సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయం పరిధిలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో రెండో పంటకు సాగునీరు అందించే అవకాశముందని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో మరోమారు చర్చించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని గోల్డెన్ జూబ్లీహాల్లో గురువారం ఆయన అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. వివిధ అవసరాలకు పోను జలాశయంలో ఉన్న 18 టీఎంసీల నీటిని దృష్టిలో ఉంచుకుని 1.50 లక్షల ఎకరాలకు నీరు అందించాలని మొదట అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు నివేదిక సమర్పించారు. దీనిపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. డెడ్‌స్టోరేజీ కింద 7.5 టీఎంసీలు అవసరం లేదని, 5 టీఎంసీలకు కుదించవచ్చన్నారు. ఏప్రిల్ 15 నాటికి సుమారు 6 టీఎంసీల నీరు అదనంగా లభిస్తుందన్నారు.
ఈక్రమంలో 25 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలు సాగుచేయవచ్చని, ఈ లెక్కన 2.50 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగుచేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారుల్లో కొందరు కావలి కాలువ పరిధిలో నీటిని అమ్ముకుంటున్నారని రైతు సంఘం నేత బెజవాడ గోవిందరెడ్డి ఫిర్యాదు చేశారు. లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు నాసిరకంగా చేసి దోపిడీకి పాల్పడ్డారని పలువురు కలెక్టర్‌కు వివరించారు. నీటి కేటాయింపులపై స్పందించిన కలెక్టర్ రైతు సంఘాల నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. 2 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు నేతల సూచనలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని ఇరిగేషన్ ఎస్‌ఈని కలెక్టర్ ఆదేశించారు. నీటి విడుదల తేదీని త్వరలో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం
కాలువల ఆధునికీకరణ పనులు జరుగుతున్న తీరుపై రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకంగా పనులు జరుగుతుంటే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్‌లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మొహమాటాలకు తావివ్వవద్దని, ఇంజనీర్లు ఇంజనీర్లుగానే వ్యవహరించాలని మండిపడ్డారు. కావలి కాలువ కింద నీటి అమ్మకాలు జరుగుతున్న విషయం గతంలోనూ తన దృష్టికి వచ్చిందని, భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రేఖారాణి పాల్గొన్నారు.
పొదుపుగా వాడుకోవాలి..
సోమశిల ప్రాజెక్టులో ప్రస్తుతం 43.5 టీఎంసీల నీరు ఉంది. డెడ్‌స్టోరేజ్, తాగునీరు తదితర అవసరాలకు పోను 35 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ నీరు వృథా కాకుండా పొదుపుగా వినియోగిస్తే 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు సరఫరా చేయవచ్చు. నేరుగా పొలాలకు నీరు సరఫరా చేసేలా అధికారుల చర్యలు తీసుకోవాలి.
దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి
పంట ఎండకుండా చూడాలి
అరుతడి విధానం ద్వారా పంటలు సాగు చేస్తే 1 టీఎంసీ నీటితో 14 వేల ఎకరాలు సాగు చేయవచ్చు. సకాలంలో సాగునీరు సరఫరా చేసి పంటలు ఎండిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంకమరాజు
రెండో పంటకు 2.50 లక్షల ఎకరాలకు నీరు !
Published Fri, Mar 7 2014 3:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement