దేశం ప్రగతి పథంలో పయనించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం ప్రగతి పథంలో పయనించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ రంగ యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను శుక్రవారం చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ఆయన ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆలోచనా ధోరణే చాలా భిన్నమైనదని, ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు.
వ్యవసాయం, రహదారు లు, భవన నిర్మాణ రంగం ఇలా అన్నింటిపైనా ఆయన ఆలోచన ధోరణిని అందుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వనరుల్లో 43 శాతం వడ్డీల చెల్లింపునకే సరిపోతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమిం చాలంటే మరింత ఆర్థిక పురోగతి అవసరమని అభిప్రాయ పడ్డారు. అందుకే ప్రధాని మోదీ తాను నిద్రపోకుండా, ఎవ్వరినీ నిద్రపోనీకుండా పని చేస్తున్నామన్నారు. ప్రశంసా త్మకమైన మోదీ పనితీరును విపక్షాలు మెచ్చుకోవడం మాని మోకాలొడ్డడమే పనిగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు.
నల్లధనాన్ని ఒక్కరోజులో తేలేమన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన సావనీర్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సభానంతరం ప్రదర్శన కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. సి మెంటు కంపెనీల యజమానులు ఇష్టారాజ్యం గా ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు కేంద్ర స్థాయిలో సిమెంటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.