సాక్షి, కొత్తగూడెం : ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి నిరసన సెగ తగులుతోంది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుండడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిలదీతలు.. నిరసనలు..లబ్ధిదారుల ఆందోళనలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీకోసం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు రెండో విడత రచ్చబండలో చేసుకున్న దరఖాస్తులపై అధికార యం త్రాంగం స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 52 రచ్చబండ సభలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈనెల 11 నుంచి 18 వరకు పది సభలను అధికారులు నిర్వహించారు. టేకులపల్లి, వాజేడు, వీఆర్‌పురం, చింతూరు, గుండాల, సత్తుపల్లి, పినపాక, గార్ల, పాల్వంచ, కొణిజర్లలో ఈ సభలు ముగిశాయి. తొలిరోజు సభ నుంచే నిరుపేదల నిరసనలు హోరెత్తాయి. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ లబ్ధిదారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీసి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ సభల్లో 1,13,928 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పింఛన్ల కోసం 29 వేల మంది, రేషన్‌కార్డుల కోసం 65వేల పైచిలుకు నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు వారికి లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
దీంతో ఈ సభలో ఇవే ప్రధాన సమస్యలుగా అర్హులైన వారు ప్రశ్నిస్తుండడంతో అధికారులు మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రజానిధులు మాత్రం గతంలో రచ్చబండల మాదిరి మళ్లీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా.. గతంలో దరఖాస్తుల సం గతి తేల్చాలని నిరుపేదలు ఎక్కడికక్కడ నిల దీస్తుండడంతో చేసేదేమీ లేక త్వరలో అందరికి లబ్ధి చేకూరుతుందని చెప్పుకుంటూ వేదిక దిగి పోతున్నారు. సభలకు ఆర్భాటంగా వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఊహించని రీ తిలో వస్తున్న నిరసనలను చూసి త్వరగా సభలు ముగించుకుంటూ మమ అనిపిస్తున్నా రు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ సభల్లో అవకా శం ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పోలీసు బం దో బస్తుతో సభలు నిర్వహించి ప్రజాసమస్యల ను ప్రభుత్వం పక్కన పెడుతుండడం గమనార్హం.
కన్నెర్ర చేస్తున్న రైతన్న
ఇటీవలి తుపానుతో అపారనష్టం జరిగి పంటలు చేతికందకుండాపోయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదని, అలాంటిది ఈ సభలెందుకని రైతులు నిరసనగళం వినిపిస్తున్నారు. గతంలో పంట నష్టం జరిగినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు సభలు పెట్టిం ఏంచేస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం కొణిజర్లలో రైతులు ఇదే విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, తుపానుతో నష్టపోయిన పంటలకు సంబంధించి తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ రైతులు ఆందోళన చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదంటూ రైతులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా రైతుల నుంచి నిరసనలు ఎదురవుతుండడం, ఇంకా 42 సభలు ఉండడంతో ఏం సమాధానం చెప్పాలో అని అధికారులు తలపట్టుకుంటున్నారు.
టీడీపీ నేతల ఫ్లెక్సీల జగడం..
ప్రజా సమస్యలు విని, అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేతలు రచ్చబండ సభల్లో తమ పార్టీ ప్రజాప్రతినిధుల ఫోటోలు పెట్టడం లేదంటూ అధికారులతో జగడం చేస్తున్నారు. కొణిజర్లలో నిర్వహించిన రచ్చబండ సభ వేదిక పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోటో పెట్టలేదని.., సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మండల నాయకులు వేదికపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే పాల్వంచ రచ్చబండ సభ ఫ్లెక్సీలో నామా ఫోటోలేదని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించాలని పాల్వంచలో టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.