సాగునీరివ్వకుంటే రైతుల ఆగ్రహానికి గురవుతాం
-
డెల్టాకు 26న నీరు విడుదల
-
నాన్ డెల్టా అధ్యయానికి కమిటీ ఏర్పాటు
-
సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలి
-
పింఛన్లు, ఇండ్లు ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లలేమన్న నాయకులు
-
సభావేదికపైకి పిలవకపోవడంపై అలిగిన నేతలు
-
టీడీపీ సమన్వయ, కార్యవర్గ సమావేశంలో మంత్రులు శిద్దా, నారాయణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో రెండోపంటకు నీరివ్వకుంటే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని, ఐఏబీ సమావేశం పెట్టకుండా నీటి విడుదలను జాప్యం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయించింది. జిల్లా నాయకులు నీటి సమస్యను జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 26వ తేదిన డెల్టాకు నీరు విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రులు జిల్లా నేతలతో చర్చించారు. ప్రధానంగా డెల్టాకు ఈ నెల 26న నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నాన్‌డెల్టాకు ఎంత నీరు కావాలన్న దానిపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ అధికారులతో కమిటీ ఏర్పటు చేయాలని సూచించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా నవంబర్ 1న జరిగే ఐఏబీ సమావేశంలో జిల్లా కలెక్టర్ తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు శిద్దా, నారాయణలు సూచించారు. జిల్లాలోని మెట్టప్రాంతాల్లో తాగునీరు ఎద్దడి ఏర్పడకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ
శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీకి చెందిన ఉపాధ్యాయులు, పట్టభద్రులతో పాటు ఇతర పార్టీçల నుంచి వచ్చేవారిని కలుపుకుని పోయి విజయం కోసం పనిచేయాలని నిర్ణయించారు.
సభ్యత్వ నమోదు, జనచైతన్యయాత్రలపై..
సమన్వయ కమిటీ సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 1వ తేదినుంచి జరుగు పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని మంత్రులు శిద్దా, నారాయణలు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నరేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను వివరించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించాలని తెలిపారు. ప్రజల సమస్యలను పార్టీ నాయకత్వం, అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయతం చేయాలని సూచించారు. దీంతో కొంత మంది నాయకులు జిల్లాలో ఎక్కువ మంది ఫించన్లు, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని.. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను ఏ విధంగా నిర్వహించాలని మంత్రులను నిలదీశారు. మండలంలో ఏ ఒకరిద్దరకో అందకపోతే అది సాకుగా తీసుకుని చెప్పడం సరికాదని వారు బదులిచ్చారు. రాష్ట్రం అర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధికి సీఎం పాటుపడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులు జిల్లా నాయకులను ఆదేశించారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయిందని, పార్టీలో ఒకరి మీద ఒకరూ చాడీలు చెప్పుకుంటూ అంతర్గతంగా కొట్లాడుకుంటే ప్రతిపక్ష పార్టీ దానిని అడ్వాంటేజిగా తీసుకుని బలపడుతుందని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుని పోయి పనిచేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల మీద ఉంటుందన్నారు. పదవుల విషయాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నాయకుల పనీతీరుపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారని, సర్వే ఆధారంగా వచ్చిన నెగెటివ్ పాయింట్లను ఆయా నియోజకవర్గ నేతలకు తెలియజేశారని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మండల కమిటీ సమావేశాలను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు.
అలిగిన నేతలు
జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశంలో సభావేదికపైకి పిలవలేదంటూ కొందరు పార్టీ నేతలు సమావేశం నుంచి అలిగి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. సభా వేదికపై నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రమేష్‌రెడ్డిలు రాగా.. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పేర్లు లేవని కిందికి దిగిపోవాలని సూచించారు. ఇదే తరహాలో రాష్ట్ర మహిళా నాయకురాలు తాళ్లపాక అనూరాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడికి కూడా అవమానం జరగడంతో నలుగురూ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఈ విషయం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.