కూరో..మొర్రో..!
సాక్షి, అనంతపురం : కూరగాయల ధరలు చూసి సామాన్యుల గుండె బరువెక్కుతోంది. ఏ పూటకు ఏం వండాలో తెలీక మహిళలు దిక్కులు చూసే పరిస్థితి నెలకొంటోంది. గతంలో కిలోల కొద్దీ కొన్న వారు ఇప్పుడు పావు కిలో..అర కిలోతో సరిపెట్టుకుంటున్నారంటే కూర‘గాయాలు’ ఎంతగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కిలో రూ.10, రూ.15 ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.30, రూ.50 పలుకుతుండడంతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖల నిర్లక్ష్య వైఖరితో కూరగాయల ధరలు చుక్కలంటుతున్నాయి.
అయినా రైతులకు గిట్టుబాటు ధర కరువవుతోంది. రైతు బజార్లలో నిర్ణీత ధరలు అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో కూరగాయల పంటలు సాధారణ సాగు 30 వేల హెక్టార్లు కాగా.. వర్షాభావం కారణంగా ఈసారి 20వేల హెక్టార్లలో మాత్రమే సాగులో ఉన్నాయి. ఇందులో టమాట, బెండ, బీర, వంకాయ, ఉల్లిగడ్డ, చౌడేకాయ (మటిక్కాయ)లతో పాటు హిందూపుర ం, మడకశిర ప్రాంతాల్లో కాలీఫ్లవర్, క్యాబేజీ సాగు చేశారు. ఆర్‌కేవీవై కింద సబ్సిడీపై కూరగాలయ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని గణాంకాలు వల్లెవేస్తున్న అధికారులు రైతుకు, వినియోగదారునికి మేలు కలిగించేలా తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమే.