సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు కొత్తగూడెంలో ఈ సారి టికెట్టు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ట్రస్టు ద్వారా సేవలు చేస్తూ అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నా జీవితం.. ప్రాణం కొత్తగూడెం ప్రజల కోసమేనని చెబుతూ అందరి మనసులను గెలుచుకునే పనిలో పడ్డారు. కన్న తల్లిని.. పుట్టిన భూమిని మర్చిపోకూడదనే ఇక్కడ సేవ చేయడానికి వచ్చానని చెప్పారు.
రావణాసురుడి పాలన..
రాష్ట్రమంతా రామరాజ్యం నడుస్తుంటే కొత్తగూడెంలో మాత్రం ఓ రావణాసురుడు పాలిస్తున్నాడని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడి ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని నడిపిస్తున్నాడని దుయ్యబట్టారు. కొత్తగూడెం ప్రాంత ప్రజలకు ఇకపై తాను కాపలా కాస్తానని చెప్పారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న తనను కావాలని ఇబ్బంది పెడితే తానేంటో కూడా చూపిస్తానని హెచ్చరించారు.
ఎన్నో సేవలు చేశా..
కొత్తగూడెం ప్రాంతంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాని శ్రీనివాసరావు చెప్పారు. మెగా హెల్త్ క్యామ్ప్ లు పెట్టి సుమారు 200 మందికి నాలుగు కోట్ల రూపాయల విలువైన వైద్యాన్ని అందించామని అన్నారు. 8వేల మంది నిరుద్యోగులకు జాబ్ మేళా లు నిర్వహించి 4 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు శ్రామిక శక్తి అవార్డులు బహుకరించి గౌరవించుకున్నామని స్పష్టం చేశారు. వందలాదిమంది నిరుద్యోగ యువతకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉచిత కోచింగ్ ఇప్పించి భోజనాలు పెట్టించామని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశామని చెప్పారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫర, ఆరో ఓ ప్లాంట్ లను ఏర్పాటు చేసి మంచినీటిని అందించామని చెప్పారు.
అభిమానాన్ని తొలగించగలరా?
పుట్టిన రోజు సందర్భంగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి పర్యటన సందర్భంగా మా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కావాలని తొలగించారని ఆరోపించారు. తమ ట్రస్ట్ ద్వారా లబ్ది పొందిన వ్యక్తి చేతే ఫ్లెక్సీ తొలగించారు కానీ అతని గుండెల్లో తనపై ఉన్న అభిమానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేసి మొదటి మెడికల్ కాలేజ్ ను సాంక్షన్ చేయించానని చెప్పారు. ఏసీ కారు, బంగ్లా, మంచి పొజీషన్ వదిలి ఇక్కడకు వచ్చి సేవ చేస్తున్నానని అన్నారు.
ఇదీ చదవండి: క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్‌లో అడుగు పెట్టాలి: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment