Rationcards
-
కార్డు నిజం.. పేర్లు అబద్ధం
టీడీపీ హయాంలో ఆ పార్టీ మద్దతు దారులైన కొందరు డీలర్లు దోపిడీకి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ సద్వినియోగం చేసుకున్నారు. రేషన్ సరుకులు నొక్కేందుకు కొత్త దారి కనుక్కున్నారు. లబ్ధిదారులకే తెలియకుండా వారి కార్డుల్లో ఇతరుల పేర్లు చేర్పించారు. అలా అదనంగా నమోదైన వారి పేరుతో రేషన్ సరుకులు ఏళ్లుగా స్వాహా చేశారు. తాజాగా కార్డుదారుల ఆధార్ వివరాలను ప్రజాసాధికార సర్వేకు అనుసంధానం చేయడంతో వారి బొక్కుడు వ్యవహారం బయటపడింది. సాక్షి, అనంతపురం: డీలర్ల మాయలు అన్నీ ఇన్నీకావు. దోచుకునేందుకు తలోదారి వెతుక్కున్నారు. టీడీపీ హయాంలో అధికార పార్టీ అండదండలున్న వారైతే మరీ ఇష్టానుసారం వ్యవహరించారు. కార్డుదారులకే తెలియకుండా ఆన్లైన్లో మాయ చేశారు. కొందరి కార్డుల్లో కుటుంబసభ్యులుగా ప్రభుత్వ ఉద్యోగులను చేర్పించారు. అలా చేర్పించిన వారి పేరున వచ్చే బియ్యం కోటాను నొక్కుతూ వచ్చారు. టీడీపీ మద్దతుదారులైన డీలర్ల చేతి వాటం జిల్లాలో 3,003 చౌక దుకాణాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో చౌకదుకాణాల డీలర్లుగా టీడీపీ కార్యకర్తలు ఆపార్టీ సానుభూతిపరులు వ్యవహరించారు. వీరిలో కొందరు డీలర్లు చేతి వాటం ప్రదర్శించి అవినీతికి తెరలేపారు. కార్డుదారులకు తెలియకుండా ఆన్లైన్లో వారి కుటుంబ సభ్యులుగా ఇతరులను చేరుస్తూ ఆధార్‌ను ఈ–పాస్‌కు అనుసంధానం చేశారు. కార్డుల్లో అలా చేర్చిన పేర్ల మీద వచ్చే బియ్యాన్ని నొక్కేశారు. ఈ తతంగం ఏళ్లుగా సాగింది. అనుసంధానంతో వెలుగుచూస్తున్న అక్రమాలు తాజాగా ఈకేవైసీ కింద రేషన్ కార్డుల్లోని సభ్యుల ఆధార్‌ను ప్రజాసాధికార సర్వేకు అనుసంధానం చేస్తుండడంతో గతంలో డీలర్లు చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్డుల్లో డీలర్లు చేర్చిన పేర్లలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఆధార్ అనుసంధానంతో కార్డులో సభ్యునిగా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు చూపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్న కార్డులకు ఆటోమేటిక్‌గా నిత్యావసర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో కార్డుదారులు ఆందోళనకు గురై తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ ఆన్లైన్లో పరిశీలిస్తే తమ కుటుంబాలకు సంబంధం లేని వ్యక్తులు కార్డుల్లో సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిలిచిన రేషన్ పంపిణీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వారు తెల్లరేషన్ కార్డు పొందేందుకు అనర్హులు. కానీ కొందరు డీలర్లు తమ స్వార్థం కోసం కార్డుదారులకే తెలియకుండా వారి కుటుంబీకులుగా పలువురు ఉద్యోగుల పేర్లను చేర్చారు. ఇపుడు ప్రజాసాధికార సర్వేకు రేషన్ కార్డుల్లో సభ్యుల ఆధార్ అనుసంధానంతో పాటు, ఈకేవైసీ చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డుల్లో సభ్యులుగా వారికి రేషన్ నిలిచిపోయింది. ఇలా జిల్లావ్యాప్తంగా ఈనెలలో 12 వేల కార్డులకు రేషన్ పంపిణీ ఆగింది. వీటిలో చాలా కార్డుల్లో కార్డుదారుల కుటుంబంలో సభ్యులు కాని వారి పేర్లు నమోదయ్యాయి. తహసీల్దార్ ద్వారా రిపోర్ట్ పంపించాలి రేషన్ కార్డుల్లో వారి కుటుంబ సభ్యులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల పేరు నమోదై ఉండి రేషన్ నిలిచిపోయి ఉంటే... అలాంటి కార్డుదారులు నేరుగా తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తూ అర్జీ ఇవ్వాలి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్‌లను అర్జీతో జతచేయాలి. దీనిపై తహసీల్దారు విచారణ చేసి... ఫిర్యాదు వాస్తవమేనని నిర్ధారణ అయితే... నివేదికను జిల్లా సరఫరాల శాఖకు పంపించాలి. దాన్ని ప్రభుత్వానికి పంపించి కార్డులో సంబంధం లేని సభ్యుల పేర్లను తొలగిస్తారు. అప్పుడు రేషన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి తన తెల్లరేషన్ కార్డు(డబ్ల్యూఏపీ 121102500289) తీసుకుని డీలర్ వద్దకు వెళ్లి ఈపాస్ యంత్రంలో వేలిముద్ర వేయగానే బియ్యం రాదన్నట్లుగా చూపించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విషయం చెప్పగా.. వారు ఆన్లైన్లో పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఇతని కార్డులో సంతోష్‌కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి పేరు నమోదై ఉంది. అందువల్లే బియ్యం రాలేదని చెప్పారు. వాస్తవంగా తమ కుటుంబంలో సంతోషకుమార్ అనే వ్యక్తే లేడని, ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు అసలే లేరని ఆంజనేయులు వాపోతున్నాడు. - ఎం.ఆంజనేయులు. శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామం. వీరికి తెల్లరేషన్ కార్డు (డబ్ల్యూఏపీ 1211002500204) ఉన్నా... డీలరు బియ్యం వేయకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఆన్లైన్లో పరిశీలిస్తే... ఇతని రేషన్‌కార్డులోనూ సంతోష్‌కుమార్ అనే పేరు నమోదై ఉంది. అతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రేషన్ నిలిచిపోయినట్లు చూపుతోందని అధికారులు తెలిపారు. తమ కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న సంతోష్‌కుమార్ పేరున్న వ్యక్తి ఎవరూ లేరని, ఎవరు ఎక్కించారో అర్థం కావడం లేదని బాధితుడు వాపోయాడు. - చిక్కాల నారాయణస్వామి, శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామం. -
ఎక్కడి దరఖాస్తులు అక్కడే
పాలమూరు, న్యూస్‌లైన్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమం దరఖాస్తులను స్వీకరించేవరకే పరిమితమైంది. మొదటి, రెండోవిడత రచ్చబండ దరఖాస్తులకే మోక్షం లేకపోగా..మూడోవిడత కార్యక్రమం నిర్వహించారు. ఈ దఫా దరఖాస్తులను కూడా మూలకుపడేయడంతో రచ్చబండ కాస్తా.. సచ్చుబండగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అర్జీలపై విచారణకు కూడా అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ప్రధానంగా రచ్చబండలో రేషన్‌కార్డులు, పింఛన్లు, అభయహస్తం, ఇందిరమ్మ, ఉపాధిహామీ పథకం అర్జీలకు ప్రాధాన్యమిస్తామని అధికారులు అప్పట్లో చెప్పినా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారు. వాటిపై దృష్టిసారించకుండానే ముచ్చటగా మూడోవిడత రచ్చబండ నిర్వహించి వివిధ సమస్యలపై జిల్లావ్యాప్తంగా 3.83 లక్షల అర్జీలను స్వీకరించారు. వాటిలో ప్రధానంగా రేషన్‌కార్డులకోసం 1,30,573 దరఖాస్తులు రాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి 1,32,090, పింఛన్లకు 87,809, ఇతర వాటికి 33,000 దరఖాస్తులు అందాయి. వీటిని అధికారులు త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని అర్జీదారులు కోరుతున్నారు. అటకెక్కిన అర్జీలు గతంలో చేపట్టిన రచ్చబండ 1, 2 విడతల్లో రేషన్‌కార్డుల కోసం 1.90 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 60వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతావి మంజూరు చేశారు. పింఛన్ల కోసం 1.50 లక్షల దరఖాస్తులు అందగా కేవలం 70వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపికచేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పేద కుటుంబాలకు చెందిన వారు 1,63,336 మంది దరఖాస్తులు అందజేయగా 95వేల ఇళ్లకు మాత్రమే మంజూరు లభించినట్లు సమాచారం. వారిలోనూ ఎంతమందికి పూర్థిస్థాయిలో బిల్లులు మంజూరుచేస్తారన్నది అయోమయంగా మారింది. అసలు విషయమేమిటంటే.. ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సరైన లెక్కలు కూడా లేకపోవడంతో ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందో తెలియడం లేదు. ఇళ్లు మంజూరు చేయాలంటే సదరు లబ్ధిదారులకు విధిగా రేషన్‌కార్డు, స్థలం ఉండాలి. ఈ రెండింటిలో ఏదిలేకపోయినా ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదు. ఇళ్లకు అర్హత సాధించిన వారిలో పలువురికి రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. ఇటువంటి అంశాలు సర్కారు విధానంపై అయోమయం కలిగిస్తున్నాయి. -
యథేచ్ఛగా చౌక బియ్యం
సాక్షి, అనంతపురం : చౌకధాన్యపు డిపో డీలర్లు సమైక్య ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు సమ్మెలో ఉన్న సమయంలో ఇక తమను అడిగే వారే లేరనే ధైర్యంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు మంజూరైన కిలో రూపాయి బియ్యాన్ని కనీసం డిపో వరకు కూడా తీసుకెళ్లకుండా.. గోదాము నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్ కు తరలించేశారు. అమ్మహస్తం పథకం కింద పంపిణీ అయ్యే తొమ్మిది రకాల సరుకులనూ ఇదే బాట పట్టించారు. కార్డుదారులు మాత్రం సమైక్య ఉద్యమం కారణంగా సరుకులు రాలేదన్న భావనలో ఉండిపోయారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను ఎక్కువ ధర పెట్టి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే డీలర్లు ఎక్కువగా అక్రమాలకు పాల్పడ్డారు.ఇలాంటి వారిపై ప్రస్తుతం ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో 2,862 చౌక ధాన్యపు డిపోలు నడుస్తున్నాయి. సమ్మె కాలంలోనూ నిత్యావసర సరుకులను సరఫరా చేశామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డీలర్ల అసలు రంగు బయటపడింది. తమకు అందాల్సిన సరుకులను డీలర్లు బొక్కేశారని తెలుసుకున్న కార్డుదారులు... ఆర్డీఓలు, తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. వీటిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటి దాకా దాదాపు పది మందిపై కేసులు నమోదు చేశారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, నల్లమాడ, కూడేరు, ధర్మవరం మండలాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలిందని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) శాంతకుమారి తెలిపారు. డీలర్లపై 6ఏ, 18ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణకు మండల స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంటు కమిటీలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా... విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్తున్న సమయంలో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం నల్లమాడ మండలం బొగ్గలపల్లిలో విచారణకు వెళ్లిన సివిల్ సప్లయిస్ డిప్యూటీతహ శీల్దార్ కృష్ణమూర్తి ఎదుటే రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. తమపైనే ఫిర్యాదులు చేస్తారా అంటూ డీలర్, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆరుగురు గ్రామస్తులు గాయపడ్డారు. విచారణ అధికారులు కనీసం పోలీసులను కూడా వెంటబెట్టుకోకుండా గ్రామాలకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చిన డీలర్లపైనే విచారణ చేస్తున్నారని, మిగతా వారి అక్రమాల మాటేమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.