పాలమూరు, న్యూస్‌లైన్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమం దరఖాస్తులను స్వీకరించేవరకే పరిమితమైంది.
మొదటి, రెండోవిడత రచ్చబండ దరఖాస్తులకే మోక్షం లేకపోగా..మూడోవిడత కార్యక్రమం నిర్వహించారు. ఈ దఫా దరఖాస్తులను కూడా మూలకుపడేయడంతో రచ్చబండ కాస్తా.. సచ్చుబండగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అర్జీలపై విచారణకు కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ప్రధానంగా రచ్చబండలో రేషన్‌కార్డులు, పింఛన్లు, అభయహస్తం, ఇందిరమ్మ, ఉపాధిహామీ పథకం అర్జీలకు ప్రాధాన్యమిస్తామని అధికారులు అప్పట్లో చెప్పినా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారు. వాటిపై దృష్టిసారించకుండానే ముచ్చటగా మూడోవిడత రచ్చబండ నిర్వహించి వివిధ సమస్యలపై జిల్లావ్యాప్తంగా 3.83 లక్షల అర్జీలను స్వీకరించారు. వాటిలో ప్రధానంగా రేషన్‌కార్డులకోసం 1,30,573 దరఖాస్తులు రాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి 1,32,090, పింఛన్లకు 87,809, ఇతర వాటికి 33,000 దరఖాస్తులు అందాయి. వీటిని అధికారులు త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.
అటకెక్కిన అర్జీలు
గతంలో చేపట్టిన రచ్చబండ 1, 2 విడతల్లో రేషన్‌కార్డుల కోసం 1.90 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 60వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతావి మంజూరు చేశారు. పింఛన్ల కోసం 1.50 లక్షల దరఖాస్తులు అందగా కేవలం 70వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపికచేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పేద కుటుంబాలకు చెందిన వారు 1,63,336 మంది దరఖాస్తులు అందజేయగా 95వేల ఇళ్లకు మాత్రమే మంజూరు లభించినట్లు సమాచారం. వారిలోనూ ఎంతమందికి పూర్థిస్థాయిలో బిల్లులు మంజూరుచేస్తారన్నది అయోమయంగా మారింది.
అసలు విషయమేమిటంటే.. ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సరైన లెక్కలు కూడా లేకపోవడంతో ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందో తెలియడం లేదు. ఇళ్లు మంజూరు చేయాలంటే సదరు లబ్ధిదారులకు విధిగా రేషన్‌కార్డు, స్థలం ఉండాలి. ఈ రెండింటిలో ఏదిలేకపోయినా ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదు. ఇళ్లకు అర్హత సాధించిన వారిలో పలువురికి రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. ఇటువంటి అంశాలు సర్కారు విధానంపై అయోమయం కలిగిస్తున్నాయి.
ఎక్కడి దరఖాస్తులు అక్కడే
Published Sun, Dec 1 2013 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement