నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఇంటిదొంగల సహకరంతో విలువైన ఎర్రసంపద తరలిపోతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఎర్రదొంగల భరతం పట్టేందుకు పోలీసు, అటవీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటి దొంగల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే.
ఎర్రదొంగలకు మరో నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలతో పాటు ఆత్మకూరు, గూడూరు, కావలి సబ్‌డివిజన్‌లలో కొందరు పత్రికా విలేకరులు సహకరించారన్న ఆరోపణలు గుప్పముంటున్న నేపథ్యంలో వారిపై సైతం చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వారిపై సైతం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అభయహస్తం ఇచ్చిన అధికారిని సైతం దూరంగా ఉంచినట్లు సమాచారం. దీంతో ఎర్ర దొంగల్లో తిరిగి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పోలీసు, అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎర్రదుంగ ఒక్కటి కూడా జిల్లాదాటి వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా జిల్లాలో ఎంతమంది స్మగ్లర్లు ఉన్నారు? వారి వ్యక్తిగత వివరాలు? కుటుంబ నేపథ్యాన్ని సేకరించడంతో పాటు గతంలో వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఏయే వాహనాలు వినియోగిస్తున్నారు? ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నారా ఆన్న వివరాలు ఆరాతీసి జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. వారిపై త్వరలో రౌడీషీట్లు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
తనిఖీలు ముమ్మరం
ఎర్ర కూలీలు జిల్లాలో అడుగిడకుండా ఉండేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తోన్నట్లు తెలిసింది. ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగే ప్రాంతాల్లో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి సత్ఫలితాలు సాధించాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్, డీఎఫ్‌ఓ శ్రీకాంత్‌నాథ్‌రెడ్డి కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఒక్క దుంగ జిల్లా దాటి బయటకు వెళ్లినా అందుకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తోంది. అదేక్రమంలో జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దులపై సైతం నిఘా ఉంచేందుకు అక్కడి పోలీసులతో కూడా సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకొంటున్నారు.
‘రెడ్’ టెన్షన్
Published Sat, May 2 2015 2:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement