ప్రజా బాట | Public trail | Sakshi
Sakshi News home page

ప్రజా బాట

Published Sat, Aug 2 2014 3:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

Public trail

అనంతపురం క్రైం : మారుమూల గ్రామాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు గుర్తించిన నూతన ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్ తనే ప్రజల వద్దకు వెళ్లాలని భావించారు. వారానికి ఒకసారి సబ్ డివిజన్ కేంద్రాలకు వెళ్లి ‘పోలీస్ ప్రజా బాట’ పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు.
 
 ఏ వారం ఎక్కడ నిర్వహిస్తారనేది ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేస్తారు. దానికనుగుణంగానే పరిసర మండలాల ప్రజలు అక్కడికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వవచ్చు. శనివారం తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి ‘పోలీస్ ప్రజా బాట’కు శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాంతం పగలు, ప్రతీకారాలతో అట్టుడుకుతోంది. అధికార పార్టీ ముసుగులో కొందరు విచక్షణారహితంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి.
 
 వీరి ఉన్మాదాలు భరించలేక సామాన్యులు గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. చెట్ల నరికివేత ఘటనలపై కనీసం ఫిర్యాదులు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు పోలీసు అధికారులు సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఇటువంటి ప్రాంతంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎస్పీ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు.
 
 నేడు తాడిపత్రి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో
 తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్పీ ‘పోలీస్ ప్రజాబాట’ నిర్వహిస్తారు. ‘పోలీస్ ప్రజాబాట’ కార్యక్రమం విధి విధానాలను ఎస్పీ శుక్రవారం వెల్లడించారు. పోలీసు పరమైన చర్యలతో న్యాయం చేయగల్గినన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, ఎవరైనా సరే ఎస్పీని కలిసి ఫిర్యాదు రూపంలో సమస్యలు చెప్పుకోవచ్చు. అసాంఘిక కార్యకలాపాలు, ఫ్యాక్షన్ తదితర అంశాలపై కూడా ఫిర్యాదు చేయొచ్చు.
 
 ముందుగా తెలియజేస్తే మరింత ఉపయోగం
 ‘పోలీస్ ప్రజాబాట’ కార్యక్రమం చాలా మంచిది. అయితే ప్రజలకు రెండు మూడు రోజుల ముందు సమాచారం ఇస్తే బావుంటుంది. ఉదయం పత్రికలు చదివి సమాచారం తెలుసుకుని ఆ కార్యక్రమం నిర్వహించే చోటుకు రావాలంటే సామాన్యులకు చాలా కష్టం. వివిధ పనుల నిమిత్తం ఊళ్లకు వెళ్లిన వారు.. భయంతో గ్రామాలు వదిలిన వారు రావడానికి కనీస వ్యవధి ఉండేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే బావుంటుందని ప్రజలు భావిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement