టమోట @ రూ.80
రైతుబజారులో కిలో రూ.65
నూజివీడు: పచ్చిమిర్చి కిలో ధర సెంచరీకి చేరి కొనుగోలుదారులకు ఘాటుచూపిస్తుండగా, నేడు టమోట వంతు వచ్చింది. వేసవి కారణంగా టమోట సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో టమోట ధర ౖపైపెకి ఎగబాకుతోంది. రైతుబజారులోనే కిలో రూ.65కు చేరడంతో ప్రజలు కొనాల్సిన చోట పావుకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో టమోట ధర రూ.80 పలుకుతోంది. గ్రామాల్లో రూ.80 నుంచి రూ.90 విక్రయిస్తున్నారు.
దీంతో పెట్టుబడి ఎక్కువ అవడం, ప్రజల కొనుగోలు తగ్గిపోవడంతో రైతుబజారులో ని దుకాణదారులు కూడా సగానికి సగం అమ్మకాలను తగ్గించేశారు. వేసవికి ముందు సాగుచేసిన పంటకాలం పూర్తికావడంతో స్థానికంగా టమోటకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం నుంచి వస్తున్న టమోటను హోల్‌సేల్ వ్యాపారుల వద్ద నుంచి కొనుగోలు చేసి అమ్మాల్సి వస్తుండటంతో టమోట ధర బాగా పెరిగింది. టమోట ధర మామూలుగా ఉన్నప్పుడు నూజివీడు రైతుబజారులో రోజుకు రెండు టన్నుల వరకు అమ్ముడుపోయేవి. ధర పెరగడంతో కేవలం టన్ను కూడా అమ్ముడుకావడం లేదని దుకాణదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment