కొత్తగూడెం : ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఆసరాగా ఉండాల్సిన కార్పొరేషన్‌లు కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కళాశాలలకు మెస్ చార్జీలు అందించకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. స్కాలర్‌షిప్ రెన్యువల్‌తో పాటు నూతన స్కాలర్‌షిప్‌ల మంజూరులో కార్పొరేషన్లు జాప్యం చేస్తుండటంతో పేద విద్యార్థులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగూడెంలోని కాకతీయ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
ఏడాది కాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లు వీరికి అందించాల్సిన రూ. 25లక్షలు బకాయిలను అందించకపోవడంతో నాలుగు రోజులుగా మెస్‌ను మూసివేశారు. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న హోటళ్లలో ఒక్క పూట భోజనం చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 350 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటున్నారు. వీరి కోసం సెల్ఫ్‌మేనేజ్‌మెంట్ కింద కళాశాల మెస్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థికి నెలకు రూ.1900 నుంచి రెండు వేల వరకు ఖర్చవుతోంది. ప్రతి నెల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.950, బీసీ విద్యార్థులకు రూ.1200 ఆయా కార్పొరేషన్‌లు చెల్లిస్తున్నాయి. వీటిని మినహాయించి మిగిలిన మొత్తాన్ని కళాశాలకు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది.
ఏడాది కాలంగా పెండింగ్‌లో బకాయిలు..
ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి స్కాలర్‌షిప్‌ల రూపంలో వచ్చే మెస్ చార్జీలు రాకపోవడంతో మెస్ నిర్వహణ కళాశాల సిబ్బందికి భారంగా మారింది. ఈ మూడు కార్పొరేషన్ల నుంచి రూ.25 లక్షల వరకు బకాయి ఉండడం, ఇప్పటి వరకు బయట అప్పులు చేసి మెస్ నిర్వహించారు. ప్రస్తుతం బకాయిలు పెరగడం, బయట అప్పులు ఇచ్చే వారు లేకపోవడంతో నాలుగు రోజులుగా బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు మెస్ నిలిపివేశారు.
అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు..
కళాశాలలో మెస్ నిలిపివేయడంతో విద్యార్థులు బయట ఉన్న హోటళ్లలో భోజనం చేస్తున్నారు. అది కూడా ఒక్కపూటే చేస్తూ అర్ధాకలితో కళాశాలకు వెళ్తున్నారు. కళాశాల నుంచి వెళ్లిపోతే చదువు ఆగిపోతుందనే భయంతో అర్ధాకలితోనే చదువుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలిపినప్పటికీ వారు పేదలు కావడంతో డబ్బులు కూడా పంపించలేకపోతున్నారని అంటున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తోటి విద్యార్థుల వద్ద అప్పు చేసి భోజనం చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
పేద విద్యార్థుల ఆకలి కేకలు..
Published Sat, Dec 6 2014 4:46 AM | Last Updated on Tue, Oct 30 2018 7:39 PM
Advertisement
Advertisement