దరలు కుతకుత!
అనంతపురం రాజు రోడ్డుకు చెందిన రాములమ్మ ఇంటికి బంధువులు రావడంతో బిర్యానీ చేయడానికి సోనామసూరి బియ్యం కోసం మార్కెట్‌కు వెళ్లింది. కిలో బియ్యం (పాతవి) రూ.50 అని వ్యాపారి చెప్పడంతో కంగుతినింది. మొన్నటి వరకు రూ.40 ఉండేవి కదా అని అడిగితే.. ‘ఔనమ్మా అది మొన్నటి మాట. ఇప్పుడు ధర పెరిగింద’ని చెప్పడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. దారి మధ్యలో మరో అంగడికి వెళ్లి కిలో కందిపప్పు ఎంతని అడగ్గా.. రూ.80 అని చెప్పడంతో ఆమె కళ్లు తేలేసింది.
సాక్షి, అనంతపురం : పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పు చారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేదలు వాపోతున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4 వేలు ఉండగా... ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరు మాసాల క్రితం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉన్న పెసర, ఉద్దులు, కందిపప్పు ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది.
చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతో పాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. తె గుళ్ల దెబ్బకు తమిళనాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
కూరగాయలదీ అదే రూటు
కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళ్తే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా ఏ కూరగాయను ముట్టుకున్నా కిలో రూ.30 పైమాటే. కందగడ్డ కిలో రూ.70, కాలీఫ్లవర్ ఒకటి రూ.15 -20, మునక్కాయలు (నాలుగు) రూ.20 పలుకుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావం కారణంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా దిగుబడి పెద్దగా లేకపోవడంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.