sub division
-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్‌మ్యాన్
-
టెక్కలి పోలీసు సబ్ డివిజన్‌కు ప్రతిపాదనలు
నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలోని మూడు పోలీసు సబ్ డివిజన్లకు అదనంగా టెక్కలిలో మరో సబ్ డివి జన్ను ఏర్పాటుకు, కాశీబుగ్గ సబ్‌డివిజన్ కేంద్రాన్ని ఇచ్ఛాపురానికి మార్చేందుకు ప్రతిపాదించా మని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ తెలిపారు. నరసన్నపేట, ఆమదాలవలసల్లో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నరసన్నపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో గతంలో పొల్చితే కానిస్టేబుళ్ల సంఖ్య బాగా పెరిగిందని, రిమోట్ మండలాల్లోనూ అవసరం మేరకు వేశామన్నారు. ఇటీవల 260 మంది కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. తగ్గిన ప్రమాదాలు.. జిల్లాలో 170 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై మే నెలలో ముగ్గురు మాత్రమే ప్రమాదాల్లో మరణించారన్నారు. ఇతర ప్రమాదాలు చాలా మేరకు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. గతేడాది మేలో 51 ప్రమాదాలు కాగా, ఈ ఏడాది మేలో 17కు తగ్గాయన్నారు. వీటిని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగతనాలు అదుపులో ఉన్నాయని, గుట్కా అమ్మకాలపై పూర్తిగా పట్టుబిగించామని, రహదారిపై అక్రమ రవాణా ను ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తూ అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. బెల్ట్ షాపులు తగ్గాయని తెలిపారు. ఆటోలు, మినీ వ్యాన్‌ల్లో అధిక లోడ్ కేసులు పెడుతున్నామని, డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండో స్థానంలో కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ జిల్లాలో 2,901 మంది కమ్యూనిటీ పోలీసుల పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో 410 మం ది వరకూ రోజూ విధులకు వస్తున్నారని ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ నిర్వహిం చడంలో చిత్తూరు తరువాత మనమే ఉన్నామని పేర్కొన్నారు. వీరికి వారి ఇష్టం మేరకే పనులు అప్పగిస్తున్నామని, అమ్మాయిలు కూడా వస్తున్నారని తెలిపారు. పాలకొండ, రాజాంలో షీ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సబ్ డివిజ న్ వద్ద ప్రత్యేక షీటీంలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయని, నరసన్నపేటలో క్వార్టర్స్ దుస్థితి స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. వీటి మరమ్మతులకు నివేదికలు పంపామన్నారు. -
పోలీస్ శాఖలో మరో ఫిర్కా
♦ గూడూరు సబ్ డివిజన్ విభజనకు ప్రతిపాదనలు ♦ నాయుడుపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం ♦ ఎర్ర చందనం, ఇసుక. సిలికా అక్రమ రవాణా నియంత్రణే కీలకం ♦ డీజీపీ నిర్ణయమే తరువాయి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో మరో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ సబ్ డివిజన్‌గా ఉన్న గూడూరును రెండుగా విభజించాలని నిర్ణయించారు. ఇం దుకు రెవెన్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకుని ప్రతిపాదనలు పంపించారు. గూ డూరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ తోపాటు నేరాల నియంత్రణ కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలు డీజీపీ పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 5పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 22 సర్కిల్స్, 64 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్స్, 20 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లాలోని మొత్తం స్టేషన్లలో 30 శాతం ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పోలీస్ సబ్ డివిజన్ల పరిధితో పోలిస్తే ఇది మూడు రెట్లు పెద్దది. రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ డివిజన్‌గా, భారీగా అక్రమ ఆదాయం పొందే కేంద్రంగా పేరొందింది. ఆదాయం అంతా ఇంతా కాదు జిల్లాలో సాగే అక్రమ వ్యాపారంలో అత్యధిక శాతం గూడూరు సబ్ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. ఎర్ర చందనం మొదలుకొని సిలికా, ఇసుక అక్రమ రవాణా అంతా ఇక్కడే నడుస్తుంది. అత్యధిక మామూళ్లు వచ్చే సబ్ డివిజన్ కావటంతో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ పనిచేస్తూ గత నెలలో వీఆర్‌కు బదిలీ అయిన డీఎస్పీ బి.శ్రీనివాస్‌పై పెద్దెత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ నెలకు రూ.50 లక్షలపైనే మామూళ్లు, ఇతర ఆదాయం ఉంటుందని అంచనా. తమిళనాడు నుంచి అక్రమంగా వచ్చే బియ్యం, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అక్రమ రవాణా దారుల నుంచి భారీగా మామూళ్లు అందుతాయి. ఇసుక రవాణా ఆదాయం రూ.లక్షల్లో ఉంటుంది. వెంకటగిరి స్టేషన్ పరిధిలో ఎర్ర చందనం కేసులు ఎక్కువ. గతంలో కొందరు పోలీస్లే ఎర్ర చందనం అక్రమ రవాణా వాహనాలకు పైలట్‌గా వ్యవహరించేవారు. దీనికి గాను రూ.లక్షల్లో ముడుపులు అందేవి. సిలికా ఇసుక అక్రమ రవాణా కూడా ఇక్కడే అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో 250కి పైగా మద్యం షాపులు, 10 వరకు బార్లు ఉన్నాయి. వీటి నుంచి రూ.12 లక్షల వరకు అందుతాయి. ఇదిలావుంటే.. జాతీయ రహదారి పరిధి అత్యధికంగా దీని పరిధిలోనే ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు డిమాండ్ ఉండేది. గత నెలలోనే ప్రతిపాదనలు గూడూరు సబ్ డివిజన్‌ను గూడూరు, నాయుడుపేట సబ్ డివిజన్లుగా విభజించాలని ప్రతిపాదించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట సర్కిల్స్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లతోపాటు ఓజిలి స్టేషన్‌ను కలిపి 7 స్టేషన్లు, రెండు సర్కిల్స్‌తో నాయుడుపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనూ ప్రతిపాదనలు వెళ్లగా.. పురోగతి లేకపోవటంతో తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపారు. ఇక్కడి పరిస్థితిని డీజీపీకి వివరించిన ఉన్నతాధికారులు సబ్ డివిజన్‌ను విభజించాలని కోరారు. సాంకేతికపరమైన లాంఛనాలను పూర్తి చేసుకుని నెల రోజుల్లో కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
చినుకు రాలదు.. చింత తీరదు!
జిల్లాను కరువుచాయ కమ్ముకుంటోంది.. బోరుబావుల్లో నీరింకిపోయింది. చినుకు రాలకపోవడంతో మట్టిలో పోసిన విత్తనం మాడిపోయింది. రెక్కలుముక్కలు చేసుకున్న అన్నదాత కష్టమంతా మట్టిపాలైంది. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసి.. ఎదురుచూసి ఆశ ఆవిరైంది. వాడుపట్టిన మొలకలు చూసి రైతుగుండె తరుక్కుపోతోంది. అచ్చంపేట జిల్లాలో వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చినుకు కురవకపోవడంతో మెట్టపంటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధిలో 50శాతం మంది రైతులు విత్తనాలు విత్తారు. నీటి వనరులు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల సహాయంతో భూమిని తడిపి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్టరైతులు మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఎకరా పత్తిసాగుకు రూ.15వేల పెట్టుబడి అవుతుంది. వర్షాలు కురవకపోతే మళ్లీ ైరె తులు దుక్కిదున్ని సాగుచేయాలంటే రెట్టింపు ఖర్చవుతోంది. అచ్చంపేట వ్యవసాయశాఖ సబ్‌డివిజన్ పరిధిలోఖరీఫ్సాగు విస్తీర్ణం 25,890 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 13,450 హెక్టార్లు సాగుచేశారు. పత్తి పంటలు మొలకెత్తకుండా భూమిలోనే వాడిపోయాయి. బిందెలతో పంటలకు నీళ్లు కొత్తూరు: ఈ ఏడాది సరైన వర్షాలు కురియక రైతులు సాగుచేసిన పంటలను రక్షించుకోవడానికి నానాఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి రెండెకరాల్లో టమాట తోటను సాగుచేశాడు. వర్షాలు ముఖం చాటేయడంతో పంట ఎండుతుంది. దీంతో ఎలాగైన పంటను రక్షించుకోవాలనే తపనతో కూలీల సాయంతో పంటకు బిందెలతో నీళ్లు పోయిస్తున్నాడు. తక్కువ వర్షపాతం న మోదు బాలానగర్: మండలంలో 787 హెక్టార్లలో వరిని సాగుచేశారు. 7835 హెక్టార్లలో మక్కజొన్నసాగు చేశారు.5042 హెక్టార్లలో పత్తిసాగుచేశారు. అదేవిధంగా 404 హెక్టార్లలో కందిసాగుచేశారు. అయితే విత్తనం విత్తిన నాటినుంచి వర్షాలు కురవకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయి. ఇప్పటికే మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ, రాజాపూర్, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న మొక్కలు పూర్తిగా ఎండిపోయేదశలో ఉన్నాయి. జూన్‌లో 84 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. మండలంలో కేవలం 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే అన్నదాతలు అప్పుచేసి విత్తనాలు కొనుగోలుచేస్తే మట్టిపాలయ్యాయని లబోదిబోమంటున్నారు. ఎండిపోతున్న మొలకలు జడ్చర్ల: నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట, బాలానగర్ మండలాల్లో దాదాపుగా 40వేల హెక్టార్లలో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేశారు. పంటసాగు కోసం ఎకరాకు రూ.ఐదు నుంచి ఏడువేల వరకు ఖర్చుచేశారు. ఈలెక్కన నియోజకవర్గంలో దాదాపుగా రూ.8కోట్లకు పైగానే విత్తనాల సాగుకు వెచ్చించారు. తీరా వర్షం కురవకపోవడంతో విత్తనాలు భూమిలోనే ఇంకిపోయాయి. బోరు వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా మొలకలను కాపాడుకుంటున్నారు. -
‘రెడ్’ టెన్షన్
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఇంటిదొంగల సహకరంతో విలువైన ఎర్రసంపద తరలిపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఎర్రదొంగల భరతం పట్టేందుకు పోలీసు, అటవీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటి దొంగల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఎర్రదొంగలకు మరో నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలతో పాటు ఆత్మకూరు, గూడూరు, కావలి సబ్డివిజన్లలో కొందరు పత్రికా విలేకరులు సహకరించారన్న ఆరోపణలు గుప్పముంటున్న నేపథ్యంలో వారిపై సైతం చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వారిపై సైతం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అభయహస్తం ఇచ్చిన అధికారిని సైతం దూరంగా ఉంచినట్లు సమాచారం. దీంతో ఎర్ర దొంగల్లో తిరిగి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణాపై ఉక్కుపాదం అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పోలీసు, అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎర్రదుంగ ఒక్కటి కూడా జిల్లాదాటి వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా జిల్లాలో ఎంతమంది స్మగ్లర్లు ఉన్నారు? వారి వ్యక్తిగత వివరాలు? కుటుంబ నేపథ్యాన్ని సేకరించడంతో పాటు గతంలో వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఏయే వాహనాలు వినియోగిస్తున్నారు? ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నారా ఆన్న వివరాలు ఆరాతీసి జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. వారిపై త్వరలో రౌడీషీట్లు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తనిఖీలు ముమ్మరం ఎర్ర కూలీలు జిల్లాలో అడుగిడకుండా ఉండేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తోన్నట్లు తెలిసింది. ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగే ప్రాంతాల్లో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి సత్ఫలితాలు సాధించాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్, డీఎఫ్ఓ శ్రీకాంత్‌నాథ్‌రెడ్డి కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఒక్క దుంగ జిల్లా దాటి బయటకు వెళ్లినా అందుకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తోంది. అదేక్రమంలో జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దులపై సైతం నిఘా ఉంచేందుకు అక్కడి పోలీసులతో కూడా సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. -
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తుళ్లూరు!
విజయవాడ సిటీ: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోకి రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్‌ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కమిషనరేట్ విస్తరణపై చర్చించేందుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.ప్రసాదరావు, రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని కమిషనరేట్ స్వరూప స్వభావాలపై చర్చించారు. ఆదివారం నగరానికి వచ్చిన డీజీపీ కూడా సీపీతోపాటు గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో మరోసారి ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటు నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతాన్ని విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో కలపాల్సిన ఆవశ్యకతపై ఇక్కడి అధికారులు గతంలోనే నివేదిక ఇచ్చారు. కమిషనరేట్ పరిధితోపాటు పోలీసుల సంఖ్య పెంపు, వాహనాలు, ఆయుధాలు, ఇతర విభాగాల ఏర్పాటు తదితర అంశాలపై తయారుచేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు తుళ్లూరు గుంటూరు జిల్లాలో ఉన్నందున గుంటూరు కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలని అక్కడి అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండు నివేదికలను పరిగణనలోకి తీసుకొని సోమవారం నగర పోలీసు కమిషనరేట్‌లో జరిగే సమావేశంలో డీజీపీ రాముడు విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. తుళ్లూరు ప్రాంతాన్ని నగర పోలీసు కమిషనరేట్‌లో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు ప్రతిపాదనలు... రాజధాని ప్రతిపాదిత ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉంది. ఆ ప్రాంతం విజయవాడకు సమీపంలో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రభుత్వం ముందుకు రెండు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. నగర పోలీసు కమిషనరేట్ పరిధి విస్తరణలో భాగంగా తుళ్లూరు ప్రాంతాన్ని కలపడం వాటిలో మొదటిది. గుంటూరును సైబరాబాద్ కమిషనరేట్ తరహాలో విస్తరించడం రెండో ప్రతిపాదన. హైదరాబాద్ కమిషనరేట్‌లో రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. -
ప్రజా బాట
అనంతపురం క్రైం : మారుమూల గ్రామాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు గుర్తించిన నూతన ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్ తనే ప్రజల వద్దకు వెళ్లాలని భావించారు. వారానికి ఒకసారి సబ్ డివిజన్ కేంద్రాలకు వెళ్లి ‘పోలీస్ ప్రజా బాట’ పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. ఏ వారం ఎక్కడ నిర్వహిస్తారనేది ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేస్తారు. దానికనుగుణంగానే పరిసర మండలాల ప్రజలు అక్కడికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వవచ్చు. శనివారం తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి ‘పోలీస్ ప్రజా బాట’కు శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాంతం పగలు, ప్రతీకారాలతో అట్టుడుకుతోంది. అధికార పార్టీ ముసుగులో కొందరు విచక్షణారహితంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి. వీరి ఉన్మాదాలు భరించలేక సామాన్యులు గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. చెట్ల నరికివేత ఘటనలపై కనీసం ఫిర్యాదులు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు పోలీసు అధికారులు సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఇటువంటి ప్రాంతంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎస్పీ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. నేడు తాడిపత్రి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్పీ ‘పోలీస్ ప్రజాబాట’ నిర్వహిస్తారు. ‘పోలీస్ ప్రజాబాట’ కార్యక్రమం విధి విధానాలను ఎస్పీ శుక్రవారం వెల్లడించారు. పోలీసు పరమైన చర్యలతో న్యాయం చేయగల్గినన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, ఎవరైనా సరే ఎస్పీని కలిసి ఫిర్యాదు రూపంలో సమస్యలు చెప్పుకోవచ్చు. అసాంఘిక కార్యకలాపాలు, ఫ్యాక్షన్ తదితర అంశాలపై కూడా ఫిర్యాదు చేయొచ్చు. ముందుగా తెలియజేస్తే మరింత ఉపయోగం ‘పోలీస్ ప్రజాబాట’ కార్యక్రమం చాలా మంచిది. అయితే ప్రజలకు రెండు మూడు రోజుల ముందు సమాచారం ఇస్తే బావుంటుంది. ఉదయం పత్రికలు చదివి సమాచారం తెలుసుకుని ఆ కార్యక్రమం నిర్వహించే చోటుకు రావాలంటే సామాన్యులకు చాలా కష్టం. వివిధ పనుల నిమిత్తం ఊళ్లకు వెళ్లిన వారు.. భయంతో గ్రామాలు వదిలిన వారు రావడానికి కనీస వ్యవధి ఉండేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే బావుంటుందని ప్రజలు భావిస్తున్నారు. -
వరినాట్లుకు శ్రీకారం
తెనాలిటౌన్ : మూడు రోజుల క్రితం వర్షాలు కురవడంతో డెల్టాలో వరినాట్లకు రైతులు శ్రీకారం చుట్టారు. బోర్లు కింద పోసిన నారుమళ్లు ఏపుగా పెరగడంతో కంచర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో శుక్రవారం నాట్లు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల వల్లన కాల్వలకు సకాలంలో నీరు విడుదల అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఎక్కువ మంది వెద పద్ధతిపై వరిసాగుకు మొగ్గు చూపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 93,750 ఎకరాల మాగాణి విస్తీర్ణం ఉంది. దీనిలో దుగ్గిరాల మండలంలో 22 వేల ఎకరాలు, తెనాలిలో 22,500 ఎకరాలు, కొల్లిపరలో 15 వేల ఎకరాలు, కొల్లూరులో 12,250 ఎకరాలు, వేమూరులో 22వేల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. కాగా డివిజన్ పరిధిలో సుమారు 40 వేల ఎకరాల్లో వెద పద్ధతిలో వరిసాగు చేపట్టారు. మిగతా 53,750 ఎకరాల్లో సాధారణ పద్ధతిలో వరినాట్లు వేయాల్సి ఉంది. మరో 10 రోజుల్లో నాట్లు వేసేందుకు పొలాలను రైతులు సిద్ధం చేస్తున్నారు. -
‘కృషి విజ్ఞానం’ వృథా!
వ్యవసాయంలో రోజురోజుకు వస్తున్న ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి వారిని అభివృద్ధి పరిచేందుకు కమాన్‌పూర్ మండలం రామగిరిఖిల్లా ప్రాంతంలో నెలకొల్పిన కృషి విజ్ఞాన కేంద్రం అన్నదాతలకు అక్కరకు రాకుండా పోయింది. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.50లక్షలు వెచ్చిస్తున్నా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. - మంథని మంథని నియోజకవర్గం కమాన్‌పూర్ మండలం రామగిరిఖిల్లా ప్రాంతంలో 2010లో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.85లక్షలతో రైతు వసతిగృహం, శిక్షణ కేంద్రంతోపాటు ఇతర పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని మంథని, మహదేవపూర్ సబ్ డివిజన్లతోపాటు జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మెట్పల్లి సబ్డివిజన్ల రైతులకు వ్యవసాయంపై అవగాహన, వివిధ పంటల సాగుపై శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పనిచేయాలి. ప్రతీ బ్యాచ్‌లో 30నుంచి 40మందికి శిక్షణ ఇచ్చి వారిని వ్యవసాయ రంగంలో రాణింపజేయాలి. కానీ మొక్కుబడిగా కేంద్రం పనిచేస్తుండడంతో రైతులు ఇంకా వ్యవసాయికంగా వెనుకబడే ఉన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, గృహవిజ్ఞానం, తెగుళ్ల నివారణపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రం పరిధిలోకి వచ్చే ఆయా సబ్డివిజన్లలోని గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించి అవగాహన కల్పించాలి. శిక్షణ పొందేందుకు ముందుకు వచ్చే రైతులకు తమ కేంద్రంలో శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటునందించాలి. అయితే ఈ కేంద్రంలో ఏడుగురు శాస్త్రవేత్తలు పనిచేయాల్సి ఉండగా, కేవలం తెగుళ్ల నివారణ శాస్త్రవేత్త మాత్రమే ఉన్నారు. ఈయనే అన్నీ తానై పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా రంగాల శాస్త్రవేత్తల నియామకం రెండేళ్లుగా జరగలేదు. రైతుల మేలు కోసం పనిచేసే కేంద్రం ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. గత సర్కారు కేంద్రం నిర్వహణ, నిధుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపయోగంగా మారింది. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పరిధిలోనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటాపూర్ యూనివర్సిటీ పరిధిలో రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజనల తర్వాత కూడా కేంద్రాన్ని అలాగే ఉంచడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని కాంట్రాక్ట్ పద్ధతిన పూరించే వీలు లేకుండా పోయింది. భూమి కేటాయించినా అభివృద్ధికి నిధులు కరువు.. కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రభుత్వం 64ఎకరాల భూమిని కేటాయించినా దాని అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయకపోవడంతో నిరుపయోగంగా ఉంటోంది. రెండో విడత మంజూరు చేసిన రూ.7లక్షల్లో రెండు బోరువెల్లు ఏర్పాటు చేయగా, వాటికి విద్యుత్ సౌకర్యం కోసం నిధులు మంజూరు చేయడంలో సర్కారు జాప్యం చేసింది. రెండు నెలల క్రితం రూ. 3లక్షలు ఇవ్వగా విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కొద్దిపాటి భూమిని చదును చేసి మామిడి మొక్కలు నాటారు. ప్రభుత్వం కేంద్రం నిర్వహణకు అవసరమైన నిధులు, శాస్త్రవేత్తలను నియమిస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వమైనా దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. -
గాలివాన తో అపార నష్టం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు గాలివానతో అపార నష్టం సంభవించింది. కదిరి వ్యవసాయ సబ్ డివిజన్‌లోనే రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో అరటి, మామిడి, ఆకుతోటలు నేలవాలగా... విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు రేకుల షెడ్లు ఎగిరిపోగా.. భారీ వర్షానికి పెద్ద సంఖ్యలో పాతమిద్దెలు కూలిపోయాయి. గాండ్లపెంట, తనకల్లు, తలుపుల, నల్లచెరువు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, ఓడీచెరువు, తాడిమర్రి, నల్లమాడ, బత్తలపల్లి, లేపాక్షి, చిలమత్తూరు, నార్పల, గుంతకల్లు, గుత్తి, విడపనకల్ తదితర మండలాల పరిధిలో పండ్లతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో కుంటలు నిండాయి. చెరువుల్లోకి కొంత మేర నీరు చేరింది. పంట, ఆస్తి నష్టం అంచనా వేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఘనంగా తొలకరి ప్రారంభం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మూడ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం కురుస్తున్నా.. సోమవారం రాత్రి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నెలలో సాధారణ వర్షాపాతం 63.9 మి.మీ.కాగా తొలి మూడ్రోజులకే 34.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో ‘అనంత’ అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల మధ్య సోమవారం అర్ధరాత్రి 63 మండలాల్లోనూ వర్షం కురిసింది. ఒక్కరోజే 31.4 మి.మీ సగటు నమోదు కావడం గమనార్హం. గుంతకల్లు మండలంలో కుండపోత (91 మి.మీ) వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని మండలాల్లో మోస్తరుగా కురిసింది. యల్లనూరు మండలంలో 67.4 మి.మీ, గుత్తిలో 65 మి.మీ, తాడిమర్రిలో 64.2 మి.మీ, తాడిపత్రిలో 61 మి.మీ, రాయదుర్గంలో 51.2 మి.మీ, విడపనకల్లో 48.6 మి.మీ, బ్రహ్మసముద్రంలో 48 మి.మీ, వజ్రకరూరులో 46 మి.మీ, కదిరిలో 44.6 మి.మీ, నార్పల 43.4 మి.మీ, నల్లచెరువు 42.4 మి.మీ, అమడగూరు 41.2 మి.మీ, అమరాపురం 41 మి.మీ వర్షపాతం నమోదైంది. ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువు, మడకశిర, తలుపుల మండలాల్లో మాత్రమే 10 మి.మీ లోపు వర్షం కురిసింది. వర్ష సూచన రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంటలోని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, డాక్టర్ వై.పవన్‌కుమార్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 10 నుంచి 50 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. -
ఏడవకు తల్లీ
ఇంద్రప్రస్థం నడివీధిలో ఓ యువతి అన్యాయానికి గురై ముష్కరుల అకృత్యానికి బలవ్వడంతో పుట్టిన ‘నిర్భయ’ చట్టం ఇంకా మహిళలకు రక్షాకవచం కాలేకపోతోంది. కఠినతరమైన సెక్షన్ల చట్రం ఉన్నా నేరగాళ్ల మైండ్‌సెట్ మారడం లేదు. కేసుల నమోదు వారిని భయపెట్టడం లేదు. మృగాళ్ల దాష్టీకానికి అడ్డుకట్ట పడడం లేదు. ఇందుకు జిల్లాలో సంభవిస్తున్న ఆ తరహా నేరాల పరంపరే సాక్ష్యమిస్తున్నాయి. ఆడపడుచుల కంట కన్నీరు తుడవలేకపోతున్నాయి. దీంతోటే గురువారం అడ్డాకులలో స్థానికులు ‘నిర్భయ’ కేసు పెట్టిన నిందితులను అరెస్టుచేయాలని పోలీసు స్టేషను ఎదుట ఆందోళన చేశారు. పాలమూరు, న్యూస్‌లైన్ : ఆడపిల్లల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ఎన్ని చర్యలు చేపట్టినా.. జరగాల్సిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. వారిపై లైంగిక వేధింపుల కు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టేం దుకు ఉద్ధేశించిన ‘నిర్భయ’ అమలులో ఉన్నప్పటికీ మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార సంఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలా 2013 జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో దాదాపు 70 వరకు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న దారుణాలు అందరికీ విస్మయాన్ని కలిగిస్తున్నాయి. పదేళ్లలోపు చిన్నారులపై మైనార్టీ తీరని బాలురు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అత్యాచార బాధితులైన బాలికలు ఈ సంఘటన తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంది. గత నెల జరిగిన దారుణాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే.. అభం శుభం ఎరుగని చిన్నారులపై మైనర్ బాలురు అత్యచారానికి పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కల్వకుర్తిలోనూ ఆతర్వాత జిల్లా కేంద్రంలోని హనుమాన్‌పుర కాలనీ సంఘటనల్లోనూ నిందితులు మైనర్లే.., అందరిపైనా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఫలితంగా వారి విలువైన జీవితం జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రం లో గత నెల అయిదు రోజుల వ్యవధిలోనే రెండు, మూడు సంఘటనలు చో టుచేసుకున్నాయి. ఈ చట్టం కింద ఎ క్కువ సంఖ్యలో కింద కేసులు నమోదు చేస్తున్నా.. ఎక్కడా ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడటంలేదు. పోలీసులు ఇలాంటి నేరాల పట్ల క ఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ... అస లు ఈ సంఘటనలు జరుగకుండా అ డ్డుకట్ట వేసేందుకు అవగాహన కార్యక్రమాలపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదు. 70వరకు కేసుల నమోదు 2012 అక్టోబరు నెలలో అమలులోకి వచ్చిన నిర్భయ చట్టం పరిధిలో ఆ ఏడాదిలో పోలీస్ శాఖకు చెందిన నారాయణపేట సబ్ డివిజన్ పరిధిలో 2 కేసులు నమోదయ్యాయి. 2013 జనవరి నుంచి నవంబర్ చివరి వరకు మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు..! 2013 నవంబర్ 23: పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌లో ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. డిసెంబర్ 7: కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. దీనికి 14, 16 ఏళ్లున్న మరో ఇద్దరు బాలురు సహకరించారు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. డిసెంబర్ 14: జిల్లా కేంద్రంలోని హనుమాన్‌పుర కాలనీకి చెందిన ఆరేళ్ల బాలికపై 14, 16 ఏళ్లలోపు వయసున్న నలుగురు బాలురు అత్యాచారం చేశా రు. వారం రోజులుగా వీరు ఆమెపై అ త్యాచారం చేస్తుండగా.. చివరకు తల్లిదండ్రులు గుర్తించి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 18 : జిల్లా కేంద్రంలోని బం డ్ల గేరిలో అయిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయికి తీవ్ర రక్తస్రావం కావడం గుర్తించి జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. 2014 జనవరి 17: పాన్‌గల్ మండలం గుడిసిరెడ్డి పల్లి ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జనవరి 18 : అడ్డాకుల మండలంలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీలో పనికి వెళ్లిన యువతి పట్ల అక్కడి మేనేజర్ అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా సద రు మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి అడ్డాకుల, న్యూస్‌లైన్: మండల పరిధిలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీకి చెందిన నిర్భయ కేసు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఉదయం బాధిత కుటుంబీకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. కంపెనీలో పనికి వెళ్లిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యూనిట్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ శ్రీజిత్‌తో పాటు కంపెనీ మేనేజర్ వైద్యనాథన్, సూపర్వైజర్ దామోదర్‌రెడ్డిలపై పోలీసులు ఈనెల 18న నిర్భయ కేసు నమోదు చేశారు. అయితే నిందితులను అరెస్టు చేయడంలేదని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. గంటకు పైగా స్టేషన్ గేటు ముందు భైఠాయించి నినాదాలు చేశారు. దీంతో శిక్షణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ అబ్దుల్ ఫయాజ్, హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. చివరికి రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు నాగార్జున్‌రెడ్డి, మహిమూద్, ఇంద్రయ్యసాగర్, భీమన్నయాదవ్, శ్రీకాంత్, రామన్‌గౌడ్, అరుణ, చెన్నమ్మ, రఘు, దేవేందర్‌రావు, నరేందర్, చల్మారెడ్డి, రాములు, శ్రీశైలం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ముసుగు తీసేదెవరు?
సాక్షి, అనంతపురం : రాజకీయ ముసుగులో కొందరు పోలీసులు 15 ఏళ్లుగా ఒకే సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ తెరవెనుక దుప్పటి పంచాయితీలు చేస్తుండటంతో నిజాయతీగా పని చేస్తున్న అధికారులకు సహకారం కొరవడుతోంది. చాలా కేసుల్లో ఎప్పటికప్పుడు నిందితులకు సమాచారం అందిస్తుండటంతో బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదు. ముక్కు సూటిగా వ్యవహరించే అధికారులను అక్రమార్కులు ఇక్కట్లలోకి నెట్టడానికి ప్రయత్నిస్తూ వారి జోరుకు ముకుతాడు వేస్తున్నారు. అనంతపురం నగరంలో ఉన్న పలువురు రౌడీ షీటర్లతో కొందరు పోలీసులకు ఉన్న పరిచయాలు బహిరంగ రహస్యం. కొందరు కానిస్టేబుళ్లు వారితో చేయి కలిపి వడ్డీ వ్యాపారం చేయిస్తున్నారు. రౌడీ షీటర్లను అడ్డుపెట్టుకొని రూ. 10 నుంచి రూ.15 వరకు పేదల నుంచి ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇందుకు కారణం వారు ఏళ్లతరబడి ఒకే సబ్ డివిజన్ పరిధిలో పాతుకుపోయి ఖద్దరు నేతలకు గులాంగిరీ చేయడమే. మరికొందరు కొన్ని సంఘాలను అడ్డుపెట్టుకొని తమ దందాను కొనసాగిస్తున్నారు. నగరంలోని మున్నానగర్, రాణి నగర్, అంబారపు వీధి, నాయక్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కళ్యాణదుర్గం రోడ్డు, నడిమివంక సమీపంలో వున్న 4, 5వ రోడ్డులలోను, నగర శివారు కాలనీల్లో నివాసం వుంటున్న కొందరు రౌడీ షీటర్లు బహిరంగంగా దందాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో వీరు మరింత స్పీడు పెంచి తమ తమ ప్రాంతాల్లో బలం నిరూపించుకునేందుకు లోలోపల యత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలకు రౌడీ షీటర్ల మద్దతు అవసరం వుండటం వల్ల వారిపై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యతను సైతం వారు భుజానికెత్తుకొనే పరిస్థితి నెలకొంది. జిల్లాకు కొత్త పోలీస్ బాస్ వచ్చినప్పుడు కొందరు పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. రౌడీ షీటర్లు పెట్టే బాధలను తట్టుకోలేక కొందరు బాధితులు ఫిర్యాదు చేయడానికి ధైర్యంతో ముందుకు వస్తుండగా, మరికొందరు వారు చేసే అరాచకాలకు భయపడి ఫిర్యాదులు చేయడం లేదు. ఇంకొందరైతే ఏకంగా ఊరు విడిచి వెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా స్పందించడం లేదని బాధితులు బహిరంగంగా చెబుతున్నారు. నగరంలోని రాజమ్మ నగర్‌కు చెందిన చిన్న రవి, షహనాజ్ దంపతులు అవసర నిమిత్తం రౌడీ షీటర్ ఆనంద్ నుంచి రూ. 1.50 లక్షలు అప్పు తీసుకోగా వారి నుంచి ఇప్పటికే వడ్డీ రూపంలో రూ. 5 లక్షలు వసూలు చేసినా రౌడీ షీటర్ ఆనంద్ తృప్తి చెందలేదు. న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సమయంలోనే రౌడీ షీటర్ ఆనంద్ ఫోన్ చేసి బెదిరించడాన్ని ప్రత్యక్షంగా చూసిన సీఐ రంగంలోకి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎంత మంది? బలవంతపు వసూళ్లు, ప్రైవేట్ పంచాయితీలు, బెదిరింపులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడానికి ఒకరిద్దరు పోలీసు అధికారులు ముందుకు వస్తున్నా, వారికి ఇదే శాఖలోని కొంత మంది తెరవెనుక నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల గుంతకల్లులో డీఎస్పీ సుప్రజ (ప్రస్తుతం బదిలీ అయ్యారు) సంఘటనను గుర్తుకు తెస్తూ వెనకడుగువేసేలా చేస్తున్నారని తెలుస్తోంది. గుంతకల్లులో తన సొంత మామనే హత్య చేయించిన అల్లుడు చంద్రశేఖర్, అతడికి సహకరించిన వారికి అప్పట్లో డీఎస్పీ సుప్రజ బహిరంగంగా కౌన్సెలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో డీజీపీ ఆమెపై బదిలీ వేటు వేశారు. దీని వెనుక కొందరు పోలీసు అధికారులే చక్రం తిప్పినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. దీంతో కొందరు పోలీసు అధికారులు అప్పటి నుంచి కొంత స్పీడును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధితులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చట్ట పరిధిలోనే చేయవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. గతంలో అంజనాసిన్హా ఎస్పీగా పని చేసిన సమయంలో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్న వారిని పిలిపించి గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని నగర ప్రజలు ప్రస్తుతం గుర్తు చే సుకుంటున్నారు. అసలుకు రెండు.. మూడింతలు వడ్డీ వసూలు చేసిన వారి నుంచి అప్పట్లో ఆమె బాధితులకు బాండ్లు వెనక్కు ఇప్పించారు. ఈ నేపథ్యం లో ‘అనంత’ పోలీసులు తమ దూకుడును పెంచకపోతే అరాచక శక్తులు చాపకింద నీరులా తమ కార్యకలాపాలు ముమ్మరం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలి ప్రస్తుత ఎస్పీ సెంథిల్ కుమార్ ‘ప్రజల చెంతకు పోలీస్’ పేరుతో ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చే యడాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. అయితే వారంలో ఒక పోలీస్‌స్టేషన్‌కు మాత్రమే దానిని పరిమితం చేయడంపై కొందరు పోలీసు అధికారులు చంకలు గుద్దుకుంటున్నట్లు సమాచారం. దీంతో పాటు వారంలో ఒక రోజు జిల్లా కేంద్రంలో కూడా నిర్వహిస్తే ఎక్కువ మంది బాధితులకు న్యాయం చేకూర్చవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతకంటే ముందు ఇంటి దొంగల పని పడితే లక్ష్యం నెరవేరుతుందనే విషయంపై ఎస్పీ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.