Kottagudem
-
మాతోనే కరెంట్ అని భారీగా అప్పులు: మంత్రి భట్టి
భద్రాద్రి కొత్తగూడెం: విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.59 వేల కోట్ల బకాలున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం భద్రాది థర్మల్ ప్రాజెక్టును సందర్శించారు. స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమతోనే కరెంట్ అని చెప్పిన గత ప్రభుత్వానికి చెందినవారు భారీగా అప్పలు చేశారని మండిపడ్డారు. సింగరేణికి రూ.19వేల కోట్లు బకాయి పడ్డారని తెలిపారు. అన్ని శాఖల్లో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆందోళనకర పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే వాస్తవ విషయాలు అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో తాము చెప్పడానికి ప్రయత్నం చేశామని తెలిపారు. ఇదేవిధంగా అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై కూడా సమగ్రమైన సమాచారం సేకరించి ప్రజల ముందుకు తీసకువస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 81,514 కోట్ల అప్పులు చేసిందని అన్నారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు 28వేల కోట్ల బకాయి పడి ఉన్నామని తెలిపారు. తాము ఉంటేనే కరెంట్ సాధ్యం అని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ. 50,000 కోట్ల అప్పు ఉందని అన్నారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాని తెలిపారు.ఇవన్నీ గాలి లెక్కలు కాదని.. ఉన్నరికార్డ్స్ ప్రకారం మీకు అందిస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వం పవర్ సెక్టార్‌ను పీకలదాకా ముంచేసిందని మండిపడ్డారు.తమ ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హని కలుగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. చదవండి: పథకాల అమలులో కాలయాపన చేసే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత -
13 ఏళ్లకే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్తగూడెం మిస్ టీన్!
ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటల్ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ టీన్ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్‌బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
వనమాకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వనమా వెంకటేశ్వరావుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వనమా పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై వనమా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే వరకు స్టే విధించాని వనమా.. కోర్టును కోరారు. దీంతో, వనమా పిటిషన్‌కు హైకోర్టు కొట్టివేసింది. వనమా పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన నాలుగున్నరేండ్ల తర్వాత ఎట్టకేలకు జలగం వెంకట్రావ్ గెలిచారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, జలగం వెంకట్రావ్నే ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావ్ బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఈ సందర్బంగా కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ సెక్రటరీకి జలగం అందించారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరారు. ఈ సందర్బంగా జలగం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నన్ను ఎమ్మెల్యేగా గుర్తించింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పు ప్రకారం.. నన్ను ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని కలిసి కోరాను. 2014లో నేను ఏ ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ పార్టీలో చేరానో అదే విధంగా ఇప్పుడు కూడా పార్టీ కోసం శ్రమిస్తాను అని స్పష్టం చేశారు. నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నేను పార్టీలోనే ఉన్నాను. కేసీఆర్.. నన్ను పిలిచిన ప్రతీసారి నేను కలవడం జరిగిందన్నారు. నేను బీఆర్ఎస్ బీ ఫామ్ మీదనే గెలిచాను అని వెల్లడించారు. ఇదే సమయంలో ఈరోజు సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌ను కలవనున్నట్టు వెంకట్రావ్ కలవనున్నారు. ఇదిలా ఉండగా.. 2018లో వనమా వెంకటేశ్వర్రావు ఈసీకి సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్లో తప్పులను దొరకబట్టిన జలగం, నాలుగేండ్లుగా న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వార్తలు.. స్పందించిన ఎంపీ ఉత్తమ్ -
టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే స్థానం కోసం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఈ సారి టికెట్టు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ట్రస్టు ద్వారా సేవలు చేస్తూ అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నా జీవితం.. ప్రాణం కొత్తగూడెం ప్రజల కోసమేనని చెబుతూ అందరి మనసులను గెలుచుకునే పనిలో పడ్డారు. కన్న తల్లిని.. పుట్టిన భూమిని మర్చిపోకూడదనే ఇక్కడ సేవ చేయడానికి వచ్చానని చెప్పారు. రావణాసురుడి పాలన.. రాష్ట్రమంతా రామరాజ్యం నడుస్తుంటే కొత్తగూడెంలో మాత్రం ఓ రావణాసురుడు పాలిస్తున్నాడని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడి ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని నడిపిస్తున్నాడని దుయ్యబట్టారు. కొత్తగూడెం ప్రాంత ప్రజలకు ఇకపై తాను కాపలా కాస్తానని చెప్పారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న తనను కావాలని ఇబ్బంది పెడితే తానేంటో కూడా చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నో సేవలు చేశా.. కొత్తగూడెం ప్రాంతంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాని శ్రీనివాసరావు చెప్పారు. మెగా హెల్త్ క్యామ్ప్ లు పెట్టి సుమారు 200 మందికి నాలుగు కోట్ల రూపాయల విలువైన వైద్యాన్ని అందించామని అన్నారు. 8వేల మంది నిరుద్యోగులకు జాబ్ మేళా లు నిర్వహించి 4 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు శ్రామిక శక్తి అవార్డులు బహుకరించి గౌరవించుకున్నామని స్పష్టం చేశారు. వందలాదిమంది నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉచిత కోచింగ్ ఇప్పించి భోజనాలు పెట్టించామని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశామని చెప్పారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫర, ఆరో ఓ ప్లాంట్ లను ఏర్పాటు చేసి మంచినీటిని అందించామని చెప్పారు. అభిమానాన్ని తొలగించగలరా? పుట్టిన రోజు సందర్భంగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి పర్యటన సందర్భంగా మా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కావాలని తొలగించారని ఆరోపించారు. తమ ట్రస్ట్ ద్వారా లబ్ది పొందిన వ్యక్తి చేతే ఫ్లెక్సీ తొలగించారు కానీ అతని గుండెల్లో తనపై ఉన్న అభిమానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసి మొదటి మెడికల్ కాలేజ్ ను సాంక్షన్ చేయించానని చెప్పారు. ఏసీ కారు, బంగ్లా, మంచి పొజీషన్ వదిలి ఇక్కడకు వచ్చి సేవ చేస్తున్నానని అన్నారు. ఇదీ చదవండి: క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్‌లో అడుగు పెట్టాలి: కేటీఆర్ -
‘ఎమ్మెల్యే వనమాకు ఇంకా రాజకీయాలెందుకు?’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి వనమా వెంకటేశ్వర రావును టార్గెట్ చేసి శ్రీనివాస రావు పొలిటికల్ కామెంట్స్ చేశారు. కాగా, శ్రీనివాస్ రావు ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వనమా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. వనమాకు ఇంకా రాజకీయాలు ఎందుకు? అని సంచలన కామెంట్స్ చేశారు. గత ఎన్నికలే నాకు లాస్ట్ ప్లీజ్ అని అప్పుడు వనమా అన్నారు. 80ఏళ్ళు వచ్చాయి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి అని సూచించారు. ఇదే క్రమంలో వనమాకు కౌంటర్ ఇచ్చారు. మంచి చేయడానికి వస్తే అడ్డుకుంటారా. మంచి చేయాలనుకునే వారిని అనుసరించాలనుకునే వారిని అడ్డు కోవడం ఏం నీతి? అని ప్రశ్నించారు. అందరినీ ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు.. నేను ఉల్వనూరులో ఇల్లు కట్టుకుంటాను. నా శరీరం ఇక్కడి మట్టిలో కలిపోతుందని ఉద్వేగంతో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందామని అన్నారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నారా? అన్ని ప్రశ్నించారు. నాతో మద్దతు తెలిపే వారు చేతులెత్తండి అని.. ఆ వెంటనే అందరూ చేతులెత్తాలని సూచించారు. ఇక, శ్రీనివాస రావు కామెంట్స్‌తో కొత్తగూడెంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇది కూడా చదవండి: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్ -
వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భగభగలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో దూరప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని శాఖ అధికారులు సూచించారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని పేర్కొంది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీ సెల్సియస్ నమోదుకాగా, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 45.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...ఖమ్మం జిల్లా ఖానా పూర్లో 45.4 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఏపీలో ఠారెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు ఏపీలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. బుధవారం రాయలసీమ జిల్లాల్లో ఎండ నిప్పులు చెరిగింది. తిరుపతి జిల్లా పల్లాం, నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట అనేక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్‌తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్‌కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్‌ను, 1950లో క్యాప్ ల్యాంప్‌లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్‌కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్‌ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్‌లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్‌లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్‌లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్‌ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్‌లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్‌ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
పొలిటికల్ కారిడార్: హెల్త్ డైరెక్టర్ తీరుపై అధికారవర్గాల్లో చర్చ..
-
నిత్యం ప్రజల్లోనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : సుఖసంతోషాల్లోనే కాదు.. కష్టనష్టాల్లోనూ ప్రజల మధ్య మెదిలే నాయకుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు పేరుంది. ప్రజస్వామ్యంలో వార్డు సభ్యుడి నుంచి మంత్రి వరకు అనేక పదవులు ఆయన సొంతం చేసుకున్నారు. వార్డు సభ్యుడిగా చిన్న స్థాయిలో ఉన్నా, మంత్రిగా ఉన్నత పదవులు అలంకరించినా గర్వం లేని ప్రజాప్రతినిధిగా ఆయన గురించి చెప్పుకుంటారు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో అతి పెద్ద వయస్కుడైన ఎమ్మెల్యేగా వనమా కొనసాగుతున్నారు. 50 ఏళ్ల ఆయన రాజకీయ ప్రస్థానం, గుర్తింపు తెచ్చిన ఘటనలు తదిరత అంశాలను ఈ ఆదివారం ప్రత్యేకంగా సాక్షి పాఠకుల కోసం ఆయన మాటల్లోనే.. నలుగురిలో ఒకడిగా నా తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, నాగభూషణం. పాత పాల్వంచలో మాకు పెద్ద ఎత్తున సాగు భూమి ఉండేది. ఇల్లు, పొలంలో కలిపి పద్దెనిమిది మంది పాలేర్లు పని చేసేవారు. పాత పాల్వంచలో ఎకరం విస్తీర్ణంలో ఇల్లు ఉండేది. చుట్టు పక్కల ఉన్న ఊళ్లకు మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించేవారు. ఎవ రి ఇళ్లలో శుభకార్యం జరిగినా ఇంటికి వచ్చి పిలిచేవారు. ఫంక్షన్ ఖర్చులకు అమ్మానాన్న సాయం చేసేవారు. ఎవరిళ్లలో ఏదైనా కీడు జరిగితే మా అమ్మే అన్నం వండి కావళ్లలో వారి ఇంటికి పంపేది. అలా మా ఇల్లు ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. గద్దెల మీద జనాలు ఎప్పుడూ కూర్చుని ఉండేవా ళ్లు. వాళ్లతో కలిసిపోయి, వాళ్ల కష్టాలు విని నాన్నకు చెప్పేవాడిని. అలా ప్రజలతో మమేకం అవడం నాకు చిన్నతనం నుంచే అబ్బింది. విద్యార్థి దశలో ఉండగా నేలకొండపల్లిలో మా మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు శ్రీశ్రీ, దాశరథి వంటి మహామహులు హాజరయ్యారు. అభివృద్ధికి కేరాఫ్‌గా పాల్వంచ పాల్వంచ పంచాయతీ ప్రెసిడెంట్‌గా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్రంలోనే నంబర్ వన్ పంచాయతీగా పాల్వంచకు గుర్తింపు తీసుకొచ్చాను. గ్రామాల్లో సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలను పరిశీలించేందుకు ఇతర పంచాయతీల సర్పంచ్‌లను పాల్వంచకు వెళ్లి చూడమంటూ అప్పటి కలెక్టర్ ఈమని పార్థసారధి సూచించేవారు. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన పీవీఆర్కే ప్రసాద్ సైతం నాపై ప్రత్యేక అభిమానం చూపించేవారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లేప్పుడు పాల్వంచలో కచ్చితంగా ఆగేవారు. నేను అందించే ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేసేవారు. అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే పానుగంటి పిచ్చయ్య సైతం ప్రజాకార్యక్రమాల్లో తన వెంట తిప్పుకుంటూ అవసరమైన మేరకు రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. పాల్వంచను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఉత్తమ పంచాయతీ ప్రెసిడెంట్‌గా అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పరకాల శేషాచలం చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాను. సంజయ్‌గాంధీ పర్యటనతో.. ప్రెసిడెంట్‌గా వచ్చిన గుర్తింపుతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్ మార్టిగేజ్) బ్యాంక్‌కు చైర్మన్‌గా నియమించారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా జలగం ప్రసాదరావు, జనరల్ సెక్రటరీగా నేను ఉండేవాళ్లం. ఆ రోజుల్లో ముఖ్య మంత్రిగా జలగం వెంగళరావు పని చేస్తున్నారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ పాల్వంచ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి కిన్నెరసాని వరకు భారీ మోటార్ వెహికిల్ ర్యాలీని యూత్ కాంగ్రెస్ ఆ«ధ్వర్యంలో చేపట్టాను. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సంజయ్‌గాంధీ హవా కొనసాగుతుండేది. కిన్నెరసాని పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నా గురించి చర్చ మొదలైంది. మంచి గుర్తింపు దక్కింది. హత్యాప్రయత్నమూ చేశారు.. పాల్వంచ పంచాయతీ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న రోజుల్లో నా ఎదుగుదల స్థానికంగా కొంతమందికి కంటగింపుగా మారింది. తమ రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారుతున్నాననే దుగ్ధతో నా ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. 1980వ దశకంలో ఐదుగురు వ్యక్తులు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో నేను పొలానికి వెళ్లాను. నేను ఇంట్లో లేకపోవడంతో పద్మావతిపై దాడి చేశారు. ఆమె చేతికి గాయమైంది. పొలం నుంచి అనుచరులతో నేను రావడం గమనించి ఇంటి నుంచి పారిపోయారు. ప్రజాసేవకే అంకితం ఇప్పటి వరకు 1989, 1999, 2004, 2018 సంవత్సరాల్లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. వైఎస్సార్ హయాంలో వైద్యవిధాన పరిషత్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే జిల్లాకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చాను. ప్రకాశం స్టేడియంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్డు సభ్యుడి నుంచి మంత్రి వరకు అన్ని రకాల పదవులూ చేపట్టాను. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుడిలా వ్యవహరించాను. యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగినా ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లను దరి చేరనీయలేదు. 80 ఏళ్ల వయసులో ఉన్నా ఇప్పటికీ ఎవరి సాయం లేకుండా రాయగలను, చదవగలను, నడవగలను. చుట్టూ ఉన్న పది మందికి సాయపడటమనే అలవాటు తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఊపిరి ఉన్నంతవరకూ ప్రజాసేవలోనే ఉంటా. రాజ్‌దూత్ బండిపై.. 1970వ దశకంలో పాల్వంచ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నన్ను వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే సమయంలో భద్రాచలంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన పద్మావతితో నా వివాహం జరిగింది. ఆ మరుసటి ఎన్నికల్లో ఏకంగా పాల్వంచ పంచాయతీకి ప్రెసిడెంట్ అయ్యాను. అప్పట్లో నాకు రాజ్‌దూత్ ద్విచక్ర వాహనం ఉండేది. ఉదయాన్నే పాల్వంచ గ్రామపంచాయతీ ఈఓను వెంటబెట్టుకుని రాజ్‌దూత్‌పై పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు వెళ్లే వాడిని. ఎక్కడైనా ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే నోట్ చేసుకునే వాడిని. మధ్యాహ్నం అంతా పంచాయతీ ఆఫీసులో ఉంటూ అక్కడికి వచ్చే ప్రజల కష్టనష్టాలు వినేవాడిని. చీకటి పడే సమయంలో మళ్లీ బండి మీద ఫీల్డ్ విజిట్‌కు వెళ్లి వీధి దీపాలు వెలుగుతున్నాయా ? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పరిశీలించేవాడిని. పీఎం వరాలు.. షాకైన సీఎం.. 1989 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేసిన కోనేరు నాగేశ్వరరావుతో తలపడాల్సి వచ్చింది. అయితే ప్రెసిడెంట్‌గా, ఇతర సంస్థల చైర్మన్‌గా నా పనితీరు, ప్రజల్లో కలిసిపోయే గుణం మెచ్చిన ప్రజలు విజయం కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా తెలుగువారైన పీవీ నర్సింహారావు వచ్చారు. ఖమ్మం కలెక్టర్‌గా పని చేసిన పీవీఆర్కే ప్రసాద్ అప్పుడు పీవీ దగ్గర ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిగా ఉన్నారు. నన్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని, ప్రధానితో మాట్లాడి రికార్డు స్థాయిలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేశారు. ఒక నియోజకవర్గానికి ఈ స్థాయిలో ఇళ్లు మంజూరు కావడం చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. -
పొలిటికల్ కారిడార్ : కొత్తగూడెం గులాబీకి గుచ్చుకుంటున్న కొడవలి
-
సింగరేణి సంస్థకు షాకిచ్చిన హైకోర్టు.. ఆ పోస్టుల భర్తీ నిలిపివేయండి!
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్– 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని సంస్థ ఉన్నతాధికారులను హైకోర్టు శనివారం ఆదేశించింది. పరీక్షలో అవకతవకలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లు వాదనకు సరిపడా ఆధారాలు చూపించారని, తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్మెంట్ సెల్‌కు ఆదేశాలు జారీచేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌తో సహా 8 జిల్లాలోని 187 కేంద్రాల్లో ఈనెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలు సజావుగానే నిర్వహించామని సింగరేణి, జేఏన్టీయూ అధికారులు చెబుతున్నా.. కొందరు అభ్యర్థులను గోవా తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడ పేపర్ లీకైందని ఆరోపణలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన సింగరేణి, జేఎన్టీయూ అధికారులు హడావిడిగా ఫలితాలు విడుదల చేశారు. 78 వేల మంది పరీక్ష రాయగా, 49 వేల మంది అర్హత సాధించారని పేర్కొంటూ వారి మార్కులు, ర్యాంకులు వెల్లడించారు. అయితే, పరీక్ష రాసిన అభ్యర్థులంతా తమకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని, కానీ సింగరేణి అధికారులు అలా విడుదల చేయలేదని, అందరి మార్కులు వెల్లడించిన తర్వాతే ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా అర్హత పేరుతో 49 వేల మంది ఫలితాలు మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ పరిశీలించకుండా ఫలితాలు విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పపట్టింది. అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ మొదలైన పేర్లతో హాల్‌టికెట్లు ఎలా పంపిణీ చేశారని, పరీక్ష సమయంలో అభ్యర్థి పేరు రాస్తే ఎలా పరిగణనలోకి తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. కాగా, పరీక్షకు 15 రోజుల ముందే సింగరేణిలో కీలకమైన డైరెక్టర్(పా) పోస్టును చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చారని, ఐదు నెలల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఆ వ్యక్తికి ఇప్పుడా పదవి కట్టబెట్టడంతో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రాజకీయాలు మారేదెన్నడు?
రాజకీయ సంబంధమైన చీకటి ఘటనలు వెలుగు చూస్తున్న తరుణంలో జనం మదిలో పలు ప్రశ్నలు మెదులుతున్నాయి. నేరమయ రాజకీయాలను నియం త్రించలేమా, సత్యశీల రాజకీయాలు చూడ లేమా అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉండి సభ్యసమాజం ముక్కుమీద వేలేసుకునే విధంగా వ్యవహరిస్తున్నవారు అధికారం అండతోనే బరితెగిస్తున్నారని విశ్లేషకుల మాట. కొంతమంది ప్రజా ప్రతినిధులు నేరుగా అరాచకాలకు పాల్పడుతుంటే, మరికొన్నిచోట్ల కుటుంబ సభ్యులు లేదా ప్రధాన అనుచరులు అడ్డదారిలో పెత్తనాలను సాగిస్తూ అందినకాడకు పోగేసుకుంటున్నారు. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను ఏమీ అనలేని అధికార్లు మిన్నకుండిపోతున్నారు. డబ్బు ఖర్చుచేసి గెలవడం అంతకు పది రెట్లు అడ్డదారిన డబ్బు సంపాదించుకోవడం భారత రాజకీయ పటంలో సాధారణ దృశ్యమైంది. కొందరు రాజకీయనాయకులు సాయం కోరి వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు వస్తున్నా పట్టించుకుని పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనేది బాగా విని పిస్తున్న విమర్శ. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనను విమర్శకులు ఇందుకు మంచి ఉదాహరణగా చూపుతున్నారు. శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అండతో... ఆయన కుమారుడు రాఘవ అనేక అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై 12 కేసులు పెడితే... కేవలం రెండు కేసుల్లోనే పోలీసులు చార్జిషీట్ నమోదు చేసి మిగతా కేసుల గురించి పట్టించు కోలేదంటే... రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో ఆర్థమవుతుంది. ఎమ్మెల్యే కుమారుని ఆగడాలకు బలైన బాధితుడు రామకృష్ణ సెల్ఫీవీడియో చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లనే ప్రభుత్వం చర్యలకు దిగిందని ప్రజలు అనుకుంటున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కుమారుని అరాచకం నియోజకవర్గం అంతా విస్తరించింది. ఆత్మహత్య చేసుకున్న వారు కొందరైతే, సర్వం పోగొట్టుకొని జీవచ్ఛవాలుగా బతుకుతున్నవారు మరికొందరు. పాల్వంచ ఘటనలో అతడివల్ల ఓ కుటుంబం లోని నలుగురు ఆత్మహత్య చేసుకుంటే అతడిపై సాధారణ క్రిమినల్ సెక్షన్ల కింద కేసు పెట్టడం విడ్డూరం. వనమా రాఘవపై అతడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న భూక్యా జ్యోతి ఫిర్యాదు చేసినప్పుడే పాల్వంచ పోలీసులు స్పందించి ఉంటే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. (చదవండి: ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్?) ప్రజా ఉద్యమాల్లో ఉండి ప్రజల కోసం తపిస్తూ ప్రశ్నించే, పోరాడే... సామాన్య ప్రజలు, కవులు, కళాకారులు, అభ్యుదయ వాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల నాయకులపై యూఏపీఏ (ఉప) లాంటి చట్టాల ద్వారా దేశద్రోహం కేసులు మోపి సంవత్సరాల తరబడి బెయిలు రానివ్వని స్థితిని చూస్తున్నాము. మరోవైపు లైంగిక దాడులు, హత్యలు, కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నవారిపై కొన్ని సందర్భాల్లో అసలు కేసులే నమోదు కావడం లేదు. ఇదంతా రాజకీయాల మహిమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ముందు ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అలాగే సేవాభావం కలిగిన, నీతి మంతులు రాజకీయాల్లోకి రావాలి. అసాంఘిక శక్తులు చట్టసభల్లో ప్రవేశించకుండా కఠిన చట్టాలు రూపొందాలి. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - కూనంనేని సాంబశివరావు మాజీ శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
వారసత్వం... నిర్లక్ష్యం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి బొగ్గు గనుల్లో పని చేయడమంటే కత్తి మీద సామేనని చెప్పాలి. ప్రకృతికి విరుద్ధంగా గాలి, వెలుతురు లేక విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. దీంతో వయస్సు పెరిగే కొద్ది కార్మికులు అవస్థ పడుతుంటారు. తద్వారా సంస్థ లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తించారు. దీనిని సరిదిద్దేందుకు సింగరేణి కార్మికుల కుటుంబాల్లో యువతను తీసుకుంటే సంస్థ లక్ష్యాలు చేరడమే కాకుండా యువతకు ఉపాధి లభిస్తుందని భావించారు. ఈమేరకు తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పలు దఫాలుగా వారసత్వ(కారుణ్య) ఉద్యోగాలకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 82 మార్లు నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షలకు 13,727 మంది హాజరుకాగా 9వేల మంది కార్మికుల పిల్లలకు సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాలు ఇచ్చారు. అయితే, వారసత్వ ఉద్యోగాలు పొందిన వారి పనితీరు సరిగ్గా లేక సంస్థ ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. గైర్హాజరుతో తలనొప్పి వారసత్వ ఉద్యోగాలు పొందిన వారితో సంస్థ అభివృద్ధి విషయం పక్కన పెడితే వారు ఉద్యోగాన్ని నిలుపుకునే పరిస్థితులు కూడా లేవని చెబుతున్నారు అధికారులు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 4వేల కార్మికులు గైర్హాజరవుతుండుగా, ఇందులో అధిక శాతం కొత్తగా కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన వారేనని అధికారిక సమాచారం. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భ గనులు, 20 ఓపెన్‌కాస్ట్ గనుల్లో సుమారు 43 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 28 వేల మంది కార్మికులు గనుల్లో, మిగతా వారు ఓసీలతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 4వేల మంది బదిలీ వర్కర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా... నెలకు కనీసం 10 మస్టర్లు(ఒక రోజు విధులకు హాజరైతే ఒక మస్టర్‌గా పరిగణిస్తారు) కూడా చేయకపోవడం గమనార్హం. కొత్తగూడెం ఏరియాలోనూ ఇదే పరిస్థితి కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనుల్లో కలిపి 3,200 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఏరియాలోని పీవీకే – 5షాప్ట్ గనిలో 765 మందికి 100 మంది డిప్యూటేషన్ల పేరుతో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు. మిగిలిన 665 మందిలో కనీసం 300 మంది గైర్హాజరవుతున్నారు. ఒకవేళ హాజరైనా సుమారు 100 మస్టర్లు కూడా నమోదు కావడం లేదు. అయితే సింగరేణి నిబంధనల ప్రకారం అండర్ గ్రౌండ్లో పనిచేసే కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు పనిచేయాలి. అదేవిధంగా సర్పేస్ విభాగంలో పనిచేసే కార్మికుడు 190 మస్టర్లు పనిచేయాల్సి ఉంది. లేనిపక్షంలో వీరిని విధుల నుండి తొలగించే హక్కు సంస్థకు ఉంటుంది. ఇలా గత 20 ఏళ్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు కూడా. ఇక ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దేందుకు యాజమాన్యం.. గుర్తింపు సంఘం సహకారంతో గతనెల 30న ఆయా కార్మిక కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించింది. అయినప్పటికీ కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగం పోతుందనే బాధ లేకపోగా.. గైర్హాజరు అలాగే నమోదవుతుండడం గమనార్హం. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 50 – 60 సంవత్సరాల వారు సుమారు 30శాతం మంది పనిచేస్తున్నారు. వీరందరూ రానున్న ఐదారేళ్లలో ఉద్యోగ విరమణ చేస్తే సింగరేణి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తీరు మారడం లేదు... గతంలో వారసత్వ నియమకాలు చేపట్టినా తర్వాత తీసేశారు. దీంతో కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు లేక కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారు. అయితే ఉద్యోగం పొందిన కొందరు చక్కగా పని చేస్తుండగా.. మరికొందరు మాత్రం లేనిపోని కారణాలతో గైర్హాజరవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యాన వీరికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. – చిలక రాజయ్య, గని ఫిట్ సెక్రటరీ, గుర్తింపు సంఘం ఎరక్షన్ చేయడమే వారికి కష్టమవుతోంది... పీవీకే – ›5షాప్ట్‌లో ప్రస్తుతం గెయిన్వేర్ కంపెనీ వారే బొగ్గు ఉత్పత్తి చేసి 138 లెవల్, 35 డిప్ వద్ద పోస్తున్నారు. ఈ బొగ్గును బయటికి పంపేందుకు ఎరక్షన్ పని మాత్రమే బదిలీ వర్కర్లు చేయాలి. ఇది కూడా ఆరుగురు కలిసి చేయొచ్చు. అయితే, ఈ పని యువతకు కష్టమై విధులకు గైర్హాజరవుతున్నారు. వయసు ఉన్నప్పుడు కష్టపడాలని చెప్పినా ప్రయోజనం లేదు. ఈ పని చేస్తూనే ఇంటర్నల్ పరీక్షలు రాసి పదోన్నతి పొందే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. – పాలడుగు శ్రీనివాస్, గని మేనేజర్ అండర్ గ్రౌండ్ వాతావరణం పడడం లేదు డిపెండెంట్ ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నత చదువులు చదివిన వారే. వీరికి గనుల్లో వాతావరణం పడక.. దుబ్బ, బురదలో నడవలేక విధులకు రెగ్యులర్‌గా రాలేకపోతున్నారు. అంతేకాకుండా వీరితో అపాయింట్మెంట్ అయిన వారిలో కొందరు పలుకుబడితో డిప్యూటేషన్ పేరిట లైట్ జాబ్లకు వెళ్లారు. దీంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది. నిబంధనలు అందరికీ ఒకేలా అమలు చేయలేని యాజమాన్యం ఈ విషయాన్ని కప్పిపుచ్చుతోంది. – విజయగిరి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి, సీఐటీయూ -
జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు
-
చెప్పిందొకటి.. ఇచ్చిందొకటి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ పరిధిలోని ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో నిర్దేశిత అంశాల నుంచి కాకుండా ఇతర ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెరిట్ జాబితాపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ 84 జూనియర్ స్టాఫ్ నర్స్ ‘డి’గ్రేడ్ పోస్టుల భర్తీకి భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచల్లోని 18 కేంద్రాల్లో ఆదివారం రాత పరీక్షను నిర్వహించింది. అయితే, హాల్‌టికెట్‌లో పేర్కొన్నట్లుగా నర్స్ ఉద్యోగ ప్రశ్న లు కాకుండా 90% ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రం అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇదిలాఉంటే ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలు ఇచ్చి, ఓఎంఆర్ షీట్లో మాత్రం సమాధానాలు ఇవ్వడానికి 200 గడులు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. అనర్హత ఎలా?: రాత పరీక్షకు 11,133 మంది దరఖాస్తు చేసుకోగా 7,666 మంది హాజరయ్యారు. వీరిలో పది శాతం మందిని సంస్థ అనర్హులుగా ప్రకటించింది. అయితే 25.33 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థిని అనర్హుడిగా పేర్కొన్న సంస్థ అవే మార్కు లు వచ్చిన మరికొందరి పేర్లను మెరిట్ జాబితాలో పొందుపరిచింది. దీనిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నుంచీ సింగరేణిలో నియామకాలపై విమర్శలు వస్తుండగా, తాజా పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై సంస్థ జీఎం పర్సనల్(రిక్రూట్మెంట్ సెల్) అందెల ఆనందరావును ‘సాక్షి’వివరణ కోరగా ప్రశ్నపత్రాన్ని నిపుణులతోనే సిద్ధం చేయించామని తెలిపారు. ప్రశ్నపేపర్ అభ్యర్థులకు ఇచ్చే విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. -
5 ఏరియాలు టాప్.. ఆరు ఏరియాలు వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021– 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్‌లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ కు దేహశుద్ధి
-
ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు!
కొత్తగూడెం: ప్రేమపేరుతో తన కూతురిని శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని రైటర్‌బస్తీ గొల్లగూడేనికి చెందిన పాలవాయి నవీన్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించానని చెప్పి, శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లి నవీన్ తల్లిదండ్రులను ప్రశ్నించగా, వారు వివాహానికి అంగీకరించారు. ఈ క్రమంలో కొద్ది నెలల్లోనే నవీన్ తండ్రి మృతి చెందాడు. అనంతరం నవీన్‌కు సింగరేణి ఉద్యోగం వచ్చింది. పెళ్లికి ముందుకు రాకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ నవీన్ ఓ మైనర్‌ను వివాహం చేసుకున్నట్లు ఫొటోలు, శుభలేఖలు, మేజర్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి పోలీసులకు అందజేశాడు. కాగా ఆ బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఏఎస్పీని కలిసి సమస్య వివరించామని, నవీన్ మైనర్‌ను వివాహం చేసుకున్న విషయమై సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. పోలీసులు, వార్డు ప్రజాప్రతినిధి కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి తన కూతురికి న్యాయం చేయాలని కోరింది. చదవండి: చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య -
నా భర్త షాపు దగ్గర లేకపోతే లారీలు వెళ్లిపోయేవి
భద్రాచలం, మణుగూరు నుంచి రోజూ సిమెంట్ లారీలు, టిప్పర్లు బయలుదేరి కొత్తగూడెంలోని ఆదిలక్ష్మి పంక్చర్ షాపు ముందు ఆగుతాయి. ఆదిలక్ష్మి చేయి పడితే వాటి టైర్లకున్న జబ్బులన్నీ పోతాయి. ఇంతకాలం పురుషులే టైర్ల మరమ్మతులు చేసేవారు. ఇప్పుడు ఆదిలక్ష్మి వాటిని ఇటు అటూ తిప్పి అవలీలగా బోర్లించి రిపేర్ చేస్తుంది. ‘నా భర్త షాపు దగ్గర లేకపోతే లారీలు వెళ్లిపోయేవి. బేరం చెడగొట్టుకోవడం ఎందుకు అని నేనే పనిలో దిగా’ అంటుంది ఆదిలక్ష్మి. ఇప్పుడూ ఆదిలక్ష్మి భర్త పంక్చర్లు వేస్తాడు. కాని టైర్లన్నీ అదిరిపడేది ఆదిలక్ష్మి అడుగుల చప్పుడుకే. తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి కథ ఇది. ‘నా కడుపులో రెండో అమ్మాయి ఉన్నప్పుడు మా ఆయన కరెంటు పోల్స్ వేసే పనికి కొత్తగూడెం నుంచి కడప వైపు వెళ్లాడు. నిండు నెలలు నాకు. నొప్పులొచ్చాయి. పైసలు లేవు. మనిషి దగ్గర లేడు. కూతురు పుట్టిన వారానికి చూడటానికి వచ్చాడు. నాకు దుఃఖం వచ్చింది. ఏం చేద్దామా అని ఆలోచించాను ఇద్దరం ఒకటే చోట ఉండి పని చేయడానికి’ అంది ఆదిలక్ష్మి. ఆమె వయసెంతో ఆమెకు తెలియదు. 30 ఉండొచ్చని అంటుంది. కొత్తగూడెం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాత అంజనాపురం వాళ్లది. ‘మేము నలుగురం ఆడపిల్లలం. నేను రెండోదాన్ని. మా అమ్మా నాన్న పొలం కూలీకి పోతే ఇంట్లో నా చెల్లెళ్లని చూసుకోవడానికి ఉండిపోయాను. బడికెళ్లలేదు’ అంటుంది ఆదిలక్ష్మి. లారీ టైర్‌కు గాలి నింపుతున్న ఆదిలక్ష్మి ఇప్పుడు ఆమె కొత్తగూడెంలో చాలా ఫేమస్. ఇంకొన్నాళ్లలో తెలంగాణ అంతా ఫేమస్ కావచ్చు. ఎందుకంటే లారీ టైర్ల మరమ్మతు చేస్తున్న ఏకైక మహిళా మెకానిక్ కాబట్టి. హెవీ వెహికిల్స్ టైర్లను విప్పడం సామాన్యమైన విషయం కాదు. వాటికి పంక్చర్లు వేయడానికి చాలా బలం కావాలి. కాని ఆదిలక్ష్మి ఆ పనులన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఆ దారిలో మగవాళ్లు వేసే పంక్చర్లనైనా డ్రైవర్లు అనుమానిస్తారేమోగాని ఆదిలక్ష్మి వేసే పంక్చర్లను అనుమానించరు. అంత పర్ఫెక్ట్ వర్కర్ ఆమె. చెట్లెక్కే నిపుణురాలు ‘నా చిన్నప్పుడు ఇంట్లో మొక్కజొన్న దంచి కడక చేసేవారు. జావ కాచేవారు. బియ్యమే తెలియదు మాకు. జొన్నకూడు తినలేక నేను అడవిలో, పొలాల్లో దొరికే వాటి కోసం తిరిగేదాన్ని. పన్నెండేళ్లకే తాటిచెట్లు ఎక్కి కాయలు కోశా. కొబ్బరిచెట్లు ఎక్కా, రేగుకాయలు, పరిగి కాయలు, సీమసింత గుబ్బలు తిని పెరిగా. నాకు కష్టం చేయడం పెద్ద కష్టం కాదు’ అంది ఆదిలక్ష్మి. వరుసకు అత్తకొడుకైన భద్రంతో ఆమెకు 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. అతడు టైర్ల మెకానిక్. వెల్డింగ్ చేస్తాడు. జీతానికి ఉంటే ఆ జీతం ఏ కోశానా సరిపోయేది కాదు. దూరానికి వెళ్లి కూలి చేసేవాడు. ఇవంతా వద్దు మనమే చేసుకుందాం అని షాపు పెట్టించింది ఆదిలక్ష్మి. ‘మాకు ఎవరూ అప్పు ఇవ్వలేదు. ఎలాగో 80 వేలు వడ్డీకి తీసుకొని అవి చాలక మరో 50 వేలు అప్పు చేసి... సుజాత నగర్లో ఈ స్థలం నెలకు 2 వేలు కిరాయికి తీసుకొని షాపు మొదలెట్టా’ అందామె. మొదలైన పని.. భర్త కోసం ఆదిలక్ష్మి గాలి మిషను, బోల్డ్ మిషను, గ్రీజు మిషను, జనరేటర్... ఇన్ని ఎలాగోలా సమకూర్చింది. కాని భర్త ఏవో పనుల కోసం బయటకు వెళ్లేవాడు. లేదంటే తొందరగా అలసిపోయేవాడు. ‘బేరాలు పోతుంటే తట్టుకోలేకపోయా. నేనే చేయడానికి పనిలో దిగా. నన్ను చూసి నువ్వు వేస్తావా అని లారీ డ్రైవర్లు ఆగకుండా వెళ్లిపోయేవాళ్లు. ఇలా కాదని వాళ్లను కూచోబెట్టి వాళ్లముందే టైర్లను విప్పి పంక్చర్లు వేశా. ఒకప్పుడు వెళ్లిపోయిన వాళ్లంతా ఇప్పుడు ఆగుతున్నారు’ అంది ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి స్టిక్కర్ వేస్తుంది. హీట్ పంక్చర్ వేస్తుంది. టైర్‌కు చిల్లిపడితే క్షణాల్లో పూడ్చేస్తుంది. బండ్లకు అవసరమైన మైనర్ వెల్డింగ్ వర్కులు చేస్తుంది. ‘ఆ వెల్డింగ్‌లో ప్రమాదం జరిగి కన్ను పోయేంత పనయ్యింది. విజయవాడ ఎల్.వి.ప్రసాద్లో 50 వేలు ఖర్చయ్యింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఒక కన్ను ఏమీ కనపడదు. కొన్ని గంటల పాటు ఎదుట ఉన్నది నెగెటివ్ లాగా కనిపిస్తుంది’ అంటుంది ఆదిలక్ష్మి. కొనసాగుతున్న పని ఆదిలక్ష్మికి మూడు కోరికలు ఉన్నాయి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి, మూడు... అప్పులు తీరాలి. ఇవన్నీ ఆమె సాధించుకోగలదు. కాని ఆమె మరోమాట అంది. ‘నా దగ్గరకు పని నేర్చుకోవడానికి వచ్చినవారికి మంచిగా తిండి పెట్టి పని నేర్పించేలా నేనుండాలి’ అని. ఈ హృదయం తక్కువమందిలో ఉంది. ఆదిలక్ష్మి భవిష్యత్తులో మరింత ఎదుగుతుంది. ఆమె భవిష్యత్తు చక్రానికి తిరుగులేదనే అనిపిస్తుంది. శ్రమను నమ్ముకుంటే ఓటమి ఉంటుందా? – సాక్షి ఫ్యామిలీ ఫొటోలు: దశరథ్ రజ్వా -
యువకుడి ప్రాణం తీసిన ఫోన్ సిగ్నల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రిజిల్లా కొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ(22) తన స్మార్ట్ ఫోన్ లో త్రీజీ సిగ్నల్ సరిగా రాక పోవడంతో సిగ్నల్ కోసం పక్కనే ఉన్న గొరకలమడుగు గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఓ చింత చెట్టు కింద సిగ్నల్ రావడంతో దాని కింద నిల్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. చదవండి: జూరాలకు పోటెత్తిన వరద ఉధృతి.. అప్పటికే అక్కడ భారీ వర్షం పడుతుండటంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్నల్ సరిగా రాదు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారంతా సిగ్నల్ కోసం గొరకలమడుగు గ్రామానికి వెళుతుంటారు. చాలా మంది యువకులు చాటింగ్ కోసం ఎక్కువగా ఆ చెట్టు కిందకే వెళుతుంటారు. సిగ్నల్స్ కోసం వెళ్లిన కృష్ణ పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది. చదవండి: శ్రీశైలం చేరిన కృష్ణమ్మ! -
దారుణం: సొంత చెల్లెలిపై అన్న అకృత్యం
సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత అన్నయ్యే తనపై లైంగిక దాడికి పాల్పడటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని పిప్పిడి వెంకటి-రాధమ్మ దంపతుల చిన్న కూతురు భూమికగా గుర్తించారు. ఆమెకు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా తమ బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ.. కూతురు భూమికను పాత పాల్వంచలోని తన అన్నయ్య రాంబాబు ఇంటిలో వదిలి వెళ్లారు. కాగా రాంబాబు చెల్లెలిని రాత్రి జ్యోతినగర్‌లోని తన తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్లాడు. తండ్రి తర్వాత తండ్రిలా రక్షణగా ఉంటాడనుకున్న అన్నయ్యే కామాంధుడిగా మారి చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆవేదన చెందిన ఆ యువతి అవమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో రోడ్డుపైకి వచ్చిన భూమికను స్థానికులు గమనించి పాల్వంచ ఆసుపత్రికి తరలిచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ప్రభుత్వం ఆసుపత్రికి బాధితురాలిని తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా బాధితురాలిపై సొంత అన్నతో పాటు అతడి స్నేహితుడు కూడా బలత్కారం చేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల ఖమ్మం జిల్లాలో తండ్రి కూతురిపై అత్యాచారం చేసిన ఘటన మరువకముందే.. సొంత అన్నయ్య చెల్లెలిపై అత్యాచారం చేయడం స్థానికులను కలిచివేస్తుంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాకపోవడం.. పైగా రక్తసంబంధాలు, వావి వరసలు మరిచిన అఘాత్యాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి
సాక్షి, సింగరేణి: కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని వేజ్‌బోర్డు సభ్యుడు, జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి డాక్టర్ బీకే రాయ్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) 26వ మహాసభ జరిగింది. ఈ సభను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బీకే రాయ్ మాట్లాడుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ఆలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ సాధనకు ఎన్నో పోరాటాలు చేసిన కార్మికులను అణగదొక్కాలనే కేసీఆర్ ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మిక వ్యతిరేక వైఖరిపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. పరిశ్రమలను ప్రైవేటీకరించటం, అమ్మివేయడాన్ని బీఎంఎస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. దేశంలో బీఎంఎస్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన, జీతభత్యాల పెంపు కోసం పోరాటాలు సాగిస్తోందని అన్నారు. ఇతర 11 జాతీయ సంఘాలు పోరాటాలు చేసినట్లు నటిస్తున్నాయని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి బొగ్గు రంగంలో ఇతర కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మె చేశాయని, బీఎంఎస్ మాత్రం 5 రోజుల సమ్మె చేసిందని అన్నారు. బీఎంఎస్ సమ్మె దెబ్బతో కేంద్ర మంత్రి దిగివచ్చి కోలిండియా సింగరేణిలో ఎఫ్‌డీఐలను అనుమతించబోమని ప్రకటించారని అన్నారు. 1991లో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారని, ఆ విధానాలనే ప్రధానులు అటల్‌బిహారి వాజ్‌పేయి, నరేంద్రమోదీలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షింపబడతాయని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు ఈ నెల 19న బీఎంఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి, బూర్ల లక్ష్మీనారాయణ, మాధవ నాయక్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఏబీకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీర్‌గరుడే, జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేశం, దక్షిణభారత సంఘటన కార్యదర్శి సామ బాల్‌రెడ్డి, కెంగర్ల మల్లయ్య, రవిరాజ్‌వర్మ, రవిశంకర్, లట్టి జగన్మోహన్, ఎం.రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో మావోయిస్టుల పేలుళ్లు
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీ మందుపాతర పేల్చారు. సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్‌కు చెందిన జవాన్లు కూంబింగ్ కు వెళ్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. దీంతో జవాన్ మన్నాకుమార్ మౌర్యకు గాయాలయ్యాయి. వెంటనే ఇతడిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే.. దంతెవాడ జిల్లాలోని బార్సూర్–నారాయణపూర్ మార్గంలోని పుస్పాల్ వద్ద మావోయిస్టులు అమర్చిన ప్రెషర్బాంబు శుక్రవారం పేలింది. పోలీసులే లక్ష్యంగా ఈ బాంబును మావోయిస్టులు అమర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కేటీపీఎస్‌లో ఇనుము దొంగలు..
సాక్షి, కొత్తగూడెం: కేటీపీఎస్ కర్మాగారంలో ఇంజనీర్ స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే భారీగా జీతభత్యాలు అందుకుంటున్నా అక్రమ ఆదాయానికి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ గతంలో అనేక స్క్రాప్, ఆయిల్ చోరీలు జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఏడీఈ స్థాయి అధికారే ఇనుమును అక్రమంగా స్టోర్స్ నుంచి తరలించి, సస్పెన్షన్‌కు గురవడం చర్చనీయాంశంగా మారింది. యాష్ పాండ్‌లో పైపులైన్లకు సపోర్టింగ్ కోసం వినియోగించే స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను(రూ. 3.50 లక్షల విలువ) అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం, ఇందుకు బాధ్యుడైన ఓఅండ్ఎం ప్లాంట్‌లోని ‘బి ’స్టేషన్లో యాష్ పాండ్, వాటర్ ట్రీట్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఏడీఈ బి.ఎర్నా సస్పెన్షన్‌కు గురికావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎందరి పాత్ర ఉందనే విషయంపై విచారణ సాగుతోంది. ఇనుప ప్లేట్లను గతంలోనూ అనేక మార్లు బయటకు తరలించి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్టోర్స్‌లో ఇప్పటి వరకు ఇలా 40 ప్లేట్లు మాయమైనట్లు సమాచారం. సుమారు రూ.30 నుంచి రూ.40లక్షల వరకు పక్కదోవ పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే తాజాగా బయటకు తరలిస్తూ పట్టుబడిన ప్లేట్లు కొత్తవి. కొత్త ఇనుప పరికరాల విషయంలోనే ఇంతలా అక్రమాలకు పాల్పడుతుండడంతో పాత ఇనుము విషయం లో గతంలో ఎన్ని అక్రమాలు జరిగాయోననే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పట్టుబడిన ఒక్కో ప్లేట్ విలువ సుమారు రూ.1.80లక్షలు. ఈ నేపథ్యంలో పాత ఇనుము రూ. వందల కోట్లలో ఉంటుంది. దీన్ని గుట్టుగా బయటకు అక్రమ మార్గంలో తరలించేందుకు మూసివేతకు సిద్ధంగా ఉన్న ఓ అండ్ ఎం ప్లాంట్‌లో పోస్టింగ్‌ల కోసం పలువురు ఇంజినీర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు అంతంతే.. కేటీపీఎస్‌లో అక్రమాలపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ తనిఖీలు, విచారణలు చేసినా చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణ లో తేలితే థర్మల్ ప్లాంట్ల నుంచి హైడల్ విద్యుత్ ప్లాంట్లకు సైతం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అలా చేస్తుండకపోతుండడంతో ఇష్టారాజ్యంగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతం లో కేటీపీఎస్ ఓ అండ్ ఎం, 5, 6 దశల ప్లాంట్లలో అనేక సార్లు స్క్రాప్, ఫ్యూయల్ ఆయిల్ చోరీ చేస్తు పట్టుబడిన కేసుల్లో ఎవరిపైనా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆర్టిజన్ కార్మికుల నియామకాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సంస్థకు సంబంధం లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారు. కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంతో మూడు నెలలకే దెబ్బతింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం నుంచి టెండర్లు పిలవకుండా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. యాష్‌ను ఉచితంగా అందించాల్సి ఉండగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శ లు వచ్చాయి. 7వ దశ నిర్మాణంలోనూ భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి బయటకు తరలిపోయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి కూడా సరైన చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. కాగా తాజాగా ఇనుము పక్కదోవ పట్టిన విషయంపై టీఎస్ జెన్ కో విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్ విచారణకు పూనుకున్నారు. శుక్రవారం కర్మాగారాన్ని సందర్శించి సీఈ జె.సమ్మయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అక్రమాలపై ఏడీఈ ఎర్నాను సైతం విచారించారు. స్టోర్స్‌ను పరిశీలించారు. ఏడీఈ ఎర్నా, మరో నలుగురు ఆర్టిజన్ కార్మికులతో కలసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సీఈ జె.సమ్మయ్యను వివరణ కోరగా.. విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ వినోద్ కుమార్‌ను వివరణ కోరగా.. విచారణలో ఉన్న కేసుల వివరాలు బయటకు వెల్లడించలేమన్నారు. సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కొందరు స్వప్రయోజనాల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. విజిలెన్స్ నివేదికలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికులకు న్యాయం చేయాలి. –ఎస్కె.సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శి చర్యలు తీసుకోవాలి కేటీపీఎస్ అవకతవకలపై విజిలెన్స్ తనిఖీల్లో పారదర్శకత ఉండాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలోను అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిపై విచారణ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. –బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
‘సాయం’తో సంతోషం..
సాక్షి, కొత్తగూడెం : ఒకప్పుడు ఆడ బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం అప్పులపాలయ్యే పరిస్థితి ఉండేది. దీంతో తల్లిదండ్రులకు కంటినిండా కునుకు పట్టకపోయేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో ఆర్థిక సాయం అందిస్తూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఆడపిల్ల పెళ్లి భారంగా భావించిన తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లను వైభవంగా జరిపిస్తూ గౌరవ మర్యాదలను నిలుపుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన వారికి ఏ లోటూ లేకుండా చూసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మొత్తాన్ని క్రమంగా పెంచుతుండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఈ ఏడాది 5036 దరఖాస్తులు... 2019–20 ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో జిల్లాలో 5036 మంది కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో పరిశీలన జరిపి 2318 మందికి మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 1649 మందికి పంపిణీ చేశారు. ఇంకా 669 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. మరో 2718 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రూ.లక్ష దాటిన పథకం లబ్ధి... 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రవేశపెట్టింది. మొదట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రూ.51 వేలు మంజూరు చేశారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని రూ.75,116కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు బీసీ, ఈబీసీలకు సైతం పథకాన్ని వర్తింపజేశారు. 2018 ఏప్రిల్ 1 నుంచి రూ.1,00,116కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు మాత్రం ఈ పథకం కింద రూ.1, 25,140 లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించింది. అంతేకాక అనాథ ఆడ పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. వీరికి అర్బన్ ప్రాంతంలో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు చెల్లిస్తున్నామని, విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకునే మహిళలు గతంలో కల్యాణలక్ష్మి పథకంతో లబ్ధి పొందకుంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అధికారులు వివరించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల ప్రత్యేక దృష్టి
సాక్షి, కొత్తగూడెం : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజూ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయమై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారి విషయంలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత 11 నెలల్లో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1452 నమోదయ్యాయి. 2019 జనవరిలో 60 కేసులు, ఫిబ్రవరిలో 123, మార్చిలో 156, ఏప్రిల్‌లో 323, మేలో 215, జూన్‌లో 123, జూలైలో 164 కేసులు నమోదు చేశారు. 2018 సెప్టెంబర్‌లో 51 కేసులు, అక్టోబర్‌లో 89, నవంబర్‌లో 93, డిసెంబర్లో 54 కేసులు నమోదయ్యాయి. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెంది ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అలాగే వివిధ కాంట్రాక్ట్ కంపెనీల తరఫున ఇక్కడికి వచ్చి పనిచేసే వారూ ఎక్కువగానే ఉన్నారు. వీరితో పాటు ఇతరత్రా వివిధ వర్గాల వారు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఏప్రిల్ వరకు ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు కాగా, తరువాత కొంతమేరకు తగ్గుతూ వచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించేందుకు మరిన్ని డ్రైవ్‌లు చేపట్టేలా పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే వేస్తున్న జరిమానాలను భారీగా పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం సవరించినట్లు వార్తలు వచ్చాయి. త్వరలో పెంచిన జరిమానాలను అమలు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు వాహనాలు నడిపేవారు మద్యం సేవించకుండా ఉండాలి. మద్యం తాగి వాహనాలు నడిపితే వారితో పాటు ప్రయాణం చేసేవారు, రోడ్డుపై వెళుతున్న పాదచారులు, ఇతర వాహనదారులు సైతం ప్రమాదాల బారిన పడతారు. అమూల్యమైన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సదరు వాహనచోదకులపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు దిక్కులేనివారు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, మద్యం సేవించకుండా ఉండడం అంతే ముఖ్యం. పెద్ద వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ, డ్రంక్ అండ్ డ్రైవ్ అంశాలపై మరింత దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. – సునీల్‌దత్, ఎస్పీ -
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?
సాక్షి, కొత్తగూడెం : కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడచెలక వద్ద సుమారు 1600 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అధ్యయనం చేసి వెళ్లింది. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ భూసేకరణ ప్రధాన సమస్యగా ఉంది. అదేవిధంగా సమీపంలోనే అభయారణ్యం ఉండడంతో పర్యావరణ అనుమతులు సైతం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ అంశం కీలకం కానుంది. పునుకుడచెలక వద్ద ఉన్న భూములు అత్యధికం ఆదివాసీలవే కావడం గమనార్హం. తమ భూములను ఇచ్చేది లేదని వారు చెబుతుండడంతో కొంత సందిగ్ధం నెలకొంది. ఏఏఐ బృందం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా స్థల సమస్య రావడంతో ఈ అంశం వెనక్కు వెళ్లింది. అయితే తాజాగా రాష్ట్రంలో ఈనెల 20 నుంచి 23 వరకు మరోసారి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో ఆరు చోట్ల ఎయిర్‌పోర్టులు నిర్మించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను ఏఏఐకు అప్పగించింది. దీంతో గతంలో ఏఏఐ బృందం కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్ ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. సంబంధిత నివేదికను ఆ బృందం ఉన్నతాధికారులకు అందజేసింది. ప్రస్తుతం రానున్న బృందం ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. 20న ఢిల్లీ నుంచి నాగ్‌పూర్ రానున్నారు. 21న నాగ్‌పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్ వస్తారు. 22న నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 23న హైదరాబాద్ మీదుగా అవసరాన్ని బట్టి మరోసారి మహబూబ్‌నగర్‌లో పర్యటించి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ బృందంలో అమిత్‌కుమార్, నీరజ్గుప్తా, కుమార్ వైభవ్ ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు ప్రకటించారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే మిలటరీ అవసరాలకు... కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుంటే బహుముఖ అవసరాలకు ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు భూసేకరణ ప్రధాన సమస్య. ఇతరత్రా చూసుకుంటే అనుకూల అంశాలు ఉన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 200 కిలోమీటర్ల లోపు ఎయిర్‌పోర్టు నిర్మించకూడదనే ఒప్పందం ఉంది. అయితే కొత్తగూడెం శంషాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో దీనికి ఆ సమస్య లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ విమానాశ్రయం కోసం అనేక ఏళ్లుగా డిమాండ్ ఉంది. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్ ఉద్యోగులు కొత్తగూడెం ఎయిర్‌పోర్టు సాధన కమిటీ సైతం వేసుకోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి, సారపాకలో ఐటీసీ, పాల్వంచలో ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్‌పోర్టు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉంది. జిల్లాకు ఆనుకుని ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండడంతో పాటు సమీపంలో ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందని రెండు ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. -
ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడి అరెస్టు
సాక్షి, కొత్తగూడెం : సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) అజ్ఞాత దళ సభ్యుడిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చింతకుంట గ్రామ శివారు ఫారెస్టు ఏరియాలో ఎన్డీ పార్టీ అజ్ఞాత దళాలు సంచరిస్తున్నారనే సమాచారంతో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ, స్పెషల్ పార్టీ సిబ్బంది కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆజాద్ దళానికి చెందిన, కొత్తగూడెం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి మూల్గుగూడెం పాలవాగు వాస్తవ్యుడు మడివి రమేష్ అలియాస్ రవి తారస పడటంతో అదుపులోకి తీసుకున్నారు. రమేష్ వద్ద కంట్రీమెడ్ తుపాకితో పాటు కిట్‌బ్యాగు లభించినట్లు చెప్పారు. దళ కమాండర్ ఆజాద్, దళ సభ్యులు శ్యామ్, ఇతరులు తప్పించుకున్నారని వివరించారు. రమేష్ గత రెండేళ్ల నుంచి దళంలో తిరుగుతూ, గుండాల, కొమరారం ప్రాంతాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని, ఇప్పటి వరకు ఇతను గుండాలలో పోలీసుల మీద దాడి, అక్రమ వసూళ్లు తదితర నాలుగు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అరెస్టు చేసిన రమేష్‌ను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వివరించారు. అజ్ఞాత దళ సభ్యులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఎస్ఎం అలీ, సీఐ గోపి, ఎస్ఐ నరేష్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్
సాక్షి, ఖమ్మం (కొత్తగూడెం) : వ్యాపారులు, స్థానికంగా పని చేస్తున్న కాంట్రాక్టర్లను చందాల నిమిత్తం తుపాకులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి పారి పోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా కొత్తగూడ మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన గోపన్న గుండాలలోని రాయగూడెం అటవీ ప్రాంతంలో, కేసు పరిశోధన అధికారి, మహబూబాబాద్ డీఎస్పీ, గుండాల సీఐ సిబ్బందితో కలిసి గోపన్నను అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 303 బోల్ట్ యాక్షన్ తుపాకీ, తూటాలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గోపన్నపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గోపి అమాయక గిరిజనులను, ప్రజలను రెచ్చగొడుతూ పోడుభూముల పేరుతో అడవులను నరికిస్తున్నాడు. న్యూడెమోక్రసీ పార్టీకి ఓపెన్ క్యాడర్ ఉన్నప్పటికీ వారి మాట వినని ప్రజలను, నాయకులను, ప్రభుత్వ అధికారులను అజ్ఞాత సాయుధ దళాలచే బెదిరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని వివరించారు. అజ్ఞాత సాయుధ దళాల కార్యకలపాలు పెచ్చుమీరిపోయి సాధారణ ప్రజానీకానికి అభివృద్ధి కార్యకలాపాలకు అడ్డంకిగా మారారు. వీరిని అదుపు చేసే క్రమంలో గతంలో చాలాసార్లు అజ్ఞాత సాయుధ దళాలు పోలీసుల మీద కాల్పులకు దిగగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ వారి పద్ధతి మార్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళాల నాయకుడు లింగన్న ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చందాల కోసం ఇటీవల తునికాకు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ఇల్లెందు టౌన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావును పట్టుకొని ఇల్లెందు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి రూ.6 లక్షలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గతంలో వారిపై అనేక కేసు లు నమోదు అయినప్పటికీ వారి పద్ధతి మా ర్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళం కొద్ది రోజుల క్రితం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాం తంలో మకాం వేసి చందాల కొరకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను, పోడు భూముల పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు జూలై 31న గాలింపు చర్యలు చేపట్టి అజ్ఞాత సాయుధ దళాన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో లింగన్న సాయుధ దళం పోలీసులపై కాల్పులు జరుపగా, ఇరువైపులా జరిగిన కాల్పుల్లో దళ నాయకుడైన లింగన్న మరణించాడని, ఇతర దళ సభ్యులు తుపాకులతో తప్పించుకున్నారని వివరించారు. పారిపోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా గోపన్న దొరకడంతో అరెస్టు చేశామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సురేష్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష
సాక్షి, ఖమ్మం(కొత్తగూడెం) : ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడిపై చర్య తీసుకోవాలని ఓ ప్రియురాలు లక్ష్మీదేవిపల్లి మం డలం అనిశెట్టిపల్లి పంచాయతీ మాలగూడెంలో మంగళవారం దీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని బర్మాక్యాంపునకు చెందిన అంగూరు శిరీష అనే యువతి పులిపాటి పారామెడికల్ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. మాలగూడేనికి చెందిన కాకెల్లి దిలీప్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని, ఇంటి నుంచి వచ్చేయమంటూ తీసుకెళ్లాడని శిరీష వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరిని పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లడం సరికాదని, పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు దిలీప్‌ను నిలదీయగా ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ప్రియురాలు శిరీష కిద్ది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని న్యాయం చేయాలంటూ దిలీప్ ఇంటి వద్ద మంగళవారం దీక్షకు పూనుకుంది. శిరీష దీక్ష చేస్తున్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై నరేష్ బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తానని తెలిపారు. -
ముహూర్తం నేడే..
సాక్షి, కొత్తగూడెం : జిల్లాలో కొత్తగా ఎన్నికైన మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మంగళవారం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల పునర్విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటయ్యాయి. పునర్విభజన సమయంలో కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో వీటి సంఖ్య పెరిగింది. గతంలో భద్రాద్రి జిల్లా పరిధిలో మొత్తం 17 మండల పరిషత్‌లు ఉండగా, వాటిలో రెండు రద్దయ్యాయి. కొత్తగా మరో 6 పెరిగాయి. దీంతో ఇప్పుడు వాటి సంఖ్య 21కి చేరింది. మండలాల పునర్విభజన తర్వాత కొత్తగూడెం మండలం పూర్తిగా మున్సిపాలిటీలో ఉండడం, భద్రాచలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రతిపాదించడంతో ఈ రెండు మండల పరిషత్‌లు రద్దయ్యాయి. కొత్తగా ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తం 21 మండలాల్లో ప్రస్తుతం 20 మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు కొత్తగా కొలువుదీరనున్నాయి. బూర్గంపాడు మండల పాలకవర్గ కాలపరిమితి మరో ఏడాది ఉండడంతో అక్కడ మండల పరిషత్ ఎన్నికలు జరుగలేదు. కాగా, బుధవారం జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావుతో కలిపి మొత్తం 21 మంది జెడ్పీటీసీ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో కొత్తగూడెం ఉమ్మడి మండలంగా ఉన్న సమయంలో స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంగా మార్పు చేశారు. ఆలస్యంగా పాలకవర్గాల ప్రమాణస్వీకారాలు... జిల్లాల పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు కొనసాగాయి. ఇటీవల ఎన్నికలు జరిగి చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నప్పటికీ ఆయా పాలకవర్గాల ప్రమాణస్వీకారంలో మాత్రం ఇతర జిల్లాలతో పోలిస్తే నెల రోజులు ఆలస్యం అయింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక (భద్రాచలం రూరల్) మండలాలు ఏపీలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు నెలరోజులు ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించాయి. అయితే బూర్గంపాడు మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మాత్రం ఏడాది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ మండలంలోని నాలుగు గ్రామాలు ఏపీలో కలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం బూర్గంపాడు మండల పరిషత్‌కు ఎన్నికలు జరుగలేదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలకవర్గం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం 20 మండల పరిషత్‌లు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. రేపు జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. జిల్లా పరిషత్ విషయంలోనూ ప్రత్యేకతే ఉంది. గతంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సైతం రాష్ట్ర విభజన సమయంలో నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కాగా ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు ములుగు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గాలు సైతం నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేయనున్నాయి. బుధవారం ఈ నాలుగు జిల్లాపరిషత్‌లు కొలువుదీరనున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. గతంలో పీఓలుగా నియమించిన అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సిబ్బందిని కేటాయించడంతోపాటు ఫర్నిచర్ కూడా మంజూరు చేసినట్లు వివరించారు. భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాలు మినహా మిగిలిన 14 పాత మండలాలు, 6 కొత్త మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారని వివరించారు. -
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
కొత్తగూడెం అర్బన్: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా నాయుడుపాలెంకు చెందిన మందా రంజిత్‌రావు ప్రస్తుతం హైదరాబాద్‌లో తన అన్నయ్య వద్ద ఉంటూ.. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. అయితే 2014 నుంచి మావోయిస్టు హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులు, సామగ్రి (బూట్లు, చెప్పులు, బెల్టులు, ముద్రించిన విప్లవ సాహిత్య పుస్తకాలు) సమకూర్చుతున్నాడు. ఈ క్రమంలో 2018, జూన్ 8న మావోయిస్టు పార్టీకి ఆయుధ సామగ్రి (9 జిలెటిన్ స్టిక్స్, 9 డిటోనేటర్లు, 2 బాక్సుల ఎక్స్‌ప్లోజివ్ వైర్లు) తరలించే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపించారు. విడుదలైన తర్వాత కూడా రంజిత్‌రావు తన పద్ధతి మార్చుకోకుండా, 20 రోజుల క్రితం మావోయిస్టు హరిభూషణ్‌ను కలసి, ఆయన పంపిన విప్లవ సాహిత్యం, ఉత్తరాలను హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో కొత్తగూడెం–ఇల్లెందు క్రాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. -
కొత్తగూడెం అభివృద్ధి నా బాధ్యత: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తన బాధ్యత అని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. శనివారం సాయంత్రం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలుజరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న పోడు భూముల అంశాన్ని కూడా పరిష్కరిస్తామని సీఎం వనమాకు చెప్పారు. -
‘‘మేము ఎవరిమో నీకు తెలుసా..?’’
సాక్షి, కొత్తగూడెంఅర్బన్: పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై, పోలీసులపై నలుగురు తాగుబోతులు దౌర్జన్యం చేశారు. ‘మేము ఎవరిమో తెలుసా..? తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాం’ అని, ఎస్సైని బెదిరించారు. కొత్తగూడెం త్రీటౌన్ సీఐ ఆదినారాయణ, ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు... అది, కొత్తగూడెంలోని సూపర్‌బజార్ సెంటర్. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలు దాటింది. కొత్తగూడెం 33వ వార్డు కౌన్సిలర్ కుమారుడు బాలిశెట్టి పృథ్వీరాజ్‌తోపాటు బి.కృష్ణార్జున్, ఎండి.రఫిక్, బాలిశెట్టి సత్యనారా యణ.. మద్యం మత్తులో ఉన్నారు. తమ కారును సెంటర్లో ఆపారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. అదే సమయంలో అటువైపుగా ఎస్సై నరేష్, పోలీసులు వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారితో ఎస్సై చెప్పారు. అంతే.. ఆ నలుగురు ఎదురుతిరిగారు. ‘‘మేము ఎవరిమో తెలుసా..?’’ అంటూ, ఎస్సైపై.. సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ‘‘తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాం’’ అంటూ, మీది మీదికొచ్చి నెట్టేశారు. దుర్భాషలాడారు. ఆ నలుగురు తాగుబోతులను జీపులోకి ఎస్సై ఎక్కించారు. అప్పుడు కూడా ఆ తాగుబోతులు ఎదురు తిరిగారు. వారిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిపై సీఐ ఆదినారాయణకు ఎస్సై నరేష్ ఫిర్యాదు చేశారు. సీఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. ఆ నలుగురిని శనివారం కోర్టుకు అప్పగించారు. -
విషాదానికి 25 ఏళ్లు
కరకగూడెం (ఖమ్మం): మణుగూరు సబ్ డివిజన్లో పినపాక, కరకగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సమాంతర ప్రభుత్వాన్ని తలపించే రీతిలో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరేవారు. అయితే వారిని అణచివేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యూçహాలు రచించేది. ఇలా ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగేది. ఈ క్రమంలో 1992 సెప్టెంబర్ 4వ తేదీన పినపాక–కరకగూడెం మండలాల మధ్య గల రాళ్లవాగు వద్ద మావోయిస్టులు బ్రిడ్జిని పేల్చివేశారు. ఈ భారీ విస్ఫోటనానికి ఐదు మందు పాతరలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి పినపాక మండలంలో మావోయిస్టు కదలికలను అరికట్టేందుకు కరకగూడెంలో నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భద్రత కోసం వస్తూ ప్రాణాలు కోల్పోయారు.. కాగా, కరకగూడెం స్టేషన్ భద్రత కోసం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది సిబ్బంది జీపులో కరకగూడెం పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. వారి కదలికలను అడుగడుగునా తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో రాళ్లవాగు బ్రిడ్జికి మందుపాతరను అమర్చారు. 1992 సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాళ్లవాగు వద్దకు చేరుకున్న పోలీసుల జీపును మావోయిస్టులు పేల్చి వేశారు. పూర్తి అటవీ ప్రాంతమైన రాళ్లవాగు వద్ద నుంచి భారీ శబ్దాలు రావడంతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. వేలాది మంది ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు ప్రయాణిస్తున్న తునాతునకలయిన జీపును, చెట్టుకొకటి, పుట్టకొకటిగా పడి ఉన్న పోలీసుల మృతదేహాలు గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా నిలిచింది. ఇప్పటికీ ఏడూళ్ల బయ్యారం నుంచి కరకగూడెం రావాలంటే పోలీసులు భారీ బందోబస్తుగానే వస్తుంటారు. పోలీస్ శాఖలో రాళ్లవాగు ఘటన పెను విషాదాన్ని నింపింది. ఆనాటి విషాద ఘట్టంలో అమరులైన పోలీసులు వీరే.... డి. నరేందర్ పాల్ (రిజర్వ్ ఇన్స్పెక్టర్), ఎస్ఏ. జార్జ్ (సబ్ ఇన్స్పెక్టర్), డి. ప్రభాకర్ రావు (ఏఆర్ ఎస్సై), ఐ. రామారావు (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు డి. శంకర్‌బాబు, జి. నాగేశ్వరరావు, ఎం. వెంకటేశ్వరరావు, జి. సత్యనారాయణ, వై.బేబిరావు, టి. సుబ్బారావు అమరుల త్యాగాలు చిరస్మరణీయం సమాజంలో పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. అలాగే వెలకట్టలే నివి. ప్రజల మధ్యలో ఉంటూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసులను ప్రతి రోజు స్మరించుకుంటున్నాం. వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. – ఆర్ సాయిబాబా మణుగూరు డీఎస్పీ స్మరించుకోవడం అందరి బాధ్యత సమాజ శ్రేయస్సే లక్ష్యంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత. అలాగే అమరుల కర్తవ్యం, త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. – ఇ రాజ్‌కుమార్ కరకగూడెం ఎస్సై -
పథకాల అమలులో ముందంజ
కొత్తగూడెంఅర్బన్: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి, వారి అభివృద్ధికి పాటుపడడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక రైటర్‌బస్తీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పలు పార్టీల నుంచి 150 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సరికొత్త సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నామన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎంతోమంది కర్షకులకు మేలు జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాలన మెచ్చి..ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జేడి చంటి, పట్టణ పరిధి బర్లిఫిట్ ఏరియా కాంగ్రెస్ నాయకులు రామయ్య, బుడబుక్కల సంఘం జిల్లా నాయకులు గోపి, ఇల్లెందు నుంచి ప్రదీప్, సందీప్, సోహెల్, వేణు, శశాంక్, రాజేష్, అఫ్రోజ్‌తో పాటుగా రుద్రంపూర్ తదితర ఏరియాల నుంచి పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ కొదుమసింహ పాండురంగచార్యులు, టీఆర్ఎస్ నాయకులు గోపాలరావు, డాక్టర్ శంకర్‌నాయక్, ఆళ్ల మురళి, తూము చౌదరి, వార్డు కౌన్సిలర్లు దుంపల అనురాధ, సరోజ, నాయకులు కందుల సుధాకర్‌రెడ్డి, పులిరాబర్ట్ రామస్వామి, సోమిరెడ్డి, పురుషోత్తం, కృష్ణ ప్రసాద్, అక్రం పాష, కనుకుంట్ల శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతిని గురువారం కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి పూజలు చేశారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీలు, హనుమాన్æ సేవా సమితీల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కొత్తగూడెంటౌన్ : జిల్లా కేంద్రంలోని రామవరం సీఆర్పీ క్యాంప్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, రుద్రంపూర్‌లోని హనుమాన్ దేవాలయం, రైటర్‌బస్తీలోని మాస్టర్ ఈకే విద్యాలయం హనుమాత్ సేవా సమితి ఆధ్వర్యంలో, బస్టాండ్ సెంటర్లోని హనుమాత్ సేవా సమితి ఆధ్వర్యంలో, ఇల్లెందు క్రాస్ రోడ్డులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, విద్యానగర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం, పాలకేంద్రంలోని హనుమాన్ ఆలయంలో స్వామివారి జయంతిని నిర్వహించారు. జూలూరుపాడులో.. జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం, జూలూరుపాడు, గుండెపుడి, పాపకొల్లు, భేతాళపాడు, కాకర్ల, పడమటనర్సాపురం, సురారం, బచ్చలకోయగూడెం తదితర గ్రామాల్లోని శ్రీఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారి జయంతిని జరుపుకున్నారు. కొన్నిచోట్ల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. -
55 రోజుల్లో.. 68 ప్రాణాలు
జిల్లా సరిహద్దులో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. అనుక్షణం యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. పోలీస్ కాల్పులు, మావోయిస్టు దాడులతో గిరిజనం ఆందోళనకు గురవుతోంది. గత 55 రోజుల్లో తడపలగుట్టల్లో 10మంది, గడ్చిరోలిలో 38 మంది మావోయిస్టులు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఇన్ఫార్మర్లు సహా మొత్తం 20 మందిని మావోయిస్టులు హతమార్చారు. సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, నారాయణపూర్, గడ్చిరోలి జిల్లాల్లో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిత్యం పేలుళ్ల మోత, తుపాకీ తూటాల చప్పుళ్లతో సరిహద్దు గ్రామాల్లో దడ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 55 రోజుల్లో ఏకంగా 68 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత మార్చి 2వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం 48 మంది మావోయిస్టులు మృతి చెందారు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన మావోయిస్టులు అప్పటినుంచి సరిహద్దుల్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో పలు విధ్వంస కార్యకలాపాలు, హత్యలకు పాల్పడుతున్నారు. భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, మొత్తం 20 మందిని హతమార్చారు. మావోయిస్టుల దాడి మృతుల్లో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బీజాపూర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఒక సర్పంచ్, ఒక కాంట్రాక్టర్, ఒక ఇంజినీర్, ఒక మాజీ కానిస్టేబుల్, ఇద్దరు మాజీ మావోయిస్టులు ఉన్నారు. తాజాగా బుధవారం దంతెవాడ జిల్లా కొవ్వకొండ పరిధిలోని గర్మిరి గ్రామంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని హత్య చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈనెల 25న నిరసనదినంగా చేపట్టాలని మావోయిస్టులు ఈ నెల 24న భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఆంజనేయపురం – చినముసిలేరు గ్రామాల మధ్య పోస్టర్లు, కరపత్రాలను వదిలిపెట్టారు. చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా బుధవారం చర్ల మండలంలోని పెదమిడిసీలేరు వద్ద రోటింతవాగుపై ఉన్న వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. దండకారణ్యం దాటి వచ్చి మరీ ఈ విధ్వంసానికి మావోయిస్టులు పాల్పడ్డారు. భద్రాద్రి, జయశంకర్ జిల్లాల్లో కార్యకలాపాలు.. నోట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న మావోయిస్టులు ఆర్థిక వనరులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రాంతం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లోని గుండాల, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, మహాముత్తారం మండలాల్లో గతంలో తమకు డెన్లుగా ఉన్న గ్రామాల్లో రిక్రూట్మెంట్ల ద్వారా పూర్వవైభవం సాధించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వలస గొత్తికోయల గ్రామాలను సైతం ఇందుకోసం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. చాపకింద నీరులా తెలంగాణ జిల్లాల్లో విస్తరించేందుకు ఇటీవలే కమిటీలు సైతం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మావోయిస్టులు పేలుడు పదార్థాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక్కడి పోలీసుల తనిఖీల్లో పేలుడు పదార్థాలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. మరోవైపు 6 నెలలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల ద్వారా గోదావరి దాటి ఇతర జిలాల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గత నెల 2న తడపలగుట్ట ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దీంతో అప్పటినుంచి సరిహద్దుల్లో నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంది. సాధారణంగా భారీగా ఆకురాలే ఎండాకాలంలో మావోయిస్టులు తాము సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్ దండకారణ్యంలోని అబూజ్మడ్(షెల్టర్‌జోన్)కు వెళతారు. ఈసారి మాత్రం అనుకున్న సమయానికి మావోలు దండకారణ్యానికి చేరుకోలేకపోయారు. ఇప్పటికే సంఖ్యాబలం పరంగా, నోట్ల రద్దుతో ఆర్థికంగా బలహీనపడ్డారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కార్యకలాపాలు పెంచేందుకు ఐదు నెలలుగా రిక్రూట్మెంట్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తగా తెలంగాణలోని ఏరియా, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక వనరులు, పేలుడు సామగ్రి సమీకరించుకునేందుకు గోదావరి దాటి తెలంగాణలోని ఇతర జిల్లాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎడతెగని పోరు సాగుతోంది. మావోయిస్టు దాడులు ఈనెల 20వ తేదీన సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మృతి చెందాడు. 16న ఫైదగూడ రోడ్డు నిర్మాణ పనుల ఇంజనీర్‌ను హత్యచేశారు. 15న సుక్మా జిల్లా చింతగుప్ప వద్ద ఐఈడీ పేల్చడంతో డీఆర్జీ జవాన్ గాయపడ్డాడు. 14న సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని ఫైదగూడ వద్ద రోడ్డు నిర్మాణంలో ఉన్న వాహనాన్ని తగులబెట్టారు. కార్మికులను కొట్టారు. అదే సీఆర్ఫీఎఫ్ క్యాంపులోని మూడు ఖాళీ బ్యారక్‌లను పేల్చివేశారు. 9న బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ పరిధిలోని కుట్రు మార్గంలో బస్సును పేల్చివేయడంతో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8న సుకుమా జిల్లా బడేసుట్టి గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు గొంతుకోసి హత్యచేశారు. రెండు మిక్సర్లను, నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. 7న బీజాపూర్ జిల్లా ఖేరామ్గఢ్ అటవీ శాఖ సిబ్బందిని చితకబాదారు. 5న చర్ల ఏరియా తిప్పాపురం–పామేడు గ్రామాల మధ్య పోలీసులే లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చడంతో స్థానిక గిరిజనుల పశువులు మృతిచెందాయి. మార్చి 28వ తేదీన పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పకు చెందిన ఇర్ప లక్ష్మణ్ అలియాస్ భరత్ అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. మార్చి 28న బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న ఊట్లపల్లి గ్రామానికి చెందిన సోడి అండాలు అనే మాజీ మావోయిస్టును హతమార్చారు. గత మార్చి 27న బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండెరను హత్య చేశారు. మార్చి 19న బీజాపూర్ జిల్లా నూకన్పాల్వద్ద రోడ్డుపనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ విశాల్‌కుమార్‌ను హతమార్చారు. మార్చి 13న సుకుమా జిల్లా కిష్టారం వద్ద శక్తిమంతమైన ఐఈడీ పేల్చడం ద్వారా 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. తెలంగాణలోకి మరింతగా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించే మావోయిస్టులు పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు ముందు జనవరి 24న చర్ల మండలం క్రాంతిపురంలో ఒకరిని హత్యచేశారు. జనవరి 26వ తేదీన పినపాక మండలం జానంపేట సమీపంలోని ఉమేష్‌చంద్రనగర్‌లో మరొకరిని హత్యచేశారు. పోలీస్ కాల్పులు, అరెస్ట్‌లు : ఈ నెల 1న సుకుమాజిల్లా కిష్టారం వద్ద ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ దళాలు 12 మంది మావోయిస్టులను అరెస్టు చేశాయి. మార్చి 2న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
ఎట్టకేలకు ‘కారుణ్యం’
సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణి యాజమాన్యం ఎట్టకేలకు కారుణ్యనియమకాల సర్క్యులర్‌ను జారీచేసింది. ఈ సర్క్యులర్‌లో గతంలో ఉన్న 5 జబ్బులకు తోడు మరో 11 జబ్బులను చేర్చి మొత్తం 16 రకాల జబ్బులున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 09.03.2018 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అర్హులని తెలిపింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 3,600 మందికి ఊరట కలగనుంది. వీరు అర్హులు 1)పక్షవాతం, 2)మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, 3)కాలేయ సంబంధిత వ్యాధులు 4)కేన్సర్, 5)మానసిక వ్యాధులు, 6)మూర్ఛ, 7) గని ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు (ఉదాహరణకు కాళ్లు, చేతులు, కళ్లు ఇతరత్రా), 8)గుండె జబ్బులు, 9)టీబీ 10)హెచ్ఐవీ 11)కుష్టు వ్యాధి 12)కీళ్లవ్యాధి 13) దృష్టిలోపం, వినికిడిలోపం 14)మెదడు సంబంధిత వ్యాధులు 15) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు 16) రోడ్డు, ఇతర ప్రమాదాలలో గాయపడి అంగవైకల్యం పొందిన వారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఉద్యోగం పొందే వారసుడి వయసు 35 సంవత్సరాలు ఉండాలని నిబంధన విధించింది. అయితే గతంలో (2015) ఇచ్చిన వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో సర్వీసు ఒక్క సంవత్సరం ఉన్నవారికి, వయోపరిమితి 40 సంవత్సరాలు ఉన్నవారికి అవకాశం కల్పించింది. యాజమాన్యం ఈ సర్క్యులర్‌లో 2 రెండు సంవత్సరాల సర్వీసుతోపాటు, వయోపరిమితిని 35 సంవత్సరాలకు కుదించింది. దీంతో చాలామంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముందని, యాజమాన్యం పునరాలోచించాలని పలు కార్మిక సంఘాల నాయకులు వేడుకుంటున్నారు. ఏడాది వారికీ అవకాశం కల్పించాలి కారుణ్య నియామకంలో యాజమాన్యం ఒక్క సం వత్సరం సర్వీసు ఉన్నవారికి కూడా అవకాశం కల్పి స్తే ఆమోద యోగ్యంగా ఉంటుంది. మరికొంత మందికి అవకాశం వస్తుంది. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారే అర్హులని పేర్కొనడం సరికాదు. –భూక్యా శ్రీరామ్, పీవీకే–5షాఫ్టు గని రేపు దిగిపోయేవారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు రేపు దిగిపోయే కార్మిక కు టుంబానికి కూడా సహా యం చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అర్హుల ని ప్రకటించటం దారుణం. అందరూ తెలం గాణ వాసులే. అంతా సింగరేణి తల్లీవడి పిల్లలే. అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి. –వీరస్వామి, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ వయోపరిమితి పెంచాలి వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచాలి. తాజాగా విడుదల చేసిన కారుణ్య నియామకాల సర్క్యులర్‌లో వయోపరిమితిని 35 ఏళకు కుదించటంతో.. వందలాది కుటుంబాలు ఉద్యోగాలను పోగొట్టుకునే ప్రమాదముంది. వయోపరిమితిని పెంచి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి. –రాంశంకర్‌కోరి, పీవీకే–5షాఫ్ట్ -
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కొరియర్లు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడు సామాగ్రి స్వాధీనపర్చుకున్నారు. కొత్తగూడెంలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ఈ విషయం తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు... మావోయిస్టు కొరియర్లు పేలుడు సామాగ్రితో వెళుతున్నారన్న సమాచారంతో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చర్ల, భద్రాచలం వద్ద పేలుడు సామాగ్రితో వెళుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించారు. తాము మావోయిస్టు కొరియర్లుగా పనిచేస్తున్నట్టు వారు చెప్పారు. చర్ల వద్ద మడివి సమ్మయ్యను, ఓయం నందను, భద్రాచలం వద్ద మిర్గం అర్జున్ను అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులైన చంద్రన్న, ఆనంద్, పాపారావు, మదన్న, హరిభూషణ్, ఇద్దమయ్య, దామోదర్ దళాలకు ఇచ్చేందుకు ఈ పేలుడు సామాగ్రిని తీసుకెళుతున్నట్టు చెప్పారు. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది. ఈ ముగ్గురి నుంచి 51 జిలెటిన్ స్టిక్స్, 130 డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్, కొత్తగూడెం డీఎస్పీ ఎంఎస్ అలీ, బెటాలియన్ అధికారి కేసీ అహ్లవత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఎంటీఓ సోములు, ఎస్పీ పీఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి
భద్రాచలం( కొత్తగూడెం జిల్లా): భద్రాచలంలో హోళీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలానికి చెందిన ఐదుగురు స్నేహితులు హోలీ వేడుకల అనంతరం గోదావరిలో స్నానానికి వెళ్లారు. లోతు అంచనావేయడంలో తప్పిదం జరగడంతో ఐదుగురు యువకులు మునిగిపోయారు. అక్కడున్న వారు వెంటనే స్పందించి ముగ్గుర్ని కాపాడగలిగారు. మరో ఇద్దరు మునిగి చనిపోయారు. మృతులు మండలకేంద్రంలోని శిల్పినగర్‌కు చెందిన మోరంపూడి రాంప్రసాద్(19), అయ్యప్పనగర్ కాలనీకి చెందిన బోటా రమేశ్(19)లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసభ్య పదజాలం..విద్యార్థుల ధర్నా
ఉపాధ్యాయినిలతో దుర్భాషలాడిన ప్రధానోపాధ్యాయుడు పాల్వంచ(కొత్తగూడెం): పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా మాట్లాడిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాల్వంచలోని వికలాంగుల కాలనీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సూర్యనారాయణ మహిళ ఉపాధ్యాయులతో దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపాధ్యాయినిలు గురువారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. -
కొత్తగూడెంలో 50 డిగ్రీలు!
వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది మృతి సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగూడెంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది. దీంతో పట్టణం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక ఇల్లెందులో 49, మణుగూరులో 48.5, సత్తుపల్లిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతుండడంతో గనుల్లో విధులు నిర్వహించేందుకు వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. వడదెబ్బతో నల్లగొండలోనే 15 మంది మృత్యువాత సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో వివిధ జిల్లాల్లో సోమవారం 45 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో 15మంది, కరీంనగర్ జిల్లాలో 11మంది, ఖమ్మం జిల్లాలో 9 మంది, వరంగల్ జిల్లాలో 8 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మెదక్ జిల్లాలో ఒకరు మరణించారు. ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలివీ.. ప్రాంతం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 43.3 హన్మకొండ 42.6 హైదరాబాద్ 39.2 నల్లగొండ 41.4 నిజామాబాద్ 43.3 -
పాల్వంచ కేటీపీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ సిఫారసు భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిబంధనలపై సైతం ఆమోద ముద్ర ఇంకా విడుదల కాని తుది ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఏడో దశ విద్యుత్ కేంద్రానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటీపీఎస్‌లో మొత్తం 1720 మెగావాట్ల సామర్థ్యంతో 11 విద్యుత్ కేంద్రాలను ఆరు దశల్లో నెలకొల్పారు. ఏడోదశ విస్తరణలో భాగంగా తెలంగాణ జెన్కో అక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. కేటీపీఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన 230 ఎకరాల స్థలంలోనే ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు పర్యావరణ అనుమతుల కోసం గత రెండేళ్లుగా జెన్కో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈనెల మొదటివారంలో సమావేశమై ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలని సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తాజాగా తెలంగాణ జెన్కోకు లేఖ అందింది. మరో వారం రోజుల్లో అనుమతుల ఉత్తర్వులు సైతం జారీ కానున్నాయని జెన్కో వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ కేంద్రానికి సంబంధించి అమలు చేయాల్సిన నిబంధనలను సైతం ఇదే సమావేశంలో ఎక్స్పర్ట్ కమిటీ ఆమోదించింది. అదే విధంగా, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 13,674 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందులో కేవలం 4334 హెక్టార్లను కేటాయించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అంగీకారం తెలిపింది. -
గిరిజన విద్యార్థులను కాపాడండి
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగాచార్యులు కొత్తగూడెం అర్బన్: ఓ కళాశాల యూజమాన్యం మోసపూరిత ప్రచారంతో గిరిజన విద్యార్థులను చేర్చుకుని చదువు చెప్పకుండా, హాస్టల్లో సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులపాలు చేస్తున్నదని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగచార్యులు చెప్పారు. ఆయన శుక్రవారం కొత్తూగూడెం రైటర్ బస్తీలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని శ్రీమాన్విత ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ అండ్ పీజీ ప్రైవేటు కళాశాల యాజమాన్యం వారు హాస్టల్, లైబ్రరీ ఉచితమని చెప్పి గిరిజన విద్యార్థులను నమ్మించి చేర్చుకున్నారని చెప్పారు. ముందుగా ఒకొక్కరి నుంచి రూ.2000 వసూలు చేశారని అన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.4500, రెండవ సంవత్సరం వారికి రూ.6000, మూడవ సంవత్సరం వారికి రూ.6500 చొప్పున గిరిజన విద్యార్థుల పేరు చెప్పి ఐటీడిఏ నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. గిరిజనుల పేరు చెప్పి ఐటీడిఏల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలాల యాజమాన్యాలు ఇలా డబ్బు తీసుకుంటున్నాయని అన్నారు. శ్రీమాన్విత కళాశాల వారు కూడా పరీక్షల ఫీజు రూ.400 అని చెప్పి రూ.1500 వసూలు చేసినట్టు చెప్పారు. హాస్టల్లో విద్యార్థులే వంటలు చేసుకుంటున్నారని, గ్లర్స్ హాస్టల్‌కు కనీసం వార్డెన్ కూడా లేదని, వరుసగా మూడు రోజులపాటు ఒకే రకం కూర పెడుతున్నారని చెప్పారు. ఈ కళాశాలకు కనీసం సైన్స్ ల్యాబ్ కూడా లేదని, కరెంట్ బిల్లు కూడా విద్యార్థులే కట్టుకోవాలని కళాశాల యాజమాన్యం చెబుతోందని అన్నారు. ఇందులో కళాశాల యాజమాన్యంతోపాటు ఐటీటీఏ అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ఐటీడీఏలో అధికారులను కళాశాల యూజమాన్యం ‘కొనుగోలు’ చేసిందని ఆరోపించారు. కళాశాల విషయాలు బయటకు చెబితే హాల్ టికెట్ ఇచ్చేది లేదని యూజమాన్యం బెదిరిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీమాన్విత కళాశాలతోపాటు అనేక కళాశాలల యూజమాన్యాలు ఇలాగే గిరిజన విద్యార్థులను మోసగిస్తున్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరిగేంతవరకు విద్యార్థులకు వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వసతి, భోజనం కల్పిస్తామని కొదమసింహం అన్నారు. ఈ కళాశాల విద్యార్థుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భీమా శ్రీధర్, జిల్లా ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, మండల అధ్యక్షుడు కందుల సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్, పట్టణ నాయకులు కంభంపాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌కు అనుమతి కోరాం'
-
‘నకిలీ’ ముఠా అరెస్ట్
చుంచుపల్లి (కొత్తగూడెం రూరల్) : నకిలీ నోట్లు, నకిలీ బంగారం చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులున్న ముఠాను సోమవారం చుంచుపల్లి పంచాయతీలోని హౌజింగ్ బోర్డులో పట్టుకున్నట్టు కొత్తగూడెం డీఎస్సీ సురేందర్‌రావు, సీఐ మడత రమేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లతో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డ్ ప్రాంతానికి చెందిన మేదర మొయినుద్దీన్, అశ్వారావుపేటకు చెందిన పాకాల కోటేశ్వరరావు, సత్తుపల్లికి చెందిన గుమ్‌షావలి, సత్తుపల్లికి చెందిన ఓడ్లపెల్లి నాగేశ్వరరావు, వేంసూరుకు చెందిన చక్రాల రామకృష్ణ, కొత్తగూడేనికి చెందిన విద్యాసాయి ప్రకాష్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పదివేల రూపాయలు అసలు నోట్లు ఇస్తే, లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇస్తామంటూ కొందరిని వీరు నమ్మించి మోసగిస్తున్నారు. ఎవరైనా వచ్చి పదివేల రూపాయల అసలు నోట్లు ఇవ్వగానే.. వీరు నకిలీ లక్ష రూపాయల నోట్లు ఇవ్వరు. ఇంతలో ఈ ముఠాలోని సభ్యులే బయటి నుంచి విజిల్ వేస్తారు. ఆ వెంటనే వీరంతా.. ‘పోలీసులు వస్తున్నారు’ అంటూ, ఆ పదివేల రూపాయలతో అక్కడి నుంచి పారిపోతారు. బంగారం అమ్ముతామని.. బంగారం అమ్ముతామంటూ ఈ ముఠా సభ్యులు పాల్వంచకు చెందిన సుభాష్‌రెడ్డిని కలిశారు. అతని నుంచి ఐదువేల రూపాయలు తీసుకుని ‘బంగారం’ ఇచ్చి వెళ్లిపోయూరు. ఆ తరువాత, అది అసలు బంగారం కాదని, నకిలీదని సుభాష్‌రెడ్డి తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. చుంచుపల్లి పంచాయతీలోని హౌజింగ్ బోర్డులో ఈ ముఠా ఉందన్న సమాచారంతో పోలీసులు సోమవారం అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. కిలో నకిలీ బంగారం, పది లక్షల రూపాయల దొంగ నోట్లు స్వాధీనపర్చుకున్నారు. ఈ ముఠాలోని పాకాల కోటేశ్వరరావు, గుమ్‌షావలిపై భద్రాచలం, తాడిపల్లిగూడెం, నందిగామ, కొత్తగూడెం టూటౌన్, దమ్మపేట, అశ్వారావుపేట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నారుు. సమావేశంలో ఎస్ఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల ఆకలి కేకలు..
కొత్తగూడెం : ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఆసరాగా ఉండాల్సిన కార్పొరేషన్లు కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కళాశాలలకు మెస్ చార్జీలు అందించకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. స్కాలర్షిప్ రెన్యువల్‌తో పాటు నూతన స్కాలర్‌షిప్‌ల మంజూరులో కార్పొరేషన్లు జాప్యం చేస్తుండటంతో పేద విద్యార్థులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగూడెంలోని కాకతీయ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏడాది కాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు వీరికి అందించాల్సిన రూ. 25లక్షలు బకాయిలను అందించకపోవడంతో నాలుగు రోజులుగా మెస్‌ను మూసివేశారు. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న హోటళ్లలో ఒక్క పూట భోజనం చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 350 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. వీరి కోసం సెల్ఫ్మేనేజ్మెంట్ కింద కళాశాల మెస్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థికి నెలకు రూ.1900 నుంచి రెండు వేల వరకు ఖర్చవుతోంది. ప్రతి నెల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.950, బీసీ విద్యార్థులకు రూ.1200 ఆయా కార్పొరేషన్లు చెల్లిస్తున్నాయి. వీటిని మినహాయించి మిగిలిన మొత్తాన్ని కళాశాలకు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది కాలంగా పెండింగ్‌లో బకాయిలు.. ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి స్కాలర్‌షిప్‌ల రూపంలో వచ్చే మెస్ చార్జీలు రాకపోవడంతో మెస్ నిర్వహణ కళాశాల సిబ్బందికి భారంగా మారింది. ఈ మూడు కార్పొరేషన్ల నుంచి రూ.25 లక్షల వరకు బకాయి ఉండడం, ఇప్పటి వరకు బయట అప్పులు చేసి మెస్ నిర్వహించారు. ప్రస్తుతం బకాయిలు పెరగడం, బయట అప్పులు ఇచ్చే వారు లేకపోవడంతో నాలుగు రోజులుగా బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు మెస్ నిలిపివేశారు. అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు.. కళాశాలలో మెస్ నిలిపివేయడంతో విద్యార్థులు బయట ఉన్న హోటళ్లలో భోజనం చేస్తున్నారు. అది కూడా ఒక్కపూటే చేస్తూ అర్ధాకలితో కళాశాలకు వెళ్తున్నారు. కళాశాల నుంచి వెళ్లిపోతే చదువు ఆగిపోతుందనే భయంతో అర్ధాకలితోనే చదువుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలిపినప్పటికీ వారు పేదలు కావడంతో డబ్బులు కూడా పంపించలేకపోతున్నారని అంటున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తోటి విద్యార్థుల వద్ద అప్పు చేసి భోజనం చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
భళా..ఉత్సవ్
కొత్తగూడెం : బాలలతో కొత్తగూడెం కళకళలాడింది. మూడు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి 23వ అంతర్‌పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలు (బాలోత్సవ్-14) పట్టణంలోని కొత్తగూడెంక్లబ్లో శుక్రవారం అంత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రేలారే రేలా ఫేం సయ్యద్ రషీద్ జ్యోతి ప్రజ్వల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు బాలోత్సవ్‌కు సుమారు ఐదు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. 15 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. ఆటాపాటలతో చిన్నారులు ఆహూతులను అలరించారు. సాంస్కృతిక, సాహిత్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులు బాలోత్సవ్‌కు హాజరై పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. ఢిల్లీలో ఉంటూ తెలుగు మాట్లాడే చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఈ పండగకు హాజరైన మహతి, పారూన్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరితోపాటు వీరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం పోటీలు తిలకించేందుకు తరలి వచ్చారు. వీరందరికీ నిర్వాహకులు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. అయితే.. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సుమారు మూడు వేల మందికి స్వచ్ఛందంగా భోజనం, వసతి కల్పించారు. 15 విభాగాల్లో పోటీలు తొలిరోజు బాలోత్సవ్‌లో 15 విభాగాల్లో పోటీలు జరిగాయి. తెలుగు మాట్లాడుదాం పోటీకి 285 మంది, సినీ, లలిత, జానపద గీతాలు జూనియర్స్ విభాగంలో 152 మంది, సీనియర్స్‌లో 145, కవితా రచనలో 245, కథా విశ్లేషణలో 225, భరత నాట్యం సబ్ జూనియర్స్‌లో 59, కూచిపూడి సబ్ జూనియర్స్‌లో 107, జానపద నృత్యాల్లో 160, క్విజ్ పోటీలకు 250, , నాటికల్లో 90 బృందాలు, స్పాట్ డ్రాయింగ్‌లో 200 మంది పాల్గొన్నారు. విజేతలు వీరే... చిత్రలేఖనం జూనియర్స్ : హైదరాబాద్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన జి.వి.దివ్యశ్రీ ప్రథమ, ఖమ్మం శ్రీ చైతన్య ఇంటర్ నేషనల్ స్కూల్‌కు చెందిన ఆర్.దీక్షిత ద్వితీయ, ఖమ్మం హార్వేస్ట్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన కె.లోహిత తృతీయ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లావణ్యరెడ్డి స్పెషల్ ప్రైజ్‌లు గెలుచుకున్నారు. చిత్రలేఖనం సబ్ జూనియర్స్ : ఖమ్మం న్యూవిజన్ స్కూల్‌కు చెందిన జే.జోహారిక ప్రథమ, హైదరాబాద్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన ప్రంజల్ శర్మ ద్వితీయ, కర్నూలు జిల్లా నంద్యాల శ్రీగురురాజా స్కూల్‌కు చెందిన పి.బెన్నీబాల్రాజ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. చిత్రలేఖనం సీనియర్స్ : ఖమ్మం జిల్లా రుద్రంపూర్ సెయింట్ జోసప్ హైస్కూల్‌కు చెందిన ఎం.డి.అనీస్ ప్రథమ, ఖమ్మం జిల్లా పాల్వంచ డీఏవీ మోడల్ స్కూల్‌కు చెందిన జి.నవీన్ ద్వితీయ, అశ్వాపురం అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌కు చెందిన జి.సంజయ్బార్గవ్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. లఘు చిత్ర సమీక్ష విభాగం : నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన శ్రీ తేజ విద్యాలయం విద్యార్థి అభిజ్ఞ ప్రథమ, ఖమ్మం జిల్లా కొత్తగూడెం త్రివేణి స్కూల్‌కు చెందిన వి.హడప్ప ద్వితీయ, ఖమ్మం న్యూఇరా మైండ్ ఫీల్డ్స్‌కు చెందిన ఎస్.కె.అస్లం తృతీయ బహుమతులు సాధించారు. కవితా రచన జూనియర్స్ : కర్నూలు జిల్లా నంద్యాల గురురాజా స్కూల్‌కు చెందిన ఎం.మనీషా ప్రథమ, ఖమ్మం జిల్లా మణుగూరు ఎస్సీ హైస్కూల్‌కు చెందిన టి.వెన్నెల ద్వితీయ, భద్రాచలం ఎస్ఎస్ఎంజీ హైస్కూల్‌కు చెందిన దివ్యసాయి తృతీయ బహుమతులు సాధించారు. కవితా రచన సీనియర్స్ : ఖమ్మం హార్వేస్ట్ స్కూల్‌కు చెందిన శ్రీహిత ప్రథమ, భద్రాచలం నవోదయ స్కూల్‌కు చెందిన టి.చందన ద్వితీయ, ఖమ్మం భారత్ బాలమందిర్‌కు ఎందిన వి.సాయిసుష్మా తృతీయ బహుమతులు సాధించారు. సృజనాత్మకత భేష్ ప్రతి పోటీలోనూ విద్యార్థులు ఎవరికి వారే దీటుగా తమ సజనాత్మకతను చాటుకున్నారు. సినీ, లలిత, జానపద గీతాల పోటీల్లో సైతం తమ వయసుకు మించి ప్రతిభను కనబర్చడంతో న్యాయ నిర్ణేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కథా విశ్లేషణ లో ‘రెండు రాజ్యాలు- అభివృద్ధికి దారులు’ అనే అంశాన్ని ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆలోచనాశక్తికి పదునుపెట్టారు. పెయింటింగ్ విభాగంలో ‘సామాజిక రుగ్మతలు’ అనే అంశాన్ని పేపర్‌పై అద్భుతంగా చిత్రీకరించారు. అలరించిన జానపద నృత్యాలు బాలోత్సవ్‌లో జానపద నృత్యాలు ఉర్రూతలు ఊగించాయి. ‘బొట్ల బొట్ల చీర కట్టి.. బొమ్మంచు రవికతొడిగి’ అని పాట మొదలుకాగానే వేదికపై చిన్నారులతోపాటు ఆహూతులు సైతం నృత్యాలు చేశారు. ‘నా అందం చూడుబాబయ్యో..’ అంటూ సాగే పాటకు కేరింతలు, కరతాళధ్వనులు మార్మోగాయి. సాయంత్రం ఇండోర్ స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్స్ భరత నాట్యం, కూచిపూడి నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాస్ట్యూమ్స్ రెడీ బాలోత్సవ్లోని వివిధ పోటీల్లో పాల్గొనే చిన్నారుల కోసం రెడీమేడ్ కాస్ట్యూమ్స్ కొత్తగూడెం క్లబ్ ప్రాంగణంలోనే అందుబాటులో ఉన్నాయి. ఏ వేషమైనా... ఏ నృత్యమైనా ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, నాటికలు, ఫ్యాన్సీడ్రెస్ పోటీల్లో పాల్గొనే వారికి అవసరమైన కాస్ట్యూమ్స్, వస్తువులు లభ్యమవుతున్నాయి. కర్నూలు, హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా మేకప్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. -
తుక..తుక.
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : కోల్‌బెల్ట్ పరిధిలోని బొగ్గు గనులు తుకతుక మండుతున్నాయి. భానుడు రోజురోజుకూ తన ప్ర తాపం చూపుతుండడంతో మైన్స్‌లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చే యలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్‌బెల్ట్ ఏరియాల్లో 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత రానురాను మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు కొలిమై మండుతున్న కోల్‌బెల్ట్‌ను చూసి భయపడిపోతున్నారు. మొదటి బదిలీ విధులు ముగించుకొని వచ్చే కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు గని నుంచి ఇంటికి బయలు దేరుతారు. అదే సమయానికి రెండో బదిలీకి వెళ్లే కార్మికులు సైతం ఇంటి నుంచి గనికి విధులకు వెళ్తారు. ఈ సమయంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింగరేణిలో 15 ఉపరితల, 34 భూగర్భ గనుల్లో 64 వేల మంది కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తున్నారు. రోజూ మొదటి, రెండో బదిలీ కార్మికులు 45 వేల మంది వరకు హాజరవుతుంటారు. ఇక్కడే ఉష్ణోగ్రత ఎందుకు ఎక్కువ.. బొగ్గు, దుమ్ము కార్మిక కాలనీల్లో విస్తరించడంతో పరిసర ప్రాంతాలు సాధారణ స్థాయిలో మించి ఉష్ణోగ్రత పెరుగుతుంది. బొగ్గు గనులు విస్తరించడం కోసం అడవులను నరికి వేశారు. దీనికి తోడు జనసాంద్రత పెరిగింది. బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపరితల గనుల్లో ఎండ వేడిమి సాధారణం కంటే అధికంగానే ఉంటుంది. పట్టణాల్లో ఉన్న వేడి కంటే గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోనే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. బొగ్గు ఆక్సీకరణం చెందడంతోనూ ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా నమోదవుతూ ఉంటుంది. ఆక్సీకరణం చెంది మంటలు వ్యాపించిన సందర్భాలు ఉపరితల గనుల్లో ఇప్పటికే నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితి.. ఎండ వేడిని తట్టుకోలేక కార్మికుల హాజరు శాతం ఉపరితల గనుల్లో కొంత మేరకు తగ్గుతోంది. ఉదయం పది గంటల వరకే ఉష్ణోగ్రత 38 డి గ్రీలు నమోదవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 డిగ్రీలు దాటుతుండడంతో కార్మికులు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారు సెలవులను వినియోగించుకుంటున్నారు. నివారణ చర్యలు చేపడుతున్నా.. ఉపరితల గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపరితల గనుల్లోని బొగ్గు పొరలు వేడెక్కకుండా ఉండేందుకు అధికారులు బొగ్గు బెంచీలను నీటితో నింపుతున్నారు. నీరు లభించని గనుల్లో బొగ్గు పొరలను మట్టితో కప్పేస్తున్నారు. ఉపరితల గనుల దారుల్లో స్పింకర్ల ద్వారా నీటిని సైతం చల్లిస్తున్నా వేడిమి మాత్రం తగ్గడం లేదు. సింగరేణి ఏం చేసింది.. భూగర్భ, ఉపరితల గనులతోపాటు సింగరేణి కాలనీల్లో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతను అడ్డుకునేందుకు యాజమాన్యం మొక్కలను నాటింది. గనులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో అవి విస్తారంగా పెరిగి చల్లని ప్రదేశాలుగా మారాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా 2002లో అటవీ శాఖను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1872.5 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల నీలగిరి, వెదురు, కానుగ తదితర మొక్కలను యాజమాన్యం నాటింది. కొత్తగూడెం ఏరియాలో 240, ఇల్లందు ఏరియాలో 115, మణుగూరు ఏరియాలో 40, ఆర్జి-1 ఏరియాలో 502.50, ఆర్జి-2 ఏరియాలో 115, ఆర్జి-3 ఏరియాలో 95, భూపాలపల్లి ఏరియాలో 260, శ్రీరాంపూర్ ఏరియాలో 215, బెల్లంపల్లి ఏరియాలో 205, మందమర్రి ఏరియాలో 85 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల మొక్కలను నాటించింది. అయితే.. బొగ్గు నిక్షేపాలు పూర్తయిన గనుల వద్ద మరిన్ని మొక్కలను నాటి పెంచడానికి కృషి చేయాలి. ఇంకా పలు కాలనీల్లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలను కూడా కలుపుకుని మొక్కలు పెంచితే ఫలితం ఉంటుంది. -
‘అకాల’నష్టం: నేల రాలిన మామిడి
* జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన * నేల రాలిన మామిడి * కల్లాల్లో తడిసిన మిర్చి, వరి పంటలు * పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలికి తోడు వడగండ్ల వర్షం పడడంతో మామిడికాయలు నేలరాలాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులు ప్రభావంతో విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. వరిపనలు తడవడం, కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి పోవడంతో చేతికొచ్చిన పంటలు చేజారిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, వైరా, ఇల్లెందు, ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో ఆదివారం అకాల వర్షం కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, టేకులపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, అశ్వారావుపేట, వేలేరుపాడు ప్రాంతాల్లో గాలివాన బీభత్సంతో మామిడికాయలు నేలరాలాయి. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో గాలి వాన రావడంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు టార్బాలిన్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాల్లిందని రైతులు చెపుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడం, స్తంభాలు కూలడంతో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. అధివారం అర్థరాత్రి వరకు కూడా ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, ముది గొండ మండలాల పరిధిలో గాలివాన మూలంగా పలు ప్రాంతాల్లో కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో రోడ్లు వాగులను తలపించాయి. పట్టణంలోని జాతీయ రహదారిపై భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద సైతం భారీ స్థాయిలో వరదనీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో సుమారు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా ఎంతమేర పంట నష్టం జరిగిందనే వివరాలు సోమవారం తెలుస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. -
మున్సి‘పోలింగ్’కు ఏర్పాట్లు పూర్తి
కొత్తగూడెం, న్యూస్‌లైన్: ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓరారు. ఆయన శుక్రవారం ఇక్కడ ఎస్పీ ఎవి.రంగనాథ్, ఎన్నికల పరిశీలకుడు విష్ణువర్థన్‌తో కలిసి విలేకరుల సమావేశంలోలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామన్నా. ఈవీఎంలు మొరాయిస్తాయేమోనని ప్రత్యామ్నా య ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తగా ఓటరు నమోదు కోసం ఈ నెల 9న పదివేల మంది దరఖాస్తు చేశారన్నారు. పరిశీలనలో జాప్యం కారణంగా వీరికి ఇంకా ఓటు హక్కు రాలేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం డివిజన్ల నుంచి ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రూ.60 లక్షలు స్వాధీనం: ఎస్పీ ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.60లక్షల నగదు స్వాధీనపర్చుకున్నట్టు ఎస్పీ ఎవి.రంగనాథ్ చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమణ కింద 35 కేసులు నమోదు చేశామన్నారు. తనిఖీలు, దాడుల ద్వారా 3,600 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 4,200 బీర్ బాటిళ్లు, 25 టన్నుల నల్ల బెల్లం, తొమ్మిది టన్నుల పటిక పట్టుకున్నట్టు చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేశామని, బెల్ట్ షాపులకు సహకరిస్తున్న ఏడు వైన్ షాపులను సీజ్ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తులో ఏడుగురు డీఎస్పీలు, 36 మంది సీఐలు, 123 మంది ఏఎస్సైలు, 7175 మంది కానిస్టేబుళ్లు, 402 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొంటారని వివరించారు. వీరితోపాటు నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలు కూడా విధులు నిర్వర్తిస్తాయన్నారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ పాల్గొన్నారు. -
ఒంటరినైపోయా..!
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ఏకాకులయ్యాయి. ఈ రెండు పార్టీలతో కలిసి పని చేసేందుకు మిగిలిన పార్టీలు విముఖత చూపడంతో చివరకు ఒంటరిగానే బరిలో దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సీపీఐ, టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ నాయకులు పొత్తులపై అంగీకారానికి వచ్చాయి. అలాగే వైఎస్సార్సీపీ - సీపీఎంలు పొత్తు కుదుర్చుకుని బరిలో దిగుతోంది. రాష్ట్రంలో సయోధ్య కుదిరితే టీఆర్ఎస్ తమకు మద్దతు ఇస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుని రెండు సార్లు మున్సిపాలిటీని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి విజయఢంకా మోగించింది. 2005లో జరిగిన ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 17 వార్డులతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకుంది. వార్డులో నెలకొన్న అసంతృప్తి.. కాంగ్రెస్ పార్టీ 2005 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ వార్డుల్లో అభివృద్ధిపై కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. రెండు పర్యాయాలు మున్సిపాలిటీలో పాగా వేసిన కాంగ్రెస్ ప్రధాన సమస్యల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం వల్ల తమకు లాభం చేకూరదనే నేపథ్యంలో మిగిలిన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసేందుకు విముఖత చూపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సారి ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీది అదే పరిస్థితి.. కాంగ్రెస్ పార్టీతోపాటు టీడీపీది అదే పరిస్థితి. ఇప్పటి వరకు బీజేపీ తమకు మద్దతు ఇస్తుందని ఆశపడిన తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ కీలక నేతలు జేఏసీలో ఉండడం, వారంతా సీపీఐకి మద్దతు ఇస్తూ బరిలోకి దిగడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన టీడీపీ మూడు వార్డులను కైవసం చేసుకుంది. అనంతరం 2005లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం మద్దతుతో బరిలోకి దిగి 6 వార్డుల్లో పాగా వేసింది. అయితే మున్సిపాలిటీలో టీడీపీకి బలం అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ సారి టీడీపీతో కలిస్తే తమకు లాభం చేకూరదనే భావనతో మిగిలిన పార్టీలు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో 33వ వార్డులో కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల కోసం టీడీపీ నాయకులు గల్లీల్లో వెతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామవరంలోని మూడు వార్డులో అభ్యర్థులు దొరక్క అక్కడ ఉన్న వ్యాపారులను తమ పార్టీ నుంచి పోటీ చేయాలని బతిమిలాడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ పంచర్ కావడం తథ్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మూడోరోజు జోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నామినేషన్లు ప్రారంభమైన తొలి రెండురోజులు ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. మూడోరోజు బుధవారం అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపలి నగర పంచాయతీలకు మొత్తం 118 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మధిరలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు ఒకటే నామినేషన్ దాఖలవడం గమనార్హం. ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా రెండు రోజులు మాత్రం నామినేషన్లు అంతగా దాఖలు కాలేదు. బుధవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు 40 నామినేషన్లు, ఇల్లెందులో 53, సత్తుపల్లిలో 24 నామిషన్లు దాఖలు కాగా మధిరలో మాత్రం ఒకే ఒక నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పదో వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మినేని రామారావు నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పార్టీల పరంగా ఒక్క అభ్యర్థి కూడా మధిర నగర పంచాయతీలోని వార్డులకు నామినేషన్ వేయలేదు. స్థానికంగా పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు హైరానాపడుతున్నారు. వార్డు సభ్యుడిగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లిలో ఎస్సీ, ఎస్జీ జనరల్, మహిళలకు రిజర్వు అయిన వార్డుల్లో అసలు అభ్యర్థులు దొరకక పార్టీల నేతలు వెదుకులాట ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో నేతలకు పాలుపోవడం లేదు. రిజర్వు అయ్యి పార్టీ పరంగా కార్యకర్తలు లేనిచోట...అసలు పార్టీల్లో తిరగని విద్యావంతులపై నేతలు కన్నేశారు. తుది గడువు నాటికి వారిని ఒప్పించి నామినేషన్ వేయించడానికి కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల విషయంలో పలు పార్టీలది ఇదే పరిస్థితి. ఇప్పటికే ఖరారైన వారు చివరిరోజు 14న సందడితో నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఐసీడీఎస్‌లో యూనియన్ల రగడ
కొత్తగూడెం అర్బన్, న్యూస్‌లైన్: ఐసీడీఎస్ కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులో యూనియన్ల గొడవలు తారాస్థాయికి చేరాయి. తమ యూనియనే గొప్పంటూ ఒక వర్గం... కాదు తమ యూనియనే గొప్పంటూ మరో వర్గం వాగ్వాదానికి దిగి ఘర్షణకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఐసీడీఎస్ కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం ప్రాజెక్టు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కు ఏఐటీయూసీ, సీఐటీయూ యూనియన్లకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. సీడీపీఓ శారదశాంతి మీటింగ్ నిర్వహించి అంగన్వాడీలకు సూచనలు, సెంటర్ల రిపోర్టులు తీసుకుని ముగించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో కార్యకర్తలు సెక్టారు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యకర్తలు మాట్లాడుతుంటే సీఐటీయూ కార్యకర్తలు వచ్చి తమ యూనియన్ నిర్వహించిన 13 రోజుల సమ్మె మూలంగానే వేతనాలు పెరిగాయని అన్నారు. ఈ క్రమంలో రెండు యూనియన్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చే సుకున్నారు. దీంతో ఘర్షణ జరిగి ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో సీఐటీయూ కార్యకర్తలు వచ్చిన తమ యూనియన్ కార్యకర్తలపై దాడి చేశారని ఏఐటీయూసీ కార్యకర్తలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సీఐటీయూ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఏఐటీయూసీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పట్టించుకోని అధికారులు..? కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టులో ఎప్పటి నుంచి ఏఐటీయూసీ, సీఐటీయూ యూనియన్ల మధ్య గొడవలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతినెలా జరిగే ప్రాజెక్టు మీటింగ్‌లకు యూనియన్ నాయకులు వచ్చి యూనియన్ల విషయాలు మాట్లాడడం వల్లే గొడవలు జరుగుతున్నాయని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
ఇక.. గనుల్లో జీపీఎస్
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవడంలో కోల్‌ఇండియాలోనే ముందువరసలో ఉన్న సింగరేణి సంస్థ మరో అడుగు ముం దుకు వేసేందుకు సిద్ధమవుతోంది. భూగర్భగనుల్లో ఉన్న కార్మికులు ఎక్కడున్నారు.. ఎన్ని గంటలకు వెళ్లారు.. అనే విషయాలను స్పష్టం గా తెలుసుకునేందుకు అత్యాధునిక జీపీఎస్(గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూగర్భంలో కిలోమీటర్ల దూరంవెళ్లిన కార్మికులు ఎక్కడ ఉన్నారనే విషయం ప్రస్తుతం తెలియడం లేదు. జీపీఎస్‌ను విని యోగించుకోవడం ద్వారా కార్మికులు గనిలో ఎక్కడ ఉన్నారో నేరుగా సర్ఫేస్(ఉపరితలం)పై ఉన్నవారికి ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. సింగరేణి సంస్థలో గతంలో కోల్ ఫిల్లింగ్ ఉండేది. కార్మికులు సుమారు పదిమంది వరకు ఒక జట్టుగా వెళ్లి విధులు నిర్వహించి తిరిగి ఉపరితలానికి వచ్చేవారు. ఇటీవల కాలంలో సంస్థలో అత్యాధునికమైన లాంగ్వాల్, కంటిన్యూయస్ మైనర్, ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను వినియోగించి బొగ్గును వెలికితీ స్తున్నారు. ప్రస్తుతం భూగర్భగనుల్లో రూఫ్ బోల్టింగ్, యంత్రాలు పనిచేసిన తర్వాత చెల్లాచెదురుగా పడిన బొగ్గును ఒకదగ్గర చేర్చేందుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కలిసి అండర్‌గ్రౌండ్‌లోని పని స్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఈ నేపథ్యంలో పనిస్థలంలో ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ ఉన్నారనే విషయాన్ని జీపీఎస్ వ్యవస్థ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. సత్తుపల్లి కోల్ ట్రాన్స్‌పోర్టులో సక్సెస్ గతంలో సింగరేణి సంస్థ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లిన బొగ్గు నిర్ధేశిత స్థలాలకు వెళ్లేది కాదు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు వెళ్లిన తర్వాత అది అక్కడకు వెళ్లకుండానే మా యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు ఒక గ్రేడ్‌కు బదులు మరో గ్రేడ్ బొగ్గు సరఫరా అయిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు యాజమాన్యం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీలో ఇటీవల జీపీఎస్ టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తోంది. కంపెనీ నుంచి సరఫరా అయిన బొగ్గు సక్రమంగా గమ్యం చేరేందుకు బొగ్గు లోడ్ చేసిన లారీలకు జీపీఎస్ కనెక్షన్ ఇచ్చి వాటి వివరాలను ఎప్పటికప్పుడు నమో దు చేసి పరిశీలిస్తోంది. ఈ విధానం విజయవం తమైంది. దీనిని భూగర్భగనుల్లో కార్మికుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉపయోగించవచ్చనే విషయాన్ని సింగరేణి రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలలో ఏదైనా ఒక భూగర్భగనిలో జీపీఎస్ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. సత్ఫలి తాలిస్తే మిగిలిన గనుల్లో సైతం అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో కంపెనీ నిర్ధేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యం అందనంత దూరంలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఉన్న కాస్త కాలంలోనైనా సర్వశక్తులు ఒడ్డి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడదామని అనుకుంటే.. ఈనెలలో మేడారం జాతర, టీబీజీకేఎస్ ఎన్నికల కారణం గా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే జాతర వల్ల కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు ఇలానే ఉండేలా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఈనెల 23న గోదావరిఖనిలో జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆ యూనియన్‌కు సంబంధించిన కార్మికులు వెళ్లాల్సి ఉం టుంది. దీంతో మరో మూడు రోజల పాటు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీబీజీకేఎస్‌లో సభ్యత్వం కలిగిన వారు 41 వేల మంది ఉండగా ఇందులో కనీసం 50 శాతమైనా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గోదావరిఖనికి తరలించాల ని పోటీలో ఉన్న రెండు వర్గాలు వ్యూహాలు పన్నుతున్నాయి. దూరంలో ఉన్న కొత్తగూడెం రీజియన్ నుంచి గోదావరిఖని వెళ్లి రావాలంటే కనీసం ఒక రోజు సమయం పడుతుంది. ఒకరోజు ముందగానే కార్మికులను తరలించాలని ఆయా నాయకులు ప్రణాళికలు రూపొందిం చా రు. కనీసం 20వేల మందైనా వెళ్లే అవకాశముం దని సింగరేణి ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటంతో బహిరంగంగా కార్మికులను ఎన్నికలకు వెళ్లవద్దని చెబితే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో వెళ్లినా ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపదని, ఓపెన్‌కాస్టులో పనిచేసే వారు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భా విస్తోంది. వారిని నేరుగా కలిసి పరిస్థితులు వివరించనున్నట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల నాయకులు కార్మికులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో అవసరమైతే పోలీస్, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. -
‘అధ్వాన’హస్తం
సాక్షి, కొత్తగూడెం: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం అభాసుపాలవుతోంది. ఈ పథకం అమలుతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా ఖమ్మం, కొత్తగూడెం పరిధిలో అర్బన్ ప్రాజెక్టులున్నాయి. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర రూరల్ తో పాటు ఏజెన్సీలో 18 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రాజెక్టుల పరిధిలోనే గత ఏడాది నుంచి అమృతహస్తం పథకం అమలవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో 49,146 మందికి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి. కానీ పథకంలో పేర్కొనట్లుగా ఏ అంగన్వాడీ కేంద్రంలోనూ పూర్తిస్థాయిలో మెనూ అమలు కాకపోవడం గమనార్హం. రోజుకు 200 మిల్లీలీటర్ల పాలు, వారానికి నాలుగు రోజులు గుడ్డు అందించాలని మెనూలో పేర్కొన్నారు. పథకం ప్రారంభం నుంచి చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు పంపిణీ చేయడం లేదు. కొన్ని కేంద్రాల్లో వారం, పదిరోజులు మాత్రమే పాల పంపిణీతో సరిపెడుతున్నారు. అసలు మెనూలో పాల పంపిణీ కూడా ఉందని గర్భిణులు, బాలింతలకే తెలియదు. స్థానికంగా పాల కొరత ఉందని అందుకే పంపిణీ చేయలేకపోతున్నామని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. కోడి గుడ్డు వారానికి రెండు రోజులే ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలకు పదిహేను రోజులుగా గుడ్డు సరఫరానే లేదు. ఇదేమని బాలింతలు అడిగినా తమకే సరఫరా లేదని అంగన్వాడీ టీచర్లు చెబుతుండటంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు. ఏజెన్సీలో మరీ అధ్వానం... ఏజెన్సీలో ‘అమృతహస్తం’ అమలుతీరు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ గర్భిణులు, బాలింతలు 36,858 మంది వరకు ఉన్నారు. వీరిలో సగం మందికి కూడా అమృతహస్తం మెనూ అందడం లేదు. పోషకాహార లోపం వల్ల ఏజెన్సీలోని గిరిజన మహిళలకు రక్తహీనత వస్తోంది. అమృతహస్తం పథకం ప్రకారం పప్పు, పాలు, ఆకు కూరలు, ఆయిల్ తప్పకుండా ఇస్తేనే వీరి ఆరోగ్యం కొంతైనా మెరుగుపడేది. పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం నాసిరకం పప్పు, ముతక బియ్యం, వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు ఇస్తున్నారు. మెనూలో సూచించిన ప్రకారం కాకుండా తక్కువ మోతాదులో పప్పు, నూనె అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లోనే వీటిని వడ్డించి పెట్టాల్సి ఉండగా కొన్ని కేంద్రాల్లోనే వండి పెడుతుండగా మిగిలిన కేంద్రాల్లో కొద్ది మొత్తంలో పంపిణీ చేసి అంగన్వాడీ టీచర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కక్కుర్తి.. నాణ్యతకు తూట్లు.. అమృతహస్తం పథకంలో పప్పు, నూనె, గుడ్లు అంతా కాంట్రాక్టర్లే సరఫరా చేయాలి. కానీ వీరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని నాసిరకమైన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పప్పు పుచ్చిపోయి ఉండటంతో గర్భిణులు, బాలింతులు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నూనె పరిస్థితి కూడా ఇంతే. చిన్నగుడ్లు సరఫరా చేసి పెద్దగుడ్లకు బిల్లు చేస్తున్నట్లు సమాచారం. గుడ్లలోనూ నాణ్యత ఉండటం లేదని అంగన్వాడీ టీచర్లే చెబుతుండటం గమనార్హం. పథకం ప్రారంభంలో వస్తువుల్లో నాణ్యత ఉన్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలోపించడమే కాకుండా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. కోట్లు మంజూరు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పథకం లబ్ధి గర్భిణులు, బాలింతలకు అందకపోవడం శోచనీయం. -
మళ్లీ నిరాశే..
సాక్షి, కొత్తగూడెం: రైల్వేమంత్రి బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో జిల్లాకు మొండి‘చేయి’ చూపించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోగా జిల్లాకు ప్రయోజనకరమయ్యే పలు ప్రతిపాదనలను పక్కన పెట్టారు. కనీసం భద్రాచలంరోడ్డు- కొవ్వూరు రైల్వే లైన్ సర్వేకు కూడా నిధులు విదల్చలేదు. జిల్లావాసులను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది. ఈ ప్రభుత్వం మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, త్వరలో ఎన్నికలు రానుండడంతో జిల్లా ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై రైల్వేశాఖ మంత్రి మల్లికార్జునఖర్గే నీళ్లుచల్లారు. ఈ బడ్జెట్లో కొంతైనా జిల్లాకు వాటా దక్కలేదు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. భద్రాద్రికి చేరువయ్యే... పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ పొడిగింపు ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటోంది. ఈ లైన్ మంజూరుకు ఏటా ఏలికలు ఇస్తున్న హామీలు నీటిమూటలే అయ్యాయి. ఈ బడ్జెట్లోనూ రిక్తహస్తమే చూపారు. కొత్తగూడెం-కొవ్వూరు రైల్వే లైన్ ఐదు దశాబ్దాలుగా ముందుకు నడవడంలేదు. ప్రతి బడ్జెట్లో ఈ లైన్ సర్వేకే పరిమితమైంది. రూ. 950 కోట్ల ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు వీటిని మంజూరు చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ రైల్వేలైన్ కోసం జిల్లా ప్రజలు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు మొత్తం రూ. 337 కోట్లు అవసరం ఉంది. గత రెండు బడ్జెట్లలో రూ.5.10 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి అసలు నిధుల ఊసే లేకపోవడంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని పలు ఆర్వోబీల నిర్మాణంపై కూడా ఈ రైల్వేబడ్జెట్‌లో ప్రస్తావన లేదు. డోర్నకల్-మిర్యాలగూడ రైల్వేలైన్ నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. దీన్ని కేంద్రం పట్టించుకోలేదు. కాజీపేట మీదుగా విజయవాడ సికింద్రాబాద్- విశాఖ (ఏసీ) ఎక్స్‌ప్రెస్ రైలు కొత్తగా జిల్లాలోని ఖమ్మం స్టేషన్ మీదుగా వెళ్లడం ప్రయాణికులకు కొంత ఊరట కలిగిస్తోంది. ఇది కూడా వారంలో ఒక రోజు మాత్రమే వస్తుంది. కాగా, జిల్లాకు ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ బడ్జెట్‌పై ప్రజానీకం పెదవివిరుస్తున్నారు. ఈసారి జిల్లాలో రైల్వేలైన్ల సర్వేకు నిధులు మంజూరు చేయిస్తామని ఎంపీలు పలుమార్లు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని విమర్శిస్తున్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో ఎంపీలు విఫలమయ్యారని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బ్లాక్ దందా!
సాక్షి, కొత్తగూడెం: భూ క్రయ విక్రయాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు స్టాంప్ పేపర్లు తప్పనిసరి. ఎక్కువగా ఉపయోగించే రూ.10, రూ.20 విలువైన బాండ ్ల కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్నచోట కూడా బ్లాక్‌లో రూ.50 వరకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు స్టాంప్ వెండర్ల మాయాజాలంతో బాండ్ల కొరత ఏర్పడుతోంది. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లందు, వైరా, మధిర, కల్లూరు పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కార్యాలయాల పరిధిలో ఎక్కువగా స్టాంప్ పేపర్ల వినియోగం ఉంటుంది. భూ విక్రయాలు, విద్యార్థులకు ఆదాయ, కుల, లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రాలు, ఇతర అఫిడవిట్ల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ కార్యాలయాలకు వినియోగదారులు ఎప్పుడు వెళ్లినా స్టాంప్ పేపర్ల కొరత ఉందని సిబ్బంది సమాధానం చెబుతుండటం తో నిరాశతో వెనుదిరుగుతున్నారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100 బాండ్ పేపర్ల కోసం ప్రతి మూడునెలలకు ఒకసారి రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌కు ఇండెంట్ పెడతారు. అయితే ప్రతిసారి రూ.50, రూ.100 బాండ్ పేపర్లను ఇండెంట్ ప్రకారం పంపుతుండగా, రూ.10, రూ.20 పేపర్లలో మాత్రం కోత పెడుతున్నారు. దీంతో ఈ బాండ్ పేపర్లు దొరకక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ విలువ చేసే బాండ్లు కొనుగోలు చేయలేక.. తక్కువ ధర పేపర్లు ఎప్పుడొస్తాయో తెలియక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ పేపర్ల కొరత లేదని చెపుతుండటం గమనార్హం. తక్కువ ధర పేపర్ల కోసం నిత్యం ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ.. విసిగి వేసారిన వారు తప్పని పరిస్థితుల్లో ఎక్కువ విలువ చేసే బాండ్ పేపర్లనే కొనుగోలు చేస్తుండడంతో వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. స్టాంప్ వెండర్ల మాయాజాలం... బాండ్ పేపర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు జిల్లా వ్యాప్తం గా 118 మంది స్టాంప్ వెండర్లను నియమించారు. ఈ స్టాంప్‌ల విక్రయం ద్వారా ప్రభుత్వం వారికి 5 శాతం కమీషన్ ఇస్తుంది. జిల్లాకు వచ్చిన వాటిలో 80శాతం పేపర్లను స్టాంప్ వెం డర్లకే ఇచ్చి మిగిలినవి మాత్రమే కార్యాలయా ల్లో విక్రయిస్తుండడంతో కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా స్టాంప్ వెండర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో రూ.10, రూ.20 బాండ్ పేపర్లను రూ.30 నుంచి 50వరకు విక్రయిస్తున్నా రు. చండ్రుగొండ, ఏన్కూరు, జూలూరుపాడు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం, మణుగూరు, ఇల్లందు తదితర ప్రాంతాల్లోని స్టాంప్ వెండర్లు ఈ వ్యవహారానికి తెరలేపారనే ఆరోపణలున్నాయి. ఎక్కువ కమీషన్ వస్తుం దనే ఉద్దేశ్యంతో తక్కువ ధర ఉన్న స్టాంప్ పేపర్ల కొరత సృష్టించి ఎక్కువ విలువైన పేపర్లను విక్రయిస్తున్నారని సమాచారం. రూ.లక్షల్లో ‘బ్లాక్’ ఆదాయం.. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.3 లక్షల విలువైన స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్నారు. అంటే సెలవురోజులు మినహాయిస్తే స్టాంప్ వెండర్లు, కార్యాలయాల్లో కలిపి నెలకు సగటున రూ.75 లక్షల వరకు పేపర్ల విక్రయం ఉంటుంది. ఇందులో తక్కువ విలువ చేసే రూ.10, రూ.20 స్టాంప్ పేపర్లను నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు స్టాంప్ వెండర్లు విక్రయిస్తారు. ఈ పేపర్లను అసలు ధరకంటే రెండుమూడు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తూ రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమ ఆదాయం అర్జిస్తున్నారు. స్టాంప్ వెండర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. పర్యవేక్షించాల్సిన సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మా దృష్టికి రాలేదు.. : రామలింగం, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం జిల్లాలో స్టాంప్ పేపర్లు కొరత, బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఎక్కడా కొరత మాత్రం లేదు. ఎప్పటికప్పుడు ఏయే స్టాంప్ పేపర్లు కావాలో కమిషనరేట్‌కు ఇండెంట్ పంపించి తెప్పిస్తున్నాము. ఎక్కడైనా కొరత ఉన్నా.. బ్లాక్‌లో విక్రయించినా వినియోగదారులు మా దృష్టికి తీసుకురావాలి. -
అమ్మకానికి ‘ఆధార్’ !
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఓ నలుగురు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు దిగేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లారు. వీరి కుటుంబంలో తల్లిదండ్రుల పేర్లు మాత్రమే రేషన్‌కార్డులో నమోదై ఉన్నాయి. ఇద్దరు పిల్లలకు గుర్తింపు కార్డులు లేవు. ముందుగా ఒక్కొక్కరికి రూ.వంద చొప్పున వసూలు చేసిన ఎన్రోల్మెంట్ నిర్వాహకులు ఇద్దరికి గుర్తింపు కార్డులు లేకపోవడం, రేషన్‌కార్డులో వారి పేర్లు లేకపోవడంతో మరో రూ.వంద అదనంగా వసూలు చేశారు. ఇలా వారు రూ.600 సమర్పించుకుని ఆధార్ దిగాల్సి వచ్చింది. ఇలా ఎన్రోల్మెంట్ నిర్వాహకులు ఒక్కో సెంటర్ నుంచి రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం వరకు ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఒక ఎన్రోల్మెంట్కు రూ.1000 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు ఎన్రోల్మెంట్ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గడంతో నిర్ణీత ధర నిర్ణయించారు. రెండు నెలల క్రితం జిల్లాలో పర్మనెంట్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బాగంగా జిల్లాలోని మీ సేవా సెంటర్లలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి ఎన్రోల్మెంట్ చేసుకునేందుకు వెళ్లేవారు సొమ్ములు చెల్లించకపోతే ఆధార్ కార్డు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైసలిస్తేనే పని... నిర్వాహకులు అడిగినట్లు రూ.100 చెల్లిస్తే వాటిని ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. అయితే ‘ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లిస్తుంది కదా..? మేమెందుకు ఇవ్వాలి’ అని ఎవరైనా దబాయిస్తే వారికి కార్డు మాత్రం రానట్లే. కేవలం కంప్యూటర్లో ఫొటోలు తీసి ఆధార్ దిగినట్లుగా కాపీని అందిస్తున్న నిర్వాహకులు ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేయకపోవడంతో జిల్లాలో సుమారు లక్ష మంది వరకు ఆధార్ కార్డులు దిగి.. నెలల తరబడి ఎదురుచూస్తున్నా కార్డులు అందడం లేదు. నిర్వాహకులు అడిగిన సొమ్ములు చెల్లించుకున్న వారికి మాత్రం నెల రోజుల లోపు కార్డులు వస్తున్నాయి. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ కార్డు అందేలా చూడాల్సిన రెవెన్యూ అధికారులు ఈ వసూళ్ల పర్వంపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ సెంటర్ల వద్ద వసూళ్ల పర్వం బహిరంగంగానే జరుగుతునప్పటికీ వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు. ఈ విషయంపై ఆధార్ ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ సూపర్వైజర్ రవికుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆధార్ కేంద్రాల వద్ద వసూళ్లు నిజమేనని, కానీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం లేదని పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా ఆధార్ కేంద్రాల వద్ద సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల పర్వంపై ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దృష్టి సారించి, అక్రమ వసూళ్లను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఈ శోకం...ఇంకెన్నాళ్లు?
సాక్షి, కొత్తగూడెం: చట్టాలు ఎన్నో...ఇప్పటికే ఉన్నవి, కొత్తగా వచ్చినవి...అయినా, ఏటికేడాది మహిళకు రక్షణ లేకుండా పోతోంది. లైంగికదాడులు, హత్యలు, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా ‘ఆమె’ అఘాయిత్యాలు, అవమానాల బారిన పడుతోంది. ముక్కుపచ్చలారని పసికందు నుంచి ముదుసలి వరకూ మృగాళ్ల పాశవిక చర్యలకు గురవుతూనే ఉన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో చోట మహిళలపై ఏదో ఒక రూపంలో దాడి జరుగుతూనే ఉంది. కొన్ని పోలీసు కేసుల వరకు వెళ్తే.. మరికొన్ని కుటుంబ పరువుపోతుందన్న ఉద్దేశంతో బయట పడడం లేదు. గత మూడేళ్లలో పరిశీలిస్తే 2013లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. జిల్లాలో గత ఏడాది అత్యధికంగా 97 లైంగికదాడి కేసులు, 245 లైంగికదాడి యత్నం, 298 వేధింపుల కేసులు నమోద య్యాయి. అలాగే నిర్భయ చట్టం కింద గత ఏడాది 26 కేసులను నమోదు చేశారు. తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య.. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. ఆధునికయుగంలోనూ ఆడపిల్ల పుట్టిందంటే పెదవి విరుస్తున్నారు. జన గణనను చూస్తే ఇవి ప్రమాద ఘంటికలే అని చెప్పవచ్చు. 2001లో జిల్లాలో ప్రతి వెయ్యిమంది మగ పిల్లలకు ఆడపిల్లల సంఖ్య 971 ఉంది. అయితే 2011 నాటికి ఇది 958కి పడిపోయింది. అలాగే 2001లో ఆరేళ్లలోపు ఆడపిల్లల సంఖ్య 1,72,470 ఉంటే.., 2011లో 1,37,966కు చేరుకుంది. 2001లో మహిళాజనాభా పెరుగుదల 16.39శాతం కాగా 2011లో 8.47 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు జిల్లాలో ఆడపిల్లల శాతం ఏస్థాయిలో పడిపోతుందో చెబుతున్నాయి. భ్రూణ హత్యలు, పుట్టిన తర్వాత చిదిమేయడం గుట్టుగాసాగుతోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఆడపిల్ల ఇంటికి ముద్దు .. అని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రణాళిక లేక ప్రజల్లో అవగాహన కల్పించలేకపోతున్నాయి. -
రబీ.. వార‘బందీ’.. చి‘వరి’కి కష్టమే..!
సాక్షి, కొత్తగూడెం: నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఏటా కష్టాల సాగే. ఖరీఫ్‌లో వేసిన వరి అకాల వర్షాలతో రైతుల చేతికందకుండా పోయింది. అయితే రబీలో కూడా వరి పంట ముమ్మరంగా సాగు చేస్తున్నా.. వార బందీ విధానంతో ఈసారైనా చేతికి వచ్చేనా..? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడులకే సాగర్ నీరు ఇస్తుండడంతో జిల్లాలోని చి‘వరి’ ఆయకట్టుకు నీరందడం కష్టమేనని అంటున్నారు. రబీ సీజన్లో సాగర్ ఆయకట్టు పరిధిలో జిల్లాలో 70,394 ఎకరాల్లో వరి సాగవుతోంది. ముదిగొండ, ఖమ్మం రూరల్, రఘునాధపాలెం(ఖమ్మం అర్బన్), కొణిజర్ల, నేలకొండపల్లి, వైరా, బోనకల్లు, కూసుమంచి, పెనుబల్లి, కల్లూరు, చింతకాని మండలాల్లో జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. రబీలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సంబంధిత అధికారులు పలుమార్లు ప్రకటించినా.. సాగర్‌లో సరిపడా నీరు ఉండడంతో రైతులు వరి పంటకే మొగ్గు చూపారు. నాగార్జున సాగర్ ఆధునికీకరణ పేరుతో గత రెండేళ్లుగా రబీలో జిల్లా ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదు. దీంతో రైతులు పంటలు కోల్పోయారు. ఖరీఫ్‌లో నీరు విడుదల చేసినా పంట చేతికి అందే సమయానికి వచ్చిన వర్షాలతో.. ధాన్యం కల్లాల్లోనే తడవడం, వరి పనలు పూర్తిగా నీటిలో మునగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ రబీపైనే వారు గంపెడాశలు పెట్టుకున్నారు. అప్పుచేసి మరీ.. వరి నాట్లు వేస్తున్నారు. అయితే సాగర్ ఆయకట్టుకు ఆరుతడులకు మాత్రమే నీరు ఇస్తున్నట్లు ఎన్నెస్పీ అధికారులు ప్రకటించడంతో ఇప్పుడు వారిలో ఆందోళన మొదలైంది. రబీ వరికి అంతరాయం లేకుండా కనీసం మూడు నెలలకు పైగా నీరు విడుదల చేస్తేనే పంట చేతికి వస్తుంది. అయితే ఆరుతడుల ప్రకారం రెండు నెలలు మాత్రమే నీరు అందనుంది. వార బందీతో చిక్కులే.. నాట్లు మొదలుకొని చేతికి వచ్చే వరకు వరి పంటకు అంతరాయం లేకుండా నీరు ఉండాలి. ఆరుతడులతో కలుపు పెరగడమే కాకుండా పంట ఎదుగుదల ఉండదు. ప్రస్తుతం ఆరుతళ్ల ప్రకారం ఫిబ్రవరి 3 వరకు, మళ్లీ ఫిబ్రవరి 9 నుంచి 18 వరకు, 24 నుంచి మార్చి 5 వరకు, 11 నుంచి 20 వరకు, 26 నుంచి ఏప్రిల్ 4 వరకు నీరు విడుదల చేస్తారు. మధ్య మధ్యలో ఐదు నుంచి వారం రోజుల వరకు విడుదలకు బ్రేక్ పడుతుంది. ఇలా నీరు విడుదల చేస్తే వరి పంట చేతికి రావడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వార బందీతో గతంలో బోనకల్, ఎర్రుపాలెం, మధిర, కల్లూరు, చింతకాని మండలాల్లో చివరి ఆయకట్టుకు నీరందక సాగు చేసిన వరి నిలువునా ఎండిపోయింది. దీంతో ఆ పంట పశువుల మేతకు మాత్రమే ఉపయోగపడింది. ఇలా నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి రానుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీతో ఎర్రుపాలెం మండలంలో నీటి కోసం రైతులు ఘర్షణ పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం... సాగర్‌లో రబీ సాగుకు సరిపడా నీరున్నా సంబంధిత అధికారులు మాత్రం వరి సాగుకు అంతరాయం లేకుండా విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. గత పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకే సిద ్ధమైనా నీటి విడుదలకు కొర్రీలు పెడుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరగడం లేదు. రబీ సాగు పూర్తయిన తర్వాతే ఈ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో ఆరు తడులు కాకుండా సరిపడా నీరు ఇస్తేనే వరి పంట చేతికి అందే అవకాశం ఉన్నా.. అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు. వచ్చేనెల 15 వరకు వరినాట్లు జరగనున్నాయి. కానీ ఈ మధ్యలో మరో ఐదు రోజులు నీటి విడుదల నిలిపివేస్తుండడంతో వరి నాటు వేయడానికి కష్టమైతే, నాటు వేసిన పొలాలకు వెంటనే నీరందక తొలి దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉంది. -
వ్యవసాయ మార్కెట్లు వెలవెల
సాక్షి, కొత్తగూడెం: రైతులకు అన్నిచోట్ల కష్టాలే... ఆటుపోట్లను ఎదుర్కొని పండిచిన పంటను విక్రయించే చోట కూడా రైతును సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేని స్థితిలో జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. రైతు విశ్రాంతి భవనాలు, పంట ఉత్పత్తులు పోసే ప్లాట్‌ఫాంలు శిథిలావస్థకు చేరుకున్నా...ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టించుకునే దిక్కులేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్లున్నాయి. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, వైరా, ఇల్లెందు, ఏన్కూరు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేటలో ఈ మార్కెట్లున్నాయి. వివిధ కేటగిరీల్లో ఈ మార్కెట్లలో మొత్తం 130 పోస్టులకుగాను 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలు ఉండగా, మిగిలిన మార్కెట్లకు లేవు. ఖమ్మం, నేలకొండపల్లి మార్కెట్లకు పూర్తి స్థాయి అధికారులుండగా మిగతా మార్కెట్లు ఇన్చార్జిల పాలనలోనే సాగుతున్నాయి. జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఏ మార్కెట్లోనూ పూర్తి స్థాయిలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. విశ్రాంతి భవనాలు, తాగునీటి వసతి, భోజన హోటళ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్కెట్లకు రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, అపరాలు, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలి. కానీ కొన్ని మార్కెట్లలో వసతులు లేకపోవడంతో అసలు కొనుగోళ్లే జరపడం లేదు. రైతులు కూడా మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర అందదని, సౌకర్యాలు ఉండవన్న కారణంతో అటువైపు అడుగుపెట్టడం లేదు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లేకపోవడంతో రైతులు మార్కెట్లలో నిలువునా మోసపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలోనే వ్యవసాయ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ రైతు విశ్రాంతి భవనం మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మంచినీటి వసతి లేక రైతులు అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఉన్న ట్యాంకుకు మరమ్మతులు చేయలేదు. మార్కెట్ యార్డుల్లో ఉన్న పంపులకు ట్యాప్‌లు పనిచేయడం లేదు. మార్కెట్ నిండా చెత్తా చెదారం పేరుకుపోయింది. యార్డుల్లో ఉన్న మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. మార్కెట్లో అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఇంకా ఫైరింజన్‌ను ఏర్పాటు చేయలేదు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అధికారికంగా ప్రారంభించలేదు. దమ్మపేట మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ పరిధిలో ములకలపల్లిలో గోదాం ఉన్నప్పటికి నిర్వహణ లేక అది నిరుపయోగంగా ఉంది. చండ్రుగొండలో గోదాం ఉన్నా అసలు విద్యుత్ సౌకర్యమే లేదు. వైరాలో మార్కెట్ యార్డును అన్ని సదుపాయాలతో నిర్మించినప్పటికీ అక్కడ ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఏడాది క్రితం రూ.13 కోట్లతో నిర్మించిన గోదాంలు నిరుపయోగంగా మారాయి. అంతేకాకుండా ఇక్కడి వేబ్రిడ్జి మూలన పడింది. పంటల ధరలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైతు సలహా కేంద్రంలో ఒక్క రోజు కూడా అధికార్లు కనిపించిన పాపాన పోలేదు. మూత్రశాలలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. ఏన్కూరు మార్కెట్ యార్డులో కేవలం ప్లాట్‌ఫాంలు మాత్రమే నిర్మించారు. గోదాంల నిర్మాణం ఇంకా చేపట్టలేదు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం లేదు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు. నిర్వహణ లేక ఇక్కడ ఉన్న వేబ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. మార్కెట్లో సీసీ రోడ్లు నిర్మించకపోవడంతో మార్కెట్ అంతా గుంతలమయంగా మారింది. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం ఉన్నప్పటికీ వసతులు లేక అది నిరుపయోగంగా ఉంది. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోదాంలను స్టోర్‌రూం గా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న యంత్రాలు తుప్పుపడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మార్కెట్లో విద్యుత్ సరఫరా చేసే స్తంభాలకు తీగలు వేలాడి ప్రమాదకరంగా మారాయి. బూర్గంపాడులోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో మణుగూరు, పినపాక, గుండాల అశ్వాపురం మండల కేంద్రాల్లో గోదాంలు నిర్మించారు. అయితే ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. ఈ గోదాంలను గ్యాస్‌గోదాంలు, చౌకధరల దుకాణాల నిల్వలకు ఉపయోగిస్తున్నారు. ఇల్లెందు మార్కెట్ యార్డులో దళారులు ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఈ మార్కెట్‌కు ఎక్కువగా రావడం లేదు. ఈ విషయంలో అధికారులు స్పందించకపోవడంతో యార్డులోని గోదాంలు, ఫ్లాట్ ఫాంలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ యార్డు పరిధిలో టేకులపల్లిలో గోదాం ఉన్నా అది కూడా నిరుపయోగంగా మారింది. సత్తుపల్లి మార్కెట్‌యార్డుకి ఏటా రూ. కోటికి పైగా, కల్లూరు మార్కెట్‌కు రూ. కోటిన్నరకు పైగా సెస్ రూపంలో ఆదాయం వస్తోంది. మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటలకు సరైన ధర కల్పించకపోవడంతో ప్రస్తుతం ఇక్కడి రైతులు అమ్మకానికి పంటలను ఎక్కువగా తీసుకురావడం లేదు. దీంతో రైతు విశ్రాంతి భవనాలు నిరుపయోగంగా మారాయి. గతేడాది రూ. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ప్లాట్‌ఫాంలు పిచ్చిమొక్కలతో నిండాయి. మధిర వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి మార్కెటింగ్ భవనం, వేబ్రిడ్జి నిరుపయోగంగా ఉన్నాయి. అప్పుడప్పుడు మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ రైతులకు తాగునీటి సౌకర్యంలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, రైతుసేవాకేంద్రం రైతులకు అందుబాటులో లేవు. కొత్తగూడెం మార్కెట్‌యార్డులో రైతులకు విశ్రాంతిగదులు లేవు.., తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులు పండించిన అపారాలు, ధాన్యం, మొక్కజొన్నల నిల్వచేసేందుకు గోదాంలు ఉన్నాయి.. కానీ వాటిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను వ్యాపారులే నిల్వ చేసుకుంటున్నారు. భద్రాచలం మార్కెట్ యార్డులో రైతులకు తాగునీటి సౌకర్యం లేదు. అసలు ఇక్కడ విశ్రాంతి భవనమే లేదు. చర్లలో మార్కెట్ కమిటీ యార్డు దూరంగా ఉండడంతో రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకురావడం లేదు. దీన్ని గిరిజన సహకార సంస్థకు అద్దెకు ఇచ్చారు. దీంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోళ్లే జరగడం లేదు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. -
రామనామం...ప్రత్యర్థులపై బాణం!
సాక్షి, కొత్తగూడెం: ‘భద్రాచలం రాముడు తెలంగాణ దేవుడు.. ఈ ప్రాంతానికే రాములోరు దక్కేలా నినదించాలి’ అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేపట్టిన భద్రాచలం జైత్రయాత్ర వెలవెలపోయింది. అనుంగు నేతలు ఆమె పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసినా చివరకు క్యాడర్ లేకపోవడంతో కార్యకర్తల సమావేశాలు కూడా రద్దయ్యాయి. ఊహించని రీతిలో క్యాడర్ దూరం కావడంతో సదరు నేతల అంచనాలు తలకిందులయ్యాయి. కాగా, పర్యటన యావత్తూ పార్టీలోని ప్రత్యర్థులపై విమర్శలకే రేణుక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇటీవలి కాలంలో తమ వర్గానికి షాక్ ఇచ్చేలా పార్టీలోని ప్రత్యర్థి వర్గం ఎత్తులు వేయడంతో నైరాశ్యంలో ఉన్న రేణుక అనుచర నేతలు జిల్లా పర్యటనకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఇదేసమయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా ఆమెను పక్కన పెట్టారు. మొత్తంగా తన అనుచరులలో ఉత్సాహం నింపాలన్న ఉద్దేశంతో రేణుక జిల్లా పర్యటన చేపట్టారు. దీంతో పాలేరు నుంచి భద్రాచలం వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు పెట్టాలని ఆమె పర్యటనకు నాలుగు రోజుల ముందే ఆయా నేతలు షెడ్యూల్ ఖరారు చేశారు. ఊహించని రీతిలో రేణుక పర్యటనను సక్సెస్ చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావించారు. అయితే శనివారం నాటి జిల్లా పర్యటనలో... గతంలో ఆమె వెంట ఉన్న నేతలు మినహా మిగతా వారేవరూ రాకపోవడంతో ఆమె వర్గీయులు ఆశించిన స్థాయిలో జరగలేదు. నాయకన్‌గూడెం నుంచి భద్రాచలం వరకు ఇదే పరిస్థితి. పార్టీ శ్రేణులు లేకపోవడంతో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఖమ్మంరూరల్‌లో కార్యకర్తల సమావేశాలు రద్దు అయ్యాయి. దీంతో ఆమె కొణిజర్ల, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచసెంటర్లలో కాన్వాయ్ ఆపి అక్కడ ఉన్న కొద్దిమంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లాడలో గతంలో ఉన్న ఆమె అనుచర నేతల నుంచి కూడా స్పందన కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం, పాల్వంచలో కొంతమంది క్యాడర్ కనిపించగా.. మిగతా చోట్ల అంతా పేలవంగానే ఆమె యాత్ర సాగింది. ప్రత్యర్థులపైనే విమర్శనాస్త్రాలు.. రేణుక పర్యటన అంతా పార్టీలో తనను ప్రశ్నిస్తున్న ప్రత్యర్థులను ఉద్దేశించిందిగానే సాగింది. ‘నేను సైనికుడిని బిడ్డను.. దేశంలో ఎక్కడైనా తిరుగుతా.. ఈ జిల్లాలో పుట్టినవారు జిల్లాకు ఏమైనా చేశారా..? నేను 27 ఏళ్లుగా జిల్లాకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. జిల్లా ఆడబిడ్డగా ఇలా అభివృద్ధి చేస్తుంటే.. నన్ను చేయనివ్వరు.. వాళ్లు చేయరు. వాళ్లు జిల్లాకు ఏంచేశారో..? నేను ఏంచేశానో బహిరంగ చర్చకు సిద్ధం’ అని ఆమె పరోక్షంగా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆమె ప్రసంగించిన చోటల్లా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన ద్వారా తలెత్తే సమస్యలనూ సీఎం అధిష్టానానికి విన్నవిస్తున్నారని, ఆయన ఫ్లెక్సీలు చించేవారు మూర్ఖులతో సమానం అంటూ విమర్శించారు. అనుంగు నేతల హల్చల్.. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం మొదలు భద్రాచలం వరకు ఆమె అనుచర నేతల హల్చల్తోనే రేణుకాచౌదరి పర్యటన కొనసాగింది. ఖమ్మంలో ఉన్న కొద్దిమంది నేతలు నాయకన్‌గూడెం వెళ్లి స్వాగతం పలకడంతో పాటు అక్కడి నుంచి భద్రాచలం వరకు ఆమె పర్యటనలో కొనసాగారు. పాలేరులో కొంత సేపు ఆగగా.. అక్కడి సర్పంచ్ మాధవిరెడ్డి తన వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా పాలేరు నియోజకవర్గంలో కుంపటి పెట్టాలని ఆమె వ్యూహంలో ఉన్నట్లు పార్టీవారే చర్చించుకున్నారు. క్యాడర్ లేక కార్యకర్తల సమావేశాలు రద్దు కావడం, అసలు పర్యటన ఫలితం ఏముంటుందని భావించే రేణుకాచౌదరి.. ‘భద్రాచలం జైత్రయాత్ర’ అని ఆమె పర్యటనకు పేరుపెట్టుకున్నట్లు పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు. పలువురు ముఖ్యనేతలు, వారి వర్గం వారు రేణుక పర్యటనకు దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణవాదులు, ఆమె ప్రత్యర్థి వర్గం అనుచరులు ఎవరైనా ఆమె పర్యటనను అడ్డుకుంటారేమోనని పోలీసులు మాత్రం భారీ బందోబస్తు చేపట్టారు. -
పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు... ఒక్క రోజులోనే బిల్లుల చెల్లింపు
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఒక్క రోజులోనే బిల్లులు చెల్లిస్తున్నట్టు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్ తెలిపారు. ఆయన శనివారం కొత్తగూడెంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో బిల్లులు రావడానికి 25 రోజులు పట్టిందన్నారు. ఈ జాప్యాన్ని ప్రస్తుతం పూర్తిగా తొలగించామన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లు కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు తమ పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌సీ కోడ్ నంబర్ సరిగా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలన్నారు. ఇవి సక్రమంగా ఉన్నట్టయితే.. గృహ నిర్మాణ శాఖ డీఈలు బిల్లులు జనరేట్ చేసిన 24 గంటల్లో బ్యాంక్ అకౌంట్లో నేరుగా చేరతాయని అన్నారు. జిల్లాలో నాలుగు నిర్మిత కేంద్రాల ద్వారా ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4.23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో 2.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వీటికిగాను 881 కోట్ల రూపాయలు చెల్లించామని అన్నారు. ఇప్పటివరకూ నిర్మాణం చేపట్టని ఇళ్లు లక్ష వరకు ఉన్నాయని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి బడ్జెట్ లోపు ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ కింద 21,758 మరుగుదొడ్లు మంజూరైనట్టు, వీటిని మండలానికి 500 చొప్పున కేటాయించినట్టు చెప్పారు. గ్రామ పంచాయతీ తీర్మానిస్తే ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరవుతాయన్నారు. కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాలలో లబ్ధిదారుల సంరక్షణ కేంద్రం (బెనిఫీషియర్స్ కేర్ సెంటర్) ద్వారా వారి (లబ్ధిదారుల) సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇసుక కూపన్లను స్టేజీవారిగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అవకతవకలకు పాల్పడిన అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నిరసనలు.. నిలదీతలు
సాక్షి, కొత్తగూడెం : ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి నిరసన సెగ తగులుతోంది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుండడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిలదీతలు.. నిరసనలు..లబ్ధిదారుల ఆందోళనలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీకోసం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు రెండో విడత రచ్చబండలో చేసుకున్న దరఖాస్తులపై అధికార యం త్రాంగం స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 52 రచ్చబండ సభలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 11 నుంచి 18 వరకు పది సభలను అధికారులు నిర్వహించారు. టేకులపల్లి, వాజేడు, వీఆర్‌పురం, చింతూరు, గుండాల, సత్తుపల్లి, పినపాక, గార్ల, పాల్వంచ, కొణిజర్లలో ఈ సభలు ముగిశాయి. తొలిరోజు సభ నుంచే నిరుపేదల నిరసనలు హోరెత్తాయి. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ లబ్ధిదారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీసి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ సభల్లో 1,13,928 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పింఛన్ల కోసం 29 వేల మంది, రేషన్‌కార్డుల కోసం 65వేల పైచిలుకు నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు వారికి లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈ సభలో ఇవే ప్రధాన సమస్యలుగా అర్హులైన వారు ప్రశ్నిస్తుండడంతో అధికారులు మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రజానిధులు మాత్రం గతంలో రచ్చబండల మాదిరి మళ్లీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా.. గతంలో దరఖాస్తుల సం గతి తేల్చాలని నిరుపేదలు ఎక్కడికక్కడ నిల దీస్తుండడంతో చేసేదేమీ లేక త్వరలో అందరికి లబ్ధి చేకూరుతుందని చెప్పుకుంటూ వేదిక దిగి పోతున్నారు. సభలకు ఆర్భాటంగా వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఊహించని రీ తిలో వస్తున్న నిరసనలను చూసి త్వరగా సభలు ముగించుకుంటూ మమ అనిపిస్తున్నా రు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ సభల్లో అవకా శం ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పోలీసు బం దో బస్తుతో సభలు నిర్వహించి ప్రజాసమస్యల ను ప్రభుత్వం పక్కన పెడుతుండడం గమనార్హం. కన్నెర్ర చేస్తున్న రైతన్న ఇటీవలి తుపానుతో అపారనష్టం జరిగి పంటలు చేతికందకుండాపోయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదని, అలాంటిది ఈ సభలెందుకని రైతులు నిరసనగళం వినిపిస్తున్నారు. గతంలో పంట నష్టం జరిగినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు సభలు పెట్టిం ఏంచేస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం కొణిజర్లలో రైతులు ఇదే విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, తుపానుతో నష్టపోయిన పంటలకు సంబంధించి తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ రైతులు ఆందోళన చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదంటూ రైతులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా రైతుల నుంచి నిరసనలు ఎదురవుతుండడం, ఇంకా 42 సభలు ఉండడంతో ఏం సమాధానం చెప్పాలో అని అధికారులు తలపట్టుకుంటున్నారు. టీడీపీ నేతల ఫ్లెక్సీల జగడం.. ప్రజా సమస్యలు విని, అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేతలు రచ్చబండ సభల్లో తమ పార్టీ ప్రజాప్రతినిధుల ఫోటోలు పెట్టడం లేదంటూ అధికారులతో జగడం చేస్తున్నారు. కొణిజర్లలో నిర్వహించిన రచ్చబండ సభ వేదిక పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోటో పెట్టలేదని.., సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మండల నాయకులు వేదికపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే పాల్వంచ రచ్చబండ సభ ఫ్లెక్సీలో నామా ఫోటోలేదని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించాలని పాల్వంచలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
కొత్తగూడెంలో వైఎస్ విగ్రహానికి నిప్పు
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్:కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డు వద్ద ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో వైఎస్ విగ్రహం కొంత మేర కాలి మసిబారింది. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వకర్త, సీఈసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి ఉన్న డీజిల్‌ను తొలగిం చారు. అనంతరం ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ మహానేత విగ్రహాలకు నిప్పు పెట్టడం పిరికిపంద చర్య అని అన్నారు. తెలంగాణ ముసుగులో కొందరు దుండగులు వైఎస్ విగ్రహాలకు నిప్పు పెడుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం మహానేత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. అటువంటి మహానుభావుడి విగ్రహానికి నిప్పుపెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు. మేము తెలంగాణ బిడ్డలమేనని, వైఎస్సార్సీపీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్యా దళ్‌సింగ్ మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైంది కాదని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అనంతరం ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్ నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి సీఐ నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ మాట్లాడుతూ త్వరగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ భీమా శ్రీధర్, మండల కన్వీనర్ తాళ్లూరి శ్రీనివాస్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, పీక కృష్ణ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సాధిక్ షాషా, వైఎస్సార్ సీపీ నాయకులు తాండ్ర నాగబాబు, నాగుల శేఖర్, కందుల సుధాకర్‌రెడ్డి, బాలరెడ్డి లింగం సత్యనారాయణ రెడ్డి, తీట్ల భాస్కర్, ఎర్పుల సుధాకర్‌రావు, ఏలూరి రాజేష్, వీరభద్రం, భాస్కర్‌రావు, రాములు, జామ్లా నాయక్, ఫ్రాన్సిస్, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు. -
మాజీ రౌడీషీటర్ హత్య
లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్‌లైన్: పాతకక్షల నేపథ్యంలో మాజీరౌడీషీటర్‌ను ప్రత్యర్థులు దారుణంగా కొట్టి హత్య చేశారు. కొత్తగూడెంలో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.... కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్‌బస్తీకి చెందిన మాజీ రౌడీషీటర్ వల్లబ్దాస్ వెంకట్‌కు సన్యాసిబస్తీకి చెందిన శ్రీరామ్‌కు గతంలో గొడవలు జరిగేవి. రెండు నెలల క్రితం కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే గొడవలు వద్దని, కలిసే ఉందామని చెప్పడానికి బుధవారం అర్ధరాత్రి బాబుక్యాంప్‌లో శ్రీరామ్ వద్దకు వెంకట్ అతని అనుచరుడు చిన్ని వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, గొడవ జరిగింది. రెచ్చిపోయిన శ్రీరామ్ అనుచరులు క్రాంతికుమార్, పట్టాల్, పద్మారావు, అస్మత్‌తోపాటు మరికొందరు వెంకట్‌పై దాడికి దిగారు. పక్కనే ఉన్న రాళ్లతో తలపై బలంగా మోదారు. వెంకట్‌తోపాటు వచ్చిన చిన్నికి గాయాలు కావడంతో అక్కడినుంచి తప్పించుకొని హనుమాన్‌బస్తీలో ఉన్న సన్నిహితుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అప్పటికే వెంకట్‌ను తీవ్రంగా కొట్టిన శ్రీరామ్ అనుచరులు అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతనిని చీకటి ప్రాంతంలో పడవేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు సుమారు రెండు గంటల పాటు బాబుక్యాంప్‌లో వెతుకులాడగా పాతపోలీస్‌స్టేషన్ సమీపంలో తీవ్ర గాయాలైన వెంకట్ కనిపించాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం వెంకట్ మృతిచెందాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, తన భర్తను బలవంతంగా ఇంటి నుంచి తీసుకొని పోయిన శ్రీరామ్ అనుచరులు హత్య చేశారని వెంకట్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు పాల్పడిన శ్రీరామ్‌తోపాటు క్రాంతికుమార్, పటాల్, పద్మారావు, అస్మత్‌లను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఏఎస్పీ భాస్కర్ భూషణ్ విలేకరులకు తెలిపారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వన్ టౌన్ సీఐ నరేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తగూడెంలో మహానేత విగ్రహావిష్కరణ