తలలు వంచుకుని నిల్చున్నవారా ప్రశ్నించేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన వేళ సోనియాగాంధీ ముందు తలలు వంచుకుని నిల్చున్నవారు ఇప్పుడు ప్రధామంత్రి మోదీ మెడలు వం చుతాననడం హాస్యాస్పదమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి చెం దిన మున్సిపల్, నగరపాలక సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలకు ఆది వారం పార్టీ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ తెలుగువాడిగా రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు.
టీఆర్‌ఎస్ మిత్రపక్షం కాకపోయినా ఫెడరల్ స్ఫూర్తితో టీం ఇండియా గా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనపై తప్పు డు ఆరోపణలు చేయడం, దురద్దేశాలు ఆపాదించడం తగదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదని కొందరు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన సమయంలోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.
స్మార్ట్‌సిటీల ఎంపిక, విధివిధానాలు, మురికివాడలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, నగరాలకు కేంద్రం నుంచి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. దేశంలోని 500 నగరాల్లో రాబోయే ఐదేళ్లలో అమృత పథకం కింద మంచినీటి సరఫరా, పరిశుభ్రత, వ్యర్థపదార్థాల సేకరణ, శుద్ధీకరణ, పట్టణ రోడ్లు వంటివాటికి లక్షకోట్లు ఖర్చు చేయనున్నట్టుగా వెల్లడించారు. వరంగల్‌ను వారసత్వ నగరాల కింద ఎంపిక చేశామన్నారు. స్వచ్ఛభారత్ కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు ఇస్తామన్నారు.
పట్టణల్లో స్వయం సహా యక బృందాలను నైపుణ్య అభివృద్ధి కేంద్రాలకు అనుసంధానం చేసి ఉపాధిని పెంచుతామన్నారు. ఆగిపోయిన రాజీవ్ ఆవాస యోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా పార్టీనేత గీతామూర్తి బీజేపీలో చేరారు. సదస్సుకు జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.