడ్ విజృంభిస్తున్న వేళ టపాసులు కాల్చడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పడంతో పలు రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్ 30 వరకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.. ఒక్కో రాష్ట్రం బాణసంచా కాల్చడంలో నిషేధం విధించడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో బాణసంచాలో 90% తమిళనాడులోని శివకాశి ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ ఉండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం పెరగకుండా చూడండి: సుప్రీంకోర్టు ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగ నేపథ్యంలో రాజధానిలో కాలుష్యం పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన బెంచ్ వీలైనంత త్వరగా కాలుష్య నివారణకు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించింది. -
వలస జీవుల కష్టాలు తీర్చండి!
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాలనీ, వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పించాలనీ కేంద్రాన్నీ, రాష్ట్రప్రభుత్వాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోరింది. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యలనూ, వారి కష్టాలను పరిశీలించిన సుప్రీంకోర్టు కేసుని సుమోటోగా స్వీకరించింది. కేంద్రం, రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు వలసకార్మికుల సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో మే 28లోగావిన్నవించాలని జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదావేసింది. మీడి యా, పత్రికల్లో వచ్చిన కథ నాలను ప్రస్తావిస్తూ ధర్మా సనం..వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాల తరఫున లోపాలు జరిగాయని భావిస్తున్నట్లు తెలిపింది. కార్మికుల వేతనాలు అత్యవసర అంశం లాక్డౌన్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించే అంశాన్ని అత్యవసర విషయంగా పరిగణించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. లాక్డౌన్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు పై విధంగా స్పందించింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తన స్పందనను దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
మద్దతుధరకు చట్టబద్ధత ఇవ్వాలి
విశ్లేషణ ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పించేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో గడచిన రెండువారాలలో కొన్ని విషాదకర దృశ్యాలు వరసగా దర్శనమిచ్చాయి. ఆ పక్షం రోజుల పాటు కూడా ఆయా ప్రాంతాల రైతులు వారు పండిం చిన టొమేటోలను రోడ్ల మీదకు తెచ్చి పారబోయడం కనిపించింది. ఆ జిల్లాలోనే ఉంది పర్సూలీ అనే గ్రామం. ఆ ఒక్క గ్రామంలోనే కనీసం 100 క్వింటాళ్ల టొమేటో పంటకు ఇదే గతి పట్టిందని అంచనా. అక్కడి రైతాంగం ఆ పంటను తమ పశువుల చేత అవి తిన్నంత తినిపించింది. ఇంకొంత పొలాలలోనే వదిలి, కుళ్లిపోయేటట్టు చేసింది. మొన్న జనవరి మొదటి వారం వరకు కొద్దిగా మెరుగ్గానే ఉన్నా, తరువాత టొమేటోల చిల్లర ధర పడిపోతూ వచ్చింది. ఉత్తర భారతంలోని ఆ రాష్ట్రంలోనే కాదు, దక్షిణాదిన తమిళనాడులో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిం చాయి. ఈ రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా రైతాంగాన్ని మార్కెట్ పరిస్థితులు తీవ్రంగా కలత పెడుతున్నాయి. అక్కడ క్యాబేజీ చిల్లర ధర దారుణంగా పడిపోయింది. గడచిన సంవత్సరం క్యాబేజీ కిలో ఒక్కంటికి రూ.12 ధర పలికినప్పటికీ, రైతులకు దక్కినది సగటున కిలోకు కేవలం ఒక్క రూపాయి. పడిపోతున్న టొమేటో ధర ఛత్తీస్‌గఢ్‌లో కూడా రైతుల జీవితాలను కకావికలు చేస్తోంది. కిలో ఒక్కంటికి రూ. 1, లేకపోతే, రూ. 2లకు మించి దక్కని పరిస్థితులలో చాలామంది రైతులు పంటను కోసే పని కూడా పెట్టుకోకుండా పొలం మీదే వదిలి పెడుతున్నారు. అంటే మార్కెట్ నుంచి దక్కుతున్న ఆ పరిమిత రాబ yì పంట వ్యయానికే కాదు, కోత కోయడానికి కూడా గిట్టుబాటు కావడం లేదు. అధిక దిగుబడితోనూ కష్టాలేనా? నిజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకంటే– అధిక దిగుబడి. అది టొమేటో కావచ్చు, బంగాళదుంప, క్యాబేజీ, ఉల్లి, మరేదైనా పంట కావచ్చు. అవన్నీ అధికంగానే పండుతున్నాయి. కానీ పలుకుతున్న ధర మాత్రం చాలా తక్కువ. అధిక దిగుబడి మళ్లీ మధ్య దళారీలకే లాభం చేకూరుస్తున్నది. దళారులంతా ముఠాలు కట్టేసి, తరుచూ దోపిడీ అనదగిన స్థాయిలో ధరలను నియంత్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధిక దిగుబడేనని ఈరోడ్ జిల్లాకు చెందిన రైతు టి. రాజాగణేశ్ కూడా అంగీకరించారు. ‘ఒక ఎకరం పొలంలో ఒక నెలపాటు క్యాబేజీ సాగుకు రైతు చేసే వ్యయం రూ. 45,000. దీనికి కూలీల ఖర్చును కలపవలసి ఉంటుంది. ఇంకా నిర్వహణ, ఎరువుల ఖర్చును కూడా జత చేయాలి. ఇవన్నీ కలుపుకుంటే నెలకి అయ్యే ఖర్చు దాదాపు రూ. 50,000. ఇక క్యాబేజీ పంట చేతికి అందాలంటే మూడు మాసాలు పడుతుంది. అంటే ఒక ఎకరం భూమిలో క్యాబేజీ సాగు చేయాలంటే చేయవలసిన వ్యయం కనీసం రూ. 1.5 లక్షలు. అలాంటప్పుడు కిలో ఒక్కంటికి రైతుకు ఒక్క రూపాయి వస్తే మాకు లాభం వచ్చిందని ఎలా అనుకోగలం?’అని ప్రశ్నించారు రాజాగణేశ్. టొమేటో సాగు కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండడం లేదు. చిన్న రైతు విషయమే తీసుకోండి. ఒక ఎకరం పొలంలో ఆ పంటను పండించాలంటే వారి కయ్యే వ్యయం రూ. 90,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటుంది. అదే పెద్ద రైతులు టొమేటో పండిస్తే ఇంకొంచెం ఎక్కువగా, అంటే ఎకరానికి రూ. 1.25 లక్షల వరకు సాగు వ్యయం అవుతుంది. దుర్గ్ జిల్లాలో టొమేటో రైతులను కలుసుకోవడానికి నేను జనవరిలో పర్యటించాను. అప్పుడు ధరలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. 25 కిలోల ఒక పెట్టె రూ. 1,000 ధర పలికిన సమయమది. అయితే కర్ణాటక నుంచి టొమేటోలు మార్కెట్లో ప్రవేశించడంతో సరుకు పెరిగిపోయింది. ధరలు పడిపోయాయి. ఇప్పుడు శనగ పంట విషయం తీసుకుందాం. కొత్త పంట మార్కెట్లోకి రావడం మొదలైంది. వీటి కనీస మద్దతు ధర రూ. 4,400. కానీ మార్కెట్లో రైతుకు లభిస్తున్న ధర రూ. 3,600. అంటే క్వింటాల్‌కు 20 శాతం తక్కువగా వారికి దక్కుతోంది. ఇది చిల్లర ధర. పైగా ఈ సంవత్సరం 8 శాతం అధికంగా సాగు జరి గింది. కాబట్టి కోటి లక్షల టన్నుల అధిక దిగుబడి ఉంటుందని (గడచిన సంవత్సరం దిగుబడి దాదాపు 93 లక్షల టన్నులు) అంచనా. కాబట్టి పంట మార్కెట్‌కు చేరే కొద్దీ ధర మరింతగా పతనమయ్యే అవకాశాలే ఎక్కువ. గోధుమ ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువగానే రైతుకు దక్కుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఆ పంటకు కనీస మద్దతు ధర కంటే 6నుంచి 8 శాతం తక్కువగానే రైతులకు దక్కుతోంది. అక్కడ కూడా పంట మార్కెట్లకు రవాణా కావడం మొదలైంది. కనీస మద్దతు ధర మిథ్యేనా? కందిపప్పు ధర కూడా అంతే. మొన్న ఫిబ్రవరి ఆఖరి వారానికి కందిపప్పు మార్కెట్ ధర క్వింటాల్‌కు రూ. 4,500. కానీ, తెలంగాణలోని తాండూర్‌లో సేకరణ ధర మాత్రం రూ. 5,500. ఈ నెల మొదటి వారంలో గుజ రాత్, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఆవాలు, ఇతర పప్పుధాన్యాల ధరలను పరిశీలించినా ఇదే అవగతమవుతుంది. వాటి మార్కెట్ ధర ప్రకటించిన మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే, ఛత్తీస్‌గఢ్‌లో మరో దఫా రైతులు తమ టొమేటో పంటను రోడ్ల మీదకు తెచ్చి పడేశారన్న వార్తలు వచ్చాయి. టొమేటోల ధర కిలో ఒక్కంటికి రూ.1కి పతనం కావడమనే విష పరిణామం వరుసగా మూడేళ్లు కొనసాగినట్టవుతుంది. ఇది టొమేటోలకే పరిమితమైన విష పరిణామం కూడా కాదు. నిజానికి వ్యవసాయోత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా పతనం కావడమనే ఆ పరి ణామం వరసగా మూడేళ్ల నుంచి జరుగుతోందన్న వాస్తవం గమనించాలి. 2014, 2015 వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొని రైతులను వేధించాయి. తరువాత 2016, 2017, 2018 సంవత్సరాలు పంట దిగుబడికి సానుకూలంగా ఉన్నాయి. ఈ అధిక దిగుబడి ప్రభుత్వానికి ఎంతో మోదాన్ని తెచ్చి పెట్టింది. కానీ పడిపోయిన ధరలు మాత్రం రైతును దుఃఖసాగరంలోకి నెట్టివేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ టి. ఎన్. ప్రకాశ్ చేసిన సూచన సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన సూచన సరైన సమయంలో వచ్చినదే కూడా. పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడం చట్ట ప్రకారం అమలు చేసే విధంగా రూపొందాలని ఆయన చెప్పారు. మైసూరులో డాక్టర్ ప్రకాశ్ ఇచ్చిన ఒక స్మారకోపన్యాసంలో ఈ సూచన చేశారు. ‘గరిష్ట చిల్లర ధరను మించి ఉత్పత్తులను విక్రయిస్తే దాని నుంచి వినియోగదారునికి చట్టబద్ధమైన రక్షణ ఉంది. అలా జరిగిన పక్షంలో వినియోగదారులు న్యాయస్థానాలకు వెళ్లవచ్చు. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, రైతుకు మాత్రం అలాంటి చట్టబద్ధమైన రక్షణ లేదు’అని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయోత్పత్తుల ధరలు పతనం కావడమనే పరిణామం మూడేళ్లుగా వరుసగా జరుగుతోంది. మూడో సంవత్సరంలో కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో చూస్తే అన్ని వ్యవసాయోత్పత్తులు వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరల కంటే 20 నుంచి 45 శాతం తక్కువ ధరలకే నోచుకుంటున్నాయి. కర్ణాటకలో ఐక్య మార్కెట్ వేదికను ఏర్పాటు చేశారు. దీనితో దేశంలో 585 ఈ నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చ రల్ మార్కెట్) శాఖలు విస్తరించాయి కూడా. అయినా రైతులకు ఒనగూడిన ప్రయోజనం ఏమీలేదు. నమూనా ధరల నిర్ణయం కూడా రైతుకు ఏమీ చేయలేదు. రోజు వారీ ట్రేడింగ్‌ను బట్టి ఈ ధరను నిర్ణయిస్తారు. ఇది వాస్తవంలో నిస్పృహను మిగిల్చింది. ఈ విధానానికి స్వస్తి పలకడం అవసరం. ఈ నామ్ల ఉద్దేశం కూడా జాతీయ స్థాయిలో స్పాట్ ట్రేడింగ్‌కు లాభం చేకూర్చడమే. రాష్ట్రాలలో వ్యవసాయోత్పత్తుల కమిషన్లు నాది కూడా ఒక సూచన ఉంది. ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. దీనితో పాటు త్వరగా పాడయ్యే టొమేటో, బంగాళదుంప, ఉల్లి, ఇతర కూరగాయల పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో వ్యవసాయదారుల కమిషన్లు ఏర్పడినాయి. కానీ అవి ఆశ్రితులకు పునరావాసం కల్పిం చేందుకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి తక్షణం చేయవలసిన పని ఏమిటంటే, ఈ కమిషన్లను రాష్ట్ర వ్యవసాయోత్పత్తుల ధరల కమిషన్లుగా మార్పు చేయాలి. రైతులకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. అంటే కర్ణాటకలో ఏర్పాటు చేసిన కమిషన్ మాదిరిగా అన్నమాట. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు మించి కర్ణాటక 14 పంటలను సేకరిస్తూ ఉంటే, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి పంథాను అనుసరించడానికి మిగిలిన రాష్ట్రాలకు ఎదురయ్యే చిక్కులేమిటో అర్థం కాదు. - దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఏం చర్యలు తీసుకొంటున్నారు
విదేశాల్లో మన బాధిత మహిళల అంశంపై హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: భారత్‌లో వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లి, అక్కడ విడాకుల బాధితులుగా మారుతున్న మహిళలకు న్యాయ సాయం అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. స్వదేశంలో పెళ్లిళ్లు చేసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తరువాత తమ భార్యలకు విడాకులు ఇస్తున్నారని, దీంతో ఆ దేశాల్లో సదరు మహిళలకు న్యాయసాయం అందడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పైడా అర్చన హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ, విదేశాల్లోని విడాకుల బాధిత మహిళలకు న్యాయ సాయం అందించే విషయంలో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సిఫారసులు అమలు కావడం లేదన్నారు. -
సీనియారిటీ తేలేవరకు కేడర్ విభజన వద్దు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ తేలేంత వరకు కేడర్ విభజన చేయవద్దని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వుచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దా ఖలు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేడర్ విభజనకు పరిపాలన ట్రిబ్యునల్ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియారిటీ ఖరారు చేయకుండానే కేడర్ విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయ న కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. -
'ఇంటర్ నెట్' ను నిషేధించడం కరెక్టే..!
న్యూఢిల్లీ: ఇంటర్ నెట్ సేవలను రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంటర్ నెట్ సర్వీసులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పిచ్చింది. ఇంటర్నెట్ వినియోగం, రద్దు అంశంపై రాష్ట్రాల అధికారాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాం నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆ పిల్ ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సీఆర్పీసీ సెక్షన్ 144, టెలిగ్రాఫ్ సెక్షన్ 5ల కింద ఇంటర్ నెట్ వాడకాన్ని రద్దు చేయడంపై ఇటీవలే పిల్ దాఖలైంది. ఇంటర్ నెట్ రద్దు చేయకుండా కాస్త సడలింపు చేయాలని పిల్ లో పేర్కొన్నారు. అయితే, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందేమో అన్న అనుమానం వస్తే ఇంటర్ నెట్ సేవల్ని రద్దుచేసే అధికారం ప్రభుత్వాలకు ఉందని తీర్పిచ్చింది. ఉదాహరణకు గతంలో పటిదార్ ఉద్యమం సమయంలో గుజరాత్ లో ఇంటర్ నెట్ సేవల్ని ఆపేసినట్లు తన తీర్పులో భాగంగా మేజిస్ట్రేట్ వివరించారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు
-
రైతు ఆత్మహత్యలు పట్టవా?
- బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి - ప్రజాసమస్యల్ని గాలికొదిలారు.. - జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైర్ - కలెక్టరేట్ ఎదుట ధర్నా సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చివేతలు, కట్టడాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే.. వాటి గొంతు నొక్కేయడం దారుణమని మండిపడింది. కరువుతో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం హేయమని విమర్శిం చింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుం బాలకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం, సుధీర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో వారిని అరెస్టు చేశారు. పలువుర్ని నాంపల్లి స్టేషన్‌కు తరలించిన తర్వాత విడుదల చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు. నియంత పాలన సాగుతోంది: ప్రసాద్‌కుమార్ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ విమర్శించారు. ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ప్రజాప్రతినిధులను అణచివేసేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రజాసమస్యలపై అన్నిపార్టీలతో కలిసి ఉద్యమించి టీఆర్ఎస్ మెడలు వంచుతామన్నారు. డిజైన్ మారిస్తే యుద్ధం చేస్తాం : టీఆర్ఆర్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల దాహార్తి తీర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణ హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, బృహత్తర లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం పూటకోమాట మారుస్తోందన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం చేసిన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని, ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిజైన్ మారిస్తే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ధర్నాలో కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి ఉద్దెమర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
25% రిజర్వేషన్ల బాధ్యత టీ సర్కారుదే
- నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు ఏ చర్యలు తీసుకున్నారు - 25% సీట్లు అందేలా చూసేందుకు యంత్రాంగం ఉండాలి - స్పష్టత ఇవ్వాలని టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీనవర్గాల విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధనను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం వచ్చి ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు అందించేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 25 శాతం సీట్లు పొందేందుకు అర్హులైన పిల్లల జాబితా ఇవ్వాలని, దానిని పరిశీలించి వారికి ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బలహీనవర్గాల విద్యార్థులకు చట్టప్రకారం 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేటు విద్యా సంస్థలను ఆదేశించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్(కోవా), మరో రెండు సంస్థలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. విద్యా హక్కు చట్టం పూర్తిస్థాయి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్ల భర్తీ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, ఎందుకంటే ఆ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. కమిటీ ఏర్పాటు చేయాలని చట్టంలో ఎక్కడుందని ప్రశ్నించింది. ఫీజు రీయింబర్స్ చేస్తే విద్యాహక్కు చట్టం లక్ష్యం నెరవేరదని, ఉచితంగానే 25 శాతం సీట్లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
’బాబు వచ్చాక వచ్చింది జాబు కాదు కరువు’
-
చుట్టపు చూపే!
- కరువు బృందాలతో ఒరిగింది శూన్యం - మారని ‘అనంత’ రైతుల బతుకులు - కరువు తీవ్రతను గుర్తించినా సహాయక చర్యలు చేపట్టని ప్రభుత్వాలు - ఏటా రూ.వందల కోట్లతో ఇస్తున్న జిల్లా కరువునివేదికలు బుట్టదాఖలు - నేడు జిల్లాకు కేంద్ర విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్రసింగ్ బృందం అనంతపురం అగ్రికల్చర్: ‘అనంత’ కరువు కాటకాలను కళ్లారా చూసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కరువు బృందాలు ఏటా వచ్చివెళుతున్నా జిల్లా రైతుల తలరాతలు మారడం లేదు. వచ్చివెళుతున్న బృందాలు జిల్లాలో అనావృష్టి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని గుర్తిస్తున్నా... కరువు రక్కసి నుంచి ‘అనంత’ను శాశ్వతంగా విముక్తి చేసే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని రూ.వందల కోట్లతో జిల్లా అధికారులు సమర్పిస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులతో కూడిన రెండు బృందాలు సంవత్సరానికి రెండు దఫాలుగా వచ్చి జిల్లాలో నెలకొన్న దారుణమైన కరువు పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను పలకరిస్తూ, పంటల స్థితిగతులపై పరిశీలనాత్మక అధ్యయనం చేసి వెళుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నడుమ సాగు చేసిన 9 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రైతులు దక్కించుకోలేక పోతున్నారు. సంవత్సరానికి జిల్లా రైతులు రూ.4 నుంచి రూ.5 వేల కోట్లు పంట ఉత్పత్తులు నష్టపోతూ ఆర్థికంగా పీకల్లోతుకు కూరుకుపోతున్న విషయం తెలిసిందే. జిల్లాలో విస్తరించిన 1.10 లక్షల హెక్టార్ల పండ్లతోటల రైతులదీ అదే పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్లతోటలు నిలువునా ఎండుతున్నాయి. అకాల వర్షాలకు నేలవాలిపోతున్నాయి. లక్షలు వెచ్చించి కొత్తగా బోర్లు తవ్విస్తున్నా నూటికి ఒకట్రెండు బోర్లలో మాత్రమే నీళ్లు వస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం కంటితుడుపుగా ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద రైతుల చేతుల్లో చిల్లర పడేస్తున్నారు తప్పితే రైతు కుటుంబాలను గట్టెక్కించే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం మాత్రం ఏటా అనంతపురం జిల్లాలో ఉన్న 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నా ప్రయోజనం శూన్యం. ఈ ఏడాది వర్షం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంటలు సాగులోకి రాక, చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని రైతులు బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 85 మంది రైతులు అర్ధంతరంగా తనవు చాలించారు. ఈ క్రమంలో షరామూమూలు అన్నట్లుగా మరో కేంద్ర బృందం సోమవారం జిల్లా పర్యటనకు రానుంది. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డెరైక్టర్ అతుల్పాట్నే, రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఉషారాణితో పాటు మరికొందరు అధికారుల బృందం పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. కాలగర్భంలోకి కమిటీ సిఫారసులు భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలు జిల్లాలో విసృ్తతంగా పర్యటించింది. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్టు అనంత’ అనే కరువు నివారణ పథకాన్ని అనతికాలంలోనే కాలగర్భంలోకి కలిపేశారు. 2013 ఏప్రిల్ 18న ఎఫ్‌సీఐ రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణచక్రవరి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం చిలమత్తూరు, లేపాక్షి, గోరంట్ల, ఓడీసీ, కదిరి మండలాల్లో పర్యటించింది. తక్షణసాయం కోసం జిల్లా అధికారుల బృందం రూ.1,065 కోట్లు కావాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది. 2013 డిసెంబర్లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్‌గులాటే బృందం జిల్లాలో పర్యటించి పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల గురించి ఆరాతీసింది. 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లా పర్యటన చేసింది. కదిరి, ముదిగుబ్బ, అనంతపురం, ఆత్మకూరు, కళ్యాణదుర్గం మండలాల్లో పర్యటించి కరువు పరిస్థితులను కళ్లారా చూసి చలించిపోయారు. తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు. అనంతరం 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్‌అహ్మద్ నేతృత్వంలో మరో బృందం జిల్లాలో పర్యటించింది. వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయి హిందూపురం, ఓడీ చెరువు, అమడగూరు, పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కరువు పరిస్థితులను చూశారు. జిల్లా యంత్రాంగం తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని సమగ్ర నివేదిక అందజేశారు. ఇలా... ఏటా కేంద్ర బృందాలు రావడం, వచ్చిన అధికారులు కరువును తిలకించి చలించిపోవడం మినహా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతులు దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నారు. -
రైతులను విస్మరించిన ప్రభుత్వాలు
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వ్యవసాయ రంగాన్ని విస్మరించాయని కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను సైతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్‌గాంధీ నెల 24వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నందున.. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అత్యధికంగా అనంతపురం జిల్లాలో అన్నదాత బలవన్మరణాలకు పాల్పడడం విచారకరమన్నారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతోపాటు.. ఇతర రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించేందుకే రాహుల్ పర్యటిస్తున్నట్టు వివరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అడ్డగోలు హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు ఊసే లేదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి కూడా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు సెక్షన్-8 తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో 27 మంది చనిపోయారంటే అది చంద్రబాబు చేసిన హత్యలేనని విమర్శించారు. బాధ్యతగల వ్యక్తిగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, పుట్టా అంజనీకుమార్, ఎం.ఎ.బేగ్, గంజి ఎజ్రా, పైడి రవి, నంబాళ్ల రాజశేఖర్, ఈశ్వరి పాల్గొన్నారు. -
పారదర్శకతకు పాతర!
మమతా బెనర్జీ, జయలలిత, కేజ్రీవాల్, చంద్రశేఖరరావు- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. నిజానికి మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఏనాడూ లేదు. అనేక పరిమితుల మధ్యనే అది పని చేస్తున్నది. కొన్ని సందర్భాలలో మీడియా కూడా లక్ష్మణరేఖను దాటుతున్న మాట వాస్తవం. అయినా సహేతుక ఆంక్షలైనా, లక్ష్మణరేఖలైనా మీడియా స్వయం నియంత్రణ ద్వారానే జరగాలి. ఉద్యమకాలంలో మీడియా అంటే దేవుళ్లు. ఉద్యమం విజయవంతమై, అదే మీడియా సహకారంతో అధికారం కూడా చేపట్టాక మాత్రం అవి దెయ్యాలు. దేశ రాజకీయ వ్యవస్థలో ఇదొక కొత్త వింత ధోరణి. ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నాక మీడియాను అణచి పారేయాలని అనిపిస్తుంది. పాతర పెట్టాలనీ అనిపిస్తుంది. జైలుకు పంపాలని కూడా కోరిక పుడుతుంది. ఇలా ఆలోచించే శత్రువర్గం మీడియాకు తక్కువేమీ లేదు. ఆ వర్గంలో తాజాగా రాజకీయ పార్టీలు కూడా చేరిపోతున్నాయి. ఈ ధోరణి జాతీయ రాజకీయ పక్షాలలో కంటే, ప్రాంతీయ పార్టీలలో తరచుగా గమనిస్తున్నాం. ఎందుకీ అసహనం? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య బంగ్లాదేశ్‌లో పర్య టించారు. ఆమె వెంట వెళ్లిన బృందంలో వ్యాపారవేత్త, సినీ నిర్మాత శివాజీ పంజా ఒకరు. ఈయనను నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్న ఆర్థిక నేరం మీద ఢిల్లీ పోలీసులు కోల్‌కతాలో అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకొచ్చారు. ఇందులో నిజానిజాలను కోర్టులు నిగ్గుతేలుస్తాయి. కానీ అప్పటిదాకా ఆయన నిందితుడే. కాబట్టి నేర చరిత్ర కలిగి, అరెస్టయిన వ్యక్తి ముఖ్యమంత్రి బృందంలో విదేశీ పర్యటనకు ఎలా అనుమతి పొందాడని బెంగాల్ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తరువాత విలేక రులు, ‘మీ వెంట విదేశ పర్యటనకు వచ్చిన సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మీ స్పందనేమిటి?’ అని తమదైన శైలిలో అడిగారు. ఇదే ప్రశ్న వేసిన విపక్షాల మీద కాదు, ఆఖరికి ఆరోపణ ఉన్నప్పటికీ తన వెంట వచ్చిన శివాజీ మీద కాదు, మీడియా మీద మమతకు కోపం వచ్చింది. ‘ఎంత సాహసం, ఇలాంటి ప్రశ్న అడుగుతారా? ఇందుకు మిమ్మల్ని జైలుకే పంపొచ్చు. కానీ దయతలచి వదిలేస్తున్నా, వెళ్లండి!’ అని కసురుకున్నారు. మమత పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మీడియా మీద దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. కాబట్టి ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఒక కార్టూనిస్టును అరెస్టు చేసి, జైలు పాల్జేసిన ఘటన ఆమె హయాంలోనే జరిగింది. ఇంతకీ, కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్ (రాష్ట్ర సచివాలయం)లోకి మీడియా వారికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందిన నాయకురాలు మమతా బెనర్జీ. వామపక్షాల పట్ల సొంత పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బయ టకొచ్చి ‘తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో వేరే పార్టీని స్థాపించి ఏళ్ల తరబడి పోరాడారు. తరువాత అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో మీడియా ఆమెకు అందించిన సహకారం తక్కువేమీ కాదు. తృణమూల్ అంటే గ్రాస్ రూట్ (అట్టడుగు) అని అర్థం. కానీ చాలా నిరాడంబరంగా ప్రజలకు దగ్గరగా ఉండే పార్టీ అని అందరూ భావించే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పని - మీడియా మీద నియంత్రణ. పశ్చిమ బెంగాల్ సచివాలయం మొత్తం ఇప్పుడు రైటర్స్ బంగ్లాలో లేదు. అక్కడికి కొద్దిదూరం లోని నబన్న అనే (నూతన) భవన సముదాయంలోకి మారింది. ఇక్కడికి కూడా మీడియాకు అనుమతి లేదు. దక్షిణాదిన తమిళనాట కూడా ఇదే పరి స్థితి. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్నంతకాలం మీడి యా ముఖం చూడరు. అక్కడి సచివాలయంలోనూ షరా మామూలే- మీడి యాకు నో ఎంట్రీ. అదే బాటలో ‘ఆప్’ నిన్నగాక మొన్న రెండు జాతీయ రాజకీయ పక్షాలను మట్టి కరిపించి ఢిల్లీ కోటను స్వాధీనం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కూడా సచివా లయంలోకి మీడియాను అనుమతించేది లేదని తేల్చి చెప్పేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే సామాన్య ప్రజల పార్టీ. మరి, సమాచారాన్ని తెలుసుకునేం దుకు సామాన్యులకు ఉన్న హక్కును తమ బాధ్యతగా నిర్వర్తిస్తున్న మీడియా మీద ఆప్ సర్కారుకు ఎందుకు ఆగ్రహం కలిగినట్టు? ఢిల్లీ ఎన్నికలలో రెండో సారి అత్యద్భుతమైన విజయం సాధించడంలో ఆ పార్టీకి మీడియా అందిం చిన సహకారం ఎంతో ఉంది. ఆప్ ఒక నిరసన ఉద్యమం నుంచి, భ్రష్టు పట్టిపోతున్న సంప్రదాయ రాజకీయాల పట్ల ప్రజలలో తలెత్తిన ధిక్కార ధోరణి ఫలితంగా ఆవిర్భవించిన మాట నిజమే. ఆ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించినది మీడియా కాదా! అటువంటి ఆప్ కూడా ఢిల్లీ సచివాలయంలోకి మీడియాను ప్రవేశించనీయకుండా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘సహేతుక’ ఆంక్షలు ఉంటాయా? తెలంగాణ సచివాలయంలోకి మీడియా ప్రవేశాన్ని నిషేధించేందుకు సంబం ధించిన నిర్ణయం త్వరలోనే వెలువడనున్నదని పత్రికలూ, న్యూస్ చానళ్లూ రాశాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంటే, మనం చేస్తే తప్పేమిటి అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులతో అన్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ మీడియా నుంచీ, జర్నలిస్టుల సంఘాల నుంచీ వచ్చిన నిరసన వేడి వల్ల కాబోలు, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా ఆపినట్టుంది. ఆ వెంటనే ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు సంపాదకులను, జర్నలిస్టు సంఘాల నాయకులను సమావేశ పరచి పాత్రికేయుల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. వారం రోజులలో నివేదిక ఇచ్చేందుకు గాను ఒక కమిటీని కూడా నియమించారు. కానీ, సచివాలయంలో మీడియాను నియంత్రించవలసిన అవసరమైతే కచ్చితంగా ఉందని అదే సమయంలో ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, జర్నలిస్టులందరితోనూ చర్చించిన మీదటే ఒక నిర్ణయం తీసుకుం టామని భరోసా ఇచ్చారు. అది జరిగి 48 గంటలు గడవక ముందే సోమ వారం సమాచార శాఖ అధికారులు కొద్దిసేపు అత్యుత్సాహం ప్రదర్శిం చారు. సమత బ్లాక్ (ముఖ్యమంత్రి కార్యాలయ భవనం)లో పౌర సంబం ధాల అధికారి చాంబర్ నుంచి పోలీసుల సాయంతో మీడియాను గెంటేశారు. మళ్లీ, ‘అటువంటిదేమీ లేదు, రావొచ్చ’న్నారు. సచివాలయం నుంచి మీడి యాను పూర్తిగా నిషేధించరు గాని, సహేతుకమైన ఆంక్షలు (రీజనబుల్ రెస్ట్రిక్షన్స్) మాత్రం ఉంటాయనీ, వాటికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ ప్రెస్ అకాడమీ అధ్యక్షుని చేత చెప్పించారు. అంటే ఇంకా ప్రమాదం తొలగిపోలేదన్నమాట. మీడియా నెత్తి మీద సచివాలయంలో ప్రవేశానికి నిషేధం అనే కత్తి వేలాడుతూనే ఉన్నదన్నమాట. ఫోర్త్ ఎస్టేట్ తత్వాన్ని మరిచారు మీడియా అంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు తెలియనిది కాదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఆ సుదీర్ఘ పోరాటం మీడియా అండ లేకుండానే జరిగిందని టీఆర్ఎస్ చెప్పగలదా? చెప్పలేదు! ఉద్యమం సాగు తున్న కాలంలో అప్పటి ప్రభుత్వాలు మీడియా వైపు కన్నెత్తి చూసినా విరుచుకుపడిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉండి, ఆంక్షల గురించి మాట్లాడడం విడ్డూరం. ఇంతకూ ఈ ఆంక్షల విధింపు వెనుక కారణాలు ఏమిటి? పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు సచివాలయంలో తిరగాడుతుండడం వల్ల మంత్రులూ, అధికారులూ సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నా రని ప్రభుత్వం చెబుతోంది. మీడియా నిషేధం దీనికి పరిష్కారం ఎలా అవుతుంది? మీరెవరూ ప్రత్యక్షంగా చూడొద్దు, వినొద్దు, రాసుకోవద్దు. మేమే సమాచారం పంపుతాం! అదే ప్రచురించండి!’ అంటే ఇంక మీడియా దేనికి? దానికి ఫోర్త్ ఎస్టేట్ అని బిరుదు ఎందుకు? స్వయం నియంత్రణ కే ప్రాధాన్యం మమత, జయ, కేజ్రీవాల్, కేసీఆర్- ఈ నలుగురు ప్రాంతీయ పార్టీల అధి నేతలు మీడియా పట్ల ప్రదర్శిస్తున్న అసహనం ప్రజాస్వామ్యానికి చేటుచే స్తుంది. నిజానికి మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఏనాడూ లేదు. అనేక పరిమితుల మధ్యనే అది పనిచేస్తున్నది. కొన్ని సందర్భాలలో మీడియా కూడా లక్ష్మణరేఖను దాటుతున్న మాట వాస్తవం. అయినా సహేతుక ఆంక్షలైనా, లక్ష్మణరేఖలైనా మీడియా స్వయం నియంత్రణ ద్వారానే జరగాలి. ప్రజా సేవలో మీడియా ఎక్కడైనా అడ్డంకిగా తయారైందని ప్రభుత్వం భావిస్తే, ఆ వ్యవస్థ యజమానులను, సంపాదకులను, జర్నలిస్టు సంఘాల నేతలను కూర్చోబెట్టి చర్చించి ఆ అడ్డంకులను తొలగించుకోవాలి. అంతేతప్ప ఇలాంటి నిషేధాలు ప్రజాప్రయోజనానికి ఉపయోగపడవు. అంతిమ ఫలితం పారదర్శ కతను బలిచేయడమేనని పాలకులు గుర్తుంచుకోవాలి. (వ్యాసకర్త మొబైల్: 98480 48536) -
వందేమాత్రం!
వ్యవసాయ పనుల్లేని సమయంలో ప్రతి కుటుంబానికి 150 రోజుల పని కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోతోంది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు ఈ విషయంలో చేతులెత్తేస్తున్నాయి. వంద రోజులతోనే సరిపెట్టేస్తున్నాయి. ఫలితంగా వేతనదారులకు వెతలు తప్పడంలేదు. ఇప్పటికే వంద రోజుల పని పూర్తి చేసిన వారు కొత్త ఆర్థిక సంవత్సరం.. అంటే ఏప్రిల్ వరకు పని లేక దిక్కులు చూడాల్సిన దుస్థితిలో పడ్డారు. రాజాం: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పంటల సాగు లేని సమయంలో స్థానికంగానే సన్నకారు రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు గత కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు ఇచ్చి ఏడాదిలో కనీసం 150 రోజులు పని కల్పించేలా చర్యలు చేపట్టింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు దీన్ని వంద రోజులకు తగ్గించేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేసేస్తున్నారు. పథకం ప్రారంభమైన తొలినాళ్లలో పక్కాగా నిర్వహించడంతో కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే కాలక్రమంలో రకరకాల నిబంధనలు పెట్టడం, వేతనాలు సక్రమంగా అందించకపోవడం, తక్కువ వేతనాలు రావడం వంటి కారణాలు మళ్లీ వలసలు పుంజుకునేలా చేశాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 60 వేల జాబ్‌కార్డులు పంపిణీ చేశారు. వీటి ద్వారా సుమారు 1.50 లక్షల మంది ఉపాధి పొందాల్సి ఉండగా..పైన పేర్కొన్న లోపాల కారణంగా లక్ష మంది వరకే ఉపాధి పనులకు వెళ్తున్నారు. రాజాం మండలంలో 13వేల జాబ్‌కార్డులు పంపిణీ చేయగా.. వాటిలో 8464 జాబ్ కార్డులకు సంంబంధించిన సుమారు 6వేల మంది వేతనదారులే పనులుకు వెళ్తున్నారు. పనిదినాలూ కట్ నిర్వహణ, ఇతరత్రా లోపాలతో ఇప్పటికే పథకం పనితీరు తీసికట్టుగా తయారుకాగా.. ఇది చాలదన్నట్లు కొత్త ప్రభుత్వం పనిదినాలను కుదించేసింది. గతంలో ప్రతి కార్డుదారుకు 150 పనిదినాలు కల్పించగా.. ఇప్పుడు దాన్ని 100 రోజులకు కుదించేశాయి. దీంతో ఫిబ్రవరి మొదటి వారానికే రాజాం మండలంలో సుమారు 500 కుటుంబాలకు 100 పని దినాలు పూర్తి అయిపోయాయి. మళ్లీ వీరికి పని కావాలంటే ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఆగాల్సిందే. కుటుంబంలో ఇద్దరు కార్డుదారులు ఉంటే చెరో 50 రోజులు చొప్పున, నలుగురు ఉంటే 25 రోజులు చొప్పున పని కల్పిస్తుండటంతో మిగిలిన రోజుల్లో పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. వేసవిలో పనులకు వెళ్లి రోజంతా కష్టపడినా ఒక్కో వేతనదారుడికి రూ.50 రావడం కష్టంగా ఉందని వేతనదారులు వాపోతున్నారు. అయినా దిక్కులేని స్థితిలో పనికి వెళ్తున్నామని, ప్రస్తుతం 100 రోజులు పూర్తి అయ్యాయని చెప్పి పనికి రావద్దంటున్నారని పలువురు వేతనదారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తమకు వలసబాటే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లేక పస్తులుంటున్నాం ఉపాధి పనులకు అలవాటుపడిపోయాం. ప్రతి రోజూ పనికి వెళ్లి ఎంతోకొంత వేతనం తెచ్చుకొని కుటుంబ పోషణ చేసుకునేవారం. ఇప్పుడు వంద రోజులు పూర్తి అయ్యాయని చెప్పి రావద్దంటున్నారు. దీంతో పనుల్లేక పస్తులుండాల్సి వస్తోంది. -కుప్పిలి కన్నారావు, పెనుబాక భార్యాభర్తలకు చెరో 50 రోజులు భార్యాభర్తలిద్దరం పనికి వెళ్లేవాళ్లం. గతంలో 150 రోజులు పని కల్పించేవారు. ప్రస్తుతం 100 రోజులే అనడంతో ఇద్దరికీ 50 రోజులే పని దొరికింది. ఇద్దరు ఆడపిల్లలతో పనిలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వమే స్పందించాలి. -చింత అప్పారావు, బీఎన్ వలస ప్రభుత్వ ఆదేశాల మేరకే.. గతంలో ఏడాదికి 150 రోజులు పని కల్పించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం కుటుంబానికి 100 రోజులు మాత్రమే పని కల్పించమని ఆదేశాలు జారీ చేసింది. తాము చే యగలిగిందేమీ లేదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయక తప్పటం లేదు. -జి.అరుణకుమారి, ఏపీవో -
కలిసి నడవాలి
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం ప్రగతి పథంలో పయనించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ రంగ యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను శుక్రవారం చెన్నై ట్రేడ్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆలోచనా ధోరణే చాలా భిన్నమైనదని, ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు. వ్యవసాయం, రహదారు లు, భవన నిర్మాణ రంగం ఇలా అన్నింటిపైనా ఆయన ఆలోచన ధోరణిని అందుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వనరుల్లో 43 శాతం వడ్డీల చెల్లింపునకే సరిపోతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమిం చాలంటే మరింత ఆర్థిక పురోగతి అవసరమని అభిప్రాయ పడ్డారు. అందుకే ప్రధాని మోదీ తాను నిద్రపోకుండా, ఎవ్వరినీ నిద్రపోనీకుండా పని చేస్తున్నామన్నారు. ప్రశంసా త్మకమైన మోదీ పనితీరును విపక్షాలు మెచ్చుకోవడం మాని మోకాలొడ్డడమే పనిగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని ఒక్కరోజులో తేలేమన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన సావనీర్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సభానంతరం ప్రదర్శన కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. సి మెంటు కంపెనీల యజమానులు ఇష్టారాజ్యం గా ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు కేంద్ర స్థాయిలో సిమెంటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా శ్రమిస్తే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడం ఖాయమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బంగారు తెలంగాణ.., విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఆదివారం సమావేశమై కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రులతో శనివారం సాయంత్రం దిల్‌కుశ అతిథి గృహంలో సమావేశమైన దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులతో కలసి దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిత్వశాఖలన్నింటి నుంచి రాష్ట్రానికి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, హైదరాబాద్ నగరాభివృద్ధికి దత్తాత్రేయ సేవలు అవసరమన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఈ సమావేశంలో దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. -
తుపాను విరాళంగా పింఛన్ల సొమ్మా!
ఉదయగిరి : మండలంలోని టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హుదూ ద్ తుపాను బాధితులకు తమ వంతు విరాళాలు అందించి సీఎం వద్ద ప్రశంసలు పొందాలని భావించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు విరాళంగా సొం త డబ్బు కాకుండా సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఒక నెల పింఛన్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. చివరకు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర రూ.100 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. హుదూద్ తుపాన్ విశాఖపట్టణం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత భాగాన్ని అతలాకుతం చేసింది. బాధితుల్ని ఆదుకునే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ వర్గాల ప్రజలు వారికి బాసటగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం తప్పులేదు. అది కనీస ధర్మం కూడా. కానీ కొంత మంది టీడీపీ నాయకులు తమ మెహర్బానీని చాటుకునేందుకు ఐకేపీ, పొదుపు గ్రూపులు, ప్రభుత్వ కార్యాలయాలకు టార్గెట్ నిర్దేశించి చందాలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఉదయగిరిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేసే సామాజిక పింఛన్లలో కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. మండలంలో 3,884 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ఈ నెలకు సంబంధించి రూ.43.29 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఈ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల మొత్తాన్ని హుదూద్ బాధితులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ దీన్ని కొంతమంది అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి నేతలు వ్యతిరేకించడంతో ప్రతి పింఛన్‌దారు నుంచి రూ.100 తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో గురువారం పంపిణీ జరిగిన బిజ్జంపల్లి, అయ్యవారిపల్లిల్లో ఈ మేరకు మినహాయించినట్లు సమాచారం. మండలంలోని మిగతా పంచాయతీల్లో విరాళాల పంచాయితీ వ్యవహారం సాయంత్రం వరకు సాగడంతో గురువారం పంపిణీ కాలేదు. శుక్రవారం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా రూ.100 నుంచి రూ.500 వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పింఛన్‌దారుల పరిస్థితులు, గ్రామ పరిస్థితులను అంచనా వేసుకుని అక్కడ చోటు చేసుకునే పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వసూళ్ల మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా మండల స్థాయి టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శులకు, గ్రామస్థాయి నేతలకు సూచించినట్లు సమాచారం. దీనికి స్థానిక నేతలు రూ.200 నుంచి రూ.1000కు పింఛను పెంచింది తమ ప్రభుత్వమేనని, మీరు కాదంటే వచ్చే నెల నుంచి మీకు పింఛను ఉండదని బెదిరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మండలంలో రూ.5 లక్షలకు పైగా ఒక్క పింఛన్‌దారుల నుంచే వసూలు చేయాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపాధి హామీ, ఐకేపీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టార్గెట్లు నిర్దేశించారు.ఈ విషయమై ఎంపీడీఓ ఫణి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా విరాళాల వసూలు తనకు తెలియదని, ఎక్కడైనా జరిగి ఉంటే విచారించి సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
వెబ్ ఆధారిత ట్యాక్సీ సేవలొద్దు!
రాష్ట్రాలను ఆదేశించామన్న హోంమంత్రి రాజ్‌నాథ్ అత్యాచారం ఘటనపై రాజ్యసభలో సభ్యుల ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ట్యాక్సీ ప్రయాణికురాలిపై అత్యాచారం జరిగిన ఘటన మంగళవారం రాజ్యసభను కుదిపేసింది. మహిళల భద్రతపై మోదీ సర్కారు చిత్తశుద్ధిని రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు ప్రశ్నించారు. నిర్భయ చట్టం అమలుపై సందేహాలను లేవనెత్తారు. విపక్ష మహిళా సభ్యులు ఈ అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనకు సంబంధించి ప్రకటన చేశారు. ఉబర్ సహా అన్ని సంస్థల వెబ్ ఆధారిత ట్యాక్సీ సేవల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు తెలిపారు. ట్యాక్సీ సేవలందిస్తున్న లెసైన్సులు లేని సంస్థలను నిషేధించాలని సూచించామన్నారు. అయితే, ట్యాక్సీల కార్యకలాపాలను నియంత్రించాలనే ఆలోచనే తప్పితే.. ట్యాక్సీ సేవలను నిషేధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ‘ఈ దారుణ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది దేశం యావత్తూ సిగ్గు పడాల్సిన ఘటన’ అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ఢిల్లీలో పీసీఆర్ వ్యాన్ల సంఖ్యను 370 నుంచి 1,000కి పెంచామని, 200 బస్సుల్లో, 3,707 బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నిందితుడిపై గతంలోనూ అత్యాచార ఆరోపణలున్నాయన్నారు. ఉబర్‌కు వినియోగదారులు చెల్లింపు జరిపే విధానం కూడా అక్రమమని తేలిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో వెల్లడించారు. కాగా, నిందితుడైన ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేప్ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళాకమిషన్ ఆదేశించింది. కాగా, ట్యాక్సీలను నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీవ్యాఖ్యానించారు. ఉబర్‌పై విమర్శలు: ఢిల్లీ అత్యాచార ఘటన నేపథ్యంలో ట్యాక్సీ బుకింగ్ సేవలందిస్తున్న ఉబర్ సంస్థపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. నేర నేపథ్యం ఉన్న డ్రైవర్లను తమ సంస్థలో నిషేధించామని అవాస్తవాలతో వినియోగదారులను ఉబర్ మోసం చేసిందని లాస్ ఏంజలీస్, సాన్ఫ్రాన్సిస్కోల్లో ఆరోపణలు వచ్చాయి. ‘ఉబర్ డ్రైవర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు సాధారణమే’ అని టైమ్ పత్రిక వ్యాఖ్యానించింది. అక్రమంగా ట్యాక్సీ బుకింగ్ సేవలందిస్తున్న ఉబర్ సంస్థపై అమెరికాలోని పోర్ట్లాండ్ సిటీ స్థానిక కోర్టులో కేసు వేసింది. -
చిరువ్యాపారులకో.. చిరునామా!
వీధి విక్రేతలకు గ్రీన్ వెండింగ్ జోన్ హక్కులతో పాటు ఆర్థిక, సామాజిక భద్రత జిల్లాలో 2వేల మంది వ్యాపారుల గుర్తింపు యలమంచిలి : పట్టణాల్లోని వీథి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అసంఘటిత రంగంలో వివిధ వర్గాల్లోని వీథి వ్యాపారులను గుర్తించడం.. వారితో సంఘాలు ఏర్పాటు..వాటి సంఘటితంతో సమాఖ్యగా రూపొందించడం... తద్వారా వారికి హక్కులతో పాటు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడం... ఇలా దశల వారీగా పట్టణ వీథి వ్యాపారులు సంక్షేమ పథకాన్ని వర్తింపజేయనున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని వీథి వ్యాపారులను ఆయా పురపాలక సంస్థ పరిధిలోని పేదరిక నిర్మూలన విభాగాలు (మెప్మా) గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2వేల మందిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటుచేశారు. యలమంచిలి 230 మంది వీథి వ్యాపారులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీధి విక్రేత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. మిగిలిన వ్యాపారులను గుర్తించి సంఘాలు, సమాఖ్యలుగా ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా అధికారులు వెల్లడించారు. వారికి ఇవీప్రయోజనాలు ఒకే రంగంలో ఉన్న పది మంది వీధి వ్యాపారులను గుర్తించి సంఘంగా ఏర్పాటు చేస్తారు. పట్టణ పరిధిలో అన్ని సంఘాలను కలిపి సమాఖ్యగా రూపొందిస్తారు. ఆ సమాఖ్య మున్సిపల్ కమిషనర్ పట్టణ విక్రేతల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తుంది. సమాఖ్యలోని వ్యాపారులందరికీ కమిషనర్ గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. వ్యాపారాలు నిర్వహిచేందుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని (హాకర్స్ జోన్) కేటాయిస్తారు. వీరికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా టౌన్ వెండింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. సంఘాల్లోని సభ్యులందరినీ బీమా పరిధిలోకి తీసుకువస్తారు. జనశ్రీ బీమా, స్వావలంబన, జనతా ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తారు. ఏ వ్యాపారికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి నష్టపరిహారం లభిస్తుంది. విక్రేతకు చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఆయా బీమా పథకాల ద్వారా ఉపకార వేతనాలు లభిస్తాయి. సంఘాలుగా ఏర్పడిన సభ్యులు వారు పొదుపుచేసే మొత్తాలను అంతర్గతంగా అప్పు ఇచ్చుకోవచ్చు. ఒక సంఘంలోని పొదుపు మొత్తాన్ని సభ్యుడికి రుణం ఇవ్వొచ్చు. ఆ అప్పును వడ్డీతో సహా నిర్ణీత గడువులోగా చెల్లించేలా సంఘాలు, కమిటీలు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు తీసుకుని వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. దీనికి మున్సిపల్ కమిషనర్లు, టౌన్ వెండింగ్ కమిటీలు తోడ్పాటునందిస్తాయి. వీధి విక్రేతలు ప్రైవేట్, వడ్డీ వ్యాపారుల గుప్పెట్లో చిక్కి ఉంటే టౌన్ వెండింగ్ కమిటీ వారికి రక్షణగా నిలుస్తుంది. వారికి బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు ఇప్పించి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తారు. వ్యాపారం నిర్వహించుకునేందుకు వీలుగా గ్రీన్ వెండింగ్ జోన్లో చోటు కల్పించి ఆశీలు వసూలుకు సంబంధించి గుత్తేదారు వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటారు. వ్యాపారాలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసి ఆ మేరకు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. త్వరలో గుర్తింపు కార్డులు త్వరలో జిల్లాలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ చేస్తాం. ఇప్పటికే వీరి వివరాలు సేకరించాం. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ప్రకారం ఒక్కో వీధి వ్యాపారి రూ.200 చెల్లిస్తే వారి ఫొటోలు, ఇతర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తికాగానే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు వీరికి ఫొటోతో కూడిన కార్డులు జారీ చేస్తారు. మూడేళ్ల వరకు ఈ కార్డు పని చేస్తుంది. హాకర్స్జోన్లో వీరు నిర్భయంగా వ్యాపారాలు చేసుకునే వెసులబాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. వారికి పోలీసులు, ఇతర అధికారుల నుంచి ఎటువంటి వేధింపులు ఉండవు. - పాండురంగారావు, పీడీ, మెప్మా -
ప్రభుత్వాల ఐక్యతతోనే దేశాభివృద్ధి
ప్రధాని మోడీ వెల్లడి.. యూపీఏ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు అందువల్లే నీరుగారిన కేంద్ర పథకాలు రైతు జేబు నిండితేనే దేశ ఖజానా భర్తీ వారికి అనుకూలమైన పథకాలు రూపొందించాలి తుమకూరు : దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిపి ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధించారు. ఇక్కడికి సమీపంలోని వసంత నరసాపురంలో బుధవారం ఆయన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, అంతకు ముందు సాగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగంపై స్పందించారు. తనకు కన్నడం తెలియకపోయినా భావాన్ని అర్థం చేసుకోగలనని అన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలుండేవని చెప్పారు. దీని వల్ల కేంద్ర పథకాలు సద్వినియోగం కాకుండా అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. కేంద్రంలో తాము అధికారం చేపట్టాక అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాగా రైతు దేశానికి అంతా ఇస్తున్నా, అతని జేబు మాత్రం ఖాళీగానే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల జేబులు నిండితే ఖజానా భర్తీ అవుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ భారత్‌కు కొత్తేమీ కాదని, ప్రాచీన కాలం నుంచే దీనికి ప్రాధాన్యత ఉందని అన్నారు. పాలు చెడిపోకుండా చూడడానికి మహిళలు దాని నుంచి నెయ్యి తీసేవారని గుర్తు చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ భాగస్వామ్యంలో నెలకొల్పామని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తుందని వెల్లడించారు. ఆదివాసీలు... లేజర్ టెక్నాలజీ తాను గతంలో ఓ సారి ఆదివాసీలు ఉండే చోటికి వెళ్లానని ప్రధాని తెలిపారు. అక్కడ ప్రతి పుష్పగుచ్ఛంలోనూ తన చిత్రం ఉండడాన్ని చూసి, ఇదెలా సాధ్యమైందని వారిని అడిగానని చెప్పారు. లేజర్ టెక్నాలజీ ద్వారా ఫొటోలను అందులో ఇమిడ్చామని చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా గతంలో రూ.2కు కూడా వీటిని అడిగే వారు లేరని, ఫొటోను అమర్చాక రూ.200కు అమ్ముతున్నామని వారు చెప్పారని వివరించారు. కనుక రైతులకు అనుకూలమైన టెక్నాలజీని, పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం నినాదాలతో దేశాన్ని అభివృద్ధి పరచలేమని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 30 శాతం ఉత్పత్తుల నష్టం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు సరైన సదుపాయాలు లేని కారణంగా సుమారు 30 శాతం నాశనమవుతున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఫుడ్ పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో వైవిధ్యమైన వాతావరణం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తులూ అలాగే ఉంటాయని తెలిపారు. రాష్ట్ర రైతులకు న్యాయమైన ధరలు లభించడం లేదని, కనుక ఇలాంటి అనేక ఫుడ్ పార్కులను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రైతులకు న్యాయమైన ధర లభించాలంటే, ముందుగా వ్యవసాయ ఉత్పత్తుల విలువను లెక్క కట్టాల్సి ఉందని తెలిపారు. ఈ పార్కు వల్ల అనేక జిల్లాలకు చెందిన రైతులకు మేలు చేకూరుతుందన్నారు. తాము కొత్తగా తీసుకు రాబోయే పారిశ్రామిక విధానంలో పరిశ్రమల ఏర్పాటు ఏ కారణంతో కూడా ఆలస్యం కారాదని పేర్కొంటున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీని కర్ణాటకకు కూడా విస్తరించాలని కోరారు. లేనట్లయితే ఆంధ్రప్రదేశ్‌తో అనారోగ్యకరమైన పోటీ ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వజూభాయ్ వాలా, కేంద్ర మంత్రులు డీవీ సదానంద గౌడ, అనంత కుమార్, హర్షిత్ కౌర్ బాదల్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీబీ జయచంద్ర, స్థానిక ఎంపీ ముద్ద హనుమేగౌడ ప్రభృతులు పాల్గొన్నారు. -
అడుగంటిన జలం
194 గ్రామాల్లో పరిస్థితి దారుణం 30 మీటర్ల లోతులోనూ కానరాని తడి భూగర్భ జలశాఖ సర్వేలో వెల్లడి జిల్లాలో బోర్లు, బావుల తవ్వకాలకు బ్రేక్ మండల అధికారులకు ఆదేశాలు జారీ హన్మకొండ : ప్రస్తుత వానాకాలంలో సగటు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాలు పడకపోవడంతోపాటు నీటి వినియోగం పెరిగిపోవడంతో నీటిమట్టం పడిపోయింది. వ్యవసాయం, పారిశ్రామికావసరాలే కాకుండా వివిధ రూపాల్లో బోర్లు, బావుల తవ్వకం 73 శాతం పెరగడంతో భూగర్భ జల మట్టం అట్టడుగు స్థాయికి చేరినట్లు భూగర్భజల శాఖ గుర్తించింది. 34 మండలాల పరిధిలోని 194 గ్రామాలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని తేల్చింది. మిగిలిన ప్రాంతాల్లో కొంత మేర నీటి లభ్యత ఉన్నప్పటికీ.... రానున్న రోజుల్లో కష్టాలు తప్పేలా లేవని హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భూగర్భ జల శాఖ ఇటీవల నివేదిక అందజేసింది. అంతేకాదు... నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో జిల్లాలో ఆంక్షలు విధించింది. అత్యంత దారుణ పరిస్థితులు ఉన్న 34 మండలాల్లో బోర్లు వేయడం, బావుల తవ్వకం, ఇసుక తీయడం నిషేధించింది. మిగిలిన గ్రామాలు, మండలాల్లో సైతం బోర్లు వేసేందుకు, బావులు తవ్వేందుకు, ఇసుక తీయడం వంటి పనులకు భూగర్భ జలశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచిస్తూ మండలాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఎక్కడైనా అనుమతి లేకుండా ఈ పనులు చేస్తే... వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. 34 మండలాల్లో అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తాగునీటి సరఫరా కోసం కొత్త బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని... ఇందుకు దారుణ పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు 2010-11 నుంచి గణనీయంగా పడిపోతున్నట్లు సర్వేలో గుర్తించాం. ప్రస్తుతం జిల్లాలో 34 మండలాల పరిధిలోని 194 గ్రామాల్లో నీటిమట్టం గరిష్ట లోతుల్లోకి పడిపోయింది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. మరికొన్ని రోజులైతే తాగునీరు కూడా దొరకదు. ఈ నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాం. కరువు నివారణ చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో పనులు చేయాల్సి ఉంది. అతి దారుణంగా ఉన్న ఈ ప్రాంతాల్లో బోర్లు, బావుల తవ్వకం, ఇసుక తీయడం నిషేధించాం. మిగిలిన ప్రాంతాల్లో కూడా నిషేధం వర్తిస్తోంది. - ఆనంద్‌కుమార్, భూగర్భ జల శాఖ డీడీ -
‘బాక్సైట్’ను కాపాడుకుంటాం
అవసరమైతే ఢిల్లీలో ఉద్యమం ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పాడేరు : ప్రాణాలు పణంగా పెట్టయినా విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను కాపాడుకుంటామని వైఎస్సార్ సీపీ పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావు స్పష్టం చేశారు. పర్యావరణ విఘాతంతోపాటు గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేసే బాక్సైట్ తవ్వకాల జోలికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే సహించమన్నారు. బాక్సైట్ తవ్వకాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, దీన్ని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం పాడేరులో వీరు విలేకరులతో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తే ఢిల్లీలోనే పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఏజెన్సీలో గిరిజనులకు మౌలిక సదుపాయాలు సమకూరలేదన్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేదని చెప్పారు. 244 పంచాయతీల్లో 200 పంచాయతీలకు రవాణా సౌకర్యం లేదన్నారు. ఏటా రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా గిరిజనులకు నడకే శరణ్యమవుతోందని చెప్పారు. మాచ్‌ఖండ్, సీలేరు కేంద్రాల ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అనేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పాలకవర్గాన్ని సమావేశపర్చాలి ఐటీడీఏకు వస్తున్న నిధులు, ఏజెన్సీలో చేపడుతున్న గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై జవాబుదారీతనం లోపించిందని ఎమ్మెల్యేలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం మూడుసార్లే పాలకవర్గ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సిన సమావేశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజనాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని చెప్పారు. ‘అల్లూరి’ జిల్లా ఏర్పాటుచేయాలి అరకు నియోజకవర్గం పరిధిలోని ఏడు గిరిజన నియోజకవర్గాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ‘అల్లూరి’ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అప్పుడే ఏజెన్సీ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీ తరపున ఎన్నికైన ఒకే ఒక్క గిరిజన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వక పోవడంలోనే గిరిజనులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఆరుగురు ఎస్టీ ఎమ్మెల్యేలం సమగ్ర గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. -
కమ్మని కాఫీ
కాఫీ పంటతో గిరిజనులకు ఆర్థిక ఆసరా మన్యంలో ఏటా విస్తరిస్తున్న సాగు పంటకు మేలు చేసిన ముందస్తు వర్షాలు గింజ దశకు చేరుకున్న కాపు ఏటా రూ.60 కోట్ల లావాదేవీలు ఏజెన్సీలో కాఫీ పంట సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల నుంచి కాపు ఆశాజనకంగా ఉంది. ఏటా ఆరు ఏడు వేల టన్నులు దిగుబడి వస్తోంది. గతేడాది కాఫీ గింజలకు మద్దతు ధర లభించింది. సుమారు రూ.60 కోట్ల లావాదేవీలు సాగాయి. రైతులు మంచి లాభాలు గడించారు. ఈ క్రమంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది కూడా వాతావరణం అనుకూలించింది. అప్పుడే పంట గింజదశకు చేరుకుంది. నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని గిరిజనులు ఆశిస్తున్నారు. పాడేరు: ఏజెన్సీలో కాఫీ పంట సాగు బాగుంది. కొయ్యూరు మండలంలో 3 పంచాయతీలతోపాటు మిగతా పది మండలాల్లో మొత్తం 1,42,993 ఎకరాల్లో 1,39,017 మంది రైతులు ఈ పంటను చేపట్టారు. ఇందులో లక్షా 19 వేల ఎకరాల్లో తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలు కాఫీతోటలకు ఎంతో మేలు చేశాయి. ఎన్నడూ లేని విధంగా తోటల్లో కాపు గింజ దశకు చేరుకుంది. కేంద్ర కాఫీబోర్డు సహకారంతో ఐటీడీఏ ఏజెన్సీలో ఈ పంటను విస్తరిస్తోంది. 1975లో కేవలం ఎకరా ప్రాంతంలో ప్రారంభమైన కాఫీ పంట ప్రస్తుతం 1,42,993 ఎకరాలకు విస్తరించింది. 2001వ సంవత్సరం నుంచి ఈ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సహిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనుల ఆర్థిక ఆసరా కోసం కాఫీ ప్రాజెక్టు అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈమేరకు 2001 నుంచి 2009 వరకు 93,521 ఎకరాలకు కాఫీసాగు పెరిగింది. కేంద్ర కాఫీబోర్డు, జాతీయ ఉపాధి హామీ పథకంలో 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 వరకు మరో లక్ష ఎకరాల్లో దీని సాగుకు రూ.319 కోట్ల అంచనాతో ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ, కాఫీ విభాగం, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులంతా కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నారు. లాభాలు వచ్చే పంట కావడంతో గిరిజన రైతులు కూడా తమ పోడు, మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా చేపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 9 వేల ఎకరాల్లో ఈ పంటను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు కొందరు రైతులను ఎంపిక చేసి 50 చోట్ల నర్సరీలను పెంచుతున్నారు. వర్షాలు అనుకూలించడంతో నర్సరీల నుంచి సేకరించిన మొక్కలను నాటేందుకు గిరిజన రైతులు సిద్ధమవుతున్నారు. -
శిశువుల పాలిట యమపురి!
రిమ్స్ క్యాంపస్, సంతకవిటి: కారణాలు ఏవైనా కావచ్చు.. ఎన్నయినా ఉండొచ్చు. కానీ ఏడాదిలో ఒక ఆస్పత్రిలో 262 మంది శిశువులు మరణించడం చిన్న విషయం కాదు. శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అందుకు తగినట్లే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చిన్నపిల్లల అత్యవసర వార్డు(ఎస్ఎన్సీయూ లేదా ఎన్ఐసీయూ)లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులను నియమించినా ఇంత పెద్ద సంఖ్యలో శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?.. దీనికి ప్రధాన కారణం వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవడమే. ఇక్కడికి వచ్చేవన్నీ అత్యవసర కేసులే. తక్షణం స్పందిస్తేనే ఆ చిన్ని ప్రాణాలు నిలుస్తాయి.. కానీ దురదృష్టవశాత్తు రిమ్స్‌లో ఆ స్పందనే కరువవుతోంది. చిన్నారుల ఉసురు తీస్తోంది. మా తప్పేం లేదు రిమ్స్‌లో చిన్నారులకు వైద్య సేవలందిచేందుకు ఎన్.ఆర్.సి,, ఎస్.ఎన్.సి.యు విభాగాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు చిన్న పిల్లల వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. అన్నీ ఉన్నా.. కీలకమైన వైద్యసేవలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఫలితంగా ఎప్పటికప్పుడు చిన్నారులు మృత్యువాత పడుతునే ఉన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తమ చేతుల్లో ఏమీ లేదని, చివరి క్షణంలో ఆస్పత్రికి తీసుకువస్తున్నారని వైద్యాధికారులు తేల్చేస్తున్నారు. శిశువు మరణిస్తే దాన్ని తమ తప్పుగా భావించటం సరికాదంటున్నారు. గ్రీవెన్సుసెల్‌లో ఫిర్యాదు వైద్యం అందించినా ప్రాణాలు దక్కకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. రిమ్స్‌లో సరైన వైద్య సేవలు అందించకపోవటం వల్లే తమ చిన్నారి మృతి చెందిం దంటూ కొద్ది నెలల కిందట ఆమె తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఒక జిల్లా స్థాయి అధికారితో విచారణ జరిపించారు. అయితే విచారణ జరిపిన సదరు అధికారి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని భావించి రిమ్స్ అధికారుల నిర్లక్ష్యాన్ని, పలు సమస్యలను గుర్తించినా వాటిని బయట పెట్టలేదు. మరోవైపు ఆస్పత్రిలో తమ పిల్లలు చనిపోయినా బయటకు చెప్పేవారు చాలా తక్కువమందే. అందువల్లే రిమ్స్‌లో నిర్లక్ష్యపు జబ్బు రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం ఆటవిడుపే ఆదివారం ఆటవిడుపు అన్న పదం రిమ్స్ వైద్యాధికారులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఇక్కడ పలువురు వైద్యులు సాధారణ రోజుల్లోనే అందుబాటులో ఉండరు. ఇక ఆదివారం అయితే అసలు కనిపించరు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో సగానికిపైగా విశాఖపట్నం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తుం టారు. ఇక మధాహ్నం ఒంటి గంట దాటిన తరువాత ఈ విభాగంలో వైద్యులు కనిపించడం గగనమే. దాంతో మధ్యాహ్నం తర్వాత వచ్చే అత్యవసర కేసులన్నింటికీ దిగువస్థాయి సిబ్బందే తమకు తోచిన వైద్యం అందిస్తున్నారు. వారికి అర్థం కానప్పుడు సంబంధిత వైద్యులను ఫోన్లో సంప్రదించి వారి సూచనల ప్రకారం మందులు ఇస్తున్నారు. ఈ క్రమంలో పలు కేసులను వైజాగ్ కేజీహెచ్‌కు రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు వైద్యులు ప్రత్యేకంగా ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. మురికికూపంలా వార్డు పరిసరాలు ఎస్ఎన్సీయూ విభాగాన్ని అపారిశుద్ధ్యం కూడా పీడిస్తోంది. ఈ విభాగంలోని చెత్తాచెదారాన్ని కిటికీల్లోంచి పక్కనే పారబోస్తుండటంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. అపారిశుద్ధ్యం కారణంగా చిన్నారులు మరింత అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎన్.ఆర్.సి పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ విభాగంలో మూడు ఏసీలు ఉండగా ఒకటి మాత్రమే పనిచేస్తోంది. వీరికందే పౌష్టికాహారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. చిన్నారులకు సరైన వైద్య సేవలు అందని కారణంగా చాలామంది రిమ్స్‌కు రావటానికి భయపడుతున్నారు. బాలల హక్కుల క మిషన్‌కు ఫిర్యాదు చేస్తా : చిన్నికృష్ణ సమాచార హక్కు చట్టం ద్వారా తనకు అందిన సమాచారం ఆధారంగా బాల ల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చిన్నికృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. తన కుమారుని విషయంలో చోటు చేసుకున్న వైద్య సేవల లోపంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానన్నారు. రిమ్స్ ఎన్ఐసీయూలో వైద్యసేవలు సక్రమంగా అందడంలేదని ఆరోపించారు. -
కొత్త పరిశ్రమల స్థాపనపై కసరత్తు
సాక్షి, గుంటూరు: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది. ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ విధానంతో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకునేలా చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా కొత్త పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వనున్నాయి. ఈ విషయమై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు గుంటూరులోని లక్ష్మీపురం ఆహ్వానం ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు జిల్లాకు చెందిన మంత్రులు, నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్పర్సన్, జిల్లా కలెక్టర్‌తోపాటు ముఖ్య అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 రకాల పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులను ఆహ్వానించేందుకు పరిశ్రమల శాఖ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా స్పిన్నింగ్, జిన్నింగ్, టుబాకో, సిమెంట్, మిరప, ఫార్మాస్యూటికల్స్, బియ్యం, దాల్, ప్లాస్టిక్, బంగారం వ్యాపారులను ఆహ్వానించనుంది. దీంతోపాటు అన్ని రెవెన్యూ డివిజన్లలో సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కోస్తా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకానున్న నేపథ్యంలో జిల్లాకు ప్రాధాన్యం లభించనుంది. భూసేకరణే ప్రధాన సమస్య... జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారనుంది. భూముల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. దీంతో వీలైనంతవరకు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరోవైపు.. పల్నాడు ప్రాంతంలో పెద్ద పరిశ్రమలను స్థాపించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 7500 చిన్న పరిశ్రమలు ఉండగా వీటి ద్వారా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పెద్ద పరిశ్రమలు 85 ఉండగా 25 వేల మందికి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో వీలైనన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వినుకొండ సమీపంలోని వెంకుపాళెంలో 83 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ పారిశ్రామికవాడలో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. వినుకొండ ప్రాంతంలో ఇప్పటికే రూ.150 కోట్ల వ్యయంతో రేడియం డె న్సిటీ ఫైబర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భూములు కేటాయించినా ఏర్పాటు కాని పరిశ్రమలు.. జిల్లాలో భూములు కేటారుుంచి ఏళ్లు గడిచినా కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. వీటిలో గుజరాత్ అంబుజా సిమెంట్, చెట్టినాటి సిమెంట్, మైహోమ్స్, విఘ్ణేశ్ సిమెంట్స్ తదితర పరిశ్రమలు ఉన్నారుు. నూతన పారిశ్రామిక విధానం అమలుతోనైనా ఈ పరిశ్రమల స్థాపనకు యాజమాన్యాలు చొరవ చూపుతాయో లేదో వేచి చూడాల్సిందే. కొత్త పాలసీ ప్రకటించాక ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు పలువురు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం.. కొత్త పారిశ్రామిక పాలసీ నేపథ్యంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ నెల 16న సెమినార్ ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై.నాగసుందర్ చెప్పారు. ఈ సదస్సుకు పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులను, ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. -
‘ఏకగ్రీవాని’కి నిధులేవి?
ఏడాదైనా విడుదల కాని ప్రోత్సాహకం నిండుకున్న పంచాయతీల ఖజానా సక్రమంగా వసూలు కాని పన్నులు అభివృద్ధి పనులకు ఆటంకం గ్రామాలో పరిస్థితులు అధ్వానం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పంచాయతీల ఖజానాలు నిండుకున్నాయి. పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు మంజూరు కావడం లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు విడుదల చేయాల్సిన ప్రోత్సాహక ప్రత్యేక నిధులు ఏడాదైనా విదల్చలేదు. అభివృద్ధి ఊసే లేదు. దీంతో సర్పంచ్‌లు దిష్టిబొమ్మలుగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. గతేడాది జూలైలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటికి రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలు ముగిశాక గ్రామాలకు నిధులొస్తాయని సర్పంచ్‌లు భావించారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిధులు రాక.. సక్రమంగా పన్నులు వసూలు కాక పంచాయతీలు కునారిల్లుతున్నాయి. ప్రత్యేక నిధులెక్కడ? ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులిస్తుంది. అవి గ్రామాభివృద్ధికి దోహదపడతాయన్న ఆశతోనే జిల్లాలో 70 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వీటికి ప్రత్యేక ప్రోత్సాహక నిధులివ్వాలి. ఏకగ్రీవమైన వాటిలో నోటిఫైడ్ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఈ దఫాలో కూడా ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు ఇలాగే నిధులొస్తాయని ఆశించినప్పటికీ ఆ ఊసే లేదు. కొత్త ప్రభుత్వం ఇప్పట్లో మంజూరు చేసే అవకాశం కనిపించడం లేదు. ఆదాయం నామమాత్రం : ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు లేవు. కొత్త సర్పంచ్‌లు కొలువుతీరాక కొద్ది రోజుల క్రితం 13వ ఆర్థిక సంఘం నిధులు 15.78 కోట్లు, ఎస్ఎఫ్సీ రూ.1.3 కోట్లు, ఏజెన్సీకి రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి. ఇవి అభివృద్ధి పనులకు ఏమూలకూ సరిపోవడం లేదు. ఇంకా వృత్తి పన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కనీసం పన్నుల ద్వారా కూడా ఆదాయం సక్రమంగా రావడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లకు కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. దీంతో ఆదాయం లేక గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. -
పారిశ్రామికాభివృద్ధికి విశాఖ అనుకూలం
అరకు, పాడేరులో పర్యాటకాభివృద్ధికి అవకాశ సీఐఐ సదస్సులో ఉత్తరాంధ్ర ఎంపీలు సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికాభివృద్ధికి విశాఖ అన్ని విధాలా అనువైనదని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి చేశాయన్నారు. ఇక మీదట ఆ పరిస్థితి లేకుండా ప్రాంతాలవారీ సమానాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వ పరంగా అనుమతులకు తన వంతు సహకారం అందించనున్నట్టు తెలిపారు. విశాఖలో రూ.1400 కోట్లు మేర ఉన్న ఐటీ పరిశ్రమను రూ.10 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అభివృద్ధి చేయాలన్నారు. పారిశ్రామికవాడలు, కారిడార్ల కోసం నిరీక్షించకుండా సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఏపీఐఐసీకి స్థలాలిచ్చినా.. నిర్ణీత గడువులోగా పరిశ్రమల్ని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. ఇలాంటి భూముల్ని సేకరించి ప్రత్యామ్నాయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు అనుబంధంగా అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరితో సంబంధాలున్న దక్షిణ భారత్‌లోనే అతి పెద్దదైన అరకు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్నారు. అరకు, పాడేరులో చాలా ప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి అనుకూలమన్నారు. ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత మూడేళ్లుగా పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, విభజన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం పరిశ్రమల ప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు. సమావేశంలో సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి సురేష్, విశాఖ జోన్ అధ్యక్షుడు జి.వి.ఎల్.సత్యకుమార్ పాల్గొన్నారు. -
'ఎక్స్ కేడర్' ఐఏఎస్ పోస్టులను సృష్టించొద్దు
న్యూఢిల్లీ: అనధికార ఎక్స్ కేడర్ ఐఏఎస్ పోస్టుల ఏర్పాటును ఆపేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అలా చేయడం ప్రస్తుతం ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. తాత్కాలిక అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టిస్తున్నాయని, వారిని ఐఏఎస్ కేడర్‌లోకి చేర్చడం కుదరదని డీఓపీటీ రాష్ట్రాలను గట్టిగా హెచ్చరించింది. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసం రాష్ట్రాలు ఎక్స్ కేడర్ పోస్టులను సమాంతరంగా సృష్టిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ డ్యూటీ రిజర్వ్లోంచి 25% పోస్టులను మాత్రమే రాష్ట్రాలు అధికారికంగా ఎక్స్కేడర్గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అనేక రాష్ట్రాలు దాదాపు అన్ని స్థాయిల్లో పలు కేడర్ పోస్టులను తాత్కాలికంగా నిలిపి ఉంచి, అందుకు బదులుగా ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టించుకుంటున్న విషయం తమ దష్టికి వచ్చిందని, అలా చేయడం వల్ల కేడర్ నిర్మాణంలో తేడా వస్తుందని వివరించింది. నిబంధనల ప్రకారం కేంద్రం ఆదేశాలు లేకుండా ఆర్నెళ్లకు మించి కేడర్ పోస్టులను నిలిపి ఉంచకూడదని స్పష్టం చేసింది. -
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఫీజుల చెల్లించాలి
-
ఆయా రాష్ట్రప్రభుత్వాలే విద్యార్థుల ఫీజుల చెల్లింపు
హైదరాబాద్: ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే ఫీజులు చెల్లించాలని ఈ రోజు ఇక్కడ జరిగిన ఆఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చదివే తెలంగాణ విద్యార్థులకు తమ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపి విద్యార్థుల ఫీజును ఏపీ ప్రభుత్వమే భరించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ పాత బకాయిలను కూడా ఆయా రాష్ట్రాలే భరించాలని తీర్మానించారు. 13 వందల కోట్ల రూపాయలు పాత బయాయిలు ఉన్నాయి. ఏ రాష్ట్రం వాటా ఎంత అనేది తేల్చి, తెలంగాణ వాటా తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు విద్యాసంస్థల విషయమై కొందరు కొన్ని సమస్యలు లేవనెత్తారు. ఆ విషయమై రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు. -
మూసీకి మహర్దశ
సబర్మతి తరహాలో ప్రక్షాళన తెలంగాణ సర్కారు ప్రణాళిక కార్యాచరణ సిద్ధం కేంద్ర సాయం కోరిన కేసీఆర్ సాక్షి, సిటీబ్యూరో: ముక్కుపుటాలదరగొట్టే మూసీని ప్రక్షాళన చేయడానికి తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. గుజరాత్లో సబర్మతి నదిని కాలుష్య కోరల నుంచి కాపాడిన తరహాలోనే.. చారిత్రక మూసీ నదిని పరిరక్షించడానికి నూతనంగా కొలువుదీరిన కేసీఆర్ సర్కారు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన వినతిపత్రంలో మూసీ నది ప్రక్షాళనకు జాతీయ నదీ పరిరక్షణ అభివృద్ధి (ఎన్‌ఆర్‌సీడీ) పథకం కింద చేయూత నివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సుమారు రూ.923 కోట్ల అంచనా వ్యయంతో మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేయాలని రెండేళ్ల క్రితమే జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఇపుడు సబర్మతి నది స్ఫూర్తితో ఈ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని పర్యావరణ వేత్తలు, నగరవాసులు సైతం కోరుతున్నారు. ఇవీ మూసీ వెతలు..! రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అనంతగిరిలో ప్రారంభమయ్యే మూసీ నది సుమారు వంద కిలోమీటర్లు ప్రవహించి నగరంలోకి ప్రవేశిస్తుంది. నగరం మధ్య నుంచి సుమారు 25 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మార్గమధ్యంలో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో మూసీనది మురికి కూపమైంది. నిత్యం నగరంలో 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలో కలుస్తోంది. రెండేళ్ల క్రితం జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మొదటిదశ ప్రక్షాళన చేపట్టారు. నదీపరివాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు మురుగుశుద్ధి(ఎస్టీపీ) కేంద్రాలను నిర్మించారు. ప్రస్తుతం మొదటి దశ కింద రోజువారీగా సుమారు 500 మిలియన్ లీటర్ల మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో 900 ఎంఎల్డీల మురుగు నీరు యథేచ్ఛగా మూసీలోకి ప్రవేశిస్తుండటంతో నది కాలుష్యకాసారమౌతోంది. రెండేళ్ల కిందటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చారిత్రక నదులను పరిరక్షించేందుకు జాతీయ నదీపరిరక్షణ పథకాన్ని(ఎన్‌ఆర్‌సీడీ) ప్రారంభించింది. ఇందులో భాగంగా మూసీ రెండోదశ ప్రక్షాళన పథకం కింద నిత్యం 610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయాలని రెండేళ్ల క్రితం సంకల్పించారు. ఇందుకయ్యే రూ.923 కోట్ల అంచనా వ్యయంలో 70 శాతం నిధులు మంజూరు చేసేందుకు అప్పట్లో కేంద్రం ముందుకొచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా పూచీకత్తు (కౌంటర్ గ్యారంటీ) ఇవ్వడంలో విఫలమవడంతో ప్రక్షాళన పథకం అటకెక్కింది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సబర్మతి నది ప్రక్షాళన ఇలా.. వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాల చేరికతో కాలుష్య కాసార ంగా మారిన సబర్మతి నది ప్రక్షాళనకు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2010లో నడుం బిగించారు. సుమారు రూ.550 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల కాలంలోనే పూర్తయింది. చారిత్రక నదిని కాలుష్య కాసారం నుంచి విముక్తి చేసింది. ఈ కృషిలో గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్‌లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచాయి. ఒకప్పుడు మురుగు వాసనతో కంపు కొట్టిన సబర్మతి నది పరిసరాల్లో ఇపుడు ఆహ్లాద వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అహ్మదాబాద్ వాసులకు సబర్మతి తీరం చక్కటి పర్యాటక స్థలంగా మారింది. నగరం నుంచి సుమారు పది కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తోంది. కాగా సబర్మతి ప్రక్షాళనలో భాగంగా పారిశ్రామిక, వాణిజ్య, గృహాల నుంచి నదిలోకి చేరుతున్న 17 ప్రాంతాలను గుర్తించారు. వ్యర్థజలాలు ఉత్పత్తవుతున్న ప్రాంతం నుంచి ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని మురుగు శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వ్యర్థజలాల్లోని ఘన, ద్రవ, రసాయనిక వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తరవాతే ఆ నీటిని నదిలోకి వదిలే ఏర్పాటు చేయడంతోనే నదిలో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇదే స్ఫూర్తితో మన నగరంలోనూ మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు జీహెచ్ఎంసీ, పీసీబీ, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. పాజెక్టు స్వరూపం.. పథకం: మూసీ ప్రక్షాళన రెండోదశ అంచనా వ్యయం: రూ.923 కోట్లు (ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద కేంద్రం 70 శాతం ఆర్థిక సహాయం చేస్తే.. 30 శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం భరించాలి) ఉద్దేశం: మూసీలో రోజూ కలుస్తున్న 610 మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ధి చేపట్టనున్న నిర్మాణాలు: మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం.. పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు ఎస్టీపీలు ఎక్కడెక్కడ: అంబర్పేట్ (142 ఎంఎల్డి), నాగోల్ (140 ఎంఎల్డి), నల్లచెరువు (80 ఎంఎల్డి), హైదర్షాకోట్(30 ఎంఎల్డి), అత్తాపూర్(70 ఎంఎల్డి), మీరాలం(6 ఎంఎల్డి), ఫతేనగర్(30 ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59 ఎంఎల్డి), నాగారం (29 ఎంఎల్డి), కుంట్లూర్-హయత్‌నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం- కాప్రా ప్రత్యేకతలు: జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధిచేసి తిరిగి నదిలోకి వదలాలి. పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చే అవకాశం ఉంటుంది. -
గ్రామీణులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలి
గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ సాక్షి,బెంగళూరు: నాణ్యమైన విద్య, వైద్యాన్ని సమాజంలోని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా గుర్తించాలని గవర్నర్ హన్స్‌రాజ్‌భరద్వాజ్ పేర్కొన్నారు. విశ్వ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాయలంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అద్దాల మేడలతో కూడిన భవంతులు నిర్మించిన మాత్రాన ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం దక్కదని, గ్రామీణులకు కూడా సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందజేయాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవ, నవజాతి శిశుమరణాలు పల్లెల్లోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని అర్థికంగా వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించే వినూత్న పథకాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విధానాలు ప్రాచూర్యం పొందుతున్నాయన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద క్లీనిక్‌లను ప్రారంభించడం వల్ల కొంత ఉపయోగముంటుందన్నారు. ఆయుర్వేద వైద్య విద్యార్థులకు ఉపాధి చూపించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ కే.ఎస్ శ్రీ ప్రకాశ్, కర్ణాటక హోమియోపతి వైద్యుల సంఘం అధ్యక్షుడు బీ.టీ రుద్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
చలో ఢిల్లీని జయప్రదం చేయండి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి కోనాల భీమారావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఏలూరులో మంగళవారం ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. భీమారావు మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం నెలకు రూ.12 వేల 500లు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కార్మిక చట్టాలు, ధరల నియంత్రణ కోరుతూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామని వివరించారు. 20న భవన నిర్మాణ కార్మికుల ధర్నా మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, హెల్త్ కార్డుల వర్తింప చేయాలని కోరుతూ ఈ నెల 20న డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, నాయకులు బండి వెంకటేశ్వరరావు, డి.లక్ష్మణమూర్తి, కందుల బాబ్జి, తాడికొండ వాసు, ఎ. కొండాజీ, గంధం అంజమ్మ, డీవీఏవీ ప్రసాదరాజు , పి.విజయ, వీఎస్ మల్లికార్జున్, బి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు -
సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తోంది జగన్ ఒక్కరే
= కిర ణ్, చంద్రబాబుది డబుల్ గేమ్ = స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన = కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారు = మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి సాక్షి, బళ్లారి : వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడని మాజీ ఎంపీ వైఎస్. వివేకానందరెడ్డి అన్నారు. గురువారం ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా స్థానిక పోలా హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెరవెనుక సహకరించారని విమర్శించారు. ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమాలు లేవనెత్తిన తర్వాత వారిద్దరూ డబుల్‌గేమ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడికి ముందుగా చెప్పకుండా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకునే అవకాశమే లేదన్నారు. సీఎం ముందు అంగీకారం తెలిపి, తర్వాత తన ఉనికి దెబ్బతింటుందన్న భయంతో మాటమార్చారని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలనుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణా ప్రాంతంలో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనేక మంది కోరుకుంటున్నారని గుర్తు చేశారు. రాయల తెలంగాణ అంశం కూడా కొందరు లేవనెత్తుతున్నారని, ఇది సరైన చర్య కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బళ్లారిని వదులుకోవడం వల్ల చాలా నష్టపోయామని గుర్తు చేశారు. హెచ్ఎల్సీ ద్వారా సమాంతర కాలువ ఏర్పాటు చేసుకుని రైతులకు నీరు అందించాలని తమ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తుంటే కర్ణాటక అడ్డుపుల్ల వేస్తోందన్నారు. విడిపోతే నీటి పంపకాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. -
గిరిజనుల గోడు పట్టదా?
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘ఓట్లు.. సీట్ల.. కోసం ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి.. కుర్చీల కుమ్ములాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూరుకుపోయాయి.. కానీ గిరిజనుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, దళితులు, పేదల సమస్యలను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. తరతరాలుగా ఆదివాసీ గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు బృందాకారత్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మూడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూర్చుని తమ పదవులను కాపాడుకోవడంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 33లక్షల ఎకరాల భూమికి గిరిజన పట్టాలు అందించాల్సి ఉండగా, వీటిని కేవలం 19 లక్షలకు కుదించారని, ఇందులో 4.5లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారని విమర్శించారు. అర్హులైన గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించి వారి నోటివద్ద ముద్దను లాక్కొనే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పొతినేని సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్లకు సర్కారు దాసోహం!
సాక్షి, హైదరాబాద్: బియ్యం మిల్లర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం, తద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే బియ్యంపై వసూలు చేసే రెండు శాతం కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ)ను రద్దు చే సే యోచనలో ఉంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేయగా.. పౌరసరఫరాల శాఖ సంబంధిత ఫైలును ఆర్థిక శాఖ పరిశీలనకు పంపింది. ఆర్థిక శాఖ పరిశీలన పూర్తి కాగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తుంటే.. సందట్లో సడేమియాలా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చే నిర్ణయాలకు సిద్ధమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు కూడా ప్రయోజనం చేకూర్చడమే ఇలాంటి నిర్ణయాల పరమార్థమని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మన రాష్ట్ర మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించాలంటే వాణిజ్య పన్నుల శాఖకు రెండు శాతం సీఎస్టీ చెల్లించి విక్రయించే బియ్యం పరిమాణం ఎంతో తెలిపే ‘సి’ ఫార్మ్ పొందాలి. అయితే ఈ విధంగా సీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ‘సి’ ఫార్మ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది! కేవలం లారీ, రైల్వే, ట్రక్కు లోడింగ్ సర్టిఫికెట్లు సరిపోతాయని పేర్కొంది. అంటే మిల్లర్లు తమ ఇష్టానుసారం ఇతర రాష్ట్రాల్లో బియ్యం విక్రయించుకునేందుకు వీలుగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసిందన్నమాట. 2011 జనవరి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే 2014 మార్చి వరకు ఈ వెసులుబాటు కల్పించాలని కూడా ఉప సంఘం సూచించింది. ఈ సిఫారసు అమలైతే రాష్ట్ర ఖజానాకు రూ.327 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అంటే ఆ మేరకు మిల్లర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. గతంలోనూ సీఎస్టీ రద్దు చేసిన సీఎం! 2007 ఏప్రిల్ నుంచి 2010 డిసెంబర్ వరకు ఇతర రాష్ట్రాల్లో మిల్లర్లు విక్రయించిన బియ్యంపై సీఎస్టీని రద్దు చేస్తూ 2011లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప సంఘం పేర్కొంది. అదే తరహాలో ఇప్పుడు కూడా సీఎస్టీని రద్దు చేయాలని సూచించింది. గతంలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కనీసం ఫైలు కూడా ఆర్థిక శాఖకు వెళ్లకుండానే సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ఖజానాకు రూ.52 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రూ. 52 కోట్ల సీఎస్టీ రద్దుకు సంబంధించి రెవెన్యూ శాఖ అంతర్గతంగా మెమో జారీ చేసి సరిపుచ్చింది. అయితే ఆ మెమోలో ‘సి’ ఫార్మ్ మినహాయింపు, సీఎస్టీ రద్దు 2010 డిసెంబర్ వరకే పరిమితమని, 2011 జనవరి నుంచి సీఎస్టీ చెల్లించాలని, ‘సి’ ఫార్మ్ తప్పనిసరని అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. అయితే 2011 తర్వాత కూడా సీఎస్టీ రద్దుకు తాజాగా మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసింది. -
‘ఆమ్ ఆద్మీ’పై నీలినీడలు!
పలమనేరు, న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న ఆమ్ఆద్మీ బీమా పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం రానురానూ కనుమరుగవుతోంది. భవిష్యత్తులో కొత్త పాలసీలకు అవకాశం రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందులో సభ్యత్వం ఉన్న శ్రమశక్తి సంఘాల్లోని మహిళా కూలీల రెన్యూవల్స్ ఆపేశారు. కొత్త సభ్యత్వాన్ని స్వీకరించడం లేదు. ఈ క్రమంలో ఈ పథకం అటకెక్కుతుందేమోనన్న భావ న కలుగుతోంది. పథకం లక్ష్యమిదీ జిల్లాలోని మహిళా గ్రూపుల్లో 18 నుంచి 58 సంవత్సరాలలోపు వయసువారు ఈ పథకానికి అర్హులు. గ్రూ పులోని మహిళ భర్త సాధారణంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఆర్థికసాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2009లో ప్రవేశపెట్టారు. ఇందులో సభ్వత్వం కోసం పాలసీదారు రూ.15 చెల్లిస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సభ్యత్వ రుసుంగా రూ.160 చొప్పున రూ.320 చెల్లిస్తాయి. పాలసీదారులకు బాండ్లను అందజేస్తారు. సహజ మరణమైతే దహన సంస్కారాల కోసం తక్షణ సాయంగా రూ.5 వేలు, అనంతరం రూ.25 వేలు అందజేస్తారు. ప్రమాదవశాత్తు మరణిస్తే తొలుత రూ.5 వేలు, ఆపై రూ.70 వేలు నామినీ ఖాతాలోకి జమ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నదేమంటే.. ఈ పథకం ద్వారా జిల్లాలో 1,93,024 మంది పాలసీదారులుగా సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరికి పూర్తిస్థాయిలో ఈ ఏడాదికి సంబంధించి రెన్యూవల్స్ జరగలేదు. సంబంధిత మండల సమాఖ్యల్లోని బీమా మిత్రలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకే కొంతవరకు రెన్యూవల్స్ పూర్తి చేశారు. గ్రూపుల్లోని మహిళలు ఉపాధి పనులకు వెళ్లేవారి ప్రీమియంను ఆ ఖాతా నుంచి రెన్యూవల్స్ మొత్తాన్ని చెల్లించేవారు. అయితే కొంతకాలంగా ఉపాధి హామీకి సంబంధించిన పనులు ఆగిపోయాయి. దీంతో ఆ శాఖ నుంచి డీఆర్డీఏ ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో శ్రమశక్తి సంఘాల్లోని మహిళలకు ఈ పథకాన్ని నిలుపుదల చేశారు. ఫలితంగా 77,619 మంది సభ్యులు రెన్యూవల్స్‌కు నోచుకోకుం డా పోయారు. దీనికితోడు పీవోపీ (పూరెస్ట్ ఆఫ్ ద పూర్)లో 3,098 మం దికి రెన్యూవల్స్ జరగలేదు. మొత్తం మీద 80,717 మందికి ఈ ఏడాది రెన్యూవల్స్ ఆగిపోయాయి. పాత పాలసీలే కొనసాగింపు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పాత పాలసీలను మాత్రమే కొనసాగిస్తున్నారు. కొత్త పాలసీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. పాత పాలసీలకూ ఇబ్బందే ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించిన వెంటనే జిల్లాలోని కాల్ సెంటర్‌కు సమాచారం అందుతుంది. 24 గంటల్లోపు దహన సంస్కారాల కోసం జిల్లా సమాఖ్య మృతుని కు టుంబానికి రూ.5 వేలు అందివ్వాలి. ఆపై పూర్తి క్లైమ్ నామీని ఖాతాలోకి జమ కావాలి. అయితే ఇందుకు డెత్ సర్టిఫికెట్, పోలీసుల నుంచి ఎఫ్ఐ ఆర్, డాక్టర్ సర్టిఫికెట్లు అవసరం. సమైక్య సమ్మె నేపథ్యంలో దర ఖాస్తులు పెండింగ్‌లో పడడంతో బా ధితులు ధ్రువీకరణ పత్రాలు అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 848 మంది లబ్ధిదారులకు క్లైమ్లు అం దాల్సి ఉంది. ఈ విషయమై ఆమ్ఆద్మీ బీమాయోజన డీపీఎం లక్ష్మీప్రసాద్ రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, కొత్తపాలసీలు తీసుకోరాదని తమకు ఆదేశాలున్నాయన్నారు. ఉపాధి హామీ కి సంబంధించి సాంకేతిక కారణాలతో కొన్నింటిని రెన్యూవల్ చేయలేదన్నారు. పాత పాలసీలదారుల రెన్యూవల్స్, బెనిఫిట్స్ సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. -
ఏటా జలమండలికి రూ.5.72 కోట్ల నష్టం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కాంతులు వెదజల్లాల్సిన మురుగుశుద్ధి కేంద్రాల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. నగరంలోని అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు(ఉప్పల్) మురుగు శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) స్థాపిత సామర్థ్యం మేరకు పనిచేయాల్సిన విద్యుత్ కేంద్రాలు సవాలక్ష సాంకేతిక సమస్యలతో కునారిల్లుతున్నాయి. నిత్యం మూడు ఎస్టీపీల్లో 850 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన యంత్రాలు కనాకష్టంగా 400 కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేసి చతికిలపడుతున్నాయి. జలమండలి పర్యవేక్షణ లోపం.. అధికారుల నిర్లక్ష్యం.. అధ్వాన నిర్వహణ.. అంతులేని అవినీతి.. తదితర కారణాల వల్ల కోట్లాది రూపాయలు మురుగుపాలవుతున్నాయి. మరోవైపు చారిత్రక మూసీనదిని మురుగు కంపు నుంచి కాపాడేందుకు నూతనంగా మరో పది ఎస్టీపీలను నిర్మించే అంశంపై ఇటు జలమండలి, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మూడేళ్లుగా ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి. అరకొర విద్యుదుత్పత్తి ఐదేళ్ల క్రితం సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో మూడు ఎస్టీపీల్లో ఏర్పాటు చేసిన ఆస్ట్రియా, జర్మనీ దేశాలకు చెందిన గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి యంత్రాల నిర్వహణ లోపంతో తరచూ మొరాయిస్తున్నాయి. ఏటా రూ.2 కోట్ల మేర నిర్వహణ, మరమ్మతులకు కేటాయిస్తున్నా సిబ్బంది చేతివాటంతో ఫలితం లేకుండా పోతోంది. అంబర్పేట్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద రోజువారీగా మూసీలో కలుస్తున్న 340 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ మురుగు నీటిలోని ఆర్గానిక్ పదార్థాల నుంచి విడుదలయ్యే మీథేన్ గ్యాస్‌తో 600 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జలమండలి లక్ష్యం నిర్దేశించింది. కానీ ప్రస్తుతానికి 350 కిలోవాట్లే ఉత్పత్తి అవుతోంది. దీంతో నెలవారీగా ఎస్టీపీ నిర్వహణకయ్యే విద్యుత్ కోసం రూ.20 లక్షల బిల్లును జలమండలి చెల్లించాల్సి వస్తోంది. ఇక నాగోల్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద నిత్యం 170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ ఉత్పన్నమయ్యే మీథేన్ గ్యాస్ ద్వారా రోజువారీగా 200 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాలను ఏర్పాటు చేశారు. కానీ కేవలం 50 కిలోవాట్లు ఉత్పత్తి చేసి ఇక్కడి కేంద్రం చతికిలపడుతోంది. ఇక్కడా షరామామూలుగానే విద్యుత్ అవసరాలకు నెలకు రూ.10 లక్షలు చెల్లించిన దుస్థితి తలెత్తింది. ఇక ఉప్పల్ నల్లచెరువు ఎస్టీపీ వద్ద 30 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 50 కిలోవాట్లు. కానీ ఉపకరణాలు పనిచేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం గమనార్హం. ఇక్కడా విద్యుత్ బిల్లు నెలకు రూ.లక్ష చెల్లించాల్సిన పరిస్థితి. నిర్వహణ మెరుగుపడితేనే... మొత్తంగా ఎస్టీపీల వద్ద విద్యుత్ అవసరాలకు నెలకు రూ.31 లక్షల బిల్లు జలమండలి చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏటా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.3.72 కోట్ల నష్టాన్ని బోర్డు భరించాల్సి వస్తోంది. ఇక నిర్వహణ మరమ్మతుల పేరిట ఏటా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. మొత్తంగా ఏడాదికి రూ.5.72 కోట్ల నష్టాన్ని భరించాల్సిన దుస్థితి తలెత్తింది. ఎస్టీపీల నిర్వహణ తీరు మెరుగుపడితే ఈ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కార్యాచరణకు నోచని ప్రతిపాదనలు చారిత్రక మూసీ నదిని మురుగుకూపం నుంచి రక్షించేందుకు గ్రేటర్ వ్యాప్తంగా నూతనంగా పది మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నెలకొల్పాలన్న జలమండలి ఆశయం నీరుగారుతోంది. కొత్త ఎస్టీపీల ప్రతిపాదనలు గత మూడేళ్లుగా కాగితాలకే పరిమితమౌతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పైసా నిధులు విదల్చడంలేదు. దీంతో జలమండలి నిధులు లేవని చేతులెత్తేసింది. జాతీయ నదీ పరిరక్షణ పథకం (ఎన్‌ఆర్‌సీడీ ) కింద నూతన ఎస్టీపీలను నిర్మించాలన్న ప్రతిపాదనలు కూడా కార్యాచరణకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం 900 మిలియన్ లీటర్ల శుద్ధి చేయని మురుగు నీరు చేరి మూసీ కాలుష్య కాసారమౌతోంది. -
చిల్లిగవ్వలేదు..
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: గ్రామ ఖజా నాలు నిండుకున్నాయి. పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటినా ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. అభివృద్ధి ఊసేలేదు. దీంతో కొత్త సర్పంచ్‌లు దిష్టిబొమ్మలుగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొత్త సర్పంచ్‌లంతా ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత గ్రా మాలకు నిధుల కురుస్తాయని సర్పంచ్‌లు భా వించారు. కానీ ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి రాలేదు. ప్రత్యేక నిధులెక్కడ : సాధారణంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధు లు మంజూరు చేస్తుంది. అవి గ్రామాభివృద్ధికి దోహదపడతాయనే ఆయా గ్రామాల్లోనివారు ఏకగ్రీవం దిశగా అడుగులేశారు. నోటిఫైడ్ పం చాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా...ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు పైసా విడుదల కాలేదు. ఇదిలా ఉంటే రెండేళ్లుగా 13వ ఆర్థిక సంఘం నిధులు లేవు. కొలువుతీరాక అవయినా వస్తాయని ఆశించిన కొత్త సర్పంచ్‌లకు నిరాశే మిగిలింది. వృత్తి పన్ను, సీనరేజీ పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏవీ మంజూరు చేయలేదు. సమైక్యాంధ్ర సెగ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. ఎంపీడీవోలు, ఖజానా శాఖ సిబ్బంది, పంచాయతీ అధికారులు, ఇలా జిల్లాలో పని చేసే ప్రతీ ఒక్కరూ సమ్మెలోకి వెళ్లారు. దీంతో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధి లైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడిక తీయాలన్నా, తాగునీటి పైపులు బాగు చేయిం చాలన్నా, వీధి లైట్లు వెలిగించాలన్నా పంచాయతీల్లో బిల్లులు కాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం గ్రామ పంచాయతీల పరిధిలో రావాల్సిన పన్నులు, ఇతర ఆదాయం రాబట్టాలనుకున్నా సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది సొంత డబ్బులు ఖర్చు పెట్టి చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు. తీర్మానాలు లేకుండా సొంత డబ్బు లు ఖర్చు పెడితే తరువాత పరిస్థితి ఏమిటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పేదలంటే అలుసా..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘ప్రజల సొమ్ముతో బ్యాంకులను ఏర్పాటు చేశారు. కానీ వారికే సేవ చేయడం మరిచిపోగా.. కనీసం బ్యాంకు మెట్లు కూ డా ఎక్కనీయరు. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయల నిధులను మంజూరుచేసి గ్రౌండింగ్ విషయంలో పట్టించుకోరు. మీకు బలుపెక్కడంతోనే వా రిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ’ నాగర్‌కర్నూ ల్ ఎంపీ మందా జగన్నాథం బ్యాంకర్లపై తీ వ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకర్ల తీరుపై ఎంపీతోపాటు, ఎమ్మెల్యేలూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎంపీ మందా జగన్నాథం మా ట్లాడుతూ.. జిల్లాలో ఏ బ్యాంకులో కూడా పేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన పథకాలను అందించడం లేదన్నారు. పేదలంటే బ్యాంకర్లకు అలుసెక్కువ అన్నారు. ఈ విషయమై తాను గతంలో ఓ బ్యాంక్ అధికారి తో మాట్లాడితే.. ‘నువ్వు ఎంపీవైతే నాకేమి, పైగా నీవు చెప్పితే నేను వీరికి రుణాలు ఇవ్వాలాల్ని ఇవ్వాలా.. అని అవమానపరి చాడు. ఈ బ్యాంకర్లకు పేదలంటే, ప్రజాప్రతినిధులులంటే లెక్కనేలేదు. ‘మీ బ్యాంకు లు ప్రజల సొమ్ముతో కాకుండా, మీ సొం తంగా నడిపిస్తున్నారా’ అంటూ ఆయన తీ వ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక కార్పొరేషన్ల ద్వారా పేద నిరుద్యోగులను ఆదుకునేం దుకు మంజూరుచేసిన యూనిట్లను గ్రౌం డింగ్ చేయకుండా, ష్యూరిటీల పేరుతో నా నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వీరి నిర్లక్ష్యంపై ప్రతి సమావేశంలో ఆర్బీఐకి ఫిర్యాదుచేస్తే పరిశీలిస్తామని చెబుతున్నారని ఆర్బీఐ ప్రతినిధి పుల్లారెడ్డిపై ఎంపీ మందా అసహనం వ్యక్తంచేశారు. విద్యారుణాలను ఎవరికిచ్చారు..? విద్యా రుణాలిచ్చేందుకు రూ.నాలుగు లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేదని ఆర్బీఐ ఆదేశాలను జారీచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎంపీ మందా జగన్నాథం ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో చాలామంది పే ద విద్యార్థులు రుణంకోసం బ్యాంకుల చు ట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఈ కారణంగా ఏటా కనీసం పదిమంది విద్యార్థులు కూడా రుణాలను పొందలేకపోతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తంచేశారు. ష్యూరిటీ లే కుండా రూ.నాలుగు లక్షల విద్యారుణాన్ని పేద విద్యార్థులకు ఇవ్వాలని, లేదంటే తాను పార్లమెంట్లో ఫిర్యాదు చేయాల్సి వస్తుంద ని హెచ్చరించారు. ఆర్బీఐ ప్రతినిధి పుల్లారె డ్డి కల్పించుకుని నాలుగు లక్షల వరకు ఎ లాంటి ష్యూరిటీ లేకుండా విద్యార్థులకు ఇ వ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. తదనంతరం గత సమావేశంలో తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా అమలుకాకపోవడంతో సభ్యులంతా బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. అచ్చంపేట్ ఎమ్మెల్యే రాములు మాట్లాడుతూ.. రైతులకు పంటరుణాల్లేవు, బల్మూర్ మండలం మంగలపల్లికి చెందిన పేద విద్యార్థి ఎంబీఏ చదివేందుకు రుణం కోసం వెళ్లితే ఇవ్వకుండా హేళనచేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బ్యాంకర్లపై మండిపడ్డారు. వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో చేతి, కుల వృత్తులవారు చాలా తక్కువమంది ఉన్నా.. వారికి మంజూరైన అతితక్కువ యూనిట్ల లో కనీసం పదిశాతమైన బ్యాంకర్లు గ్రౌం డింగ్ చేయలేదన్నారు. వారి అంత అలుసెందుకుని ప్రశ్నించారు. దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కడుకుంట్ల, చిన్నచింత కుం ట ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటుచేస్తామని చెప్పినా..ఇంతవరకు అతీగతి లేదన్నా రు. ఇలా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మక్తల్ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నర్వ ప్రాంతంలో కొత్త బ్యాంకును ఏర్పాటు చేసేటప్పుడు ఎమ్మెల్యేగా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు బ్యాంకర్లు రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని మండిపడ్డారు. కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ.. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా కఠి నచర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రభు త్వ పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే బ్యాంకుల ను సహించేది లేదని హెచ్చరించారు. అనంత రం అంబట్పల్లి శ్రీరంగాపూర్, మక్తల్ ప్రాం తాల్లో కొత్త బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, నాబార్డ్ ఏజీఎం సురేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు, అన్ని బ్యాంకుల ఏజీఎంలు పాల్గొన్నారు. -
యాసిడ్ దాడుల నుంచి ఆమెకు రక్షణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలపై యాసిడ్ దాడుల అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విచ్చలవిడిగా రసాయనాలను విక్రయించకుండా నిషేధం విధించాలని సూచిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొనుగోలుదారుల పూర్తి వివరాలను నమోదు చేయకుండా ఇష్టం వచ్చినట్లు యాసిడ్ విక్రయించే దుకాణదారులకు రూ.50,000 జరిమానా విధించాలని సూచించింది. యాసిడ్ దాడిని నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటూ వీలైనంత త్వరగా చట్టాలు చేయాలని రాష్ట్రాలను కోరింది. యాసిడ్ దాడుల బాధితులకు ఉచితంగా చికిత్స అందచేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు, విభాగాలను ఇప్పటికే ఆదేశించినట్లు హోంశాఖ తెలిపింది. ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనందున యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యసాయం, పునరావాసం తదితర అంశాలపై హోంశాఖ మార్గదర్శకాలను వెలువరించింది. మగువలపై యాసిడ్ దాడులను అరికట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్లో ప్రధానమైనవి: యాసిడ్ దాడి బాధితురాలికి చికిత్స, పునరావాసం కింద ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి. ఘటన జరిగిన 15 రోజుల్లోగా తక్షణ సాయం కింద రూ.లక్ష అందచేయాలి. మిగతా రూ.2 లక్షలను వీలైనంత వేగంగా లేదా రెండు నెలల్లోగా చెల్లించాలి. యాసిడ్ కొనుగోలుదారుల సమాచారాన్ని, చిరునామానాను విక్రేతలు కచ్చితంగా నమోదు చేసుకోవాలి. చిల్లరగా వీటిని విక్రయించరాదు. ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు కలిగిన వారికే యాసిడ్‌ను విక్రయించాలి. 18 ఏళ్లు నిండి చిరునామా ధ్రువపత్రాన్ని చూపితేనే యాసిడ్ అమ్మాలి. యాసిడ్ నిల్వల వినియోగం వివరాలను విక్రయదారుడు సంబంధిత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎదుట 15 రోజుల్లోగా సమర్పించాలి. లేకపోతే రూ.50వేల వరకు జరిమానా. యాసిడ్‌ను వినియోగించే విద్యాసంస్థలు, పరిశోధనా ల్యాబ్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ విభాగాలు కూడా విని యోగం వివరాలను నమోదు చేయాలి. వివరాలను సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు ఇవ్వాలి. -
గంటి ప్రసాదాన్ని ప్రభుత్వమే హత్య చేసింది..
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆగడాలను ఎవరు ప్రశ్నిస్తారో వారిని హతమారుస్తారు. జిల్లాలో మొదలైన గంటి ప్రసాదం విప్లవ నాయకత్వం దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రజలే ప్రశ్నించే తత్వానికి కారకుడవుతున్నాడన్న నెపంతో ప్రభుత్వాలే ప్రసాదాన్ని హతమార్చా’యని అమరుల బంధుమిత్రుల సంఘం, విరసం, విప్లవ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. గంటి ప్రసాదం సంస్మరణ సభ బొబ్బిలిలోని లక్ష్మీథియేటర్(రాజన్నహాల్)లో ఆదివారం జరిగింది. పట్టణ కలాశీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్మరణ సభలో విరసం వ్యవస్థాపక సభ్యుడు చలసాని ప్రసాద్, అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ట్ర నాయకురాలు పద్మాకుమారి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి, గంటి సోదరుడు రమణ, భార్య కామేశ్వరితో పాటు రైతు కూలీ సంఘం, సీపీఐ, సీపీఎం, సీపీఐ న్యూ డెమొక్రసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ప్రసాదం మరణానికి సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. అనంతరం జరిగిన సభలో విరసం వ్యవస్థాపక సభ్యుడు చలసాని ప్రసాద్ మాట్లాడుతూ ప్రసాదాన్ని మఫ్టీలో ఉండే పోలీసులే హతమార్చారని ఆరోపించారు. పట్టపగలు, నెల్లూరు నడిరోడ్డులో జరిగిన ఈ హత్యపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం, దర్యాప్తు ముందుకు వెళ్లకపోవడం చూస్తే ఇది వాస్తవమనిపిస్తోందన్నారు. అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ర్ట నాయకురాలు పద్మకుమారి మాట్లాడుతూ విప్లవ నాయకుల్ని హత్యలు చేసినంత మాత్రాన విప్లవం ఆగదన్నారు. పసాదం ఆశయాలను నెరవేర్చేవరకూ పోరాడతామన్నారు. గంటి సోదరుడు రమణ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరిగే మార్గం ఏదైనా ఉందా అంటే అది సాయుధపోరాటం, మావోయిస్టు పార్టీ సిద్ధాంతమేనని ప్రసాదం బాగా నమ్మారన్నారు. ఏ ప్రభుత్వం పరిపాలిస్తున్నా వాటికి ప్రతిపక్ష మావోయిస్టు పార్టీయేనన్నారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకుడు వర్మ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు రమణి,సీఐటీయూ నాయకులు పీ శంకరరావులు మాట్లాడుతూ గ్రీన్‌హంట్ పేరుతో బలగాలను మోహరించి అమాయకులైన ఆదివాసీలను తరిమి కొడుతున్నారన్నారు. వీటిపై గొంతెత్తి మాట్లాడే ప్రసాదం లాంటి వారిని చంపుతున్నారన్నారు. స్థానికులు బోగాది అప్పలస్వామి, మెరుగాని అప్పలస్వామి, టీవీ రమణ, నల్లి తవిటినాయుడు తదితరుల ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ జరిగింది. సీడీలు, పుస్తకాల ఆవిష్కరణ గంటి ప్రసాదం అంతిమయాత్రపై రూపొం దించిన సీడీని సంస్మరణ సభలో చలసాని, రమణ, కామేశ్వరి తదితర నాయకులు, బంధువులు ఆవిష్కరించారు. ప్రసాదం మృతదేహం వచ్చిన దగ్గర నుంచి అంతిమ సంస్కారాల వరకూ దీనిలో పొందుపరిచారు. అలాగే ప్రసాదం రచనలు, జీవితచరిత్ర, విప్లవ ఉద్యమంలో సన్ని హితుల మనోభావాలతో కూడిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు, డప్పు రమేష్, ప్రజా కళామండలి, శ్రీకాకుళం కళాకారులు ఆలపించిన విప్లవగీతాలు, గంటి ప్రసాదంపై రాసిన పాటలు ఆకట్టుకున్నాయి.