ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: గ్రామ, సచివాలయ వలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని ఎవరైనా నగదు వసూలు చేస్తే తీసుకున్న వారితో పాటు, ఇచ్చిన వారిని కూడా జైలుకు పంపుతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే మంగళవారం రాజధాని నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల కల్పన పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎవరైనా పైరవీలు సాగించి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థుల వద్ద నగదు వసూలుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపించి ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఆశావాహులు అర్హులైతే పార్టీలకు అతీతంగా వలంటీర్ల పోస్టులకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలైన పింఛన్లు, ఇంటి నివేశనా స్థలాలు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్టు తెలిపారు. వీటి అమలులో అవకతవకలు చోటుచేసుకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పథకాల పేరు చెప్పి ఎవరైనా వసూలుకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతికి తావులేదని, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు అర్హులకే అందజేసేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment