దేశంలో గవర్నర్‌ల వ్యవస్థ రాను రానూ వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నారు గవర్న ర్‌లు. వారి బాధ్యత రాజ్యాంగ పరిరక్షణతో పాటూ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ, సూచనలూ ఇవ్వడం. శాసనసభలో ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరిని తొలుత ఆహ్వానించాలనే అంశంలో, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం.
రాష్ట్ర శాసన సభ, మండలిలో ఆమోదించిన బిల్లు లను లాంఛనంగా ఆమోదించడం గవర్నర్ విధి. కొన్ని ప్రత్యేక, అసాధారణ సందర్భాలలో బిల్లులను రాష్ట్రపతికి పంపవచ్చు. లేదంటే గవర్నరే బిల్లులపై తన అభిప్రాయంతో సహా తిరిగి చట్ట సభలకు పంపవచ్చు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుండి తిరిగి వచ్చిన బిల్లులను, గవర్నర్ అభిప్రాయానికి అనుగుణంగా సవరించినా, లేదా యధావిధిగా మరోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌కు వాటిపై ఆమోద ముద్ర వేయడం తప్ప వేరే మార్గం లేదు.
బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్‌లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చను తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో గవర్నర్ వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా.. కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులు నెలలు తరబడీ, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 20 బిల్లులను అనేక మాసాలుగా ఆయా రాష్ట్రాల గవర్నర్‌లు పెండింగ్‌లో పెట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో గవర్నర్‌లను ఉపయోగించు కొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ... గవర్నర్‌ల నుండి రప్పించిన తప్పుడు నివేదికల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను డిస్మస్ చేసి రాష్ట్రపతి పాలనను విధించి, గవర్నర్‌ల ఆధ్వర్యంలో కేంద్రం పాలన సాగించడం చూశాం. కేరళలో ఎన్నికైన కమ్యూ నిస్టు ప్రభుత్వమే మొదటిసారిగా ఆర్టికల్ 356 బారిన పడింది. ఇప్పటి వరకు 41 ప్రభుత్వాలు అలా డిస్మిస్ కాబడ్డాయి. 1977లో జనతాపార్టీ అప్పటివరకు ఉన్న గవర్నర్‌లను డిస్‌మిస్ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకొంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగానే గవర్నర్‌ల మార్పు కొనసాగింది. 1984లో ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీ ఆర్‌ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతాన్నీ, కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్‌ఆర్ బొమ్మై చారిత్రాత్మక కేసునూ ఎలా మరవగలం?
బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. గతంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖంఢ్ వంటి రాష్ట్రా లలో అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీని విస్మరించి, బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు గవర్నర్‌లు సహ కరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనైతే 2016లో గవర్నర్ ఆజ్ఞ మేరకు శాసనసభ సమావేశాలను ముందుకు జరిపి, ముఖ్యమంత్రి లేకుండానే ఏకంగా ఒక హోటల్‌లో అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మెజారిటీ లేనప్పటికీ తెల్లవారు జామున బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, వారి పార్టీ ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయాలనూ, ఆ సందర్భంగా గవర్నర్ వ్యవహరించిన తీరునూ ప్రజలంతా గమనించారు.
సర్కారియా కమిషన్‌తో పాటు, అనేక కమిషన్‌లు గవర్నర్ వ్యవస్థ తీరును తప్పు పట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫార్సులు చేశాయి. కానీ అవన్నీ బుట్ట దాఖలే అయ్యాయి. గవర్నర్ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే... అది ఆరవ వేలు లేదా అపెండిక్స్ లాంటిదని అర్థమవుతోంది. దాన్ని రద్దు చేయడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానం కూడా చేసింది.
గవర్నర్ వ్యవస్థ రద్దయితే... అది నిర్వహించే బాధ్యతలను న్యాయ వ్యవస్థకూ, శాసన సభలోని సెలెక్ట్ కమిటీ లేదా స్టాండింగ్ కమిటీకి అప్పగించవచ్చు. ఉదాహరణకు మెజారిటీ లేని సందర్భంలో సీఎంగా ఎవరిని ఆహ్వానించాలి, ప్రమాణ స్వీకారం, బలాబలాలు లాంటి వివాదాస్పద అంశాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. సంక్లిష్ట సమస్యలపై బిల్లులను కూలంకషంగా చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించవచ్చు. లేదా స్టాండింగ్ కమిటీలకు అందించవచ్చు. ఆ కమిటీలు సూచించిన ప్రతి పాదనలతో బిల్లులపై చర్చించి చట్టసభలు ఆమోదిస్తే, గవర్నర్ జోక్యం ఇక అవసరం ఉండదు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష)
- కూనంనేని సాంబశివరావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment