సంక్షేమంలో.. తిమింగలాలు | officials | Sakshi
Sakshi News home page

సంక్షేమంలో.. తిమింగలాలు

Published Fri, Jul 10 2015 1:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

officials

సాంఘిక సంక్షేమ శాఖలో కొందరు అవినీతి అధికారులు దోచుకుతింటున్నారు. లేని భవనాలకు అద్దెలు, చేయని పనులకు బిల్లుల పేరిట లక్షలకు లక్షలు స్వాహా చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు భారీగా ముడుపులు తీసుకుని ఏకంగా రికార్డులనే తారుమారు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు, అవసరం లేకపోయినా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేస్తున్నారు. ఇలా.. సంక్షేమశాఖలో ఇష్టారాజ్యంగా పాలన సాగుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే ఫెవికాల్ అధికారుల అవినీతి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కలెక్టర్‌ను సైతం తప్పదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ శాఖ అధికారుల అవినీతి అక్రమాల్లో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే.. సూళ్లూరుపేటలో ఏఎస్‌డబ్ల్యూ కార్యాలయం ఉంది.
 
 దీన్ని 2011 మార్చి 31 నుంచి ఎస్సీ బాలుర వసతి గృహంలో ఓ గదిలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే అధికారులు మాత్రం ఏఎస్‌డబ్ల్యూ కార్యాలయాన్ని ఓ ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు రికార్డులు సృష్టించి నెలకు రూ.2,681 చొప్పున అద్దె వసూలు చేసుకుని స్వాహా చేస్తున్నట్లు తెలిసింది. ఆ వసతి గృహంలో ఏఎస్‌డబ్ల్యూ కార్యాలయం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి బోర్డు ఏర్పాటు చేయకపోవటం గమనార్హం. కావలిలో ఆనంద నిలయం (బాలికల) మంజూరైంది. పిల్లలు లేకపోవటంతో ఇప్పటికీ ఆనంద నిలయం నడవటం లేదు. అయితే అధికారులు మాత్రం భవనం రిపేర్ల కోసమని రూ.లక్ష నిధులు మంజూరు చేసుకుని ఎటువంటి పనులు చేయకుండా స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
 నెల్లూరులోని ఏఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో ఏఎస్‌డబ్ల్యూ, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అటెండర్ ఉంటే సరిపోతుంది. అయితే వీరు కాకుండా అదనంగా అవుట్ సోర్సింగ్ కింద అటెండర్‌ను నియమించుకున్నట్లు తెలిసింది. అటెండర్ నియామకంలో అధికారులు ముగ్గురు మామూళ్లు పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటగిరిలోని రెండు బాలుర వసతి గృహాల్లో పిల్లలు రాకపోయినా.. వార్డెన్లు హాజరు పట్టీలో వస్తున్నట్లు చూపించి డైట్‌చార్జిలు, కాస్మోటిక్ చార్జిలు, కంటింజెంట్, ఆఫీసు నిర్వహణ ఖర్చులు కాజేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
 
 అందుకు కారణమైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయమని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే సంక్షేమశాఖలోని కొందరు అధికారులు వార్డెన్ల నుంచి మామూళ్లు పుచ్చుకుని అదే శాఖకు చెందిన ఓ అధికారిని విచారణాధికారిగా నియమించారు. దీంతో ఆ విచారణను నీరుగార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
 మౌఖిక ఆదేశాలతో డిప్యుటేషన్
 సంక్షేమ శాఖలో పనిచేసే వాచ్‌మెన్, కేర్ టేకర్ నుంచి మామూళ్లు పుచ్చుకుని వారు కోరుకున్న చోటుకు డిప్యుటేషన్ పేరుతో పంపినట్లు తెలిసింది. ఆ ఇద్దరినీ సూళ్లూరుపేటలో ఏఎస్‌డబ్ల్యూ కార్యాలయానికి పంపినట్లు సమాచారం. 2009, 2013లో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా హెచ్‌డబ్ల్యూలుగా నియమితులైన సుమారు 46 మందికి ఇప్పటి వరకు పర్మినెంట్ చేసినట్లు ఆదేశాలు ఇవ్వలేదని తెలిసింది. వారికి సకాలంలో ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వకుండా కొందరు అధికారులు వాడుకుని ఆ తరువాత ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇద్దరు అధికారులు ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ నుంచి నోషనల్ ఇంక్రిమెంట్  కోసం ఆదేశాలు తెప్పించుకున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఇవ్వలేదని సంక్షేమశాఖలో పనిచేసే అధికారి ఒకరు వెల్లడించారు. వెంకటగిరి పరిధిలోని దళిత వర్గానికి చెందిన 150 మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు.
 
 వారికి వసతి గృహం ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విన్నవించారు. అందుకు అవసరమైన భవనం ఉన్నప్పటికీ వసతి గృహం ఏర్పాటుకు అధికారులు ససేమిరా అంటున్నట్లు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా సంక్షేమశాఖలోని కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా సాగుతోంది. సంక్షేమశాఖలో జరిగే అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరెన్నో అవినీతి, అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement