ధరవింటే దడ | prices are very huge increased | Sakshi
Sakshi News home page

ధరవింటే దడ

Published Mon, Sep 2 2013 4:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

prices are very huge increased

 పాలమూరు, న్యూస్‌లైన్: పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడికి కలవరపెడుతున్నాయి. ఉల్లి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. మిర్చి రూటే సప‘రేటు’. కిలో పచ్చిమిర్చి ధర రూ.80 దాటి పైకి ఎగబాగుతోంది. వెల్లుల్లి రేటు మరింత ఘాటెక్కింది. బీర, బెండ, చిక్కుడు కాయలు కిలో ధర రూ.35 దాటి సగటు జీవిని బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో కూరగాయల దిగుబడి లేకపోవడం, పక్కజిల్లాల నుంచి కూడా రవాణా లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన సాగుభారం కారణంగా అన్నదాతలు కూరగాయల సాగుపై దృష్టిసారించడం లేదు.
 
 జిల్లా 41లక్షలు ఉండగా.. దాదాపు 11 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం ఒక్కో కుటుంబం నెలకు సగటున 20 కిలోల కూరగాయలు వినియోగిస్తుంది. ఈ లెక్కన జిల్లాలో నెలకు 2.40 కోట్ల కిలోలు (24వేల టన్నులు) అవసరమని అధికారుల అంచనా..అయితే జిల్లాలో కూరగాయల దిగుబడి 25శాతం కూడా రావడంలేదు. ఏడాదిలో 8.80 కోట్ల కిలోల(88వేల టన్నులు) దిగుబడి వస్తుందని అంచనా.
 
 దీని ప్రకారం జిల్లాకు ఇంకా 20 కోట్ల కిలోల కూరగాయల కొరత ఏర్పడుతుంది. జిల్లా మొత్తంగా ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లను కలుపుకుని 22వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టాల్సి ఉండగా.. ఈ ఖరీఫ్‌లో ఐదువేల ఎకరాలోపు మాత్రమే సాగుచేపట్టారు. ఏడాది మొత్తంలో 8.80 కోట్ల కిలోల(88వేల టన్నులు) దిగుబడి వస్తున్నా ఇక్కడ పండించిన కూరగాయలను రైతులు దళారులకు అమ్మడం, దళారులు జిల్లాయేతర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో కొరత తీవ్రమవుతుంది. స్థానికంగా పండించిన కూరగాయలను ఇక్కడే విక్రయించే విధంగా చేస్తూ, సాగు విస్తీర్ణం పెరిగేవిధంగా చర్యలు తీసుకుంటే ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. రైతులకు రాయితీ కల్పిస్తూ కూరగాయల సాగులో ప్రోత్సహిస్తే పెరిగిన ధరలకు కళ్లెం వేసే అవకాశం ఉంటుంది.
 
 తగ్గిన సాగు..పెరిగిన ధరలు
 అలంపూర్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉల్లిసాగు తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో విపరీతమైన ధర పలుకుతుంది. నాణ్యమైన ఉల్లి రూ.60 నుంచి రూ.90 ధర పలుకుతుంది. మేలో సాగుచేసిన ఉల్లి పంట దిగుబడులు మార్కెట్‌కు వస్తున్నాయి. మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను చుట్టుముట్టడంతో పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో అంతంతమాత్రంగానే సాగయింది. గతేడాది ఉల్లి సాగు ఘణనీయంగా తగ్గడంతో దిగుబడి కూడా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలోఉల్లి ధర రూ.90 వరకు చేరింది. సాధారణంగా 110 రోజులకు ఉల్లి పంట చేతికందుతుంది. ఏ కాలంలోనైనా ఈ పంటను సాగుచేసుకునే వీలు ఉంటుంది.
 
 వడ్డేపల్లి, మానవపాడు, అయిజ, ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో మే, జూన్ నెలలోనే సుమారు రెండువేల ఎకరాల్లో ఉల్లిని సాగుచేశారు. ఉల్లి రైతులకు లాభాలు తెచ్చిపెడుతుండటంతో సాగు మరింత పెరిగింది. ఉల్లికి డిమాండ్ ఉండటంతో ఎకరాకు దాదాపు రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంటసాగుచేపట్టారు. అయితే మే నెలలో సాగుచేసిన రైతులకు పంట లాభసాటిగా మారింది. నెలరోజుల క్రితం మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.4.500 వేల నుంచి రూ.ఆరువేల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాలు ధర రూ.2400 నుంచి రూ.మూడువేలకు వరకు పలుకుతుంది.
 
 వ్యాపారుల మాయాజాలంతోనే..
 జిల్లాలో ఏడాదికి 22వేల హెక్టార్లలో కూరగాయల సాగు ఉంటుంది. ఇక్కడ పండించిన పంటను వ్యాపారులు పొలాలవద్ద నుంచే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా రవాణా ఖర్చులు తగ్గుతాయని, మార్కెటింగ్ ఇబ్బందులు తప్పుతాయనే ఉద్దేశంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దళారులు వీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కూరగాయలను రవాణా రుసుములతో కలిపి అమ్ముతున్నారు. ఈ పథకంలో రూ.90 రాయితీ ఇస్తూ కేవలం రూ.10 చెల్లిస్తే ఎనిమిది రకాల కూరగాయల విత్తనాలు అందిస్తాం.
 - సోమిరెడ్డి,
 ఉద్యానవనశాఖ ఏడీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement