vegetables rates
-
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు కూరగాయల కొనుగోళ్లు భారంగా మారాయి. రూ.200 పెట్టినా.. సగం సంచి నిండడం లేదు. గత ఏడాదితో పరిశీలిస్తే.. ఈ ఏడాది వానాకాలం అంతటా కూరగాయల సాగు పడిపోవడమే ఇందుకు కారణం. నీటి పారుదల వనరులతో మెట్ట ప్రాంతాల్లో తరి పంటలే ఎక్కువగా సాగయ్యాయి. వరి సాగుకు రైతులు మొగ్గు చూపడంతో కూరగాయల సాగు పడిపోయింది. గత ఏడాది 1,32,610 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగయితే, ఈ ఏడాది 61,153 ఎకరాల్లోనే ఈ పంట సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ పరిస్థితితో కూరగాయల ధరలు పెరిగాయి. రాజధాని చుట్టూ తగ్గిన సాగు రాజధాని చుట్టు పక్కల ఉన్న జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో గత ఏడాది సాగు విస్తీర్ణం కన్నా ఈసారి 50 శాతం లోపే సాగు చేశారు. ఈ వానాకాలం రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో భూగర్భ జలాలు అనూహ్యంగా పైకివచ్చాయి. దీంతో రైతులు మెట్ట పంటలను వదిలి తరి పంటల సేద్యం బాట పట్టారు. టమాట, బెండకాయ, వంకాయ, దొండకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, సొరకాయ వంటి కూరగాయలు ప్రతి గ్రామాల్లో కొన్ని ఎకరాల్లోనైనా పండేవి. నీటి వనరుల కళతో రైతులు కూరగాయల సాగును పక్కన పెట్టి ఎక్కువగా వరి సాగు చేశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలతో మెట్ట ప్రాంతమంతా తరిగా మారడంతో ఈ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లోనూ కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో దీని ప్రభావం ధరలపై పడింది. ఏ కూరగాయలను కొనుగోలు చేయాలన్నా ధరను చూసి సామాన్య ప్రజలకు దడ పుడుతోంది. పచ్చి మిర్చి కేజీ రూ.100, బెండకాయ, వంకాయ, టమాట రూ.60 పైనే పలుకుతోంది. గత ఏడాది కన్నా రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఐదు నెలలుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ కానీ దిగి రావడం లేదు. అయితే ఈ పంటలు కొద్దిగొప్పో సాగు చేసిన రైతులకు మాత్రం దండిగా ఆదాయం సమకూరుతోంది. ఒకప్పుడు మార్కెట్లో టమాటకు కిలో రూ. 2 కూడా పెట్టలేదని, గత ఐదు నెలలుగా కేజీ హోల్‌సేల్‌గా తోట వద్దే రూ.40కి పైగా అమ్ముతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. గత ఏడాది, ఈ ఏడాది పలు జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) .. జిల్లా గత ఏడాది ఈ ఏడాది రంగారెడ్డి 37,579 13,652 వికారాబాద్ 5,664 6,328 సంగారెడ్డి 6,823 3,535 నల్లగొండ 4,269 1,191 సిద్దిపేట 9,902 4,696 సూర్యాపేట 2,418 825 -
కొనలేం..తినలేం...
► కూరగాయల ధరలు పైపైకి....! గరుగుబిల్లి: జిల్లాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజకు పెరుగుతున్న ధరలతో కూరగాయలు కొనలేని, తినలేని పరిస్థితి దాపురిస్తోంది. గత 15రోజులు నుంచి కూరగాయల ధరలు రెట్టింపు అవ్వడంతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు బీతిల్లుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా కూరగాయ పంటలు లేకపోవడంతో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఒకవైపు ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. మండలంలోని గొట్టివలస, పెద్దూరు, గరుగుబిల్లి, చినగుడబ తదితర గ్రామాలలో రైతులు తమపండించిన టమోట, బీర, చిక్కుడు, ఆనప, తోటకూర, జనపకూర వంటి కూరగాయలను సమీపంలోని పార్వతీపురం మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దీంతో గ్రామాలలోని చిరువ్యాపారులు పార్వతీపురం మార్కెట్‌నుండి తీసుకొచ్చి గ్రామాలలో ప్రజలకు విక్రయాలు చేస్తుంటారు. ప్రస్తుతం గ్రామాలలో కిలో కూరగాయలు ధరలు ఇలావున్నాయి. వంకాయలు రూ.40, దొండ రూ.40, టమోట రూ.40, బెండ రూ.40, కాకరకాయలు రూ.40, బీరకాయలు రూ.40, మునగకాడలు రూ.80, ఉల్లిపాయలు రూ.20లు పలుకుతోంది. ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ తగినంత ఉత్పత్తిలేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. ధరలను అదుపులో ఉంచి సామాన్యులకు అందుబాటులో కూరగాయలను సరఫరాచేసేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు. -
రైతు బజార్లో తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు
అనంతపురం అగ్రికల్చర్ : ఆంజనేయ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ప్రజల సదుపాయం కోసం రైతుబజార్లో పండ్లు, కూరగాయలు తక్కువ ధరకే అందుబాటులో ఉంచామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శివసత్యనారాయణ తెలిపారు. బహిరంగ మార్కెట్, మాల్స్‌లో అమ్మేదాని కన్నా ఇక్కడ తక్కువకే విక్రయిస్తున్నందున వినియోగించుకోవాలన్నారు. ప్రధానంగా శని, ఆదివారం రోజుల్లో అన్ని రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల స్పందనను బట్టి భవిష్యత్తులో మరింత తక్కువగా, మరిన్ని ఉత్పత్తులు అందుబాటులో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పండ్లు, కూరగాయల ధరలు కిలో ఒక్కంటికి ఇలా ఉన్నాయన్నారు. సరుకు రైతుబజార్ బహిరంగమార్కెట్ మాల్స్ –––––––––––––––––––––––––––––––––– ఉల్లి 6 10 16 టమాట 3.50 6 5 పచ్చిమిరప 10 15 30 ఎండుమిర్చి 80 150 120 బెండ 10 15 15 అనప 25 40 –– రేగు 20 40 –– దానిమ్మ 80 100 150 వేరుశనగ విత్తనాలు 85 100 100 –––––––––––––––––––––––––––––––––– -
కూరో..మొర్రో..!
సాక్షి, అనంతపురం : కూరగాయల ధరలు చూసి సామాన్యుల గుండె బరువెక్కుతోంది. ఏ పూటకు ఏం వండాలో తెలీక మహిళలు దిక్కులు చూసే పరిస్థితి నెలకొంటోంది. గతంలో కిలోల కొద్దీ కొన్న వారు ఇప్పుడు పావు కిలో..అర కిలోతో సరిపెట్టుకుంటున్నారంటే కూర‘గాయాలు’ ఎంతగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కిలో రూ.10, రూ.15 ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.30, రూ.50 పలుకుతుండడంతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖల నిర్లక్ష్య వైఖరితో కూరగాయల ధరలు చుక్కలంటుతున్నాయి. అయినా రైతులకు గిట్టుబాటు ధర కరువవుతోంది. రైతు బజార్లలో నిర్ణీత ధరలు అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో కూరగాయల పంటలు సాధారణ సాగు 30 వేల హెక్టార్లు కాగా.. వర్షాభావం కారణంగా ఈసారి 20వేల హెక్టార్లలో మాత్రమే సాగులో ఉన్నాయి. ఇందులో టమాట, బెండ, బీర, వంకాయ, ఉల్లిగడ్డ, చౌడేకాయ (మటిక్కాయ)లతో పాటు హిందూపుర ం, మడకశిర ప్రాంతాల్లో కాలీఫ్లవర్, క్యాబేజీ సాగు చేశారు. ఆర్కేవీవై కింద సబ్సిడీపై కూరగాలయ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని గణాంకాలు వల్లెవేస్తున్న అధికారులు రైతుకు, వినియోగదారునికి మేలు కలిగించేలా తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమే. -
దరలు కుతకుత!
అనంతపురం రాజు రోడ్డుకు చెందిన రాములమ్మ ఇంటికి బంధువులు రావడంతో బిర్యానీ చేయడానికి సోనామసూరి బియ్యం కోసం మార్కెట్‌కు వెళ్లింది. కిలో బియ్యం (పాతవి) రూ.50 అని వ్యాపారి చెప్పడంతో కంగుతినింది. మొన్నటి వరకు రూ.40 ఉండేవి కదా అని అడిగితే.. ‘ఔనమ్మా అది మొన్నటి మాట. ఇప్పుడు ధర పెరిగింద’ని చెప్పడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. దారి మధ్యలో మరో అంగడికి వెళ్లి కిలో కందిపప్పు ఎంతని అడగ్గా.. రూ.80 అని చెప్పడంతో ఆమె కళ్లు తేలేసింది. సాక్షి, అనంతపురం : పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పు చారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేదలు వాపోతున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4 వేలు ఉండగా... ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరు మాసాల క్రితం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉన్న పెసర, ఉద్దులు, కందిపప్పు ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతో పాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. తె గుళ్ల దెబ్బకు తమిళనాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలదీ అదే రూటు కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళ్తే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా ఏ కూరగాయను ముట్టుకున్నా కిలో రూ.30 పైమాటే. కందగడ్డ కిలో రూ.70, కాలీఫ్లవర్ ఒకటి రూ.15 -20, మునక్కాయలు (నాలుగు) రూ.20 పలుకుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావం కారణంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా దిగుబడి పెద్దగా లేకపోవడంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. -
ధరవింటే దడ
పాలమూరు, న్యూస్‌లైన్: పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడికి కలవరపెడుతున్నాయి. ఉల్లి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. మిర్చి రూటే సప‘రేటు’. కిలో పచ్చిమిర్చి ధర రూ.80 దాటి పైకి ఎగబాగుతోంది. వెల్లుల్లి రేటు మరింత ఘాటెక్కింది. బీర, బెండ, చిక్కుడు కాయలు కిలో ధర రూ.35 దాటి సగటు జీవిని బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో కూరగాయల దిగుబడి లేకపోవడం, పక్కజిల్లాల నుంచి కూడా రవాణా లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన సాగుభారం కారణంగా అన్నదాతలు కూరగాయల సాగుపై దృష్టిసారించడం లేదు. జిల్లా 41లక్షలు ఉండగా.. దాదాపు 11 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం ఒక్కో కుటుంబం నెలకు సగటున 20 కిలోల కూరగాయలు వినియోగిస్తుంది. ఈ లెక్కన జిల్లాలో నెలకు 2.40 కోట్ల కిలోలు (24వేల టన్నులు) అవసరమని అధికారుల అంచనా..అయితే జిల్లాలో కూరగాయల దిగుబడి 25శాతం కూడా రావడంలేదు. ఏడాదిలో 8.80 కోట్ల కిలోల(88వేల టన్నులు) దిగుబడి వస్తుందని అంచనా. దీని ప్రకారం జిల్లాకు ఇంకా 20 కోట్ల కిలోల కూరగాయల కొరత ఏర్పడుతుంది. జిల్లా మొత్తంగా ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లను కలుపుకుని 22వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టాల్సి ఉండగా.. ఈ ఖరీఫ్‌లో ఐదువేల ఎకరాలోపు మాత్రమే సాగుచేపట్టారు. ఏడాది మొత్తంలో 8.80 కోట్ల కిలోల(88వేల టన్నులు) దిగుబడి వస్తున్నా ఇక్కడ పండించిన కూరగాయలను రైతులు దళారులకు అమ్మడం, దళారులు జిల్లాయేతర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో కొరత తీవ్రమవుతుంది. స్థానికంగా పండించిన కూరగాయలను ఇక్కడే విక్రయించే విధంగా చేస్తూ, సాగు విస్తీర్ణం పెరిగేవిధంగా చర్యలు తీసుకుంటే ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. రైతులకు రాయితీ కల్పిస్తూ కూరగాయల సాగులో ప్రోత్సహిస్తే పెరిగిన ధరలకు కళ్లెం వేసే అవకాశం ఉంటుంది. తగ్గిన సాగు..పెరిగిన ధరలు అలంపూర్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉల్లిసాగు తగ్గడంతో బహిరంగ మార్కెట్లో విపరీతమైన ధర పలుకుతుంది. నాణ్యమైన ఉల్లి రూ.60 నుంచి రూ.90 ధర పలుకుతుంది. మేలో సాగుచేసిన ఉల్లి పంట దిగుబడులు మార్కెట్‌కు వస్తున్నాయి. మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను చుట్టుముట్టడంతో పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో అంతంతమాత్రంగానే సాగయింది. గతేడాది ఉల్లి సాగు ఘణనీయంగా తగ్గడంతో దిగుబడి కూడా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలోఉల్లి ధర రూ.90 వరకు చేరింది. సాధారణంగా 110 రోజులకు ఉల్లి పంట చేతికందుతుంది. ఏ కాలంలోనైనా ఈ పంటను సాగుచేసుకునే వీలు ఉంటుంది. వడ్డేపల్లి, మానవపాడు, అయిజ, ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో మే, జూన్ నెలలోనే సుమారు రెండువేల ఎకరాల్లో ఉల్లిని సాగుచేశారు. ఉల్లి రైతులకు లాభాలు తెచ్చిపెడుతుండటంతో సాగు మరింత పెరిగింది. ఉల్లికి డిమాండ్ ఉండటంతో ఎకరాకు దాదాపు రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంటసాగుచేపట్టారు. అయితే మే నెలలో సాగుచేసిన రైతులకు పంట లాభసాటిగా మారింది. నెలరోజుల క్రితం మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర రూ.4.500 వేల నుంచి రూ.ఆరువేల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాలు ధర రూ.2400 నుంచి రూ.మూడువేలకు వరకు పలుకుతుంది. వ్యాపారుల మాయాజాలంతోనే.. జిల్లాలో ఏడాదికి 22వేల హెక్టార్లలో కూరగాయల సాగు ఉంటుంది. ఇక్కడ పండించిన పంటను వ్యాపారులు పొలాలవద్ద నుంచే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా రవాణా ఖర్చులు తగ్గుతాయని, మార్కెటింగ్ ఇబ్బందులు తప్పుతాయనే ఉద్దేశంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దళారులు వీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కూరగాయలను రవాణా రుసుములతో కలిపి అమ్ముతున్నారు. ఈ పథకంలో రూ.90 రాయితీ ఇస్తూ కేవలం రూ.10 చెల్లిస్తే ఎనిమిది రకాల కూరగాయల విత్తనాలు అందిస్తాం. - సోమిరెడ్డి, ఉద్యానవనశాఖ ఏడీ