సాక్షి, అనంతపురం : చౌకధాన్యపు డిపో డీలర్లు సమైక్య ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు సమ్మెలో ఉన్న సమయంలో ఇక తమను అడిగే వారే లేరనే ధైర్యంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. తెల్ల రేషన్‌కార్డుదారులకు మంజూరైన కిలో రూపాయి బియ్యాన్ని కనీసం డిపో వరకు కూడా తీసుకెళ్లకుండా.. గోదాము నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్ కు తరలించేశారు.
అమ్మహస్తం పథకం కింద పంపిణీ అయ్యే తొమ్మిది రకాల సరుకులనూ ఇదే బాట పట్టించారు. కార్డుదారులు మాత్రం సమైక్య ఉద్యమం కారణంగా సరుకులు రాలేదన్న భావనలో ఉండిపోయారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను ఎక్కువ ధర పెట్టి బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే డీలర్లు ఎక్కువగా అక్రమాలకు పాల్పడ్డారు.ఇలాంటి వారిపై ప్రస్తుతం ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో 2,862 చౌక ధాన్యపు డిపోలు నడుస్తున్నాయి. సమ్మె కాలంలోనూ నిత్యావసర సరుకులను సరఫరా చేశామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డీలర్ల అసలు రంగు బయటపడింది. తమకు అందాల్సిన సరుకులను డీలర్లు బొక్కేశారని తెలుసుకున్న కార్డుదారులు... ఆర్డీఓలు, తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. వీటిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇప్పటి దాకా దాదాపు పది మందిపై కేసులు నమోదు చేశారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, నల్లమాడ, కూడేరు, ధర్మవరం మండలాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలిందని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) శాంతకుమారి తెలిపారు. డీలర్లపై 6ఏ, 18ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణకు మండల స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంటు కమిటీలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉండగా... విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్తున్న సమయంలో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం నల్లమాడ మండలం బొగ్గలపల్లిలో విచారణకు వెళ్లిన సివిల్ సప్లయిస్ డిప్యూటీతహ శీల్దార్ కృష్ణమూర్తి ఎదుటే రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. తమపైనే ఫిర్యాదులు చేస్తారా అంటూ డీలర్, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆరుగురు గ్రామస్తులు గాయపడ్డారు. విచారణ అధికారులు కనీసం పోలీసులను కూడా వెంటబెట్టుకోకుండా గ్రామాలకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చిన డీలర్లపైనే విచారణ చేస్తున్నారని, మిగతా వారి అక్రమాల మాటేమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.
యథేచ్ఛగా చౌక బియ్యం
Published Wed, Nov 6 2013 2:48 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement