
‘ఏకగ్రీవాని’కి నిధులేవి?
- ఏడాదైనా విడుదల కాని ప్రోత్సాహకం
- నిండుకున్న పంచాయతీల ఖజానా
- సక్రమంగా వసూలు కాని పన్నులు
- అభివృద్ధి పనులకు ఆటంకం
- గ్రామాలో పరిస్థితులు అధ్వానం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పంచాయతీల ఖజానాలు నిండుకున్నాయి. పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు మంజూరు కావడం లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు విడుదల చేయాల్సిన ప్రోత్సాహక ప్రత్యేక నిధులు ఏడాదైనా విదల్చలేదు. అభివృద్ధి ఊసే లేదు. దీంతో సర్పంచ్‌లు దిష్టిబొమ్మలుగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి.
గతేడాది జూలైలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటికి రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలు ముగిశాక గ్రామాలకు నిధులొస్తాయని సర్పంచ్‌లు భావించారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిధులు రాక.. సక్రమంగా పన్నులు వసూలు కాక పంచాయతీలు కునారిల్లుతున్నాయి.
ప్రత్యేక నిధులెక్కడ?
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులిస్తుంది. అవి గ్రామాభివృద్ధికి దోహదపడతాయన్న ఆశతోనే జిల్లాలో 70 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వీటికి ప్రత్యేక ప్రోత్సాహక నిధులివ్వాలి. ఏకగ్రీవమైన వాటిలో నోటిఫైడ్ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా ప్రభుత్వం గతంలో ఇచ్చింది.
ఈ దఫాలో కూడా ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు ఇలాగే నిధులొస్తాయని ఆశించినప్పటికీ ఆ ఊసే లేదు. కొత్త ప్రభుత్వం ఇప్పట్లో మంజూరు చేసే అవకాశం కనిపించడం లేదు.
ఆదాయం నామమాత్రం : ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు లేవు. కొత్త సర్పంచ్‌లు కొలువుతీరాక కొద్ది రోజుల క్రితం 13వ ఆర్థిక సంఘం నిధులు 15.78 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ రూ.1.3 కోట్లు, ఏజెన్సీకి రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి. ఇవి అభివృద్ధి పనులకు ఏమూలకూ సరిపోవడం లేదు. ఇంకా వృత్తి పన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కనీసం పన్నుల ద్వారా కూడా ఆదాయం సక్రమంగా రావడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లకు కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. దీంతో ఆదాయం లేక గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.