Minister m.venkaiah naidu
-
రియల్ హీరోలకు అవార్డులివ్వండి
సినిమా పరిశ్రమలో రియల్ హీరోలంటే స్టంట్ కళాకారులే. అలాంటి వారి కోసం దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు, నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్యధనుష్ గొంతు విప్పారు. ఇటీవల ఐనా సభలో మహిళాభివృద్ధి రాయబారిగా ఎంపికైన ఐశ్వర్య అటు వైపుగా అడుగులు వేస్తున్నారు. తన భర్త ధనుష్ హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తిన ఈమె తాజా చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ప్రస్తుతం సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన భర్త వుండర్‌బార్ ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా సినీ స్టంట్కళాకారుల జీవితాలను ఆవిష్కరించనున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వనున్నారు. ఇక ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. కాగా సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా కేంద్రప్రభుత్వం ఉత్తమ కళాకారులకు జాతీయ అవార్డులను అందించడం ఆనవాయితీగా జరుగుతున్న విషయమే. అయితే ఇందులో స్టంట్ కళాకారుల కేటగిరి చోటు చేసుకోలేదు. ఇప్పుడు స్టంట్ కళాకారుల జీవితాలను డాక్యుమెంటరీగా రూపొందిస్తున్న ఐశ్యర్య ధనుష్ శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖా మంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించిన ఐశ్వర్యధనుష్ తన డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించారు. అదే సమయంలో జాతీయ అవార్డుల కేటగిరిలో స్టంట్ కళాకారుల శాఖను చేర్చి వారికి అవార్డులందించి ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ కోసం గొంతు విప్పిన ఐశ్వర్యధనుష్కు పలువురు స్టంట్ మాస్టర్లు, స్టంట్ కళాకారులు సోషల్ మీడియా ద్వారా కృతజత్ఞలు తెలుపుతున్నారు. -
పేదరిక నిర్మూలనకే ‘ముద్ర’
చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు రుణాలు: వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే నిరుద్యోగులను స్వయంఉపాధి వైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పేదరిక నిర్మూలనతోపాటు యువత, చిరు వ్యాపారులు, చేతివృత్తులవారికి తోడ్పాటు అందించేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ) యోజన పథకం ప్రచార కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు శుక్రవారమిక్కడ ప్రారంభించి, లబ్ధిదారులకు రుణపత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలతోపాటు వ్యాపారులు, చేతివృత్తులవారిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ప్రధాని మోదీ భావించారని, అందులో భాగంగానే ముద్ర యోజనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ముద్ర పథకానికి ఆర్బీఐ రూ. 20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు అర్హులైనవారికి రుణాలు మంజూరు చే స్తారన్నారు. అక్టోబర్ 2 వరకు ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రుణాల మంజూరులో రాజకీయ జోక్యం కూడా ఉండదని చెప్పారు. రుణాల చెల్లింపులో పేదలే ముందుంటారని, మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను 98 శాతం తిరిగి చెల్లించడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, వ్యాపారులే బ్యాంకులకు బకాయిదారులుగా ఉన్నారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, పీహెచ్డీ చదివినవారు ఫ్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి బాధాకరమన్నారు. దేశంలో 4 కోట్ల మంది ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజ్లలో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, జి. కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
‘జీఎస్టీ’ కోసం మళ్లీ భేటీ
పార్లమెంటు వర్షాకాల భేటీపై వెంకయ్య సంకేతాలు * వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రభుత్వం మంతనాలు * కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత ఖర్గేతో భేటీ అయిన వెంకయ్య * అవసరమైతే సోనియా, రాహుల్‌లను కలిసేందుకూ సిద్ధం న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు వర్షాకాల భేటీని త్వరలో మళ్లీ సమావేశపరచే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. వచ్చే నెల (సెప్టెంబర్)లో సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బిల్లు ఆమోదం కోసం సహకరించాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 13వ తేదీన నిరవధిక వాయిదా పడిన అనంతరం.. ఆ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా (పూర్తిగా ముగించకుండా) ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గేను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుపై తాను ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిశానని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కూడా కలిసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలూ జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ‘‘పార్లమెంటు పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైన చర్చకు ప్రత్యామ్నాయం లేదు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ నియంత్రణ, భూసేకరణ బిల్లులు చాలా ముఖ్యమైనవి. జీఎస్టీ బిల్లు ఆమోదంలో జాప్యం జరిగితే.. భారత ప్రజలు, ప్రత్యేకించి యువత ఆకాంక్షలను అది దెబ్బతీస్తుంది’’ అని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లుకు ఎప్పుడు ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోందని ప్రశ్నించగా.. ‘‘సాధ్యమైనంత త్వరలో’’ అని బదులిచ్చారు. ఆ బిల్లుకు కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరుతున్న సవరణల గురించి ప్రస్తావించగా.. పార్లమెంటు ప్రారంభమైతే వాటిని పరిష్కరించగలమని.. ప్రభుత్వం వాటిని పరిశీలించే ఆలోచనతోనే ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఆగస్టు 31వ తేదీ వరకూ సమయం ఉంది. గడువులోగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకపోతే.. భూసేకరణకు సంబంధించి మరో 13 చట్టాలు కూడా చెల్లకుండాపోతాయి’’ అని వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్నందున ఈ లోగా దాని స్థానంలో చట్టం తెచ్చే అవకాశం లేకపోవటంతో.. నాలుగోసారి భూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముందని వెంకయ్య పరోక్షంగా సూచించారు. తుది బిల్లును చూశాకే: కాంగ్రెస్ న్యూఢిల్లీ/లక్నో: ప్రభుత్వం తుదిగా రూపొందించిన జీఎస్టీ బిల్లును పరిశీలించే వరకూ ఆ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేదీ లేనిదీ చెప్పలేమని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు తనను కలసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో వేర్వేరుగా ఆమోదించాల్సి ఉందని.. రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించరాదని పేర్కొన్నారు. సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఉద్ఘాటించారు. అది రాజ్యసభ ఆమోదం పొందాలంటే.. 4 సవరణలు ప్రతిపాదించిన కాంగ్రెస్ మద్దతు కీలకమని లక్నోలో అన్నారు. ‘‘జీఎస్టీ దేశ ప్రయోజనానికి సంబంధించినదే. కానీ.. 2011లో (యూపీఏ హయాంలో) ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఒక్క వ్యక్తి కారణంగా - నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ కారణంగా బీజేపీ దానిని వ్యతిరేకించింది. ఇప్పుడు అదే వ్యక్తి జీఎస్టీ ప్రాధాన్యం గురించి ప్రచారం చేస్తున్నారు.. ఆ బిల్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కరాదని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత రూపంలోని బిల్లులో చాలా లోపాలు ఉన్నాయన్నారు. పన్ను రేటు నిర్ణయించటం, పురపాలక సంఘాలు, పంచాయతీలకు పరిహారం, వివాదాల పరిష్కారానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు వంటివి అందులో ఉన్నాయని చెప్పారు. -
తలలు వంచుకుని నిల్చున్నవారా ప్రశ్నించేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన వేళ సోనియాగాంధీ ముందు తలలు వంచుకుని నిల్చున్నవారు ఇప్పుడు ప్రధామంత్రి మోదీ మెడలు వం చుతాననడం హాస్యాస్పదమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి చెం దిన మున్సిపల్, నగరపాలక సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలకు ఆది వారం పార్టీ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ తెలుగువాడిగా రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ మిత్రపక్షం కాకపోయినా ఫెడరల్ స్ఫూర్తితో టీం ఇండియా గా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనపై తప్పు డు ఆరోపణలు చేయడం, దురద్దేశాలు ఆపాదించడం తగదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదని కొందరు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన సమయంలోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. స్మార్ట్‌సిటీల ఎంపిక, విధివిధానాలు, మురికివాడలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, నగరాలకు కేంద్రం నుంచి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. దేశంలోని 500 నగరాల్లో రాబోయే ఐదేళ్లలో అమృత పథకం కింద మంచినీటి సరఫరా, పరిశుభ్రత, వ్యర్థపదార్థాల సేకరణ, శుద్ధీకరణ, పట్టణ రోడ్లు వంటివాటికి లక్షకోట్లు ఖర్చు చేయనున్నట్టుగా వెల్లడించారు. వరంగల్‌ను వారసత్వ నగరాల కింద ఎంపిక చేశామన్నారు. స్వచ్ఛభారత్ కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు ఇస్తామన్నారు. పట్టణల్లో స్వయం సహా యక బృందాలను నైపుణ్య అభివృద్ధి కేంద్రాలకు అనుసంధానం చేసి ఉపాధిని పెంచుతామన్నారు. ఆగిపోయిన రాజీవ్ ఆవాస యోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా పార్టీనేత గీతామూర్తి బీజేపీలో చేరారు. సదస్సుకు జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
అంత తేలిగ్గా అర్థం కాదు
*బడ్జెట్‌పై వెంకయ్య వ్యాఖ్య సాక్షి. హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత సులువుగా అర్ధమయ్యేది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.సంక్షిప్త వివరాలను చూస్తే బడ్జెట్ అర్థం కాదని, లోతుపాతులకు వెళ్లి చూడాల్సి ఉంటుందని చెప్పారు. అలా చూడకుండానే కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. సహచర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఆదాయాన్ని పెంచి దానిని అందరికీ పంచి సంక్షేమాన్ని కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అన్నీ ఫ్రీ అంటూ కాలం గడిపేయొచ్చనీ కానీ దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న దాన్లోంచి రూ.5 లక్షల కోట్లను ముందుగా ఆర్థిక సంఘం నిధుల రూపేణా రాష్ట్రాలకు ఇచ్చేసిందని, మిగిలిన దాంట్లోనే బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులకు అవకాశం ఉంటుందన్న విషయం ప్రజలు, రాష్ట్రాలు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాల వాటాగా ఇస్తున్న దానికి అదనంగా ఒకేసారి పది శాతం నిధులను 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే ఐదేళ్లలో కేంద్రం రెండు లక్షల కోట్లు అందజేస్తుందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న సీఎం చంద్రబాబుతో శనివారమే తాను మాట్లాడినట్టు వెంకయ్య తెలిపారు. లోటుపాట్లు ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాట్లాడమని చెప్పానన్నారు. బహిరంగ చర్చలకన్నా కలిసి కూర్చొని మాట్లాడడం మంచిదన్నారు. బాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని తాను అనుకోవడం లేదని, బాధను వ్యక్తం చేసినట్టుగా భావిస్తున్నానన్నారు. బాబుతో పవన్‌కల్యాణ్ భేటీ పెద్దగా ప్రాధాన్యమే ముంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తుది నిర్ణయమేమీ జరగలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్థిక శాఖ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని చెప్పారు. పోలవరానికి కేటాయింపులు తక్కువన్న దానితో తానూ ఏకభవిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు. -
కలిసి నడవాలి
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశం ప్రగతి పథంలో పయనించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ రంగ యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను శుక్రవారం చెన్నై ట్రేడ్ సెంటర్లో ఆయన ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆలోచనా ధోరణే చాలా భిన్నమైనదని, ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని అన్నారు. వ్యవసాయం, రహదారు లు, భవన నిర్మాణ రంగం ఇలా అన్నింటిపైనా ఆయన ఆలోచన ధోరణిని అందుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వనరుల్లో 43 శాతం వడ్డీల చెల్లింపునకే సరిపోతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమిం చాలంటే మరింత ఆర్థిక పురోగతి అవసరమని అభిప్రాయ పడ్డారు. అందుకే ప్రధాని మోదీ తాను నిద్రపోకుండా, ఎవ్వరినీ నిద్రపోనీకుండా పని చేస్తున్నామన్నారు. ప్రశంసా త్మకమైన మోదీ పనితీరును విపక్షాలు మెచ్చుకోవడం మాని మోకాలొడ్డడమే పనిగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని ఒక్కరోజులో తేలేమన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన సావనీర్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సభానంతరం ప్రదర్శన కమిటీ అధ్యక్షులు రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. సి మెంటు కంపెనీల యజమానులు ఇష్టారాజ్యం గా ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు కేంద్ర స్థాయిలో సిమెంటు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఇప్పట్లో సాధ్యం కాదు
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారంలో జాప్యం అనివార్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అన్నిరంగాల్లో అల్లకల్లోలంలోకి నెట్టేసిందన్నారు. ఫలితంగా ఆర్థికంగా కుంటువడిపోయిందని చెప్పారు. అలాగని మత్స్యకారుల సమస్యను కేంద్రం ఎంతమాత్రం విస్మరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాధాన్యక్రమంలో ఇతర సమస్యల పరిష్కారాన్ని సైతం తీవ్రంగా పరిగణిస్తున్నందున కొంత జాప్యం తప్పదని చెప్పారు. ఒక అనుకూలమైన పరిస్థితుల్లో మత్స్యకారుల సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. చెన్నై నగరంలో మెట్రోరైల్ పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయన్నారు. తిరువొత్తియూరు వరకు మెట్రోరైల్ పొడిగింపు పరిశీలన దశలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నీతి ఆయోగ్‌పై అనుమానాలు వద్దు: ప్రణాళికా సంఘం స్థానంలో ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ పై ఎటువంటి అనుమానాలకు తావులేదని వెంకయ్య అన్నారు. ఈ చట్టం వల్ల దేశంలో అనేక పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లభించడం ఖాయమన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే నీతి ఆయోగ్ చట్టం రూపకల్పన జరిగిందన్నారు. ఈ పథకం పూర్తి వివరాలను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపామని చెప్పారు. కేంద్ర స్థాయిలో అభివృద్ధి జరిగితే చాలదు, దేశంలోని అన్నిరాష్ట్రాలు అదేరీతిలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అడ్డుకోవడం సహజం కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రగతిని అడ్డుకోవడం సహజమని వెంకయ్య అన్నారు. గతంలో 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రణాళికా సంఘం ద్వారా ఎటువంటి అభివృద్ధిని సాధించలేదని అన్నారు. ప్రకటనతోనే పథకాలను సరిపెట్టిన గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిని పక్కనపెట్టిందని వ్యాఖ్యానించారు.