గాలివాన తో అపార నష్టం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు గాలివానతో అపార నష్టం సంభవించింది. కదిరి వ్యవసాయ సబ్ డివిజన్‌లోనే రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో అరటి, మామిడి, ఆకుతోటలు నేలవాలగా... విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈదురుగాలులకు రేకుల షెడ్లు ఎగిరిపోగా.. భారీ వర్షానికి పెద్ద సంఖ్యలో పాతమిద్దెలు కూలిపోయాయి. గాండ్లపెంట, తనకల్లు, తలుపుల, నల్లచెరువు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, ఓడీచెరువు, తాడిమర్రి, నల్లమాడ, బత్తలపల్లి, లేపాక్షి, చిలమత్తూరు, నార్పల, గుంతకల్లు, గుత్తి, విడపనకల్ తదితర మండలాల పరిధిలో పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో కుంటలు నిండాయి. చెరువుల్లోకి కొంత మేర నీరు చేరింది. పంట, ఆస్తి నష్టం అంచనా వేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఘనంగా తొలకరి ప్రారంభం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మూడ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం కురుస్తున్నా.. సోమవారం రాత్రి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నెలలో సాధారణ వర్షాపాతం 63.9 మి.మీ.కాగా తొలి మూడ్రోజులకే 34.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో ‘అనంత’ అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల మధ్య సోమవారం అర్ధరాత్రి 63 మండలాల్లోనూ వర్షం కురిసింది. ఒక్కరోజే 31.4 మి.మీ సగటు నమోదు కావడం గమనార్హం. గుంతకల్లు మండలంలో కుండపోత (91 మి.మీ) వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని మండలాల్లో మోస్తరుగా కురిసింది. యల్లనూరు మండలంలో 67.4 మి.మీ, గుత్తిలో 65 మి.మీ, తాడిమర్రిలో 64.2 మి.మీ, తాడిపత్రిలో 61 మి.మీ, రాయదుర్గంలో 51.2 మి.మీ, విడపనకల్‌లో 48.6 మి.మీ, బ్రహ్మసముద్రంలో 48 మి.మీ, వజ్రకరూరులో 46 మి.మీ, కదిరిలో 44.6 మి.మీ, నార్పల 43.4 మి.మీ, నల్లచెరువు 42.4 మి.మీ, అమడగూరు 41.2 మి.మీ, అమరాపురం 41 మి.మీ వర్షపాతం నమోదైంది. ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువు, మడకశిర, తలుపుల మండలాల్లో మాత్రమే 10 మి.మీ లోపు వర్షం కురిసింది.
వర్ష సూచన
రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంటలోని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, డాక్టర్ వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 10 నుంచి 50 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు.