జెడ్పీ అద్భుతం..సౌకర్యవంతం | ZP In nellore district | Sakshi
Sakshi News home page

జెడ్పీ అద్భుతం..సౌకర్యవంతం

Published Sun, Feb 15 2015 2:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ZP  In nellore district

నెల్లూరు(రెవెన్యూ): జెడ్పీ నూతన భవన సముదాయం అద్భుతంగానూ, సౌకర్యవంతంగానూ ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ నూతన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహన్ని ఆవిష్కరించారు. అనంతరం నేతలు పైలాన్‌ను, జెడ్పీ భవనాన్ని, సమావేశమందిరం, చైర్మన్ చాంబర్, సీఈఓ చాంబర్, పరిపాలన విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో మంచి వనరులు ఉన్నాయని, వాటి ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా చర్యలు చేపడతామన్నారు. రాత్రికి రాత్రే అభివృద్ధి సాధ్యపడదన్నారు. మంచినీటి సమస్య పరిష్కరానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
  సోమశిలను ఉపయోగించుకుని జిల్లాలో మంచి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.100 కోట్ల బడ్జెట్ అడిగి ఉన్నామన్నారు. రాబోయే రెండేళ్లలో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 2016లో ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం ప్రజలు పోటీపడేలా వాటిని తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ 2009లో ప్రారంభమైన నూతన భవన నిర్మాణం 2011లో పూర్తయిందన్నారు. రాజకీయ కారణాలతో నిర్మా ణం పూర్తిస్థాయిలో కాలేదన్నారు.
 
 తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ. 1.60 కోట్లు నిధులు కేటాయించి భవన నిర్మాణం పూర్తిచేశామన్నారు. భవన నిర్మాణానికి మొత్తం రూ. 7.10 కోట్లు ఖర్చుచేశారన్నారు. ప్రజల సౌకర్యార్థం జెడ్పీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓ, డీఎల్‌పీఓ కార్యాలయాలు నూతన భవనంలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన భవనానికి ఎదురుగా ఉన్న 26ఎకరాల స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ ఒకే ప్రాంగణంలో ఉండేలా భారీ సముదాయ నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ నూతన భవనం అద్భుతంగా ఉందన్నారు.
 
 అధికారులు చక్కగా పనిచేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించారన్నారు. మంత్రి చొరవ తీసుకుని జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ అన్ని పదవుల్లోకి జెడ్పీచైర్మన్ పదవి గొప్పదన్నారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం లేదన్నారు. జెడ్పీ చైర్మన్ ఒక్కరే ప్రజలకు నేరుగా సేవ చేయగలరన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రధానపాత్ర జెడ్పీదేనని తెలిపారు.
 
 ప్రజాప్రతినిధులు, అధికారులందరు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జెడ్పీ భవన నిర్మాణానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విశేష కృషిచేశారన్నారు. నూతన భవనాన్ని అధునాతన హంగులతో సిద్ధం చేయడానికి జెడ్పీ చెర్మన్ బొమ్మిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తిచేశారన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మంత్రి నారాయణ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగపరిచేలా మంత్రి చర్య లు తీసుకోవాలని కోరారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రప్రభుత్వం తర్వాత జెడ్పీలకే అధిక బాధ్యతలు ఉన్నాయన్నారు. రాజకీయాలకతీతంగా అందరూ జిల్లా అభివృద్ధికి కృషిచేయాలన్నారు. కోవూరు ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నూతన భవనంలో జెడ్పీటీసీ ఫ్లోర్‌లీడర్‌కు ప్రత్యేక గదిని కేటాయించాలన్నారు. ఎమ్మెల్యే వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రేమికుల రోజున జెడ్పీ నూతన భవనాన్ని ప్రారంభించడం అనందంగా ఉందన్నారు. మేయర్ అజీజ్ మాట్లాడుతూ కార్పొరేషన్ కార్యాలయానికి మిన్నగా జెడ్పీ నూతన భవనాన్ని నిర్మించారన్నారని కొనియాడారు.
 
 అనంతరం పదవీవిరమణ చేసిన తెలుగు లెక్చరర్ వెంకటస్వామిని సన్మానించారు. సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు జ్ఞాపిక లు అందజేశారు. నూతన భవన ప్రాంగణంలో  చెట్లు నాటారు. సమావేశంలో  ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, జేసీ ఇంతియాజ్, కమిషనర్ చక్రధర్‌బాబు, టీడీపీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement