రైతుకు కడగండ్లు | Farmer harassment | Sakshi
Sakshi News home page

రైతుకు కడగండ్లు

Published Sat, Mar 7 2015 2:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Farmer harassment

నెల్లూరు (రవాణా): పాలకులకు ముందుచూపు కొరవడటం, అధికారుల అలసత్వం వెరసి అన్నదాతలకు నీటి కడగండ్లను మిగిల్చాయి. మొదటి పంట చేతికందే సమయంలో సాగునీటిపై అధికారులు చెతులెత్తేశారు. జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయంటూ వారానికొకసారి కాల్వలకు సాగునీరు వదులుతున్నారు. ఓవైపు ప్రకృతి సైతం అన్నదాతలపై కన్నెర్రజేసింది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఈ ప్రాంతంలో మాత్రం అలాంటి జాడలు ఎక్కడా కనబడటం లేదు. దీంతో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
 
 ఓవైపు జలాశయాల్లో నీరు అడుగంటుతున్నా.. ఒప్పందం ప్రకారమేనంటూ చెన్నైకు తెలుగుగంగ నీటిని అధికారులు వదులుతూనే ఉన్నా రు. సాగునీటి విషయంపై కొన్ని ప్రాం తా ల్లో అన్నదాతలు ఘర్షణకు దిగుతుం టే, మరికొన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగుతు న్న సంఘటనలు కనిపిస్తున్నాయి. రెండోపంటకు మాత్రం నీరు అందించలేమం టూ ముందే అధికారులు చేతులెత్తేయడం పై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
 
 పొట్టదశలో వరి
 జిల్లాలో 8 లక్షల ఎకరాలల్లో పంటను సాగుచేస్తున్నారు. అందులో 7 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. వాటిలో నెల్లూరు డెల్టా కింద లక్ష ఎకరాలు, సంఘం బ్యారేజి కింద 1.5 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. వీటితో పాటు కనిగిరి రిజర్వాయర్, కనుపూరు, తెలుగుగంగ, కండలేరు రిజర్వాయర్ల కింది లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉంది. ఇప్పుడు వరికి నీరు అందించకపోతే నిలువునా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఉద్యానపంటలైన నిమ్మ, మామిడి, పుచ్చ తదితర పంటలను సాగుచేస్తున్నారు. అవి కూడా కొన్ని పూతదశలో ఉంటే కొన్ని రకాల పంటలు పిందె దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం నీరు అందకపోయినా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.  ప్రధానంగా కావలి, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు, పొదలకూరు, రాపూరు తదితర ప్రాంతాల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 అడుగంటిన జలాశయాలు
 సోమశిల రిజర్వాయర్ అడుగంటే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం 18 టీఎంసీలు నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వేసవికాలంలో 3.5 టీఎంసీలు నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేయాల్సి ఉంది. సోమశిల డెడ్‌స్టోరేజి 7.2 టీఎంసీలుగా అధికారులు నిర్ణయించారు. అంటే తాగునీటిని కలుపుకొని తక్కువలో తక్కువ 12 టీఎంసీలు నీరు సోమశిల రిజర్వాయర్‌లో ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 7 టీఎంసీల నీటిని సాగునీటికి వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మార్చి నెలాఖరు వరకు పంటలకు నీరు అందించాల్సి ఉంది. అదే గతేడాది ఈసీజన్‌కు 40.43 టీఎంసీలు ఉంది.
 
 ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రతి 3 రోజులకు ఒక టీఎంసీ నీరు పంటలకు వదులుతున్నారు. అంటే అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం మరో 18 రోజులు సాగుకు నీరు అందించవచ్చు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కాలువల కింద చాలామంది అనధికారికంగా మోటార్లుతో నీటిని వినియోగిస్తున్నారని, వీటితో కలుపుకొంటే మరో 10రోజుల కంటే ఎక్కువ రావని రైతులు అంటున్నారు.
 
  పైగా ఆయుకట్టు చివరి భూములుకు ఇప్పటికే నీరు అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. కండలేరులో కూడా ప్రస్తుతం 12.5 టీఎంసీ నీరు మాత్రమే ఉంది.
 కండలేరు డెడ్‌స్టోరేజి 8.4 టీఎంసీగా అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం చెన్నైకు 15 వేల క్యూసెక్కులు తాగునీటిని వదులుతున్నారు. ఒప్పందం ప్రకారం ఏడాది పొడవునా తాగునీటిని వదాలాల్సి ఉంది. శ్రీశైలంలో రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గిపోయింది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేటర్ ద్వారా వచ్చే నీరు ఆగిపోతుంది.
 
 రెండోపంట లేనట్టే....
 ప్రతి ఏటా జిల్లాలో రెండోపంటగా సుమారు 2 లక్షలకు ఎకరాలకు పైగా సాగుచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితుల్లో 3 లక్షల ఎకరాలల్లో సాగు ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రెండో పంటకు నీరు అందించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో అన్నదాతలు అధికారులు, నేతలపై మండిపడుతున్నారు.
 
 కొరవడిన ముందుచూపు
 జిల్లా సాగు, తాగునీటి అవసరాలపై అటు పాలకులు, ఇటు అధికారులకు ముందుచూపు కొరవడింది. వరదల సమయంలో కృష్ణానది నుంచి ఎక్కువ మొత్తంలో నీరు పెన్నాకు వస్తుంది. కడప జిల్లా నిప్పులవాగును వెడల్పు చేస్తే వరద సమయంలో 22 వేల క్యూసెక్కులకు పైగా నీరువచ్చే అవకాశం ఉంది. అయితే ఆదిశగా నేతలు, పాలకులు దృష్టిసారించడం లేదు. నిప్పుల వాగును వెడల్పు చేసేందుకు రూ.30 కోట్లు ఖర్చు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా నీటికోసం ఇబ్బందులు పడకుండా నిప్పులవాగు వెడల్పుపై జిల్లా నేతలు  ఆలోచించాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement