మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి, పక్కన వైఎస్సార్‌సీపీ నాయకులు
వెంకటాచలం(నెల్లూరు): అధికారంలోకి వచ్చి 50 నెలలైన తర్వాత ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చాయా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని సర్వేపల్లి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పాలన అవినీతిమయమైందని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అభివృద్ధి మాటున ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. సబ్సిడీ రుణాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, రుణమాఫీ ఇలా ఎన్నో హామీలిచ్చి బాబు ప్రజలను మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులుంటే 12 లక్షల మంది ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీకి చెందిన వారు మాత్రమే లబ్ధిపడేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు విధానాల కారణంగా రాష్ట్రంలో టీడీపీ ఉనికి దాదాపుగా కోల్పోయిందన్నారు.
ధనార్జనే ధ్యేయంగా..
సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మంజూరైన అభివృద్ధి పనుల్లో రూ.కోట్లు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. నీరు–చెట్టు పనులతో సోమిరెడ్డికి ప్రయోజనం చేకూరింది తప్ప రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నిత్యం ఏదోఒక పనిలో కమీషన్ల రూపంలో దోచుకోందే సోమిరెడ్డికి నిద్రపట్టడం లేదన్నారు. వెంకటాచలం పోలీస్‌స్టేషన్ వద్దకు ఎప్పుడు వెళ్లినా టీడీపీ నాయకుల గ్రావెల్ టిప్పర్లు, జేసీబీలు కనిపిస్తున్నాయంటే మంత్రి అవినీతిని ప్రోత్సహించినట్టు కాదా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కట్టంరెడ్డి విజయ్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, నాయకులు ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌నాయుడు, విజయభాస్కర్ నాయుడు, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment