రియల్ హీరోలకు అవార్డులివ్వండి
సినిమా పరిశ్రమలో రియల్ హీరోలంటే స్టంట్ కళాకారులే. అలాంటి వారి కోసం దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు, నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్యధనుష్ గొంతు విప్పారు. ఇటీవల ఐనా సభలో మహిళాభివృద్ధి రాయబారిగా ఎంపికైన ఐశ్వర్య అటు వైపుగా అడుగులు వేస్తున్నారు. తన భర్త ధనుష్ హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తిన ఈమె తాజా చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ప్రస్తుతం సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన భర్త వుండర్‌బార్ ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా సినీ స్టంట్‌కళాకారుల జీవితాలను ఆవిష్కరించనున్నారు.
విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వనున్నారు. ఇక ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. కాగా సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా కేంద్రప్రభుత్వం ఉత్తమ కళాకారులకు జాతీయ అవార్డులను అందించడం ఆనవాయితీగా జరుగుతున్న విషయమే. అయితే ఇందులో స్టంట్ కళాకారుల కేటగిరి చోటు చేసుకోలేదు. ఇప్పుడు స్టంట్ కళాకారుల జీవితాలను డాక్యుమెంటరీగా రూపొందిస్తున్న ఐశ్యర్య ధనుష్ శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖా మంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు.
ఆయనతో కాసేపు ముచ్చటించిన ఐశ్వర్యధనుష్ తన డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించారు. అదే సమయంలో జాతీయ అవార్డుల కేటగిరిలో స్టంట్ కళాకారుల శాఖను చేర్చి వారికి అవార్డులందించి ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ కోసం గొంతు విప్పిన ఐశ్వర్యధనుష్‌కు పలువురు స్టంట్ మాస్టర్లు, స్టంట్ కళాకారులు సోషల్ మీడియా ద్వారా కృతజత్ఞలు తెలుపుతున్నారు.