ప్రొటోకాల్ పాటించకపోతే తిప్పలు
తోటపల్లిగూడూరు: ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రొటోకాల్ పాటించకపోతే అధికారులు ఇబ్బందులు పడక తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ మండల వ్యవసాయాధికారిణి జ్యోత్స్నపై మండిపడ్డారు.
ఇస్కపాళెంలో జరిగిన ఏరువాక కార్యక్రమానికి అధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు రాజగోపాలరెడ్డిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా పీఠం ఎలా వేస్తారని ప్రశ్నించారు. కనీసం వార్డు సభ్యుడు కూడా కాని సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి కుమారుడని, ప్రభుత్వ కార్యక్రమంలో ఏ విధంగా ముఖ్య అతిథిగా కూర్చోబెట్టావని దీనిపై వివరణ ఇవ్వాలని ఏఓ జ్యోత్స్న నిలదీశారు. ప్రొటోకాల్ అంటే ఏంటో తెలుసుకుని అధికారులు పద్ధతిగా వ్యవహరిస్తే మంచిదన్నారు. లేని పక్షంలో ఏ స్థాయి అధికారైనా ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు.