rachabanda programme
-
రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర
సాక్షి, మహబూబాబాద్: రైతులను కూలీలుగా మార్చడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. తామర పురుగు ఆశించిన మిర్చి పంటను చూపించి రైతులు విలపించారు. అనంతరం అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రైతును రాజుగా చూసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. రైతుల కోసమే ప్రాజెక్టులు కట్టామని చెబుతూ వరి సాగు చేయొద్దని చెప్పడం శోచనీయమన్నారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతోందని, విత్తనాల తయారీ కంపెనీలతో కుమ్మక్కై పంటలకు చీడపీడలు ఆశించేలా చేస్తోందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చట్టాలు సైతం అందులో భాగమేనన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘రచ్చ బండ’ ఖాయం.. అడ్డుకుని తీరుతాం..
మర్కూక్ (గజ్వేల్): సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నిర్వహించనున్న ‘రైతులతో రచ్చబండ’కార్యక్రమం స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం వచ్చిన కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రచ్చబండ నిర్వహిస్తే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించగా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. ‘జై టీఆర్ఎస్, జై కేసీఆర్’.. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్.. గోబ్యాక్ కాంగ్రెస్’అని టీఆర్ఎస్ నాయకులు.. ‘కేసీఆర్ డౌన్ డౌన్.. టీఆర్ఎస్ డౌన్ డౌన్’అని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. రైతులతో రేవంత్ నేరుగా మాట్లాడతారు ఎర్రవల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో సభాస్థలం పరిశీలనకు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడుతారని, అడ్డుకోవడానికి టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా రచ్చబండ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. -
Congress: రైతులతో ‘రచ్చబండ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈనెల 24 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రైతాంగాన్ని కలవడం ద్వారా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు వారిని మోసగిస్తు న్న విధానాన్ని వివరించాలని పార్టీ నేతలు నిర్ణయిం చారు. ఈ పర్యటనల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక్కొక్క రోజు ఆ జిల్లా పరిధిలోని రెండు లేదా మూడు ప్రాంతాల్లో రైతులను కలుస్తారు. రచ్చబండపై వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో వారి సమస్యలను అవగాహన చేసుకోవడం ద్వారా రైతాంగ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించుకునే ప్రణాళికతో వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య ఎందుకు వచ్చింది, ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు ఏ విధంగా రైతులను మభ్యపెడుతున్నాయో పూర్తిస్థాయిలో తెలియజేయాలని, కాంగ్రె స్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణ రైతాంగానికి జరిగిన మేలు, ఆ పార్టీ హయాంలో నిర్మించిన ప్రా జెక్టుల వల్ల జరిగిన అభివృద్ధిని కూడా రైతులతో పంచుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు టీపీసీసీ కిసాన్‌సెల్ నేతృత్వంలో షెడ్యూల్ రూపొందించారు. రచ్చబండ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. రచ్చబండలో భాగంగా కాంగ్రెస్ రైతు అనుకూల విధానాన్ని, టీఆర్ఎస్, బీజేపీల రైతు వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించామని టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి వెల్లడించారు. -
హామీలిచ్చి గాలికొగ్గేశారు
కంఠం ప్రభుదాస్, పాడేరు :‘గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. చివరకు గాలికొగ్గేశారు. రుణమాఫీసేత్తామన్నారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. పంట నష్టానికి పరిహారం కూడా ఇవ్వలేదు. కాయితాలట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప పనులవటం లేదు. పోడు భూములకు వ్యక్తిగత పట్టాలివ్వలేదు. దీనివల్ల ఉపాధి పనులకు, బ్యాంకు రుణాలకు దూరమవుతున్నాం. గిరిజన యువతకు ఉద్యోగాలివ్వటం లేదు. ఏజెన్సీలో అనేక పోస్టులు ఖాళీ ఉన్నా.. నియామకాలు చేపట్టలేదు’ అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు మండలం కుజ్జెలి పంచాయతీ పరిధిలోని దిగుమోదాపుట్టు, కుజ్జెలి, రాములు పుట్టు, ఎగు మోదాపుట్టు గ్రామాల ప్రజలు ములపుట్టులో రచ్చబండ నిర్వహించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చించి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆశపెట్టారని.. అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ధ్వజమెత్తారు. నిజమైన నిరుద్యోగులకు భృతి అందటం లేదని, ఐదెకరాలు దాటి ఉన్న కుటుంబాలకు పింఛన్లు ఇవ్వటం లేదని, జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే సబ్సిడీ పథకాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లను నమ్మి ఓటేసిన రైతులు, డ్వాక్రా మహిళలు వడ్డీల భారం మోయలేక రుణగ్రస్తులుగా మిగిలిపోయారని నిరసన తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో ఎవరేమన్నారంటే.. రైతుల కోసం ఒక్క పనీ చేయలేదు రైతులకు మేలు చేసే పనులు ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు. పంట నష్టం కలిగితే పరిహారం ఇవ్వలేదు. జన్మభూమి గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారే తప్ప ఏ çపనీ చేయలేదు. ప్రతిసారి దరఖాస్తులుఇవ్వడానికి వ్యయప్రయాసలే తప్ప ప్రయోజనం లేదు. వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని పెట్టుబడులు కూడా చేతికి రావటం లేదు. అయినా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. – పాంగి దేముడు, కుజ్జెలి ఉద్యోగాల్లేక చదువులు మానేశారు చదువుకున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు.ప్రభుత్వం ఏజెన్సీలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో లేవు. ఆర్థిక స్థోమత, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో యువకులు ఇంటర్, డిగ్రీ తర్వాత చదువు మానేసి కూలి పనులకు వెళ్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి. – తామర నారాయణ, కుజ్జెలి రుణమాఫీ జరగలేదు ఆరేళ్ల క్రితం నా భూమి పట్టాపై పాడేరు యూనియన్ బ్యాంకులో రూ.50 వేలు పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ అవుతుందని చెప్పడంతో బ్యాంకుకు బాకీ కట్టలేదు. నాకు ఒక విడత కూడా రుణమాఫీ జరగలేదు. వడ్డీతో కలిపి రూ.80 వేలు అయ్యిందని, వెంటనే చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పంట రుణం మాఫీ అవుతుందని నమ్మి మోసపోయాను. – బొండా చిన్నబాలన్న, రాములపుట్టు మంచి పాలన అందించాలి ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇస్తుంటే బినామీలు పాలిస్తున్నారు. గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తించి గిరిజనులకు మేలు చేసేవిధంగా మంచి నాయకులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. – కుంతూరు సూరిబాబు, రాములపుట్టు అటవీ హక్కు పత్రాలు ఇవ్వలేదు మా పంచాయతీలో పోడు భూములు సాగు చేసుకుంటున్న కుటుంబాలు 500పైగా ఉన్నాయి. మాకు వీఎస్ఎస్ కింద ఉమ్మడి పట్టా ఇచ్చారు. వ్యక్తిగత పట్టాలివ్వాలని ఐదేళ్ల నుంచీ అడుగుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత పట్టాలు ఉన్నవారికే 50 రోజులు అదనంగా ఉపాధి పనులు కల్పిస్తున్నారు. రుణాలు ఇస్తున్నారు. ఉమ్మడి పట్టా కావడంతో మాకు ఇవేమీ అందటం లేదు. – కె.నాగరాజు, రైతు,దిగుమోదాపుట్టు గ్రామ సచివాలయవ్యవస్థ మేలు అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడం పేదలకు ఒక వరంలాంటిది. ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. నవరత్న పథకాల వల్ల పేదరికం తొలగిపోతుంది. – గబ్బాడ చిట్టిబాబు, మాజీ సర్పంచ్, కుజ్జెలి -
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ రచ్చబండ
-
కొత్త కార్డులకు ఈ నెల బియ్యం లేనట్లే
రెంజల్, న్యూస్‌లైన్ : రచ్చబండ సాక్షిగా కలెక్టర్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వంతో పేదలకు ప్రయోజనం చేకూరడం లేదు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మూడోవిడత రచ్చబండతో ప్రజాధనం వృథా అయ్యిందే తప్ప వారికి ఒరిగిందేమి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రచ్చబండలో భాగంగా జిల్లాలో 80వేల రేషన్‌కార్డులు, 4,300మంది అర్హులకు బంగారుతల్లి గుర్తింపుకార్డులు, 40వేల మందికి పింఛన్లు, 11వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు, రూ.19 కోట్లు ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బకాయి మాఫీ పత్రాలు అందించారు. వీరికి డిసెంబర్ నుంచి రూపాయి కిలో బియ్యంతో పాటు పింఛన్లు అందిస్తామని కలెక్టర్ ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలు ప్రశ్నార్థకం కావడంతో లబ్ధిదారులు హైరానా పడుతున్నారు. రేషన్ సరఫరాపై సమాధానం చెప్పలేక డీలర్లు, మండల స్థాయి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రచ్చబండ రోజునే పూర్తిస్థాయిలో మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేసినా గ్రామాల్లో నేటికీ పంపిణీ కొనసాగుతోంది. డిసెంబర్ నుంచి బియ్యం, పింఛన్లు అందించాలని చెప్పినా ఇంతవరకు డీలర్లు డీడీలు కట్టలేదు. జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రతీనెల 15వరకు స్టాక్ వివరాలు మండల కార్యాలయాలకు అందిస్తారు. దాని ఆధారంగా డీలర్లకు 18వరకు అలాట్మెంట్ను ఇస్తారు. డీలర్లు 20వరకు సంబంధిత బ్యాంకుల్లో డీడీలు కట్టి ఎంఎల్ఎస్ పాయింట్లో సమర్పిస్తే 22 నుంచి డీలర్లకు రేషన్ సరుకుల సరఫరా ప్రారంభమవుతుంది. నెల మొదటి తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడం మొదలుపెడతారు. అయితే గతనెల రచ్చబండలో కార్డులు పొందిన వారికి డీఎస్ఓ కార్యాలయం నుంచి అలాట్మెంట్ రాకపోవడంతో డీలర్లు డీడీలు కట్టలేదని తెలుస్తోంది. దీంతో వారికి డిసెంబర్ నెల బియ్యంతో పాటు పింఛన్లు అందే అవకాశం కనిపించడం లేదు. వచ్చే నెలలోనైనా అందించాలని వారు కోరుతున్నారు. -
దీపం ఎర
సాక్షి, గుంటూరు :ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రచ్చబండ కార్యక్రమం వేదికగా పించన్లు, రేషన్ కార్డులు ఇస్తామని ద రఖాస్తులు ఆహ్వానించిన అధికార పార్టీ నేడు గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలకు దిగింది. ఎత్తుగడల్లో భాగంగా ‘దీపం’ పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు నగర పాలక సంస్థ, మున్సిపాల్టీలు, మండలాల నుంచి అర్హుల జాబితాలు తెప్పించారు. కొత్తగా రెండు వేల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు.జిల్లాలో ఇప్పటికే 1,82,757 దీపం కనెక్షన్లు ఉన్నాయి. మాచర్ల పట్టణంలో 946, బాపట్లలో 99, బెల్లంకొండలో 105, తెనాలి పట్టణంలో 850 కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయా స్థానిక సంస్థల కమిషనర్లు, తహశీల్దార్ల నుంచి అందిన లబ్ధిదారుల జాబితాలను అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ఇవి కాకుండా గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సుమారు 200 కొత్త కనెక్షన్లు దీపం కింద మంజూరు చేయాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుకు ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. పెండింగ్ కనెక్షన్లకు దిక్కులేదు.. పేదవారికి అంది ంచే దీపం కనెక్షన్లపై స్థానిక సంస్థలు అంతగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల జాబితాలకు గ్యాస్ ఏజెన్సీల వద్ద వున్న జాబితాతో సరిపోలకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు అంతకు ముందే కనెక్ష న్లు ఉన్నట్లు గా్యాస్ ఏజెన్సీల వద్ద వున్న జాబితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎవరు అర్హులో, అనర్హులనే ది ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు. 2011-12 ఏడాదికి 19,583 గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా, 17,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 16,293 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,290 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇదిలావుంటే, గుంటూరు నగరంలో సుమారు 700 మందికి సాంకేతిక కారణాలు చూపి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఈ విషయాన్ని ఆహార సలహా సంఘ సమావేశం జరిగిన ప్రతిసారి సభ్యులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెస్తూనే ఉన్నారు. గ్రామాల్లో నేతల హడావుడి.. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు, ఇప్పటి నుంచే నానా ప్రయాస పడుతున్నారు. ప్రధానంగా పేద మహిళా ఓటర్లకు ఎర వేసేందుకు దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. ప్రతీరోజూ ఎవరో ఒక నాయకుడు పది మంది మహిళలను వెంటబెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు. ఆయాచోట్ల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు. -
ఎక్కడి దరఖాస్తులు అక్కడే
పాలమూరు, న్యూస్‌లైన్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమం దరఖాస్తులను స్వీకరించేవరకే పరిమితమైంది. మొదటి, రెండోవిడత రచ్చబండ దరఖాస్తులకే మోక్షం లేకపోగా..మూడోవిడత కార్యక్రమం నిర్వహించారు. ఈ దఫా దరఖాస్తులను కూడా మూలకుపడేయడంతో రచ్చబండ కాస్తా.. సచ్చుబండగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అర్జీలపై విచారణకు కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ప్రధానంగా రచ్చబండలో రేషన్‌కార్డులు, పింఛన్లు, అభయహస్తం, ఇందిరమ్మ, ఉపాధిహామీ పథకం అర్జీలకు ప్రాధాన్యమిస్తామని అధికారులు అప్పట్లో చెప్పినా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారు. వాటిపై దృష్టిసారించకుండానే ముచ్చటగా మూడోవిడత రచ్చబండ నిర్వహించి వివిధ సమస్యలపై జిల్లావ్యాప్తంగా 3.83 లక్షల అర్జీలను స్వీకరించారు. వాటిలో ప్రధానంగా రేషన్‌కార్డులకోసం 1,30,573 దరఖాస్తులు రాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి 1,32,090, పింఛన్లకు 87,809, ఇతర వాటికి 33,000 దరఖాస్తులు అందాయి. వీటిని అధికారులు త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని అర్జీదారులు కోరుతున్నారు. అటకెక్కిన అర్జీలు గతంలో చేపట్టిన రచ్చబండ 1, 2 విడతల్లో రేషన్‌కార్డుల కోసం 1.90 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 60వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతావి మంజూరు చేశారు. పింఛన్ల కోసం 1.50 లక్షల దరఖాస్తులు అందగా కేవలం 70వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపికచేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పేద కుటుంబాలకు చెందిన వారు 1,63,336 మంది దరఖాస్తులు అందజేయగా 95వేల ఇళ్లకు మాత్రమే మంజూరు లభించినట్లు సమాచారం. వారిలోనూ ఎంతమందికి పూర్థిస్థాయిలో బిల్లులు మంజూరుచేస్తారన్నది అయోమయంగా మారింది. అసలు విషయమేమిటంటే.. ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సరైన లెక్కలు కూడా లేకపోవడంతో ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందో తెలియడం లేదు. ఇళ్లు మంజూరు చేయాలంటే సదరు లబ్ధిదారులకు విధిగా రేషన్‌కార్డు, స్థలం ఉండాలి. ఈ రెండింటిలో ఏదిలేకపోయినా ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదు. ఇళ్లకు అర్హత సాధించిన వారిలో పలువురికి రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. ఇటువంటి అంశాలు సర్కారు విధానంపై అయోమయం కలిగిస్తున్నాయి. -
ఈసారీ ‘బుట్టపాలే!’ రచ్చబండారం
సాక్షి, కాకినాడ :తెలుగువారి మధ్య విభజన చిచ్చు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లో రగిలిన ఆగ్రహజ్వాల లను చల్లార్చే ఉపాయంగా మూడవ విడత రచ్చబండ ను నిర్వహించింది. మొదటి విడత రచ్చబండ 2011లో జనవరి 23 నుంచి 10 వరకు జరిగింది. రెండో విడత కూడా అదే ఏడాది నవంబర్ 2 నుంచి 30 వరకు జరిగింది. షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించ తలపెట్టిన రచ్చబండ-3 సభలు హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల 30వ తేదీ వరకు సాగాయి. జిల్లాలో ఇప్పటివరకు 63 సభలు నిర్వహించా రు. మొదటి రెండు రచ్చబండల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహరుణాలు, ఇంటి స్థలాలు, వ్యక్తిగత రుణాలు తదితర సుమారు 20కి పైగా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తినప్పటికీ ప్రభుత్వం కేవలం రేషన్ కార్డులు, పింఛన్లు, గృహరుణాలకు వచ్చిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంది. గత రెండు రచ్చబండల్లో రేషన్‌కార్డులకు 1,26, 754 దరఖాస్తులు రాగా, 1,11,664 అర్హత పొందాయి. కానీ ఇందులో సుమా రు 85,906 మంది మాత్రమే కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. వారిలోనూ తిరిగి సుమారు 26 వేల మందికి మొండి చేయి చూపారు. 85,906 మందిలోనూ ఇప్పటి వరకు 5 వేల మందికి పైగా మా త్రమే కార్డులిచ్చి మిగిలిన వారికి 66,474 కూపన్లు పంపిణీ చేశారు. 10,065 మం దికి ఇప్పటికే కార్డులున్నాయని పేర్లను తొలగించారు. మూడవ విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం ఇప్పటి వరకు 28,817 దరఖాస్తులు వచ్చాయి. పింఛన్లదీ అదే దారి.. మొదటి రెండు విడతల్లో పింఛన్ల కోసం లక్ష పైగా దరఖాస్తులు రాగా కేవలం 53, 843మంది మాత్రమే అర్హులని తేల్చారు. లక్షన్నర మందికి పైగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేస్తే లక్ష 5 వేల మందికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. పింఛన్లకు 53, 843 మందిని అర్హులుగా నిర్ధారించినప్పటికీ 42,027 మందికి మాత్రమే మంజూరు ఉత్తర్వులందజేశారు. అలాగే వికలాంగ పింఛన్లకు 5722 మందిని అర్హులుగా నిర్ధారించగా, 5021 మందికి మాత్రమే పంపిణీ చేశారు. కాగా మూడవ విడత పింఛన్లకు మరో 22,422 దరఖాస్తులు వచ్చాయి. శనివారం కాకినాడ రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 40 వేలు దాటొచ్చు. అంటే గత రెండు రచ్చబండల్లో అర్హులైన వారితో కలిపితే సుమారు 50 వేల మంది పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. మూడోవంతు మందికి నిరీక్షణే గృహరుణాలకు సంబంధించి లక్షా 5 వేల మందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు 51,933 మందికి మంజూరు ఉత్తర్వులందజేశారు. కాగా మూడవ విడత రచ్చబండలో ఇప్పటి వరకు గృహరుణాల కోసం 17,785 దరఖాస్తులొచ్చాయి. బంగారుతల్లి పథకానికి సంబంధించి 3406మందిని అర్హులుగా గుర్తించినా ఇప్పటి వరకు 2626 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్టు చెప్పుకొచ్చారు. రేషన్కూపన్లు, పింఛన్లు, గృహరుణాల మంజూరు ఉత్తర్వుల పంపిణీకి తప్ప ఈ రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించిన దాఖలాలు లేవు. గత రెండు రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిలో మూడవ వంతు మందికి ఎదురుచూపు తప్పడం లేదు. వారికి మూడవ విడత అర్జీదారులు తోడవుతున్నారు. లక్షలాదిగా పేరుకుపోయిన ఈ దరఖాస్తులను పరిష్కరించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోగానే నిధులు సమకూర్చే పరిస్థితిలో రాష్ర్ట ప్రభుత్వం లేదని అధికారులే అంటున్నారు. అంటే ఈ రచ్చబండ దరఖాస్తులు కూడా గతంలో మాదిరిగానే బుట్టదాఖలయ్యే అవకాశాలే ఎక్కువన్న మాట. ప్రభుత్వం రచ్చబండకు సంబంధించి ప్రచారం పట్ల చూపుతున్న ఆరాటంలో వందో వంతు చిత్తశుద్ధి కూడా దాని అమలులో చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రభుత్వ పాలనలో టీ-మంత్రుల ప్రమేయం లేదు: డి.శ్రీనివాస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తెలంగాణ మంత్రుల ప్రమేయం ఏమీలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందులో తెలంగాణ ప్రజాప్రతినిధుల పాత్ర చక్కగా ఉంటుందన్నారు. ఎన్నో సంవత్సరాల ఉద్యమం, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడనున్న తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులతోపాటు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి యత్నిస్తున్నారని చెప్పారు. అయినా వారి యత్నాలు ఫలించవన్నారు. కొన్ని పార్టీలు తెలంగాణపై ఊహించిన దానికంటే ఎక్కువే మాట్లాడుతున్నాయని చెప్పారు. భద్రాచలం తెలంగాణ నుంచి విడిపోయే ప్రసక్తే లేదన్నారు. సీమాంధ్రులు కొత్త రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సిన నిధుల కేటాయింపు వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, డీఎస్ ప్రసంగాన్ని తెలంగాణవాదులుఅడ్డుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో డీఎస్ స్పందించి తాను ఇక్కడికి రాకముందే ఈ పనిని మీరే చేయాల్సి ఉండేదన్నారు. అంతలో ఓ తెలంగాణవాది సీఎం ఫొటోపై పేడను కొట్టారు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల పహారా నడుమ మమ
సాక్షి, గుంటూరు :పోలీసుల పహారా నడుమ రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులు ‘మమ’ అనిపించారు. రచ్చబండలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు నిరసనలు.. నిలదీతలు ఎదురైనా.. సభలు రచ్చ రచ్చగా మారినా.. ప్రజా సమస్యల్ని పెడచెవిన పెడుతూ కేవలం అర్జీల స్వీకరణతోనే సరిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా రచ్చబండ సభలు మంగళవారంతో ముగిశాయి. అయితే వాయిదా పడ్డ రెండు మూడు చోట్ల ఈ నెల 30 వరకు గడువిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల ఆశ చూపి జిల్లాలో పలు చోట్ల సభలకు జనాన్ని రప్పించడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమైనప్పటికీ అందిన దరఖాస్తుల పరిష్కారంలో ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తారన్నది తేలాల్సివుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆశలో ఇబ్బడిముబ్బడిగా అర్జీలు అందజేశారు. అక్కడక్కడా రచ్చ..రచ్చ.. జిల్లాలోని తెనాలి డివిజన్ మినహా గుంటూరు, నర్సరావుపేట డివిజన్లలో అక్కడక్కడా రచ్చబండ సభలు రచ్చరచ్చగానే ముగిశాయి. వందల్లో హాజరైన జనం అర్జీలను అందజేసే క్రమంలో కిందటిసారి సమర్పించిన అర్జీల విషయంపైనా అక్కడక్కడా నిలదీశారు. నెలల తర బడి ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నా తమగోడు పట్టించుకున్న వారే కరువయ్యారని గుంటూరు పట్టణంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్న సభల్లోనూ ఈ నిరసనలు, నిలదీతలు కనిపించాయి. ఈ సారి అర్జీలపై పరిశీలన జరిపి వాటికి పరిష్కారం చూపకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటేసే ప్రసక్తే లేదంటూ కొందరు మహిళలు తేల్చి చెప్పారు. సభల్లో ప్రసంగించడం, హామీలు గుప్పించడం, ఆపైన అర్జీలు స్వీకరించడంతోనే కార్యక్రమాలు ముగిశాయనిపించారు. తెనాలి డివిజన్లోని 18 మండలాల్లోనూ రచ్చబండ సభలు సజావుగానే సాగినా, ప్రజాప్రతినిధుల హాజరు పెద్దగా లేకపోవడం అర్జీదారుల్ని నిరాశ పరిచింది. నర్సరావుపేట మున్సిపాల్టీ, మండలంలో మంగళవారం జరగాల్సిన రచ్చబండ సభలు వాయిదా పడ్డాయి. ఇక్కడ 29న సభలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కాసు హాజరయ్యే అవకాశాలు లేకపోవడంతో వాయిదా వేశారు. కిందటి అర్జీలకు పరిష్కారమే లేదు.. కిందటి సారి జరిగిన రచ్చబండ సభల్లో సమర్పించిన అర్జీలలో సగం సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. రకరకాల కారణాలు చూపుతూ ఇళ్ల మంజూరు, ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేసిన ప్రభుత్వం ఈసారైనా వాటిని మంజూరు చేస్తుందో లేదోనన్న అనుమానాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. రచ్చబండలో ప్రజల నుంచి అందిన అర్జీలన్నింటినీ ఆన్లైన్లో పొందుపర్చాలంటూ కలెక్టర్ సురేశ్‌కుమార్ అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికలకు ముందు నిధుల్ని విడుదల చేయడం, ఉద్యోగాలు భర్తీ చేయడం వంటి ఓటర్లను ప్రభావితం చేసే జిమ్మిక్కులు చేపట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ సభల్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మలుచుకొందనే విమర్శలు వినిపించాయి. -
రచ్చబండలో రచ్చ..రచ్చ..
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం రచ్చ..రచ్చగా సాగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వె ంకటేశ్వరరావు ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. వారికి పోటీగా టీడీపీ కార్యకర్తలు ప్రతి నినాదాలు చేయడంతో సుమారు అరగంట పాటు సభకు అంతరాయం కలిగింది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఎంపీ మధుయాష్కీగౌడ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, అరికెల నర్సారెడ్డి, మండవ తదితరులు పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఇరువర్గాల వారు శాంతించకపోవడంతో రచ్చబండ రసాభాసాగా కొనసాగింది. మధ్యలో డీఎస్ తన స్థానం నుంచి లేచి వేదిక చివరకు వచ్చి మరీ ఇరువర్గాల వారికి నచ్చజెప్పాల్సి వచ్చింది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కార్యకర్తల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలను సైగలతో రెచ్చగొడుతున్నావంటూ ఏఎంసీ చైర్మన్ నగేశ్‌రెడ్డితో ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే మండవలు వాగ్వాదానికి దిగారు. చివరకు కలెక్టర్ ప్రద్యుమ్న మైక్‌లో ఇది రాజకీయ పార్టీల సమావేశం కాదని, ప్రభుత్వ కార్యక్రమం అని ఇష్టం లేని వారు ఇక్కడి నుంచి వెళ్లి పోవచ్చని పదే పదే చెప్పాల్సి వచ్చింది. డీఎస్పీ అనిల్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలను లాఠీల తో చెదరగొడుతున్న పోలీసులపై ఏఎంసీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ డైరక్టర్ గజవాడ జైపాల్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారం భం కావాల్సిన కార్యక్రమం అరగంట ఆలస్యంగా ప్రార ంభం కావడంతో పాటు మధ్యలో రచ్చరచ్చ కావడం వల్ల రాత్రి 6 గంటలకు ముగిసింది. సభ ముగిసిన తర్వాత కౌంటర్ల వద్ద సుమారు రెండు గంటల పాటు వేచిఉండి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
రచ్చబండ వేదికపై సమైక్య రాగమా?: విఠల్
ఆలంపల్లి/ తాండూరు రూరల్ , న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండను వేదికగా చేసుకుని సమైక్యరాగం వినిపిస్తున్నారని, దశాబ్దాల కల నెరవేరే సమయంలో కుట్రలు పన్ని తెలంగాణ రాష్ట్ర బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ విమర్శించారు. సోమవారం ఆయన వికారాబాద్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సమన్యాయం అంటున్నారే తప్ప.. అది ఎలా సాధ్యమో చెప్పడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్‌ను కేంద్రంగా ప్రకటించాలన్నారు. అనంతగిరి హిల్స్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంజినీర్స జేఏసీ నాయకులు సంపత్, శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మూడు డిమాండ్లు.. తెలంగాణ పున ర్నిర్మాణంలో భాగంగా తమ నుంచి మూడు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయని విఠల్ అన్నారు. మొదటిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 90రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఒకే నోటిఫికేషన్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని, రెండోది సాయుధ పోరాట యోధుల మాదిరిగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలన్నారు. మూడో డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థులు, ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని విఠల్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ప్రజలు ప్రస్తావించే అన్ని సమస్యలూ ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని, దశలవారిగా వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంబంధించి రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో కొత్తగా 30వేల రేషన్‌కార్డులు, 15వేల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 29 శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని వర్తింపజేశామని ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి డిసెంబర్ నెల నుంచి బియ్యం, పెన్షన్లు మంజూరైన వారికి నవంబర్ నుంచి పెన్షన్ అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు లక్షా ఐదు వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే ఇళ్లను కట్టుకోవాలని కోరారు. ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు లేనివారికి(గతంలో మంజూరైన వారికి) స్థలాలను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్న వారికి నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని కలెక్టర్ చెప్పారు. అంతకు ముందు సర్పంచ్‌లు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీనిచ్చారు. డ్రైనేజీ, రోడ్లు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తామని, 13వ ఫైనాన్స్ నిధులతో అభివృద్ధి పనులను చేపడతామన్నారు. వివిధ అభివృద్ధి పనుల గురించి నెలకోసారి సర్పంచ్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఎంపీడీఓలకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలుకు నిధులు లేవని, నిధుల మంజూరుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. పట్నం నగరపంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణరెడ్డి, ఎంపీడీఓ అనిల్‌కుమార్, సర్పంచ్‌లు ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, పాశం అశోక్‌గౌడ్, బొడ్డు నిర్మల, పోరెడ్డి సుమతి, రచ్చబండ మండల కమిటీ సభ్యుడు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కంబాలపల్లి హన్మంత్‌రెడ్డి, మండల సీపీఎం కార్యదర్శి సామెల్ తదితరులు మాట్లాడారు. -
తెలంగాణ రాష్ట్రంలోనూ రచ్చబండ: ప్రసాద్‌కుమార్
పెద్దేముల్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన పెద్దేముల్‌లోని ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన మూడో విడత రచ్చబండలో పాల్గొని మాట్లాడారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండకు శ్రీకారం చుట్టారని, దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రచ్చబండ ద్వారా జిల్లాలో 40,353 ఇందిరమ్మ ఇళ్లు, 10,567 రేషన్ కార్డులు మంజురు చేసినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేసి రూ.12వేల కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికి వికారాబాద్ నియోజకవర్గానికి రూ.18కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు రుణాలు ఇచ్చేందుకు రూ.ఏడు కోట్లు సిద్ధంగా ఉన్నాయని, తుపానుకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఉపాధి పీడీ చంద్రకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ధారాసింగ్, అనంత్‌రెడ్డి, మాజీ మున్సిఫల్ చైర్మన్ విశ్వనాథంగౌడ్, మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి, ఎంపీడీఓ సంధ్య, తహసీల్దార్ రామహరిప్రసాద్, గ్రామ సర్పంచ్ పద్మ, పలు పార్టీల నాయకులు అంజయ్య, నారాయణరెడ్డి, రాములు, మైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, చందర్‌నాయక్, విష్ణువర్ధన్‌రెడ్డి, అంబరయ్య, రియాజ్, వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎంగా ఉండడం పూర్వజన్మ సుకృతం: కిరణ్‌కుమార్‌రెడ్డి
రాయచోటి రచ్చబండలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తయిందని, సీఎంగా మీతో గడపడం తన పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌జిల్లా రాయచోటిలో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందలేదని లబ్ధిదారులు బాధపడకుండా ఉండేందుకే రచ్చబండ కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా రెండు విడతల్లో 60లక్షల మందికి ప్రభుత్వ పథకాలల్లో అవకాశం కల్పించామన్నారు. -
సంక్షేమ ఫలాలు అందించేందుకే.. : సుదర్శన్‌రెడ్డి
మద్నూర్, న్యూస్‌లైన్ : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే రచ్చబండ నిర్వహిస్తున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మా ర్కెట్ యార్డులో రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సోయా ఎక్కువగా పండిస్తున్నారన్నారు. వచ్చే ఏడాది సోయా విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పుడు పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయడం దారుణమని ఎమ్మెల్యే హన్మంత్ సింధే విమర్శించారు. అంతకు ముందు మేనూర్‌లో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ భవణ నిర్మాణానికి శంకస్థాపన చేశారు. డబ్బులిస్తేనే స్థలం కేటాయిస్తారట! అధికారులకు డబ్బులిస్తేనే తమకు ఇండ్ల స్థలం కేటాయిస్తారట అని మొగాకు చెందిన ఈరేశం రచ్చబండ కార్యక్రమం మధ్యలో లేచి గట్టిగా మాట్లాడారు. నాకు సొంత ఇల్లు లేదని గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకొని ఉంటున్నానన్నారు. ఇంటి స్థలం ఇవ్వడానికి తహశీల్దార్ రవి, ఏఆర్ఐ అజయ్ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఈరేశంను పక్కకు లాక్కెళ్లారు. వెంటనే స్పందించిన బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్ అతడి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. వారంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి.. బిచ్కుంద : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రుణాలు అందిస్తోందని మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిచ్కుంద మార్కెట్ యార్డులో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ర్టం సాధ్యమన్నారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి రూ. 5 కోట్లు ఇస్తున్నామని, లెండి ప్రాజెక్టు నిర్మాణానికి మన రాష్ట్ర వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. లెండి కాలువల నిర్మాణానికి భూమి ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు పావలా వడ్డీ రాయితీని పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, కలెక్టర్ ప్రద్యుమ్న, బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్, మాజీ ఎమ్మెల్యే అరుణాతార తదితరులు పాల్గొన్నారు. -
పల్లెను వదిలేశారు
కామారెడ్డి, న్యూస్‌లైన్ : మొదటి విడత రచ్చబండ కార్యక్రమా న్ని గ్రామాల్లో నిర్వహించిన సర్కారు రెండో విడత కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే పరిమి తం చేసింది. నిలదీతలను తప్పించుకోవడం కోసం మూడో విడతలో కేవలం లబ్ధిదారులనే రప్పించాలని పథకం రచించారు. లబ్ధిదారుల కు ఎంట్రీ పాస్‌లు ఇచ్చారు. అయితే కొత్తగా ప్రభుత్వ పథకాల కోసం వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ప్రతి చోటా రచ్చబండ సభలు రసాభాసగా మారాయి. ‘బంగారుతల్లి’కి దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం మాచారెడ్డిలో నిర్వహించిన రచ్చబండకు ఓ తల్లి మూడు నెల ల పాపతో వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో తన కూతురును కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రభు త్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ఆ తల్లి కూతురిని కోల్పోయింది. రచ్చబండను నీరుగార్చడం వల్లే... ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన రచ్చబం డ లక్ష్యాన్ని దెబ్బతీయడం వల్లే ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. రచ్చబండలో దరఖాస్తు చేయడం కోసం వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాట ఓ చిన్నారిని పొట్టనపెట్టుకున్న సంఘటన అందరినీ వేదనకు గురి చేసింది. రచ్చబండలో దరఖాస్తులు ఇచ్చేందుకు వందలాది మంది తరలి వస్తుండడం, దరఖాస్తులు సమర్పించడం కోసం గంటల తరబడి బారులు తీరాల్సి రావడంతో తోపులాట జరుగుతోంది. అదే గ్రామాల్లో సభలు నిర్వహిస్తే ఇంత మంది ఉండరు. తక్కువ మంది వస్తే సమస్యలు చెప్పుకోవడానికీ అవకాశం ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రచ్చబండను గ్రామాల వారీగా నిర్వహించాలని కోరుతున్నారు. -
‘బంగారు తల్లుల’కు తిప్పలు
మంచాల, న్యూస్‌లైన్: బంగారుతల్లి పథకానికి ఎంపికైన మహిళలు రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచాల మండల కేంద్రంలో శుక్రవారం రచ్చబండ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 11.00 గంటలకే మంత్రి ప్రసాద్‌కుమార్ వస్తారని చెప్పడంతో మహిళలంతా గంట ముందుగానే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని 91మంది మహిళలు పడిగాపులు కాశారు. పిల్లలు ఆకలి బాధ తట్టుకోలేక ఏడుస్తున్నారని, ఏంచేయాలో తోచడం లేదని కొంతమంది అధికారులకు తమ ఇబ్బందులను తెలియజేశారు. మంత్రిగారు వచ్చేదాకా ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని అధికారులు చెప్పడంతో ఏడుస్తున్న పిల్లలను సముదాయిస్తూ మహిళలు అలాగే కూర్చుండిపోయారు. మంత్రిగారు తీరిగ్గా మధ్యాహ్నం 1.30గంటలకు వచ్చారు. తర్వాత మరో రెండుగంటల సేపు ప్రసంగాలు అవీ కొనసాగాయి. ఈ మధ్యలో సీపీఎం నాయకులు కాసేపు ఆందోళన చేయడంతో గొడవ జరుగుతుందేమోనని భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మహిళలకు బంగారుతల్లి పథకం మంజూరుపత్రాలు అందజేశారు. -
వైఎస్ ఆశయం మేరకే రచ్చబండ: ప్రసాద్‌కుమార్
మంచాల, న్యూస్‌లైన్: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. వైఎస్ ఆశయం మేరకు పేదలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. శుక్రవారం మంచాలలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. దేశ సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్, అలాగే బాలికల కోసం బంగారుతల్లి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చురుకుగా చర్యలు తీసుకుంటోందన్నారు. మైనింగ్ జోన్ రద్దు చేయాలి... కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ జోన్‌తో రైతులు, ప్రజలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రి ప్రసాద్‌కుమార్ లింగంపల్లి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే రూ.40లక్షలతో మంచాల-లింగంపల్లి రోడ్డు నిర్మా ణ పనులకు, తాళ్లపల్లిగూడలో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 758మందికి రేషన్‌కార్డులు, 633మందికి పింఛన్లు, 844 స్వ యం సహాయక సంఘాలకు రూ.42.31 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులు, 91మందికి బంగారుతల్లి పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. సీపీఎం నిరసన... రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు ఫొటో లేకపోవడంతో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభమవుతుండగా సీపీఎం జిల్లా నాయకులు పి.యాదయ్య, కె.జగన్, కె.శ్రీనివాస్ నాయక్, ఆర్.జంగయ్య, మండల పార్టీ కార్యదర్శి కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీన్ని గమనించిన మంత్రి ప్రసాద్‌కుమార్ వెంటనే లేచి ఎమ్మెల్సీ ఫొటో ఉంచనందుకు చింతిస్తున్నామని చెప్పడంతో సీపీఎం నాయకులు శాంతిం చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, ఆర్డీఓ సూర్యారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నాగమణి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
రచ్చబండలో సీఎం ఫొటోల రగడ
న్యూస్‌లైన్ నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం ఫోటోల దూమారం చెలరేగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా వర్నిలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీఎం బొమ్మతో రచ్చబండ జరపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనగా, ఎంపీ సురేష్‌షెట్కార్ సీఎం ఫ్లెక్సీని చింపివేశారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో అధికారులు వేదికపై సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా, టీఆర్ఎస్ నేతలు చెప్పులతో కొట్టి దహనం చేశారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో, పాలమూరు జిల్లాలో సీఎం ఫొటో వివాదాస్పదమయ్యాయి. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో సీఎం ఫొటోలను ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్యెల్యే గంగుల కమలాకర్ తొలగించి దహనం చేశారు. -
‘బంగారు తల్లి’ని బలితీసుకుంది
కామారెడ్డి, న్యూస్‌లైన్: ఆడబిడ్డను ఆదుకుంటామంటూ ‘బంగారు తల్లి’ పథకంపై సర్కారు ఇస్తున్న ప్రకటనలు, చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో గాని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు మాత్రం కడుపుకోత మిగిలింది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రచ్చబండ సందర్భంగా జరిగిన తోపులాటలో మూడు నెలల పసికందు మృతిచెందింది. మండలంలోని భవానీపేట తండాకు చెందిన లావుడ్య రాజు-రేణుకలకు మూడేళ్ల పాప మోక్ష ఉంది. చిన్నారిని ‘బంగారు తల్లి’ పథకంలో నమోదు చేయించేందుకు ఆ దంపతులు శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండకు వచ్చారు. అధికారులకు దరఖాస్తులు అందించేందుకు రేణుక చంటిబిడ్డతో పాటు వరుసలో నిలుచుంది. వరుసలో ఒకరినొకరు తోపులాడుకున్న సందర్భంలో రేణుక తన కూతురు మోక్షను కడుపులో దాచుకునే ప్రయత్నం చేసింది. ఊపిరాడని పరిస్థితుల్లో చిన్నారి కండ్లు తేలేయడంతో ఆందోళన చెందిన తల్లి తన కూతురు కదలడం లేదంటూ రోదించింది. వెంటనే 108 అంబులైన్స్‌లో చిన్నారిని కామారెడ్డిలోని చిన్నపిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య సేవలు ప్రారంభించిన కొద్దిసేపటికే మోక్ష కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు కళ్లముందే చనిపోవడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. తోపులాటకు కారణం: రచ్చబండ సభ ముగిసేంత వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించకపోవడంవల్లే తోపులాట జరిగిందని పలువురు ఆరోపించారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించే సమయానికి వందలాది మంది బారులు తీరారని.. మధ్యాహ్నం కావడంతో ఆకలి మంటతో ఉన్న జనం త్వరగా దరఖాస్తులు సమర్పించాలని భావించారని, ఈ క్రమంలో తోపులాట జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. తప్పుదారి పట్టించే యత్నం రచ్చబండ సందర్భంగా జరిగిన తోపులాటలో ఊపిరాడక మృతి చెందిన చిన్నారి మోక్షకు గుండె సంబంధ వ్యాధి ఉందని అధికారులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యులు మాత్రం పాపకు గుండె సంబంధిత సమస్య ఉందని నిర్ధారించలేదు. అధికారులను సస్పెండ్ చేయాలి సాక్షి, హైదరాబాద్: రచ్చబండ సందర్భంగా చిన్నారి మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
బట్టలూడదీసి కొడతా! : ఎమ్మెల్యే రత్నం
తెలంగాణ కోసం నేనూ ఆమరణ దీక్ష చేశా నేను తల్చుకుంటే మీ సంగతి తేలుస్తా రచ్చబండలో కాంగ్రెస్ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే రత్నం ఆగ్రహావేశాలు ఎమ్మెల్యే పరుషపదజాలంపై కాంగ్రెస్ నాయకుల నిరసన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ కిరణ్, చంద్రబాబుల ఫొటోల విషయమై ఇరువర్గాల వాగ్వాదం సహనం కోల్పోయిన చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం శంకర్పల్లి, న్యూస్‌లైన్: శంకర్‌పల్లిలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్, టీడీపీ నాయకుల వాక్బాణాలతో చినికి చినికి గాలివానలా మారింది. తెలంగాణ వ్యతిరేకి సీఎం ఫొటోను రచ్చబండలో ఎలా పెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నించగా.. తెలంగాణ విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలుచేస్తున్న చంద్రబాబు ఫొటోను శంకర్పల్లి గ్రామపంచాయతీ భవనంలో ఎలా ఉంచుతున్నారని.. స్థానిక ఎమ్మెల్యే రత్నం తెలంగాణ ద్రోహి అని.. చంద్రబాబు తొత్తుగా మారారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడంతో రచ్చబండ సభలో రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సభలోనే ఉన్న ఎమ్మెల్యే రత్నం కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకదశలో సహనం కోల్పోయి పరుష పదజాలంతో దూషణల పర్వానికి దిగారు. కాంగ్రెస్ నాయకులారా ఖబడ్డార్.. బట్టలూడదీసి కొడతా నా కొడకల్లారా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. గురువారం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన రచ్చబండ ప్రారంభంలోనే టీడీపీ నాయకులు జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ సభా వేదికపైకి దూసుకెళ్లారు. తెలంగాణ వ్యతిరేకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ డౌన్‌డౌన్ అంటూ ఆయన ఫొటోతో ఉన్న బ్యానర్‌ను లాగేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే కాంగ్రెస్ జిందాబాద్.. రెండుకళ్ల చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి లేచి మేం కూడా తెలంగాణవాదులమే.. ముఖ్యమంత్రి బొమ్మ పెట్టొద్దంటున్నారు సరే... తెలంగాణ విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్న చంద్రబాబును శంకర్పల్లి గ్రామపంచాయతీలో ఎలా పెడతారని.. వెంటనే ఆ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. సమైక్యవాది చంద్రబాబు తొత్తు ఎమ్మెల్యే రత్నం తెలంగాణ ద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన రత్నం.. కాంగ్రెస్ నాయకుల్లారా ఖబడ్డార్.. బట్టలూడదీసి కొడతా నా కొడకల్లారా.. తోలుతీస్తా నేనెందుకైతరా తెలంగాణ ద్రోహిని నా కొడకల్లారా.. తెలంగాణ కోసం చేవెళ్ల గడ్డమీద ఆమరణదీక్ష చేసిన.. మీకు బుద్ధి ఉందా.. సిగ్గూశరం లేదా.. నేను దళిత ఎమ్మెల్యేను.. నేను తలుచుకుంటే మీ సంగతి తేలుస్తా.. అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు అదే తీరున ఆగ్రహం వ్యక్తచేస్తూ ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకొని నిరసనకు దిగారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధులు వాడరాని భాష వాడుతున్న రత్నం ఒక ఎమ్మెల్యేనా సిగ్గు సిగ్గు అంటు నినాదాలు చేశారు. వాడుక భాష బాగాలేని ఎమ్యెల్యే శాసనసభలో ఉండటానికి అర్హత లేదంటూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరుష పదజాలంతో దూషించిన ఎమ్యెల్యే రత్నం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగించింది. కార్యక్రమం కొనసాగింది. -
రచ్చబండ సమీక్షా..? పార్టీ సమావేశమా..?
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ :రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, తనపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రచ్చబండను జిల్లా మంత్రి బొత్స తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రచ్చబండ ఫలాల పేరిట పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో నిర్వహించిన రచ్చబండ సమీక్ష ఆ దిశగానే సాగించారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో అందించాల్సిన సేవల నిర్వహణపై సమీక్షించాల్సి ఉండగా దానిని కాదని కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో పార్టీ కేడర్ పని చేయూల్సిన విధి విధానాలపై సమీక్షించారు. వార్డుల వారీగా బాధ్యతలను నిర్దేశించారు. వార్డుల్లో ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతను చల్లార్చి తిరిగి కాంగ్రెస్ వైపు ఓటర్లను ప్రభావితం చేసేలా పని చేయూలని పరోక్షంగా ఉపదేశించారు. అసంతృప్తితో ఉన్న దిగువ స్థారుు కేడర్‌ను వలలో వేసుకునేందుకు రచ్చబండ విన తుల స్వీకరణ, మంజూరైన సౌకర్యాలను లబ్ధిదారులకు వార్డుల్లో నేరుగా పంపిణీ చేయూల్సిన బాధ్యతలను అప్పగించేలా చర్యలు తీసకున్నారు. తద్వారా వార్డుల్లో ప్రజలను తిప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో పలువురు మాజీ కౌన్సిలర్లు తమ వార్డుల పరిధిలోని సమస్యలను మంత్రి బొత్సకు విన్నవించుకున్నారు. ఇలా సమస్యలు చెప్పిన వారిలో 14, 15, 16, 35 వార్డుల మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే రచ్చబండ సమీక్ష సమావేశం పేరిట పిలిపించి కాంగ్రెస్ నేతలతో సమీక్షించడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఏమి చేయూలో పాలుపోని పరిస్థితుల్లో అసంతృప్తిగానే ఉండాల్సి వచ్చింది. చేసేది లేక మంత్రి మాటలకు అధికారులు తలలూపాల్సి వచ్చింది. -
టెక్కలిలో ‘రచ్చ’బండ
టెక్కలి, న్యూస్‌లైన్:టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చయింది. కేంద్ర మంత్రి కృపారాణితో పాటు టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి పాల్గొన్న ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఉదయం నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పలేదు. కార్యక్రమం ప్రారంభమవడంతో ఒక్కసారిగా లబ్ధిదారులంతా వేదికవద్దకు దూసుకుపోయారు. వేదికపైనున్న కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించుకోవాలనుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా కృపారాణి డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేశారు. పేదల కష్టాలు తక్షణమే తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన లబ్ధిదారులంతా వేదిక ముందు బైఠాయించారు. సంక్షేమ పథకాల కోసం వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ బాధలను చెప్పుకునేందుకు వస్తే పోలీసులు నెట్టివేస్తున్నారంటు మండిపడ్డారు. గతంలో రచ్చబండలో ఇచ్చిన దరఖాస్తులకు ఇప్పటికీ మోక్షం కలుగలేదని కేకలు వేశారు. ఇదిలా ఉండగా దరఖాస్తులు స్వీకరణ వద్ద కేంద్ర బలగాలకు చెందిన పోలీసులు అత్యుత్సాహంతో లబ్ధిదారులను నెట్టివేశారు. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకదశలో మంత్రి వేదిక దిగి కిందకు వచ్చారు. మళ్లీ కొద్దిసేపటికే వేదిక మీదకు వెళ్లి ప్రసంగించారు. సంక్షేమ పథకాల పంపిణీని రచ్చ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో కేవలం పసుపు చొక్కా కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందజేశారని విమర్శించారు. అలాంటి నీచ రాజకీయాలు చేయకుండా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు అందజేశారు. టెక్కలి మండలానికి సంబంధించి 1086 ఇందిరమ్మ ఇళ్లు, 469 పింఛన్లు, 2409 రేషన్ కార్డులు, 44 బంగారు తల్లి పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెహరా కృష్ణవేణి, డీసీసీబీ డెరైక్టర్ ధవళ కృష్ణ, హౌసింగ్ ఈఈ ఎన్.గణపతిరావు, తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, వ్యవసాయ శాఖ ఏడీ చంద్రరరావు, ఎంపీడీఓ రాజులుతో పాటు కాంగ్రెస్ నాయకులు కె.రామ్మోహనరావు, పి.ఆనంద్, గుప్తా, విశ్వనాథం, లక్ష్మీపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బొత్స రచ్చబండ రాజకీయం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్:‘ఒరేబాబూ కాస్త ఆగరా..నీపనిచేసి వెళ్తాను. మీసమస్యలు తీర్చ డానికే వచ్చాను. ఇతగాడికి కార్డుఎందుకు ఇవ్వలేదు సమస్యేంటి..’అంటూ సామాన్యుడి తరఫున వకాల్తా పుచ్చుకున్న రాష్ట్ర రవాణా శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ లక్కవరపుకోటలో బుధవారం జరిగిన రచ్చబండలో తన మార్కు మ్యాజిక్ చేశారు. సభలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, రచ్చబండ ఆహ్వాన కమిటీ స భ్యురాలు తూర్పాటి వరలక్ష్మి మాత్రమే నాలు గు మాటలు మాట్లాడారు. మంత్రి బొత్స వన్‌మేన్ షో చేసి అన్నీ తానై వ్యవహరించి రచ్చబండ సందర్భంగా తాజాగా జారీ చేసిన కార్డు లు, పింఛన్లు, ఇళ్ల వివరాలు అధికారులచే చెప్పించారు. లబ్ధిదారులను పిలిచి ‘ఎప్పుడు ధరఖాస్తు పెట్టావు. ఎన్నాళ్ల నుంచి తిరుగుతున్నావ్..’అని అడిగి సమాధానాలు రాబట్టారు. నాలుగేళ్లుగా ఉన్న మీ ఇబ్బందుల్ని తీర్చాం. ఇప్పుడున్న జాబితాలో రాకుండా మిగిలిపోయిన అర్హులు ఎవ్వరున్నా కార్డులు, పింఛన్లు, ఇళ్లు అన్నీ జనవరిలోగా ఇచ్చేస్తామంటూ పదే పదే చెప్పారు. మంత్రి బొత్స మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు గతంలో రూ.40వేలు ఇస్తే, ఇప్పుడు రూ.80 వేలు నుంచి రూ.1,10,000 లుకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ కులస్థుల విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని, బంగారుతల్లి పథకంతో ఆడపిల్లలకు భద్రత ఇచ్చామని చెప్పారు. జిల్లా అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులెవ్వరికీ మాట్లాడే ఛాన్స్ రాలేదు. రచ్చబండ వేదికపై ముందు వరుసలో కలెక్టర్ మినహా ఇతర జిల్లా అధికారులెవ్వరికీ చోటు దక్కలేదు. ఆర్డీఓ వెంకటరావు, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితర అధికారులు, మండల అధికారులు వెనుక వరుసకే పరిమితమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమం అయిన రచ్చబండ వేదిక కాంగ్రెస్ తాజా మాజీలతో నిండిపోయింది. బొత్స ఈ ధపా ఎస్.కోట నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు, ప్రజాభిమానం కూడగట్టటానికే ఇలా నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారంటూ పలువురు చర్చించుకున్నారు. గడిచిన నెల రోజుల్లో మంత్రి బొత్స వేపాడలో నాలుగుసార్లు, ఎస్.కోటలో ఒకసారి, జామిలో రెండుసార్లు, లక్కవరపుకోటలో మూడుసార్లు, కొత్తవలసలో మూడు సార్లు పర్యటించారు. 22న జామి, కొత్తవలసలలో జరిగే రచ్చబండకు, 25న ఎస్.కోటలో జరగనున్న రచ్చబండ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మొత్తంగా సత్తెన్న రచ్చబండ సాక్షిగా రసవత్తర రాజకీయం సాగిస్తున్నారు. బుధవారం నాటి రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, లక్కవరపుకోట సర్పంచ్ సంఘం నాగమణి హాజరు కాలేదు. -
రారా.. తేల్చుకుందాం!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ప్రజాసమస్యలను చర్చించి పరిష్కారం చూపాల్సిన రచ్చబండ కార్యక్రమం నాయకుల కొట్లాటకు వేదికగా మారింది. తాము ప్రజలకు జవాబుదారిగా ఉండాలనే విషయాన్నే మరిచిపోయి బూతుపురాణం మొదలుపెట్టారు. ‘నీవెంత అంటే నీవెంత’ అంటూ ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. ‘రారా.. తేల్చుకుందాం!’ అని తొడగొడుతూ ఫ్యాక్షన్ సినిమా సీన్‌ను తలపించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారంతా నిశ్చేష్టులై వెనుదిరిగారు. సభావేదిక అరుపులు కేకలతో దద్దరిల్లింది. వెరసి ప్రజాప్రయోజన కార్యక్రమం రణరంగంగా మారింది. సోమవారం మండల కేంద్రమైన నర్వలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాహాబాహీకి దిగారు. పత్రికల్లో రాయలేని భాష వాడుతూ ‘రారా తేల్చుకుందాం’ అంటూ ఒకరిపై మరొకరు గట్టిగా కేకలు వేయడంతో ప్రజలు అక్కడినుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ విడత రచ్చబండ కార్యక్రమంలో అధికారపార్టీ ఆమోదముద్రతో ముగ్గురు సభ్యులను ఎంపికచేసి వారు మాత్రమే వేదికపై కూర్చొనే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నర్వలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నియమించిన సభ్యులతో మాట్లాడించే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డిపై తిరగబడ్డారు. అంతటితో ఆగకుండా నర్వలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు సమాచారం ఇవ్వడంతో ఆయన తన అనుచరులతో వేదిక వద్దకు వచ్చి నానా బీభత్సం సృష్టించారు. దీంతో అక్కడ కొద్దిసేపు యుద్ధవాతావరణ ఏర్పడింది. సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్, కుర్చీలు, చెప్పులు గాల్లో లేచాయి. దాదాపు గంటన్నర పాటు ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ దాడులకు తెగబడ్డారు. చేయిదాటే పరిస్థితి కనిపించడంతో ఆత్మకూరు సీఐ గోవర్దన్గిరి, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ ఇద్దరు నేతలు రాజకీయం చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంతో ప్రజలు అసహనం వ్యక్తంచేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆత్మకూరులో అదేతీరు! అంతకుముందు ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభకు హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు పరస్పరం గొడవపడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. తోపులాటలో సాక్షాత్తు మక్తల్ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్రిసభ్య కమిటీ పేరుతో కాంగ్రెస్ తరఫున ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన పేర్లనే కమిటీ సభ్యులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ సభ్యులను వేదికపైకి పిలవాలని మాజీ ఎమ్మెల్యే తన వర్గీయులతో కలిసి పట్టుబట్టడంతో ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి ససేమిరా అన్నారు. తాను ప్రతిపాదించిన వారిపేర్లు ఏమయ్యాయని అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేతలు సూచించిన వారిని వేదికపైకి పిలిచేది లేదంటూ ఎమ్మెల్యే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ వర్గీయులు ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాలవారు ఘర్షణకు దిగారు. - అలాగే మాడ్గులలో త్రిసభ్య కమిటీ సభ్యులను మాత్రమే వేదికపైకి ఆహ్వానించి మిగిలిన సర్పంచ్‌లను పట్టించుకోకపోవడంతో పలువురు సర్పంచ్‌లు ఆగ్రహంతో ఊగిపోయారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను వేదికపైకి ఆహ్వానించాలంటూ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లుగౌడ్తో మిగిలిన వారు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీని రద్దుచేయాలని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసంచేశారు. అప్పటికే వేదికపై ఉన్న టీడీపీ ఎమ్మెల్యే జి. జైపాల్‌యాదవ్‌తో మిగిలిన ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఉన్నా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. -
నిరసనలు.. నిలదీతలు
సాక్షి, కొత్తగూడెం : ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి నిరసన సెగ తగులుతోంది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుండడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిలదీతలు.. నిరసనలు..లబ్ధిదారుల ఆందోళనలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీకోసం జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు రెండో విడత రచ్చబండలో చేసుకున్న దరఖాస్తులపై అధికార యం త్రాంగం స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 52 రచ్చబండ సభలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 11 నుంచి 18 వరకు పది సభలను అధికారులు నిర్వహించారు. టేకులపల్లి, వాజేడు, వీఆర్‌పురం, చింతూరు, గుండాల, సత్తుపల్లి, పినపాక, గార్ల, పాల్వంచ, కొణిజర్లలో ఈ సభలు ముగిశాయి. తొలిరోజు సభ నుంచే నిరుపేదల నిరసనలు హోరెత్తాయి. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ లబ్ధిదారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీసి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ సభల్లో 1,13,928 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పింఛన్ల కోసం 29 వేల మంది, రేషన్‌కార్డుల కోసం 65వేల పైచిలుకు నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు వారికి లబ్ధి చేకూర్చడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈ సభలో ఇవే ప్రధాన సమస్యలుగా అర్హులైన వారు ప్రశ్నిస్తుండడంతో అధికారులు మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రజానిధులు మాత్రం గతంలో రచ్చబండల మాదిరి మళ్లీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా.. గతంలో దరఖాస్తుల సం గతి తేల్చాలని నిరుపేదలు ఎక్కడికక్కడ నిల దీస్తుండడంతో చేసేదేమీ లేక త్వరలో అందరికి లబ్ధి చేకూరుతుందని చెప్పుకుంటూ వేదిక దిగి పోతున్నారు. సభలకు ఆర్భాటంగా వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఊహించని రీ తిలో వస్తున్న నిరసనలను చూసి త్వరగా సభలు ముగించుకుంటూ మమ అనిపిస్తున్నా రు. సంక్షేమ పథకాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ సభల్లో అవకా శం ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల పోలీసు బం దో బస్తుతో సభలు నిర్వహించి ప్రజాసమస్యల ను ప్రభుత్వం పక్కన పెడుతుండడం గమనార్హం. కన్నెర్ర చేస్తున్న రైతన్న ఇటీవలి తుపానుతో అపారనష్టం జరిగి పంటలు చేతికందకుండాపోయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదని, అలాంటిది ఈ సభలెందుకని రైతులు నిరసనగళం వినిపిస్తున్నారు. గతంలో పంట నష్టం జరిగినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు సభలు పెట్టిం ఏంచేస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం కొణిజర్లలో రైతులు ఇదే విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, తుపానుతో నష్టపోయిన పంటలకు సంబంధించి తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ రైతులు ఆందోళన చేశారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదంటూ రైతులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా రైతుల నుంచి నిరసనలు ఎదురవుతుండడం, ఇంకా 42 సభలు ఉండడంతో ఏం సమాధానం చెప్పాలో అని అధికారులు తలపట్టుకుంటున్నారు. టీడీపీ నేతల ఫ్లెక్సీల జగడం.. ప్రజా సమస్యలు విని, అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేతలు రచ్చబండ సభల్లో తమ పార్టీ ప్రజాప్రతినిధుల ఫోటోలు పెట్టడం లేదంటూ అధికారులతో జగడం చేస్తున్నారు. కొణిజర్లలో నిర్వహించిన రచ్చబండ సభ వేదిక పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోటో పెట్టలేదని.., సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మండల నాయకులు వేదికపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే పాల్వంచ రచ్చబండ సభ ఫ్లెక్సీలో నామా ఫోటోలేదని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించాలని పాల్వంచలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘రచ్చ’బండ
పెద్దకడబూరు, న్యూస్‌లైన్ : పెద్దకడబూరులో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ..రచ్చగా మారింది. గ్రామాల నుంచి వచ్చిన వారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సభాప్రాంగణంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడం.. కార్యక్రమ రూపకర్త అయిన ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహించారు. ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. రచ్చబండ ద్వారా 1265 రేషన్‌కార్డులు, 1349 పక్కాగృహాలు, 246 పింఛన్లు, 89 బంగారుతల్లి, 696 విద్యుత్ మీటర్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆయా గ్రామాల నుంచి 3645 మంది లబ్ధిదారులతో పాటు కొత్తగా దర ఖాస్తులు ఇచ్చేందుకు మరో వెయ్యి మంది రచ్చబండకు హాజరయ్యారు. అయితే అధికారులు 200 మందికి మాత్రమే ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వచ్చిన ప్రజలు వేదిక ఎదుట గుమిగూడడంతో గందోరగోళ పరిస్థితి నెలకొంది. రచ్చబండ పోస్టర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం లేకపోవడం కూడా ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి తన అనుచరులతో ఆందోళనకు దిగారు. దానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి అడ్డు చెప్పడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల ప్రత్యేక అధికారి లక్ష్మా విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం కొనసాగించారు. అధికారపక్ష నేతలు రవిచంద్రారెడ్డి, తిక్కన్న, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రమాకాంతరెడ్డి వ్యక్తిగత ప్రసంగాలతో ఒకరినొకరు దూసించుకున్నారు. ఒక్కసారిగా ఇరువర్గాల అనుచరులు వేదికపైకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కుర్చీలను విరగొట్టారు. ఎస్ఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాల వారినీ చెదరగొట్టారు. అయితే వందలాది రూపాయలు ఖర్చు చేసుకుని వస్తే కాంగ్రెస్ నేతల నిర్వాహకంతో నోట్లో మట్టిపడిందని వృద్దులు, వికలాంగులు, వితంతువులు శాపనార్ధలు పెట్టారు. -
రెండునాళ్ల ముచ్చట
సాక్షి, రాజమండ్రి :‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’- తెలుగు సినిమాలకు వాటి పేర్ల కింద తగిలిస్తున్న ఉపశీర్షికల్లా.. మూడవ విడత ‘రచ్చబండ’కు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తగిలించిన వ్యాఖ్య ఇది. అయితే పేరులో ఎంత ఆర్భాటం ఉన్నా..కథ, కథనాల్లో పస లేని సినిమా ఫ్లాపయినట్టు.. రాజమండ్రిలో రచ్చబండ కార్యక్రమం తుస్సుమంది. రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చే 41 అర్బన్ డివిజన్లు, తొమ్మిది రూరల్ డివిజన్లకు కలిపి కేవలం రెండు రచ్చబండలు మాత్రమే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. పట్టుమని రెండు రోజులు కూడా జరగని ఈ తంతులో కూడా నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వినిపించలేదు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వస్తున్నారు కాబట్టి ఓ సభ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తున్నారు కాబట్టి మరో పెద్ద సభ అన్నట్టుగానే నగరంలో రచ్చబండ జరిగింది. రాష్ట్రంలో అది చేశాం, జిల్లాకు ఇది చేస్తాం అంటూ అటు ముఖ్యమంత్రి, ఇటు పితాని డంబాలు పలికారు, అంతే తప్ప వివిధ పథకాలకు సంబంధించిన స్థానిక లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయకుండా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం కన్నా గత ఏడాది మంజూరైన వాటిని అందచే సేందుకే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ విమర్శలకే పరిమితం.. జిల్లాలో ఈనెల 11 నుంచి 26 వరకూ రచ్చబండ కార్యక్రమాలు సాగుతాయని కలెక్టర్ ప్రకటించారు. వాస్తవానికి ప్రతి రెండు, మూడు డివిజన్లకొక రచ్చబండ నిర్వహించాల్సి ఉంది. కనీసం ఐదు డివిజన్లకో రచ్చబండైనా నిర్వహించకుండా రెండే రెండింటితో సరిపుచ్చడం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ నెల 12న పుష్కరాల రేవు వద్ద నిర్వహించిన తొలి రచ్చబండకు ఆర్ అండ్ బి మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం తన రాజకీయ విమర్శలకే పరిమితం చేశారు. ‘మీకు మంజూరైన కార్డులు, పెన్షన్లు మంత్రిగారు అంద చేస్తారు’ అని జనాన్ని పిలిచిన అధికారులకు కూడా మంత్రి వ్యవహార శైలి ఇబ్బంది కలిగించింది. అసలే ఆలస్యంగా వచ్చిన మంత్రి జనం సమస్యల గురించి కాక ఇతర విషయాలు మాట్లాడి, తీరా అసలు కార్యక్రమానికి వచ్చేసరికి ఓ నలుగురికి మంజూరు పత్రాలు అందచేసి చక్కా వెళ్లిపోయారు. మొత్తం 11 డివిజన్లకు నిర్వహించిన ఈ సభలో డివిజన్ల వారీ సమస్యలు చర్చకు రాలేదు. కొత్తగా ఎవరికి ఏం కావాలో అడగలేదు. దీంతో ఎంతో ఆశతో వచ్చిన జనం తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. ‘సమైక్య’ ప్రచారానికే ప్రాధాన్యం.. ఈ నెల 16న సుబ్రహ్మణ్య మైదానంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరైన రచ్చబండ కూడా అదే తంతుగా జరిగింది. తాను సమైక్యవాదినని, రాష్ట్ర సమైక్యత కోసం ఎంతకైనా సిద్ధమని చెప్పుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని సీఎం ప్రజల సమస్యలపై మాట్లాడడానికి ఇవ్వనేలేదు. వాస్తవంగా ఈ కార్యక్రమం 39 డివిజన్ల లబ్ధిదారులను ఉద్దేశించి పెట్టినా మొత్తం 50 డివిజన్ల వారినీ పిలిచారు. సుమారు 25 స్టాళ్లు పెట్టి రచ్చబండలో మంజూరైన ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇక్కడే ఇచ్చేస్తామంటూ ప్రచారం చేశారు. అదే ఊరింపుతో లబ్ధిదారులను సభకు తరలించారు. తీరా సీఎం వెళ్లిపోయాక ‘మీ రేషన్ కార్డులు, కూపన్లు డిపోలకు వస్తాయి. పెన్షన్ల కోసం సంబంధిత అధికారులను సంప్రదించండి’ అంటూ చేతులు దులుపుకొన్నారు. ఎక్కడ ‘రచ్చ’ అవుతుందోననే.. నగరంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న పలువురు మాజీ కార్పొరేటర్లు తమ వర్గీయులకు రచ్చబండలో లబ్ధి చేకూర్చడం లేదని ఆగ్రహంగా ఉన్నారు. చాలా కాాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరుకాకపోవడం, గత ఏడాది మంజూరైన కార్డులను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో సంగతి తేల్చుకుందామని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారులను నిలదీసేందుకు వివిధ రాజకీయ పక్షాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో డివిజన్లలోకి వెళ్లి రచ్చ చేసుకోవడం కన్నా పోలీసు పహారాలో మంత్రితో ఓ సభ, ముఖ్యమంత్రితో మరోసభ నిర్వహించి ‘మమ’ అనిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తమ సమస్యలు చెప్పుకుందామని, పథకాల ప్రయోజనం పొందుదామని గంపెడాశలు పెట్టుకున్న జనానికి నిరాశే మిగిలింది. -
రచ్చ..బండ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అనుకున్నదొక్కటి... అయిందొక్కటి.. అన్న చందంగా తయారైంది రచ్చబండ పరిస్థితి. ప్రజలకు తాము ఎంతో చేశామని, చేస్తున్నామని ప్రచారం చేసుకునేందుకు తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం కాస్త రచ్చ రచ్చ అవుతోంది. ప్రభుత్వానికి ఉన్న కాస్త పరువును గంగలో కలిపేస్తోంది. సంక్షేమ పథకాల పంపిణీ వేది కగా రచ్చబండను మార్చేసిన పాలకులకు అదే ఎదురు తన్నింది. కొత్తగా మంజూరు చేస్తున్నవేవీ లేకపోవడంతో అర్జీదారులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల జాబితాలు తీసుకొచ్చి రచ్చబండలో పంపిణీ చేసినట్లు పాలకులు గొప్పలు చెప్పుకొంటున్నారు. వాస్తవానికి ఇవి సాధారణంగా ఎప్పటికప్పుడు జరగాల్సిన కార్యక్రమాలే. ఇదే విషయాన్ని లబ్ధిదారులు, అర్జీదారులు ఎత్తిచూపుతున్నారు. దీని వల్ల రచ్చబండకు రావడం వల్ల కొత్తగా ఒనగూడే ప్రయోజనం ఏమీ కనిపించడంలేదని అంటున్నారు. దాంతో కొత్తగా తామేదో చేశామని చెప్పుకునేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని ఐదు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. రాజాం నియోజవకర్గంలోని సంతకవిటి, వంగర, రాజాం, రేగిడి మండలాల్లో ఈనెల 13, 14 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు హాజరైన మంత్రి కోండ్రు మురళీ మోహన్‌కు సమైక్య సెగ తగిలింది. మంత్రిస్థాయిలో ఆయన కూడా కొత్తగా హామీలు ఇవ్వకపోగా సొంత ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలు అడిగిన పనులు చేయాల్సింది పోయి సొంత డబ్బా కొట్టుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. దివంగత వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనైనా సక్రమంగా అమలు చేయడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శిస్తున్నారు. జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన దారిలోనే పయనిస్తున్నారు. శనివారం వీరఘట్టం, ఆమదాలవలసల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాలకు ఎంతో ఆశతో వచ్చిన అర్జీదారులు అక్కడి ఏర్పాట్లు, అధికారుల తీరుతో అసహనానికి గురయ్యారు. తొక్కిసలాట, గందరగోళం తప్ప రచ్చబండ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. రచ్చబండలోనూ అదే వైఖరి అవలంభిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని వారికి నేరుగా చెబుదామనుకుంటే వేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారు చెప్పింది వినడం తప్ప.. ప్రజలు చెప్పేవి నాయకులు వినే పరిస్థితులు లేవని అంటున్నారు. ఇన్ని కష్టాలు పడి, తొక్కిసలాడుకుని అర్జీలు ఇచ్చేకంటే ప్రతి వారం జరిగే గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు ఇస్తే సరిపోతుంది కదా.. అని వ్యాఖ్యానిస్తున్నారు. -
రాజకీయ వేదికగా రచ్చబండ
అలంపూర్, న్యూస్‌లైన్: శనివారం అలంపూర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలవడాన్ని టీడీపీ, సీపీఎం నాయకులు తప్పుబట్టారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారిం ది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నేతలు ఆంజనేయులు ఆధ్వర్యంలో ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని కళాశాల గేటు వద్ద అడ్డుకున్నారు. తాము కేవలం పార్టీ తరఫున స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిప్రతం మాత్రమే అందించి వెళ్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. సీపీఎం నాయకులు సైతం వారికి మద్దతు తెలుపుతూ వినతిపత్రం అందజేయడానికి అనుమతించాలని కోరారు. కానీ పోలీసులు ససేమిరా అనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తహశీల్దార్ అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రజాసమస్యలను ప్రస్తావించడానికి వచ్చిన తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిం చారు. రచ్చబండ ఎందుకు కోసం పెట్టారని నిలదీశారు. చివరికి నలుగురు మాత్రమే రావాలని తహశీల్దార్ సూచించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో 13 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమం అనంతరం విడిచిపెట్టారు. అరెస్ట్‌ను నిరసిస్తూ పట్టణంలోని గాంధీచౌక్‌లో టీడీపీ, సీపీఎం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
రాజకీయ రచ్చబండ
సాక్షి, రాజమండ్రి :‘పథకాల లబ్ధి పంచుతామని పిలిచారు. ప్రసంగాలతో సరిపుచ్చి పంపారు’ ఇదీ రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం పాల్గొన్న రచ్చబండకు హాజరైన జనం నిష్టూరంగా అనుకున్న మాట. నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన రచ్చబండకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సిన సీఎం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి 5.15 గంటలకు సుబ్రహ్మణ్య మైదానం చేరుకునే సరికి సభా ప్రాంగణంలో ఒక్క కార్యకర్త కూడా లేడు. దీంతో అధికారులు మైదానం ప్రధాన ద్వారం వద్దకు పరుగున వెళ్లి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం వేదికనెక్కి జనానికి అభివాదం చేసే దాకా ఆయన వచ్చారన్న విషయమే తెలియలేదు. ముఖ్యమంత్రి ప్రసంగానికి సభలో కనీస స్పందన కూడా లభించక పోవడంతో రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తారు. ‘నేను, ఇక్కడున్న వాళ్లంతా అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంపై బాంబు పడబోతోంది. దాన్ని తప్పించాలని నావంతు కృషి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. అయినా జనంలో ఆసక్తి కనిపించకపోవడంతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపైకి దృష్టి మళ్లించారు. జిల్లాలో నీలం తుపాను బాధితులైన మూడు లక్షల మంది రైతులకు రూ.139 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశామని, ఇప్పటికే 90 శాతం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయ్యాయని, 1,63,000 మంది రైతులకు రూ.212 కోట్ల పంటల బీమా చెల్లించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దమ్మున్న సీఎం అంటూ రౌతు అధ్యక్షోపన్యాసంలో ఆకాశానికెత్తగా, సీఎంను ఖడ్గతిక్కన్నగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అభివర్ణించారు. ఇక మంత్రి తోట నరసింహం అభివృద్ధి అంతా కిరణ్‌కే సాధ్యమని కీర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే చందన రమేష్ జిల్లాలో రోడ్ల దుస్థితిని ప్రస్తావించగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటే అది ఎమ్మెల్యే వైఫల్యం అంటూ కందుల విమర్శించారు. ఇలా రచ్చబండ కార్యక్రమం కొంతమేర రాజకీయ ‘రచ్చ’గా సాగింది. స్టాల్స్ మూయించి సభలో కూర్చోబెట్టారు రచ్చబండకు కొద్దిగా హాజరైన జనం కూడా సీఎం రావడానికి ముందు స్టాళ్ల వద్ద రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల కోసం బారులు తీరారు. సీఎం రాగానే స్టాళ్లను మూయించి జనాన్ని కుర్చీల్లో కూర్చోబెట్టాలని మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ ఆదేశించడంతో పోలీసులు అలాగే చేశారు. దీంతో లబ్ధిదారులు ‘ఈ సభ ఎందుకు? మాకు పథకాలు ఇవ్వడానికా? ప్ర సంగాలు వినడానికా?’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 6.20 గంటలకు సభ ముగిశాక జనం స్టాళ్ల ముందు క్యూలు కట్టారు. సభకు రాని ఉండవల్లి, బలశాలి, శ్రీఘాకోళ్లపు ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ బలశాలి ఇందిర, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం సభకు దూరంగా ఉన్నారు. తాను పార్టీకి రాజీనామా చేశానని ఉండవల్లి గైర్హాజరు కాగా ఎమ్మెల్యే తనకు కావల్సిన ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చి మిగిలిన వారికి సముచితంగా సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ శ్రీఘాకోళ్లపు వర్గం సభను బహిష్కరించింది. ముందుగా సభలో ఫ్లెక్సీలు కూడా కట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గైర్హాజరయ్యారని తెలిసింది. కాగా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని గతంలో తాను విన్నవించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్న కినుకతోనే ఇందిర రానట్టు తెలిసింది. మొత్తమ్మీద సభలో పార్టీ కార్యకర్తలే కరువై వారు చేయాల్సిన పనులు కూడా అధికారులే చేసి సభ అయ్యిందనిపించారు. పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిన సభలో పది మందికి కూడా మంజూరు పత్రాలు ఇవ్వకుండానే సీఎం వెనుతిరిగారు. మహిళ ఆత్మహత్యాయత్నం కాగా, సీఎం సభ వద్ద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన కలిగుడ్ల గిరికుమారి అనే మహిళ తన చీరను మెడకు బిగించి ఆత్మహత్యాయత్నం చేసుకోబోవడం కలకలం రేపింది. ప్రసంగం ముగించుకొని వేదిక దిగు తుండగా సీఎంను కలిసేందుకు ఆమె యత్నిం చింది. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అడ్డుకో వడంతో ఆత్మహత్యా యత్నం చేసుకోబో యింది. అది గమనించిన సీఎం అర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద తనను కలవాలని సూచించారు. తాను పేగు ఒరుపు, వెన్ను సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, హైదరాబాద్, చెన్నై ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేదని చెప్పింది. ఇప్పటికే రూ.10 లక్షల ఖర్చయిందని చెప్పింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తనను ఆదుకోవాలని వేడుకొంది. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చును మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా.. ముఖ్యమంత్రి సాయంత్రం 3.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్థలంలో రూ.9.88 కోట్లతో నిర్మించిన ఐహెచ్ఎస్డీపీ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. కాగా ఉదయం నుంచి పడిగాపులు పడితే సీఎం నలుగురికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చి వెళ్లిపోయారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సీఎం ఆర్ట్స్ కళాశాల మైదానం చేరుకుని రూ.3.30 కోట్లతో నిర్మించే సంక్షేమ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సుబ్రహ్మణ్య మైదానంలో రచ్చబండ సభలో పాల్గొన్నారు. మహిళలకు అర్బన్ ఐకేపీ మంజూరు చేసిన రూ.6.21 కోట్లు, రూరల్ ప్రాంతంలో ఐకేపీ మంజూరు చేసిన రూ.3.47 కోట్ల రుణాలు అందచేశారు. 8,604 మందికి రేషన్ కార్డులు, 2028 మందికి వివిధ పింఛన్లు, 800 మందికి గృహాలు, ఎస్సీ, ఎస్టీలు 3900 మందికి రూ.2.70 లక్షలు విద్యుత్తు చార్జీల బకాయిలు చెల్లించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యేలు చందన రమేష్, రౌతు సూర్యప్రకాశరావు, కె.కాశీ విశ్వనాథ్, కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, రాజా అశోక్‌బాబు, వంగా గీత, పాముల రాజేశ్వరీదేవి, ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ, శివకుమారి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచ్చబండ అనంతరం ఆర్ అండ్ బి అతిథిగృహం చేరుకున్న సీఎం అక్కడి నుంచి ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుల వివాహ రిసెప్షన్‌కు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. తిరిగి ఆర్ అండ్ బి అతిథిగృహం చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. -
'రచ్చబండను దుర్వినియోగం చేస్తున్న సీఎం'
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దుర్వినియోగపరుస్తున్నారని టి. కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... సీఎం కిరణ్ కు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత రాజీకీయాలు చేయాలని సీఎం కిరణ్‌కు జీవన్‌రెడ్డి హితవు పలికారు.ప్రజా సమస్యల పరిష్కరానికి ఏర్పాటు చేసిన రచ్చబండను రాజకీయ వేదికగా చేసుకోవడం ఎంతవరకు సబబు అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సీఎం సొంత జిల్లాకు రూ.5,800 కోట్లు: హరీష్‌రావు
సిద్దిపేట: ప్రజాధనంతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం విద్వేష పూరిత ప్రసంగాలతో రాజకీయం చేయడం ఏమిటని కిరణ్కుమార్రెడ్డిపైటీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టమంటూ విశాఖ జిల్లాలో జరిగిన రచ్చబండలో సీఎం వ్యాఖ్యానించడం దొంగే.. దొంగ దొంగ.. అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పదవిపై వ్యామోహం లేదనే భావన ప్రజల్లో కలిగించేందుకు ప్రయాస పడేకన్నా...సీఎం సీటును వదలుకొని సీమాంధ్రలో కార్యక్రమాలు పెట్టుకోవాలని కిరణ్‌కు ఆయన హితవు పలికారు. విభజన జరుగుతోన్న దశలోనూ తెలంగాణకు మరింత నష్టం కలిగించేలా సీఎం అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేలా దుమ్ముగూడెం ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తున్నారని ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారన్నారు. తన సొంత జిల్లా చిత్తూరుకు రూ.5,800 కోట్లు కేటాయించుకున్నారని, రెండో మెడికల్ కాలేజీ పెట్టుకుంటున్నారని, ఉన్నత విద్యా మండలి కౌన్సిల్ చైర్మన్ పదవిని, ఆర్‌అండ్‌బీలో ఈఎన్సీ పోస్టునూ తన జిల్లా వాసులకే ఇచ్చుకున్నారని హరీష్ ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను విచ్చలవిడిగా బదిలీ చేస్తున్నారని విమర్శించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామంటున్న సీమాంధ్రకు చెందిన దళిత, గిరిజన మంత్రులు కొండ్రు మురళి, బాలరాజులను సీఎం అవమానిస్తున్నారని అన్నారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆయన్ను సీఎం పదవి నుంచి తక్షణం తప్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
చింతూరు, న్యూస్‌లైన్: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించి, ప్రజా సమస్యల పరిష్కా రం కోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అ న్నారు. బుధవారం చింతూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రస్థాయిలోనే ఆంక్షలు ఉండడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. అర్హులను గుర్తించి, వారికి మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డుల్లో తప్పులను సరిచేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. పోలవరం ముంపులో భాగంగా ఆర్ఆర్ ప్యాకేజీ కింద బాధితులకు ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేస్తామని, వీరికి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఐఏపీ కింద రహదారుల నిర్మాణాలకు రూ. 90 కోట్లు మంజూరు కాగా, అందులో 90 శాతం నిధులను భద్రాచలం డివిజన్‌కే ఖర్చు చేస్తున్నామని చెప్పా రు. ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రాచలం డివిజన్లో గత విద్యా సంవత్సరంలో ఇంటర్, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు రాలేదని, ఈ ఏడాది ఫలితాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తామని, దీనికోసం విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించేందకు త్వరలో పరిష్కృతి కార్యక్ర మం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పీ వో వీరపాండియన్ మాట్లాడుతూ గిరిజనుల అ భివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడతున్నామని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ సందర్భం గా పలువురికి బంగారుతల్లి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ గణేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
13న జిల్లాకు సీఎం రాక
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న జిల్లాకు రానున్నారు. సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రెండు రోజుల సమయమే ఉండటంతో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సహా జిల్లా అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం సమీక్షించారు. సదాశివపేటతోపాటు రచ్చబండ సమావేశం నిర్వహించనున్న వెల్టూరు గ్రామాన్ని జయప్రకాశ్‌రెడ్డి, జేసీ శరత్, ఎస్పీ విజయ్‌కుమార్ ఇతర అధికారులు సందర్శించారు. మొదట రచ్చబండ సమావేశం జరగనున్న వెల్టూరు గ్రామాన్ని సందర్శించి వేదికను ఖరారు చేశారు. అలాగే సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా సిద్దాపూర్ సమీపంలోని హౌసింగ్ కాలనీలో ఉన్న ఖాళీ ప్రాంతంలో హెలిపాడ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అనంతరం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుంది. అధికారుల సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్దాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వెల్టూరు గ్రామానికి చేరుకుని రచ్చబండ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు పంపిణీ చేస్తారు. అలాగే గ్రామస్థులతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం రోడ్డు మార్గాన సదాశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మూడోసారి రచ్చబండకు సీఎం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మూడోసారి జిల్లాకు రానున్నారు. మొదటి, రెండో విడతల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. తాజాగా ఈనెల 13న సదాశివపేట మండలం వెల్టూరులో నిర్వహించనున్న మూడో విడత రచ్చబండకు సీఎం హాజరు కానున్నారు. -
రచ్చబండకు సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మూడోవిడత రచ్చబండ కార్యక్రమా న్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈ సభల్లో పేదలకు సం క్షేమ ఫలాలు అందించనున్నట్లు కలెక్టర్ ప్రద్యు మ్న పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈనెల 11నుంచి 26వరకు మండలకేంద్రాల్లోనూ, మున్సిపాలిటీ వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నా రు. రచ్చబండ సభలను విజయవంతం చేయడానికి మండల స్థాయిలో ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క మిటీలో సర్పంచ్, మండల మహిళా సమాఖ్యలోని ఉత్సాహంగా ఉన్న సభ్యురాలు, ఒక అధికారి ఉంటారని చెప్పారు. మొత్తం 36 మండలాల్లో ప్రతిపాదించిన కమిటీల జాబితాను జి ల్లా ఇన్చార్జి మంత్రి ముఖేశ్‌గౌడ్‌కు నివేదించామన్నారు. మంత్రి ఆమోదం లభించగానే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 11న బోధన్‌లో మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తొలి రచ్చబండను ప్రారంభిస్తారని తెలిపారు. పేదలకు లబ్ధి.. మూడో విడత రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో సుమారుగా రెండు వేల నుంచి మూడు వేలమంది పేదలకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పెం డింగ్‌లో ఉన్న 73,454 రేషన్‌కార్డుల దరఖాస్తులకు కూపన్లు, 41,369 మంది లబ్ధిదారులకు పెన్షన్లు, 11,179 మందికి ఇందిరమ్మ ఇళ్లకు సం బంధించిన మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. కొత్తగా పెన్షన్లు, రేషన్కూపన్లు మం జూరు చేసిన వారికి డిసెంబర్ నుంచి లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. ఎస్సీలకు రూ.13.76 కోట్లు, ఎస్టీలకు రూ.3.65 కోట్లు మాఫీ చేసిన విద్యుత్తు బిల్లుల రశీదులను అందిస్తామన్నారు. ఇందిర మ్మ కలలు కార్యక్రమం ద్వారా వసతి గృహాలు, కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు చేస్తామని కలెక్టర్ వివరించారు. ప్రతిరోజు నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారికి అదే రోజు చేరుతుందని, ఆ వివరాలు జ్ట్టిఞ:ఙఙ్చఞ.జౌఠి.జీ:8080/్కక వెబ్సైట్లో నమో దు చేస్తారన్నారు. ఈ సమావేశంలో సీపీఓ నబీ, ఐకేపీ పీడీ వెంకటేశం, డీఎం, సీఎస్ దివాకర్, డీఎస్ఓ కొండల్రావు, హౌసింగ్ పీడీచైతన్యకుమార్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
తూతూ మంత్రం..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రచ్చబండ సమీక్ష సమావేశం నాలుగు గోడలకే పరిమితమైంది. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పసుపులేటి బాలరాజు అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశం డీఆర్సీని తలపించినప్పటికీ.. ప్రజా సమస్యలు పెద్దగా ప్రస్తావించలేదు. మీడియాను సైతం అనుమతించలేదు. దీనిపై సత్తుపల్లి, కొత్తగూడెం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమీక్ష సమావేశంలో రహస్యాలేమీ ఉండవని, అలాంటప్పుడు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాట్లాడిన విషయాలు మాత్రమే ప్రకటనల ద్వారా వెల్లడిస్తారా అని డీపీఆర్ఓను నిలదీశారు. అసెంబ్లీలో సైతం మీడియాను అనుమతిస్తారని, ఇక్కడ రానీయకపోవడం సరైంది కాదని అన్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే ర చ్చబండలో ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఇన్చార్జి మంత్రి బాలరాజు వివరించి ముగించారు. వరుస తుపాన్లు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లినా.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించకపోవడం గమనార్హం. ఏడాది తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశం సాదాసీదాగా ముగియడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలం తుపాన్‌తో దెబ్బతిన్న రోడ్లను ఇంతవరకూ మరమ్మతు చేయలేదని, ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఈ పరిస్థితిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సమీక్ష నుంచి తుమ్మల వాకౌట్... ప్రభుత్వ తీరుపై ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. గత సమీక్షలో ఇచ్చిన హమీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరు వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోతోందన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, తుపాన్ వచ్చి 15 రోజులు దాటినా ఇప్పటికీ పంట నష్టం సర్వే పూర్తి కాలేదని వాపోయారు. ఇన్ చార్జి మంత్రి జిల్లాకు రారని, ఉన్నవారు పట్టించుకోరని ఆరోపించారు. జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లినా పట్టించుకోకుంటే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తూ.. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
11 నుంచి మూడో విడుత రచ్చబండ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్‌కార్డుల జారీ, పింఛన్ల పంపిణీకి మూడో విడత రచ్చబండలో పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ముందుచూపుతో దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం కొత్త రేషన్‌కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నాలుగేళ్ల నుంచి నూతన కార్డుల జారీ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రెండు విడుతల రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల అర్జీలు వచ్చాయి. క్షుణ్ణంగా పరిశీలించి 22 వేల మంది లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం కార్డులు జారీ చేసింది. మిగతా వారికి మంజూరు చేయలేదు. కాగా, మూడో విడత రచ్చబండలో 45,294 కొత్త రేషన్‌కార్డులు. 11,210 పింఛన్ల పంపిణీ, 11,210 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 28,603 మంది విద్యుత్ వినియోగదారుల బకాయిల మినహాయింపు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఎస్సీ, ఎస్టీలనూ ఆకట్టుకునే యత్నం జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న పరిస్థితులు అధికార పార్టీకి కలిసి రావడం లేదు. సాధారణ ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే జిల్లాలో 50 యూనిట్ల కన్నా తక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీల బకాయిలు ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందుకు రూ.15.97 కోట్ల జారీకి ఉత్తర్వులు వెలువర్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 28,603 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఈ మినహాయింపు వర్తించనుంది. మూడేళ్ల క్రితం వికలాంగత్వం తక్కువగా ఉందని పింఛన్లను ప్రభుత్వం ఏరివేసింది. ఫలితంగా సదరమ్ క్యాంపు సర్టిఫికెట్లో 40 శాతం వికలాంగత్వం ఉంటేనే పింఛన్‌కు అర్హులని మెలిక పెట్టింది. దీంతో అర్హులైన వికలాంగులు పింఛన్‌ను కోల్పోయారు. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సుమారు 61 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ రచ్బబండ ద్వారా 11,210 మందికి పింఛన్ల పంపిణీ చేయనున్నారు. రచ్చబండ షెడ్యూల్ ఇదే.. రచ్చబండ నిర్వహణకు మండలాల వారీగా షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లేదా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం నిర్వహిం చాలి. కళాశాల ఆవరణలు, మార్కెట్‌యార్డులు, ప్రభు త్వ అతిథిగృహాలు, మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలు, పాఠశాల ఆవరణల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 11న వాంకిడి, బోథ్, 12న జైనూర్, తలమడుగు, కుంటాల, 13న మంచిర్యాల, భైంసా (అర్బన్), భైంసా, సిర్పూర్(టి), 14న జైనథ్, 15న బెల్లంపల్లి, ఇచ్చోడ, మంచిర్యాల (అర్బన్), కుంటాల, 16న ఆదిలాబాద్, రెబ్బెన, తాండూర్, కుభీర్, బెజ్జూర్, 18న బేల, ఆసిఫాబాద్, కాసిపేట, బజార్హత్నూర్, ఉట్నూర్, దహెగాం, 19న నెన్నెల, తాంసి, చెన్నూర్, లోహేస్రా, కాగజ్‌నగర్, 20న తిర్యాణి, వేమనపల్లి, నేరడిగొండ, మందమర్రి, మందమర్రి(అర్బన్), ఇంద్రవెల్లి, దండేపల్లి, తానూర్, దిలావర్పూర్, కాగజ్‌నగర్ (అర్బన్), 21న నార్నూర్, భీమిని, గుడిహత్నూర్, కోటపల్లి, ఖానాపూర్, లక్సెట్టిపేట, ముధోల్, మామడ, 22న బెల్లంపల్లి (అర్బన్), జైపూర్, కడెం, లక్ష్మణచాంద, 23న ఆదిలాబాద్ (అర్బన్), కెరమెరి, జన్నారం, నిర్మల్ (అర్బన్), 25న సిర్పూర్(యు), సారంగపూర్ మండలాల్లో రచ్చబండ కార్యక్రమం జరుగనుంది. -
‘ఇందిరమ్మ’ చెల్లింపులపై సర్కారు చిన్నచూపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయిన బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ, రచ్చబండ కింద మూడు విడతలుగా మంజూరై ఇళ్లకు బిల్లులు నిలిచాయి. అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు రోడ్డెక్కుతున్నారు. గృహనిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం జిల్లాలో రూ.42 కోట్ల మేర బిల్లులు నిలిచాయి. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన నిర్మాణాలు ఇందిరమ్మ, రచ్చబండ, ఆర్అండ్ఆర్ పథకాల కింద జిల్లాకు 3,30,961 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,75,735 ఇళ్లు గ్రౌండింగ్ కాగా, ఇప్పటివరకు 2,03,705 ఇళ్లు పూర్తయినట్లు గృహనిర్మాణ సంస్థ రికార్డులు చెప్తున్నాయి. 25,949 ఇళ్లు పునాది, 9,214 లెంటల్ లెవెల్, 25,702 రూప్ లెవెల్, 1,27,258 ఇళ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందిరమ్మ మొదటి విడతలో 93,386 ఇళ్లు మంజూరైతే అందులో 91,108 ఇళ్లు గ్రౌండింగై 76,070 ఇళ్లు పూర్తి చేయగా లక్ష్యంగా 83 శాతంగా ఉంది. రెండో విడతలో 1,05,895 ఇళ్లకు 73, 219 ఇళ్లు పూర్తి కాగా 75 శాతం, మూడో విడతలో 72,764 ఇళ్లకు 36,838 ఇళ్లు పూర్తయి 65 శాతం లక్ష్యం నెరవేరాయి. మొదటి విడత రచ్చబండ 16,411 ఇళ్లకు 8,494 పూర్తి కాగా 62 శాతం, రెండో విడత రచ్చబండలో 19,157కు 3,404 ఇళ్లు పూర్తి కాగా 46 శాతం లక్ష్యం నెరవేరింది. జీవో 44 కింద మంజూరైన 10,324 ఇళ్లలో 23 గ్రౌండింగ్ కాగా ఒకే ఇల్లు పూర్తయింది. మంపు బాధితులకు 3,647 ఇళ్లు మంజూరైతే అందులో 941 పూర్తి చేసిన అధికారులు 14 శాతంతో లక్ష్యాన్ని సరిపెట్టారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కలిసిరాని పథకం ఇందిరమ్మతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన 3,30,961 ఇళ్లలో 2,03,705 పూర్తి కాగా, పూర్తయిన ఇళ్లతోపాటు వివిధ స్థాయిల్లో ఉన్న వాటికి రూ.893.30 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రెండు, మూడు నెలల్లో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు చెందిన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచాయి. బకాయిల వివరాలపై ‘సాక్షి’ ఆరా తీయగా కచ్చితంగా చెప్పలేమని గృహనిర్మాణ శాఖ అధికారులు చెప్పారు. ఆన్లైన్లోనే ఉంటాయని సెలవిచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒకటి, రెండు మాసాల్లో నిలిచిన బిల్లులు సుమారు రూ.42 కోట్లకు పైగా ఉంటాయంటున్నారు. ఇందిరమ్మ పథకం కింద ఎస్సీ లబ్ధిదారులైతే రూ.లక్ష, ఎస్టీలైతే రూ.1.05 లక్షలు, బీసీ/ఇతరులకు రూ.80 వేలు చెల్లిస్తారు. పట్టణాల్లో నివసించే బీసీ/ఇతరులకైతే ఓ రూ.10 వేలు అదనంగా చెల్లిస్తారు. గృహనిర్మాణ శాఖ నిబంధనలకు ప్రకారం లబ్ధిదారులు ఏ కులానికి చెందిన వారైనా ఇళ్ల నిర్మాణ స్థాయిలను బట్టి అన్లైన్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణ ప్రగతి నివేదికలను ఆన్లైన్లో అనుసంధానం చేయడం, సిబ్బంది కొరత వల్ల బిల్లులు నిలిచాయని అధికారులు చెప్తున్నారు. అప్పు చేసి ఇళ్లు కట్టుకుంటే, బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. -
ఆగస్టు 8 నుంచి 28 దాకా మూడో విడత రచ్చబండ