Federal inspiration
-
దేశ శ్రేయస్సుకు మార్పు అనివార్యం
భారతదేశం మతపరమైన చట్టాలు, మత బోధనల చట్రంలో ఇరుక్కోని సర్వ సత్తాక లౌకిక శ్రేయో రాజ్యం. ప్రపంచంలోనే అత్యంత బలమైన పునాదులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రజాస్వామిక దేశం. నిజమే! కానీ ఇప్పుడు అధికారం కోసం లౌకికవాదానికి తూట్లు పొడిచే ఎత్తుగడలు దేశ లౌకికతత్వంతో పాటు సమాఖ్య స్పూర్తికీ పెను ముప్పుగా నిలువ బోతున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో దేశాన్ని విడగొట్టే యత్నాలతో వచ్చే సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటు న్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారి దేశ ఎన్ని కల రణ క్షేత్రంలో దూకుతోంది. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో వచ్చే ఎన్నికలకు వెళతామని ఖమ్మం సభలో ప్రకటించటం ఆయా వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రాజెక్టులు పచ్చగా మార్చాయి దేశంలో వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సృష్టించిన కల్లోలంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకు తలమయ్యాయి. పలు రంగాలు పూర్తిగా దెబ్బతిని ప్రభుత్వాలు నడవడం దుర్లభం అయిపోయింది. కానీ తెలంగాణలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న సమ్మిళిత అభివృద్ధి పథకాలు తెలంగాణ ను కోవిడ్ నష్టం నుండి తొందరగానే విముక్తం చేశాయి. పారిశ్రామిక రంగం కాస్త దెబ్బతిన్నా... వ్యవ సాయ రంగం మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధించింది. అందుకు కారణం... సమృద్ధి వర్షాలతో సముద్రం పాలయ్యే నీటిని బీడు భూములకు మళ్లించటమే. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్... నిరంతరం కరువుతో నకనక లాడే ఉత్తర తెలంగాణను ఇప్పుడు పచ్చని సీమగా మార్చింది. ‘మిషన్ కాకతీయ’ పాడుపడిన పల్లెల్లో కొత్త కళను తెచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో 2021– 22లో 378 శాతం వరి ఉత్పత్తి పెరిగి తెలంగాణ ఇప్పుడు ‘రైస్‌బౌల్ ఆఫ్ ఇండియా’గా రూపాంతరం చెందింది. పత్తి ఉత్పత్తి 61 శాతం పెరిగి తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో కీలకంగా మారింది. 2020–21లో తెలంగాణ వ్యవసాయం – అనుబంధ రంగాల అదనపు స్థూల విలువ 9.09 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది. పండిన పంటను మద్దతు ధరతో కొనుగోలు కూడా చేస్తున్నది. సమాఖ్య స్ఫూర్తి చెదరకుండా... ఇక విద్య, వైద్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం గ్రామాలకు రక్షిత మంచినీళ్లందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ముందడుగు వేసింది. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమం కావాలంటే, వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరించా లని కేసీఆర్ ఇచ్చిన పిలుపును దేశం ఆసక్తిగానే గమనిస్తున్నది. ఇదే సభలో పాల్గొన్న కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు సైతం దేశ సమాఖ్య స్పూర్తికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై ఇప్పటికే కేంద్రం అంతర్గత భద్రత, వ్యవసాయ, సహకారం, విద్యుత్ తదితర అంశాలపై రాష్ట్రాలతో చర్చించకుండానే చట్టాలను చేసుకుపోతోంది. అలాగే మరోవైపు రాష్ట్రాలు చేస్తున్న శాసనాలను గవర్నర్లతో నియంత్రించే ప్రయత్నాలు చేస్తు న్నది. ఈ తీరు భారత సమాఖ్య స్పూర్తికి భంగం కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో అనేక జాతులు, మతాలు, భాషలు, కులాలు, జీవన విధానాలూ ఉన్న సువిశాల భారత దేశ ‘భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి’ని ముందుకు తీసుకు వెళ్లడం ఇప్పుడు అత్యవసరం. ఈ విధిని నిర్వహించడంతో పాటూ... సమాఖ్య స్పూర్తికి దెబ్బ తగలకుండా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అజెండా దేశమంతా విస్తరించాలంటే ఒక్కసారి భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇచ్చి చూడాలి. మతం, కులం పేరుతో రాజకీయాలు చేసే చోట అభివృద్ధి–సంక్షేమంతో వచ్చే గుణాత్మక మార్పుతోనే లౌకిక స్ఫూర్తికి కొత్త శక్తి వస్తుంది. (క్లిక్ చేయండి: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!) - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రాను రానూ వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నారు గవర్న ర్లు. వారి బాధ్యత రాజ్యాంగ పరిరక్షణతో పాటూ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ, సూచనలూ ఇవ్వడం. శాసనసభలో ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరిని తొలుత ఆహ్వానించాలనే అంశంలో, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ట్ర శాసన సభ, మండలిలో ఆమోదించిన బిల్లు లను లాంఛనంగా ఆమోదించడం గవర్నర్ విధి. కొన్ని ప్రత్యేక, అసాధారణ సందర్భాలలో బిల్లులను రాష్ట్రపతికి పంపవచ్చు. లేదంటే గవర్నరే బిల్లులపై తన అభిప్రాయంతో సహా తిరిగి చట్ట సభలకు పంపవచ్చు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుండి తిరిగి వచ్చిన బిల్లులను, గవర్నర్ అభిప్రాయానికి అనుగుణంగా సవరించినా, లేదా యధావిధిగా మరోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌కు వాటిపై ఆమోద ముద్ర వేయడం తప్ప వేరే మార్గం లేదు. బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చను తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో గవర్నర్ వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా.. కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులు నెలలు తరబడీ, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 20 బిల్లులను అనేక మాసాలుగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో గవర్నర్లను ఉపయోగించు కొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ... గవర్నర్ల నుండి రప్పించిన తప్పుడు నివేదికల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను డిస్మస్ చేసి రాష్ట్రపతి పాలనను విధించి, గవర్నర్ల ఆధ్వర్యంలో కేంద్రం పాలన సాగించడం చూశాం. కేరళలో ఎన్నికైన కమ్యూ నిస్టు ప్రభుత్వమే మొదటిసారిగా ఆర్టికల్ 356 బారిన పడింది. ఇప్పటి వరకు 41 ప్రభుత్వాలు అలా డిస్మిస్ కాబడ్డాయి. 1977లో జనతాపార్టీ అప్పటివరకు ఉన్న గవర్నర్లను డిస్మిస్ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకొంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగానే గవర్నర్ల మార్పు కొనసాగింది. 1984లో ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీ ఆర్‌ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతాన్నీ, కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఆర్ బొమ్మై చారిత్రాత్మక కేసునూ ఎలా మరవగలం? బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. గతంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖంఢ్ వంటి రాష్ట్రా లలో అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీని విస్మరించి, బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు గవర్నర్లు సహ కరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనైతే 2016లో గవర్నర్ ఆజ్ఞ మేరకు శాసనసభ సమావేశాలను ముందుకు జరిపి, ముఖ్యమంత్రి లేకుండానే ఏకంగా ఒక హోటల్లో అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మెజారిటీ లేనప్పటికీ తెల్లవారు జామున బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, వారి పార్టీ ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయాలనూ, ఆ సందర్భంగా గవర్నర్ వ్యవహరించిన తీరునూ ప్రజలంతా గమనించారు. సర్కారియా కమిషన్‌తో పాటు, అనేక కమిషన్లు గవర్నర్ వ్యవస్థ తీరును తప్పు పట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫార్సులు చేశాయి. కానీ అవన్నీ బుట్ట దాఖలే అయ్యాయి. గవర్నర్ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే... అది ఆరవ వేలు లేదా అపెండిక్స్ లాంటిదని అర్థమవుతోంది. దాన్ని రద్దు చేయడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానం కూడా చేసింది. గవర్నర్ వ్యవస్థ రద్దయితే... అది నిర్వహించే బాధ్యతలను న్యాయ వ్యవస్థకూ, శాసన సభలోని సెలెక్ట్ కమిటీ లేదా స్టాండింగ్ కమిటీకి అప్పగించవచ్చు. ఉదాహరణకు మెజారిటీ లేని సందర్భంలో సీఎంగా ఎవరిని ఆహ్వానించాలి, ప్రమాణ స్వీకారం, బలాబలాలు లాంటి వివాదాస్పద అంశాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. సంక్లిష్ట సమస్యలపై బిల్లులను కూలంకషంగా చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించవచ్చు. లేదా స్టాండింగ్ కమిటీలకు అందించవచ్చు. ఆ కమిటీలు సూచించిన ప్రతి పాదనలతో బిల్లులపై చర్చించి చట్టసభలు ఆమోదిస్తే, గవర్నర్ జోక్యం ఇక అవసరం ఉండదు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం
బన్సీలాల్‌పేట్: రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరిస్తోందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మంగళవారం సహకార సమాఖ్యవాదం –ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని కాలరాసే విధంగా రాజకీయ నిర్ణయాలతో రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతోందన్నారు. ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో అనేక సమస్యలను సృష్టిస్తూ గందరగోళం చేస్తోందని నిందించారు. ప్రముఖ విద్యావేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పీఎల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, సీపీఐ కార్యదర్శి కె. సాంబశివరావు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఆమ్ఆద్మీ పార్టీ నేత డాక్టర్ సుధాకర్ మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాల సాధికారతపై దాడి చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. సెస్‌ల పేరిట రాష్ట్రాల ఆర్థికవనరులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాష్ట్ర జాబితాలోని అంశాలను కేంద్రం తీసుకొని పార్లమెంట్లో చట్టా లు చేయడమంటే రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేయడమేనన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ అక్రమాస్తులు పోగు చేసుకొనేవారిని వదిలేసి సమాజహితం కోసం పనిచేస్తున్న వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను కేంద్రం జైల్లో పెట్టిందన్నారు. -
ఇదేం సమాఖ్య స్ఫూర్తి?
కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి రాష్ట్రాలను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. మతం, భాష, సంస్కృతి పేరుతో దేశంలోని బహుళ సంస్కృతులను ఒకే గాటన కట్టేసి ఏకరూపత సాధన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీని ఎన్నుకుంటేనే పాలన సజావుగా ఉంటుందన్న సంకేతాన్ని ఆయా రాష్ట్ర ప్రజలకు పంపిస్తోంది. నిజానికి ప్రాంతాలకు ప్రాముఖ్యం ఇచ్చినంతకాలం, స్థానికతలను గౌరవించినంతకాలం... ఈ దేశ ప్రజలు ‘భారత్ మాతాకీ జై’ అనడానికి సంకోచించరు. వారు ఈ దేశం తమదని భావిస్తారు. స్థానిక ప్రజల అవసరాలు, కోరికలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిం చడం; వారి సాంస్కృతిక విలువలను నిలబెట్టడం, ఆచారాలను గౌరవించడం వంటి చర్యల ద్వారా ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల్ని దేశభక్తులుగా నిలబెట్టుకుంటాయి. భిన్నత్వంలో ఏకత్వానికి అరుదైన ఉదాహరణ భారత్. అందుకు భారతీయులుగా మనమంతా గర్వించాలి. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ సందర్భాన మన సంబరం అంబరాన్ని అంటడం సహేతుకం. కానీ... గత ఏడెనిమిదేళ్ళుగా ఈ దేశంలో పరిణామాలు చూస్తే భారతీయాత్మకు ప్రమాదం ముంచుకొస్తున్నదన్న ఆందోళన కలుగుతున్నది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగజేస్తున్న కేంద్ర ప్రభుత్వ దుందుడుకు విధానాలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు స్వాతంత్య్రమే లక్ష్యంగా దేశమంతా కాంగ్రెస్ గొడుగు కిందకు వచ్చింది. స్వాతంత్య్రానంతరం మెల్లిగానే అయినా బలంగా ప్రాంతాలు తమ గుర్తింపును నొక్కి చెప్పడం ప్రారంభించాయి, ప్రాంతీయ భావనలు, అస్తిత్వాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైన ప్రాంతీయ నాయకుల ఆవిర్భావం ద్వారా రాష్ట్రాల ఉనికి బలపడింది. ఈ నాయకులు కేంద్రం పట్టులో ఉండకుండా తమం తట తాముగా శక్తిమంతంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ ‘శక్తి కేంద్రా లను’ నిరోధించే కేంద్రం, బలమైన పట్టుకు ఇది ముప్పుగా భావించిన అధిష్టానం స్థానిక నాయకుల బలాన్ని అరికట్టే ప్రయత్నాలు చేసింది. దీనితో ప్రాంతీయ సమూహాలు కొత్త పార్టీలుగా ఆవిర్భవించడంతో, క్రమంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పట్టు తప్పింది. విభిన్న సాంస్కృతిక వారసత్వాలు, భాషా సంపద, ఆహార ఆహార్య ఆచార వ్యవహారాలు, బహుళ మత విశ్వాసాలు కలిగిన ప్రజలను ఒకే ఒక్క గుర్తింపులో ఇమడ్చలేరు. ఇది మరింత అసహనా నికి, విభజనకు, తిరుగుబాటుకు మాత్రమే దారి తీస్తుంది. గతంలో సోవియట్ యూనియన్ విభిన్న ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించి, తనలో విలీనం చేసుకుంది. చివరికి అది కుప్పకూలి ప్రతి ప్రాంతం స్వతంత్ర దేశంగా విడిపోయింది. అమెరికాలో రాష్ట్రాలకు విస్తారమైన స్వేచ్ఛ ఉంది. ఐక్యత ఎట్లా, ఎందుకు సాధించబడుతుందో అర్థం చేసుకోవా లంటే – దేశాలు విఫలం కావడానికి, విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను అధ్యయనం చేయాలి. విచ్ఛిన్నమైన దేశాలలో స్పష్టంగా కనిపించే ఒక అంశం ఏమిటంటే ‘ఏకరూపత’ పేరిట జరిగే అరాచకం! మెజారిటీ మతం (అధికారికమైనా, కాకపోయినా) ఇతర మతాలను సహించకపోవటం; ఒక భాషకు ఇతర భాషలకంటే ప్రాముఖ్యం ఇవ్వడం; స్థానిక సంస్కృతిని విస్మరించడం; వారి మనోభావాలను, ఆకాంక్షలను పక్కన పెట్టడం! ఈ సాంస్కృతిక ఆధిపత్య ధోరణులను ఎదిరించే ప్రాంతీయ పార్టీలు, నాయకులు లేకుంటే... ఆ మాత్రం ‘ప్రెషర్ రిలీజ్ వ్యవస్థ’ లేకుంటే... వాటిని సహించకుంటే... వాటిని నిర్మూలించాలి అనుకుంటే... దీర్ఘకాలిక పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఒక్కటే మతం అన్ని రాష్ట్రాల ప్రజలను ఏకం చేయగల దనేది వట్టి అపోహ మాత్రమే కాదు, చారిత్రక అవగాహన లేక పోవడం కూడా! తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్లలో ఉన్న మతం ఒకటే అయినా... బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడినట్లు? ఒకటే భాష అయినంత మాత్రాన వివక్షను సహించలేమని పోరాడి రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ నేర్పిన పాఠాల్ని కూడా మర్చిపోరాదు. కాబట్టి మతం వల్ల, భాష వల్ల బలవంతంగా ఐక్యత సాధించగలమని నమ్మే వారు ఇంకా ఆలస్యం చేయకుండా మేలుకోవాలి. దేశ సమైక్యతకు ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం. విస్తారమైన భౌగోళిక, సాంస్కృ తిక, భాషా వైవిధ్యం ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ ఒక్కటిగా ఎట్లా ఉండగలుగుతున్నదని ఈ వ్యాస రచయితలను ఇంగ్లండులో కొలీగ్స్ అడిగారు. ఇంకా ఎందరో ఈ భిన్నత్వంలో ఏకత్వ భావనకు ఆశ్చర్యపడుతూ ఉంటారు. కేవలం భావనయే కాదు, అది స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా బలంగా ఉండడం ఒక అబ్బురమైన వాస్తవం. దానికి ప్రాంతీయ పార్టీలే కారణం. ప్రాంతాలకు ప్రాముఖ్యం ఇచ్చినంతకాలం, స్థానికతలను గౌరవించినంతకాలం ఈ దేశ ప్రజలు ‘భారత్ మాతాకీ జై’ అనడానికి సంకోచించరు. వారు ఈ దేశం తమదని భావిస్తారు. స్థానిక ప్రజల అవసరాలు, కోరికలు, ఆకాంక్షలకు ప్రాతి నిధ్యం వహించడం; వారి సాంస్కృతిక విలువలను నిలబెట్టడం; వారి ఆచారాలను గౌరవించడం వంటి చర్యల ద్వారా ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల్ని దేశభక్తులుగా నిలబెట్టుకుంటాయి. మన దేశ ఐక్యతకు ప్రమాదం బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల కాదు, రాష్ట్రాలపై కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే వస్తుంది. రాష్ట్రాలలో బలమైన పార్టీలు, నాయకులు ప్రజాస్వామిక మార్గాల ద్వారా, ప్రజలను సమీకరించడం ద్వారా ప్రాంతీయ గౌర వాన్ని నిలబెట్టవచ్చు, రక్షించవచ్చు. రాష్ట్రాల ఆకాంక్షలు గౌరవించని, స్థానిక సంస్కృతితో సంబంధం లేని ‘ఏకరూప’ రాజకీయ, సామాజిక విధానాలు ఉండే జాతీయ పార్టీలు మనలేవు అనడానికి దక్షిణాది మంచి ఉదాహరణ. తమ పాలనలోని ఒక్క కర్ణాటకలో తప్ప దక్షిణాది రాష్ట్రాలపట్ల కేంద్రంలోని అధికార పార్టీ వివక్ష ఈ ఏడేళ్ళల్లో తారస్థాయికి చేరుకున్నది. తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష మరీ ఎక్కువ అయింది. బెంగాల్, ఢిల్లీ, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలతో సహా దక్షిణాది కూడా బలంగా ఈ ‘ఫెడరల్ విఘాతం’ పట్ల గొంతు కూడదీసుకుంటున్నది. రాష్ట్రాలలో పార్టీలు ఏవైనా... రాజకీయ అవగాహనలు, అవసరాలు ఎట్లున్నా... కేంద్రం పెత్తనాన్ని నిలువరిం చకపోతే ఆయా పార్టీలకే కాదు రాష్ట్రాల ఉనికికి కూడా అర్థం లేకుండా పోతుంది. ‘మీపై అన్ని హక్కులూ మావే – బాధ్యతలు మాత్రం మాకొద్దు’ అన్న రీతిలో కేంద్రం రాష్ట్రాల మీద దాష్టీకం చేస్తున్నది. రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థ నేడు నామమాత్రం అయినాయి. ఒక్కటొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది. రాష్ట్రాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను తన అధీనంలోకి తీసుకుంటున్నది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర పరిధిలోది అయినా కొను గోళ్ళు–అమ్మకాలు, ఎరువులు–ఎగుమతులు, మద్దతుధర–గోడౌన్లు అన్నీ తన గుప్పెటలో ఉంచుకున్నది. రాష్ట్రాలు ఆందోళన చెందు తున్న మరో అంశం– విద్యుత్ సంస్కరణలు. ‘విద్యుత్ చట్ట సవరణల బిల్లు’ ఉద్దేశం కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించడమే! పంపుసెట్ల దగ్గర మీటర్లు పెట్టడం దగ్గర నుంచి, రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ నిర్వహణ మొత్తం తన గుప్పిటలో పెట్టుకుంటోంది కేంద్రం. విద్యుత్ ధరలు, కొనుగోళ్ళు, సరఫరా మొత్తం కేంద్రం అజమాయి షీలో ఉంటాయి. వారు చెప్పినట్టు వినకపోతే రాష్ట్రాలకు పెనాల్టీ విధిస్తుంది. రాష్ట్రాలకు అప్పులు రాకుండా చేస్తుంది! న్యాయంగా రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాను కూడా ఇవ్వడంలో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల చేతుల్లోని సహకార వ్యవస్థనూ కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పుడు ‘జనన, మరణ రిజిస్ట్రేషన్ చట్టం’ సవరణ ముసుగులో రాష్ట్రాల మరో అధికారాన్ని కూడా కత్తి రించ బూనుకుంటున్నది. వారు తలపెట్టిన ‘సంస్కరణల’ ప్రకారం జనన, మరణ రిజిస్ట్రేషన్ వివరాల పర్యవేక్షణ కేంద్ర హోంశాఖ అధీనంలోకి వెళ్తుంది. సివిల్ సర్వెంట్స్‌ను తమ ఇష్టం వచ్చినట్టు, రాష్ట్రాలతోనూ అధికారులతోనూ సంప్రదించకుండా కేంద్ర సర్వీసుల లోనికి రప్పించుకోవడం కోసం ఒక దుర్మార్గమైన చట్టాన్నీ తేబోతున్నది కేంద్రం. గతంలో ఇట్లాంటి చొరబాట్లు చాలానే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పరీక్షలను ఏకీకృతం చేసింది. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకే పరిమితమైన బీఎస్ఎఫ్ దళాల పరిధిని 50 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఓడ రేవులపై రాష్ట్రాల అధికారాన్ని కూడా కబళించ చూస్తున్నారు. ఇదేమి ఫెడరల్ స్ఫూర్తి? ఇదేమి రాజ్యాంగబద్ధత? ఈ దేశ ప్రజలకు దక్కాల్సినవి ఏమిటో స్ఫటిక స్పష్టంగా చెప్పింది – మన రాజ్యాంగం. అన్ని వ్యవస్థలూ ఇందుకు లోబడి పనిచేసే అనివార్య తను కల్పించే విషయంలో రాజీ పడవద్దు. అప్రమత్తంగా ఉందాం. అది మన బాధ్యత. హక్కు కూడా! అప్పుడే మనం మిథ్యాతాత్పర్యాల కేంద్రం నుంచి రాష్ట్రాలను రక్షించుకోగలం! వధ్యశిల నుంచి తప్పించు కోగలం!! – శ్రీశైల్ రెడ్డి పంజుగుల, తెరాస నాయకుడు డాక్టర్ సతీష్ చంద్ర, ఎండీ, ఎఫ్ఆర్సీఎస్ (జీపీ), ఇంగ్లండ్ -
సమాఖ్య స్ఫూర్తి ఓ ఎండమావి
కొన్ని మాటలు చెప్పుకోవడానికి సొంపుగా ఉంటాయి. కానీ, ఆచరణలో చూసినప్పుడు ఆవేదన కలుగుతుంది. ‘సమాఖ్య స్ఫూర్తి’ అనే మాట అటువంటిదే. భారతదేశం రాష్ట్రాల కూటమిగా ఉంటుందనీ, సహకార సమాఖ్య భావస్ఫూర్తితో పని చేస్తుందనీ భారత రాజ్యాంగం చెబుతుంది. కేంద్రం, రాష్ట్రాలు వాటి పరిధిలో వేటికవి సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఒకదానికొకటి సహ కరించుకొంటూ జాతీయ సమైక్యతతో ముందుకు సాగుతాయి. ఇందుకు అనుగుణంగానే శాసన నిర్మాణాధికారాలు, కార్యనిర్వహణాధికారాలు, ఆర్థిక నిర్వహణాధికారాల విభ జన జరిగింది. ఆచరణలో ఇది జరుగుతున్నదా? తాజా ఉదాహరణనే చూద్దాం. సరిహద్దు భద్రతాదళాల (బీఎస్ఎఫ్) చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఓ సవరణ చేసింది. దాని ప్రకారం, సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో 15 కిలోమీటర్ల లోపలికి వచ్చి సోదాలు, జప్తులు, అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఉన్న అధికారాల పరిధిని పెంచారు. తాజా సవరణతో బీఎస్ఎఫ్ బలగాలు 50 కిలోమీటర్ల లోపలికి వెళ్లవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు. కేంద్రం తన వద్ద నున్న సమాచారంతో భద్రతా చర్యల దృష్ట్యా ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్న ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తో సమర్థించాలనుకొన్నా, సదరు నిర్ణయం తీసుకోవడానికి ఆయా రాష్ట్రాలతో సంప్రదించాల్సిన అవసరం లేదా? పార్ల మెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోవాలి కదా? భారతీయ జనతా పార్టీ తనను తాను ‘పార్టీ విత్ ఎ డిఫరెన్స్’ అని చెప్పుకొనేది. తాము అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థలను సమూలంగా మార్చేస్తామని చెప్పు కోవడం అందరికీ తెలుసు. గుజరాత్‌కు 13 ఏళ్లు ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ... అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల కేంద్రీకృత విధానా లను ప్రతి సందర్భంలోనూ ఎండగట్టారు. తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో మాట్లాడే అవకాశం కలిగి నప్పుడు ఆయన ఎంచుకొన్న అంశం... ‘యూపీఏ ఎ గ్రేవ్ థ్రెట్ టు అవర్ ఫెడరలిజం’. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించడాన్ని మోదీ తీవ్రంగా నిరసించారు. రాష్ట్రాలు తమ వార్షిక ప్రణాళికలను ఆమోదింపజేసుకోవడానికి ఢిల్లీలోని యోజన భవన్లో ఉన్న ప్లానింగ్ కమిషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవస్థపై గట్టిగా మాట్లాడారు. అసలు రాష్ట్రాల ప్రాధాన్యతలు కేంద్రానికి ఏం తెలుస్తాయంటూ ప్రశ్నించడమేకాక, రాష్ట్రాలను పెద్దస్థాయి మున్సిపాలిటీ లుగా మార్చేశారని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తను ఎదుర్కొంటున్న వివక్షను ఎత్తి చూపినప్పుడు ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. 2014లో నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చినప్పుడు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో కొత్త శకం ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే, బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించి 8 ప్రధాన హామీలు ఇచ్చింది. గవర్నర్ల నియామకంలో రాష్ట్రాలను సంప్రదించే సత్సంప్రదాయాన్ని పాటిస్తామనీ, రాష్ట్రాలు చట్టాలు చేసే అధికారంలో జోక్యం చేసుకోబోమనీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే దుష్ట సంప్రదాయానికి చెల్లుచీటీ పాడుతామనీ... ఇలా నిర్ది ష్టమైన హామీలు అందులో ఉన్నాయి. ‘సమాఖ్య స్ఫూర్తి’కి ఓ నూతన నమూనా ప్రవేశపెడతామని చెప్పారు. కాంపిటీటివ్ ఫెడరలిజం అంటూ కొత్త పదాలు వాడారు. అధికారం చేపట్టిన తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి ఆ స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ప్రవేశ పెట్టడం మినహా ఏ నూతన ఒరవడిని సృష్టించలేదు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఆర్టికల్ 356ను ఉపయోగించి బీజేపీయేతర ప్రభుత్వాలను దింపివేశారు. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ నినాదంతో అమలులోకి వచ్చిన జీఎస్టీ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా సెస్సులు, సర్‌చార్జీలు వసూలు చేసుకొంటూ రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదు. రాష్ట్రాల జాబితాలోని ‘వ్యవసా యం’కు సంబంధించి ఏ చర్చా లేకుండా 3 వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ఆమోదింపజేసుకొన్న తీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసింది. ఉమ్మడి జాబితాలోని విద్య, విద్యుత్‌లకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు, అంగీకారాలు లేకుండానే నూతన విద్యా విధానం, విద్యుత్ సవరణ బిల్లులు రూపుదిద్దుకొన్నాయి. ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్థులను ప్రైవేటుపరం చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో ఆయా రాష్ట్రాలలో అశాంతి రేకెత్తు తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాభాలలో నడుస్తున్న విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ మైన్స్ లేవని, నష్టాలు వస్తున్నాయని ప్రైవే టీకరణ చేయడానికి సిద్ధం కావడంతో ఆ ప్రాంత ఉద్యో గులు, ప్రజలలోనేకాక రాష్ట్రవ్యాప్తంగా అలజడి నెలకొంది. నష్టాల సాకుతో ప్రైవేటీకరణ చేస్తున్నామని చెబుతున్న కేంద్రం లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ఎందుకు ప్రైవేటీ కరణ చేయాల్సి వస్తున్నదో చెప్పడం లేదు. ‘చిన్న రాష్ట్రాలు బలమైన కేంద్రం’ ఉండాలన్నది బీజేపీ మొదట్నుంచీ నమ్మిన సిద్ధాంతం. అందుకు అను గుణంగానే ఆంధ్రప్రదేశ్ విభజనలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అయితే, విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని... ఆంధ్రకు ఐదేళ్లు కాదు, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు ఏడేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన తెలుగుదేశం నిష్క్రియాపరత్వం రాష్ట్రానికి శాపమైంది. కృష్ణానదీ జలాల వాటాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను పెద్దన్నపాత్ర పోషించి పరిష్కరించవలసిన కేంద్రం కొన్ని ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశప్రధానిగా ఏడేళ్లు పాలనా పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న నరేంద్ర మోదీ దేశ ప్రజల జీవన పరిస్థితులు మెరుగు చేశానని, అద్భుతాలు జరిగాయంటూ తనకు తానే కితాబు నిచ్చుకొన్నారు. ప్రపంచ ఆహార సూచీలో భారత్ ర్యాంకింగ్ పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి చిన్న దేశాలకంటే దిగజారడం ఓ అద్భుతమేమో! అభివృద్ధికి కొలమానాలు ఇంతకంటే మెరుగైనవి ఉంటే అవేమిటో బీజేపీ పాలకులు చెప్పాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర సంబం ధాలను ఏవిధంగా మెరుగుపరిచారో చెప్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
సమాఖ్య స్ఫూర్తి ఏదీ? ఎక్కడ?
కేంద్రీకృత విధానాలకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ కాగా, ఆ విధానాలను తూర్పారపడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రాష్ట్రాల హక్కులను హరించడంలో తామేమీ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నం కాదని నిరూపిస్తోంది. నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరణ, రాష్ట్రాల అధికారాలలో కోత వంటి అంశాల్లో కేంద్రం ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటం. కాగా జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య స్ఫూర్తిని నీరుగార్చేదిగా ఉంది. జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకొనే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, అందుకు అనుగుణంగా చట్టంలో చేర్చిన అంశాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. జీఎస్టీ రాబడులు తగ్గాయి కాబట్టి రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు ఎగ్గొట్టడం మన సమాఖ్య స్ఫూర్తికే భంగకరం. మన దేశంలో ఉన్నది అర్థఫెడరల్ విధా నంతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని; కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగానూ, పరస్పరం సహకరించుకొంటూ రాజ్యాంగ లక్ష్యాలను సాధించే దిశగా సాగాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రవచించినా, అది ఆచరణకు నోచలేదు. రాజ్యాంగ స్వరూపంలోనే కేంద్రానికి ఎక్కువ అధికారాలు దఖలు పడ్డాయి. కారణాలు ఏవైనా, ప్రపంచంలోని ఏ ప్రజాస్వామిక సమాఖ్య వ్యవస్థలో లేనన్ని వైరు ధ్యాలు మన వద్ద కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనవి వనరుల సమీకరణ, ప్రజా సంక్షేమ బాధ్యత. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఎప్పటికప్పుడు మెరుగుపరిచే గురుతర బాధ్యత రాష్ట్రాలపైనే ఎక్కువ. ప్రజా రక్షణ, దేశ భద్రత, సామాజిక విముక్తి, ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరత మొదలైన అంశాలలో కేంద్ర, రాష్ట్రాలది ఉమ్మడి బాధ్యత. దీని ఆధారంగానే విధులు, బాధ్యతలు, హక్కుల విషయంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబి తాలు ఏర్పాటయ్యాయి. వైరుధ్యం ఎక్కడ ఉందంటే ఎక్కువ బాధ్య తలు కలిగిన రాష్ట్రాలకు తక్కువ అధికారాలు కల్పించబడ్డాయి. దీనిని ఆసరాగా చేసుకొని కేంద్రం తనకున్న అపరిమితమైన అధికారాలతో రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవడం ఎక్కువగా కనపడుతుంది. ఫలితంగానే, రాష్ట్రాలు ఆశిం చిన స్థాయిలో బలపడలేకపోయాయి. పాత బాటలోనే ఎన్డీఏ కేంద్రీకృత విధానాలకు అంకురార్పణ చేసింది కేంద్రంలో సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీయే. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రా లలో ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా చేసుకొని అధికారం చలాయిం చిన చరిత్ర, తమ పార్టీ అధికారంలేని రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఆ విధానాలను తూర్పార పడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రాల హక్కులను హరిం చడంలో తామేమీ కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నం కాదని నిరూపిస్తోంది. గత ఎన్డీఏ–1 ఐదేళ్ల పాలనగానీ, ప్రçస్తుత ఎన్డీఏ–2 పద్నాలుగు నెలల పాలనగానీ పరిశీలించినపుడు నోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరణ, తదితర అంశాలలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటం. రాష్ట్రాల పరిధిలోని అంశాలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేసి, మళ్లీ వాటిల్లో కొన్నింటిని కేంద్ర జాబితాకు బదిలీ చేసు కోవడం కేంద్రానికి పరిపాటిగా మారింది. జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకొనే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చిన హామీ, అందుకు అనుగుణంగా చట్టంలో చేర్చిన అంశాలకు పూర్తి విరు ద్ధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట. ‘కరోనా’ కారణంగా పారిశ్రామిక వ్యాపార రంగాలు కుదేలైన నేప థ్యంలో జీఎస్టీ వసూళ్లు అంచనాలు అందుకోలేకపోయాయని, మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు కావల్సి ఉండగా కేవలం 65,000 కోట్లు మాత్రమే వచ్చాయని, కనుక రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించలేమని కేంద్రం తెగేసి చెప్పడం అసాధారణం. లాభాలొస్తే మాకు, నష్టాలొస్తే మీకు అనే చందంగా వ్యవహరించడం కేంద్రానికి తగని పని. రాష్ట్రాలకు నష్టపరిహారంగా ఉపయోగించాల్సిన రూ. 47,272 కోట్ల నిధులను కేంద్రం అక్రమంగా తనవద్ద ఉంచేసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనలర్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికను పరిశీలించినట్లయితే, కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లం ఘించినట్లు స్పష్టమవుతుంది. కరోనా కష్టకాలంలో ఉమ్మడి బాధ్యత ‘ఒకే దేశం–ఒకే పన్ను’ నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం లోని ఎన్డీఏ–1 ప్రభుత్వం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016 సెప్టెంబర్ 8న వస్తు, సేవల పన్నులను నిర్ణయించడానికి జీఎస్టీ కౌన్సిల్ అనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీని సజావుగా ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఆ సందర్భంగా రాష్ట్రాలకు పలు వాగ్దానాలు చేశారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాల ఆదాయాలకు నష్టం వాటిల్లదని, ఒకవేళ లోటు ఏర్పడినట్లయితే కేంద్ర సంచితనిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్రాల ఆర్థికలోటును భర్తీ చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో నాటి కేంద్ర ఆర్థికమంత్రి పదేపదే చెప్పారు. నిజానికి, జీఎస్టీ బిల్లు ముసాయిదాలోనే రాష్ట్రాల అభ్యంతరాలకు చోటు లేకుండాపోయింది. బిల్లులోని సెక్షన్ 12(9) ప్రకారం జీఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయమైనా జరగాలంటే, ఆ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేవారిలో 75% మంది ఆమోదం పొందాలి. అయితే, జీఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాలకు 67% ఓట్లు మాత్రమే కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పాల్గొనే ఇరువురు మంత్రులకు 33% ఓట్లు నిర్ధారించారు. అటువంటప్పుడు జీఎస్టీ కౌన్సిల్లో తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే అవకాశమే లేదు. జీఎస్టీ వసూళ్లు మందగించడానికి కరోనా కారణం అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన కొంతవరకు నిజమే. కానీ, కరోనా ప్రభావం ఎక్కువగా రాష్ట్రాలపై పడింది. కరోనా దెబ్బకు కేంద్రానికి లభించే ఆదాయంలో దాదాపు 40% మేర క్షీణత నమోదుకాగా, రాష్ట్రా లకు లభించే ఆదాయంలో 60% నుంచి 70% తగ్గుదల కనిపిస్తున్నది. పైగా, కరోనా కట్టడికి, బాధితుల చికిత్సకు కేంద్రం కంటే రాష్ట్రాలే అధిక మొత్తంలో నిధులు ఖర్చు పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ గడ్డు పరిస్థితులలో రాష్ట్రాలకు బకాయిలు చెల్లించ కుండా అవసరమైన నిధుల సమీకరణకు ‘అప్పులు తెచ్చుకోండి’ అని కేంద్రం నోటి మాటగా చెప్పడమే ఆశ్చర్యం. ఒకవైపు రుణాల స్వీకరణకు రాష్ట్రాలపై ఎఫ్ఆర్బిఎం పరిమితులు మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి. ఇంకోవైపు పరిమితులను మించి రుణాలు స్వీకరించాలంటే సంస్కర ణల అమలు పేరుతో కొన్ని రంగాలలో అదనంగా పన్నులు వేయా లన్న కేంద్రం ఆంక్షలు మరోవైపు. కోవిడ్ ఎంత కాలం ఉంటుందో, రెవెన్యూ లోటు ఎంత పెరుగుతుందో తెలియనపుడు రాష్ట్రాలు అధిక వడ్డీపై ఏవిధంగా అప్పులు తెచ్చుకోగలవు? బ్యాంకుల నిరర్థక ఆస్తులు గత యూపీఏ హయాంలో దాదాపు 4 లక్షల కోట్లు ఉండగా, గత ఆరేళ్లల్లో ఆ మొత్తం 10 లక్షల కోట్లకు చేరాయి. దీంతో బ్యాంకులే నిధుల కొరతతో సహాయానికై రిజర్వు బ్యాంకు వైపు చూస్తున్నాయి. ఎంతకాలం ఇలా? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉన్నదంటే జీఎస్టీ వసూళ్లలోనూ మొండిబకాయిలు కొండలా పెరుగుతున్నాయి. జీఎస్టీ రేట్లు, శ్లాబుల మార్పుపై జీఎస్టీ కౌన్సిల్ మొదట్లోనే సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, శ్లాబులలో మార్పులు చేసి ఉంటే పారిశ్రామిక వర్గాలకు వెసులుబాటు లభించేది. జీఎస్టీని ఎవ్వరూ ఎగ్గొట్టేవారు కాదు. కేంద్రం ఏకపక్షంగా ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడి జీఎస్టీ కట్టలేక చేతులెత్తేశాయి. కేంద్రం అవలంభించిన ఇటువంటి విధానాలు రాష్ట్రాలకు శాపాలుగా మారాయి. ప్రణాళికాసంఘం రద్దు కానంత వరకు కనీసం ఆ సంస్థ రాష్ట్రాల విన్నపాలను, డిమాండ్లను పట్టిం చుకొనేది. ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి ఆ స్థానంలో ఏర్పాటు చేసిన ‘నీతి ఆయోగ్’ కేవలం కేంద్రానికి సలహాలిచ్చే వ్యవస్థ మాదిరిగా పని చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు? అన్నది ప్రశ్న కాదు. ఎందుకు రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారు? సమాఖ్య స్ఫూర్తిని ఎందుకు అమలు చేయడం లేదు? అన్నదే అసలు సమస్య. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం సాధ్యమని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ, రాష్ట్రాలు బలోపేతం కాకుండా కేంద్రమే అడ్డుపడుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహపర్చడం, ఆర్థిక నిర్వహణ సరిగాలేని రాష్ట్రాలకు అధికమొత్తంలో నిధులు ఇవ్వడం, ఓట్ల రాజకీయాల మాయలోపడి కొన్ని రాష్ట్రాలకు భారీ ఆర్థిక ప్యాకే జీలు ప్రకటించడం, ఇచ్చిన వాగ్దానాలపై వెనక్కి పోవడం, పార్లమెంట్ చేసిన చట్టాలను గౌరవించకపోవడం తదితర ఏకపక్ష కేంద్రీకృత పోకడల్ని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టాలి. కరోనా నుంచి నేర్చుకొనే పాఠాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేయాలన్నది ఒకటి. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడా నికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి చెప్పిన విధంగా ‘ఆత్మ నిర్భర్’తో ముందుకు సాగాలి. ‘మేము ఏమీ చేయలేం. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ నిస్సహాయంగా చేతులు ఎత్తేస్తే ప్రజలు క్షమించరు. కేంద్రం ఇప్పటికైనా సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. రాష్ట్రాలకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలవాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
తలలు వంచుకుని నిల్చున్నవారా ప్రశ్నించేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన వేళ సోనియాగాంధీ ముందు తలలు వంచుకుని నిల్చున్నవారు ఇప్పుడు ప్రధామంత్రి మోదీ మెడలు వం చుతాననడం హాస్యాస్పదమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి చెం దిన మున్సిపల్, నగరపాలక సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలకు ఆది వారం పార్టీ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ తెలుగువాడిగా రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ మిత్రపక్షం కాకపోయినా ఫెడరల్ స్ఫూర్తితో టీం ఇండియా గా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనపై తప్పు డు ఆరోపణలు చేయడం, దురద్దేశాలు ఆపాదించడం తగదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదని కొందరు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం వీచిన సమయంలోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. స్మార్ట్‌సిటీల ఎంపిక, విధివిధానాలు, మురికివాడలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, నగరాలకు కేంద్రం నుంచి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. దేశంలోని 500 నగరాల్లో రాబోయే ఐదేళ్లలో అమృత పథకం కింద మంచినీటి సరఫరా, పరిశుభ్రత, వ్యర్థపదార్థాల సేకరణ, శుద్ధీకరణ, పట్టణ రోడ్లు వంటివాటికి లక్షకోట్లు ఖర్చు చేయనున్నట్టుగా వెల్లడించారు. వరంగల్‌ను వారసత్వ నగరాల కింద ఎంపిక చేశామన్నారు. స్వచ్ఛభారత్ కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు ఇస్తామన్నారు. పట్టణల్లో స్వయం సహా యక బృందాలను నైపుణ్య అభివృద్ధి కేంద్రాలకు అనుసంధానం చేసి ఉపాధిని పెంచుతామన్నారు. ఆగిపోయిన రాజీవ్ ఆవాస యోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా పార్టీనేత గీతామూర్తి బీజేపీలో చేరారు. సదస్సుకు జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీకి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.