‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు’ | Kakani Govardhan Reddy Hits Out At CM Chandrababu | Sakshi
Sakshi News home page

‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు’

Published Thu, Feb 20 2025 2:30 PM | Last Updated on Thu, Feb 20 2025 3:19 PM

Kakani Govardhan Reddy Hits Out At CM Chandrababu

సాక్షి,నెల్లూరు: రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం  గుంటూరులోని మిర్చి యార్డులో రైతు సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటే..  గతంలో ఏనాడూ నాఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్‌ లేఖ రాసిన సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. 

నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘గతంలో ఏనాడూ నాఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్‌ లేఖ రాసిన సీఎం చంద్రబాబు, మరోసారి రైతులను దారుణంగా వంచించారని స్పష్టం చేశారు. మిర్చి రైతులపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం (ఎంఐఎస్‌)లో రైతులను ఆదుకోవాలని కోరేవారని ఆయన వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదు కాబట్టే, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన రూ.3,480 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ గురించి పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారన్న ఆయన, జగన్‌ పర్యటనలను అడ్డుకునే ఉద్దేశంతోనే, గుంటూరు మిర్చియార్డు సందర్శనలో ఏ మాత్రం భద్రత కల్పించలేదని అన్నారు. జగన్‌ పర్యటనతోనే రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం మొదలైందని  చెప్పారు.

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?:
రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడితే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. రైతులకు అండగా నిలవాలని జగన్‌ వెళితే, వాస్తవాలను మరుగుపర్చి ప్రజల దృష్టి  మళ్లించేందుకు విష ప్రచారం చేస్తోంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే మీపై బురద జల్లుతాం’.. అన్నట్లుంది ప్రభుత్వ వ్యవహారం. ఆఖరుకి రైతులను కూడా అవమానించే విధంగా ప్రభుత్వం, ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.

ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించ లేదు:
‘జగన్‌ జనంలోకి వెళ్లకూడదు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. తమ వైఫల్యాలు ప్రజల వద్ద ఎండగట్టొద్దు’.. అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. అందుకే జగన్‌ జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్నా, ఆయన గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో కనీస భద్రత కూడా కల్పించలేదు. చివరకు రోప్‌ పార్టీ కూడా ఏర్పాటు చేయలేదు. ‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు. ఆయన్ను సూపర్‌ సిక్స్‌ హామీల గురించి ప్రశ్నించకూడదు. రైతుల సమస్యలపై అస్సలు అడగకూడదు. ఏమడిగినా అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెడతాం’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్‌పైనా కేసు పెట్టారు.

ఇదే నా ఛాలెంజ్‌:
జగన్‌ గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతుల సమస్యలపై కనీసం చర్చ మొదలైంది. ప్రభుత్వం రైతులను గాలికొదిలేసినప్పుడు, వారి బాధ్యతను గుర్తు చేయడానికి మాజీ సీఎం జగన్‌ పర్యటిస్తే, దానిపై ఆక్రోషం వెళ్లగక్కుతున్న చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నాయకులకు నా ఓపెన్‌ ఛాలెంజ్‌. మీరు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యల గురించి అడిగి రాగలరా? మిర్చి రైతులు మిమ్మల్ని కారం దంచినట్టు దంచకుండా వదిలిపెట్టరు.

నాఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోలు పచ్చి అబద్ధం:
అచ్చెన్నాయుడి ప్రెస్‌మీట్‌ చూస్తే.. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన పేపర్‌ చదవడం తప్ప, ఆయనకు రైతుల సమస్యలపై ఏ మాత్రమైనా అవగాహన ఉందా? అనే అనుమానం కలిగింది. అలాంటి వ్యక్తి వ్యవసాయ మంత్రి కావడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రైతుల కోసం నడుం బిగించినట్లు, నాఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ఒక బోగస్‌ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. ఈ లేఖ ద్వారా ఆయన రైతులను మరోసారి వంచించారు.గతంలో ఎప్పుడూ నాఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయడం జరగలేదు. మరి అలాంటప్పుడు మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, నాఫెడ్‌కు చంద్రబాబు లేఖలు రాయడం మిర్చి రైతులను మోసం చేయడం కాదా?.

అది కూడా వాస్తవం కాదా?:
మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఉద్యానవన శాఖ అధికారులిచ్చిన నివేదికలో, క్వింటాలుకు రూ.11,600 చొప్పున మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద ఇస్తూ కనీసం 25 శాతం పంటను కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ.3,480 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవుతుందని చెప్పారు. ఆ మొత్తం భరించడానికి ఇష్టపడని చంద్రబాబు, ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద కాకుండా మార్కెట్‌ ప్రైస్‌ సపోర్ట్‌ కింద నాఫెడ్‌ తరఫున కొనుగోలు చేయాలని లేఖ రాయడం చేతులు దులిపేసుకోవమే. చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రకారం చూసినా గత మా ప్రభుత్వంలో రైతుకు రూ.20 వేలకు తగ్గకుండా మద్దతు ధర లభించింది. ఒకవేళ గతం కంటే ఎక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేసి ఉంటే, దావోస్‌లో మాట్లాడి నేనే చేయించానని చంద్రబాబు ప్రచారం చేసుకునే వాడు.

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు:
కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం మిర్చికి మాత్రమే కాదు, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితి. గత వైయస్సార్సీపీ పాలనలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవ­స్థను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్‌ గాలికొదిలేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం మిర్చి పంటకే కాదు.. పసుపు, పత్తి, అరటి, ఉల్లి, పెసర, మినుము పంటలకు మద్దతు ధర కల్పించాం. కానీ నేడు చంద్రబాబు ఇస్తామన్నవి ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు కూడా లేకుండా చేశారని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement