
ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబం
రాజకీయ సంబంధమైన చీకటి ఘటనలు వెలుగు చూస్తున్న తరుణంలో జనం మదిలో పలు ప్రశ్నలు మెదులుతున్నాయి. నేరమయ రాజకీయాలను నియం త్రించలేమా, సత్యశీల రాజకీయాలు చూడ లేమా అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉండి సభ్యసమాజం ముక్కుమీద వేలేసుకునే విధంగా వ్యవహరిస్తున్నవారు అధికారం అండతోనే బరితెగిస్తున్నారని విశ్లేషకుల మాట. కొంతమంది ప్రజా ప్రతినిధులు నేరుగా అరాచకాలకు పాల్పడుతుంటే, మరికొన్నిచోట్ల కుటుంబ సభ్యులు లేదా ప్రధాన అనుచరులు అడ్డదారిలో పెత్తనాలను సాగిస్తూ అందినకాడకు పోగేసుకుంటున్నారు. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను ఏమీ అనలేని అధికార్లు మిన్నకుండిపోతున్నారు.
డబ్బు ఖర్చుచేసి గెలవడం అంతకు పది రెట్లు అడ్డదారిన డబ్బు సంపాదించుకోవడం భారత రాజకీయ పటంలో సాధారణ దృశ్యమైంది. కొందరు రాజకీయనాయకులు సాయం కోరి వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు వస్తున్నా పట్టించుకుని పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనేది బాగా విని పిస్తున్న విమర్శ. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనను విమర్శకులు ఇందుకు మంచి ఉదాహరణగా చూపుతున్నారు.
శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అండతో... ఆయన కుమారుడు రాఘవ అనేక అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై 12 కేసులు పెడితే... కేవలం రెండు కేసుల్లోనే పోలీసులు చార్జిషీట్ నమోదు చేసి మిగతా కేసుల గురించి పట్టించు కోలేదంటే... రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో ఆర్థమవుతుంది. ఎమ్మెల్యే కుమారుని ఆగడాలకు బలైన బాధితుడు రామకృష్ణ సెల్ఫీవీడియో చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లనే ప్రభుత్వం చర్యలకు దిగిందని ప్రజలు అనుకుంటున్నారు.
కొత్తగూడెంలో ఎమ్మెల్యే కుమారుని అరాచకం నియోజకవర్గం అంతా విస్తరించింది. ఆత్మహత్య చేసుకున్న వారు కొందరైతే, సర్వం పోగొట్టుకొని జీవచ్ఛవాలుగా బతుకుతున్నవారు మరికొందరు. పాల్వంచ ఘటనలో అతడివల్ల ఓ కుటుంబం లోని నలుగురు ఆత్మహత్య చేసుకుంటే అతడిపై సాధారణ క్రిమినల్ సెక్షన్ల కింద కేసు పెట్టడం విడ్డూరం. వనమా రాఘవపై అతడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న భూక్యా జ్యోతి ఫిర్యాదు చేసినప్పుడే పాల్వంచ పోలీసులు స్పందించి ఉంటే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. (చదవండి: ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్?)
ప్రజా ఉద్యమాల్లో ఉండి ప్రజల కోసం తపిస్తూ ప్రశ్నించే, పోరాడే... సామాన్య ప్రజలు, కవులు, కళాకారులు, అభ్యుదయ వాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల నాయకులపై యూఏపీఏ (ఉప) లాంటి చట్టాల ద్వారా దేశద్రోహం కేసులు మోపి సంవత్సరాల తరబడి బెయిలు రానివ్వని స్థితిని చూస్తున్నాము. మరోవైపు లైంగిక దాడులు, హత్యలు, కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నవారిపై కొన్ని సందర్భాల్లో అసలు కేసులే నమోదు కావడం లేదు. ఇదంతా రాజకీయాల మహిమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ముందు ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అలాగే సేవాభావం కలిగిన, నీతి మంతులు రాజకీయాల్లోకి రావాలి. అసాంఘిక శక్తులు చట్టసభల్లో ప్రవేశించకుండా కఠిన చట్టాలు రూపొందాలి. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు)
- కూనంనేని సాంబశివరావు
మాజీ శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment