కొనలేం..తినలేం...
► కూరగాయల ధరలు పైపైకి....!
గరుగుబిల్లి: జిల్లాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజకు పెరుగుతున్న ధరలతో కూరగాయలు కొనలేని, తినలేని పరిస్థితి దాపురిస్తోంది. గత 15రోజులు నుంచి కూరగాయల ధరలు రెట్టింపు అవ్వడంతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు బీతిల్లుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా కూరగాయ పంటలు లేకపోవడంతో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఒకవైపు ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.
మండలంలోని గొట్టివలస, పెద్దూరు, గరుగుబిల్లి, చినగుడబ తదితర గ్రామాలలో రైతులు తమపండించిన టమోట, బీర, చిక్కుడు, ఆనప, తోటకూర, జనపకూర వంటి కూరగాయలను సమీపంలోని పార్వతీపురం మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దీంతో గ్రామాలలోని చిరువ్యాపారులు పార్వతీపురం మార్కెట్‌నుండి తీసుకొచ్చి గ్రామాలలో ప్రజలకు విక్రయాలు చేస్తుంటారు. ప్రస్తుతం గ్రామాలలో కిలో కూరగాయలు ధరలు ఇలావున్నాయి. వంకాయలు రూ.40, దొండ రూ.40, టమోట రూ.40, బెండ రూ.40, కాకరకాయలు రూ.40, బీరకాయలు రూ.40, మునగకాడలు రూ.80, ఉల్లిపాయలు రూ.20లు పలుకుతోంది. ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ తగినంత ఉత్పత్తిలేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. ధరలను అదుపులో ఉంచి సామాన్యులకు అందుబాటులో కూరగాయలను సరఫరాచేసేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు అధికారులను కోరుతున్నారు.